మే నెలలోనే.. బిరబిరా కృష్ణమ్మ తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు
నిండు వేసవిలో అరుదైన దృశ్యం. ఎండిపోయి ఎడారిలా మారిన కృష్ణానది ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక- తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది. జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపూర్కు ప్రవాహమేదీ లేదు. సాధారణంగా జూన్, తరువాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం అరుదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి 90 వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు తెరిచి 82,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (1045 అడుగులు). ఒకే నీటి సంవత్సరంలో(2024 జూన్- 2025 మే) మధ్య నైరుతి రుతుపవనాలతో గేట్లు ఎత్తడం అరుదైన విషయం.

