పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటి విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఆదివారం కృష్ణా జలాలను బనకచర్లకు విడుదల చేసేందుకు వచ్చిన మంత్రి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నాం అని వెల్లడించారు. దెబ్బతిన్న అలగనూరు రిజర్వాయర్‌ బండ్‌, గోరుకల్లు రిజర్వాయర్‌ మరమ్మతులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు పూజలు చేశారు. 10 వేల క్యూసెక్కుల శ్రీశైలం వెనుక జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి బనకచర్లకు విడుదల చేశారు. కృష్ణమ్మకు చీరె, సారె సమర్పించి జలహారతినిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రెడ్డిశేఖరరెడ్డి, ఈఈ నాగేంద్రప్రసాద్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు

Read More

జూరాల గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న కృష్ణా ప్రవాహం

మే నెలలోనే.. బిరబిరా కృష్ణమ్మ తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు

నిండు వేసవిలో అరుదైన దృశ్యం. ఎండిపోయి ఎడారిలా మారిన కృష్ణానది ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక- తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది. జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపూర్‌కు ప్రవాహమేదీ లేదు. సాధారణంగా జూన్‌, తరువాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం అరుదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి 90 వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు తెరిచి 82,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (1045 అడుగులు). ఒకే నీటి సంవత్సరంలో(2024 జూన్‌- 2025 మే) మధ్య నైరుతి రుతుపవనాలతో గేట్లు ఎత్తడం అరుదైన విషయం.

Read More