ఉద్యాన విద్యార్థులకు అంకుర శిక్షణ

తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల విద్యార్థులకు అంకురాలపై శిక్షణ ఇచ్చి వాటి స్థాపనకు సహకరిస్తామని ఉపకులపతి దండా రాజిరెడ్డి తెలిపారు. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో శుక్రవారం వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అంకురాల యుగం నడుస్తోందని, ఉద్యానవన విద్యార్థులను నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, అంకురాలపై ప్రోత్సహించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. సమావేశంలో నార్మ్‌ జేడీ గోపాలాల్‌, ఐడియా సీఈవో సెంథిల్‌ వినాయగం, మోజెర్ల ఉద్యానవన కళాశాల అసోసియేట్‌ డీన్‌ సైదయ్యలు పాల్గొన్నారు.
ఎగుమతులకు ప్రోత్సాహం: రాష్ట్రం నుంచి ఉద్యాన పంట దిగుబడుల ఎగుమతులను ప్రోత్సహిస్తామని ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో దృక్పథ ప్రణాళికపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉద్యాన పంటలు రాష్ట్ర అవసరాల మేరకు ఉత్పత్తి చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

Read More

ఉద్యాన పంటల అభివృద్ధికి మారుత్‌ డ్రోన్స్‌తో హార్టికల్చర్‌ వర్సిటీ ఒప్పందం

ఉద్యాన పంటల అభివృద్ధి, పరిశోధన, శిక్షణకు అవసరమయ్యే సహకారం కోసం హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ డ్రోన్స్‌ సంస్థతో శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వీసీ దండా రాజి రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ భగవాన్‌, మారుత్‌ డ్రోన్స్‌ వ్యవస్థాపకుడు ప్రేమకుమార్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. డ్రోన్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తెగుళ్లను అంచనా వేస్తూ పంటల సాగు పద్ధతులను మెరుగుపరుస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు చీనానాయక్‌, లక్ష్మీనారాయణ, సురేష్‌కుమార్‌, శ్రీనివాసన్‌, వీణ జోషి తదితరులు పాల్గొన్నారు.

Read More

మూసీ పరీవాహకం.. పూలసాగుకే అనుకూలం

ప్రభుత్వానికి వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక

తెలంగాణ రాష్ట్రంలోని మూసీనది పరీవాహకంలో కలుషిత జలాలతో పండించిన పంట ఉత్పత్తులు ప్రమాదకరంగా మారుతున్నందున ఆహార పంటల సాగును నిలిపివేసి ప్రత్యామ్నాయంగా పూలసాగును చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు. మూసీ నదిలో క్యాన్సర్‌ కారక ఆర్సెనిక్‌, క్రోమియం, కాపర్‌, నికెల్‌, లెడ్‌ వంటి రసాయనాలుండగా.. ఆ నీటితో పండించే పంట ఉత్పత్తుల్లో భారలోహాలున్నట్లు ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. మురికినీటితో సాగు చేయడంవల్ల వ్యవసాయ భూములు పంటలకు పనికిరాకుండా పోతున్నాయని గుర్తించారు. ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు మూసీ పరీవాహకంలోని పలు గ్రామాల్లో పర్యటించి అక్కడి పంటల పరిస్థితులను అధ్యయనం చేశారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమం కింద అన్నదాతలతో మాట్లాడి, ప్రజాభిప్రాయాలను తెలుసుకుని నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.

అధ్యయన అంశాలివి..
ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 81 గ్రామాల్లో పంటల సాగు జరుగుతోంది. ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది మూసీ నీటిని ఉపయోగిస్తుండగా.. 30 శాతం మంది వరకు బోర్ల కింద సాగు చేస్తున్నారు. వరి, జొన్న, బత్తాయి, కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. తాము పర్యటించిన ప్రాంతాల్లో కలుషిత మూసీ నీటితో పంటలు సాగవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వరి, ఇతర ఆహారపంటలు, కూరగాయలు, ఆకుకూరలను సాగుచేయవద్దని, పండ్ల తోటలను పెంచవద్దని రైతులను కోరారు. ఇక్కడి గడ్డిని పశువులు మేస్తే అవి అనారోగ్యం బారిన పడతాయన్నారు. మూసీ నీటిని శుద్ధి చేస్తేనే ఈ భూములు పంటల సాగుకు అనుకూలంగా మారతాయన్నారు. అప్పటివరకు రైతులు భూములను వదులుకునే పరిస్థితి లేనందున.. అక్కడ పూల సాగును చేపట్టాలని, వాటివల్ల రైతులకు ఆదాయం వస్తుందని, ప్రజలకు ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు.

Read More

రాష్ట్రంలో పాడిపశువులకు ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పాడిపశువులకు జాతీయ ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని కింద శుక్రవారం నుంచి రాష్ట్రంలోని 20 లక్షల పాడిపశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు వేస్తామని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణ అధికారి సి. హెచ్‌. మల్లీశ్వరి తెలిపారు. గతంలో కృత్రిమ గర్భధారణకు రుసుములు వసూలు చేసేవారని, కేంద్ర కార్యక్రమం ద్వారా పాడిరైతులు ఇప్పుడు ఉచిత సేవలు పొందవచ్చని వివరించారు. దీని కింద రైతులకు ఆర్థికభారం తగ్గడంతోపాటు మేలు జాతి పశువుల సంతతి అభివృద్ధి చెందుతుందని, పాల దిగుబడి గణనీయంగా పెరుగుతుందన్నారు.

Read More

ఆదర్శ రైతు.. నిమ్మల

ఎకరాకు 65 బస్తాలు పండించిన మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగరిపాలెంలోని తన పొలంలో రబీ వరిలో ఎకరానికి 65 బస్తాల (బస్తాకు 75 కిలోల చొప్పున) సగటు దిగుబడి సాధించి ఆదర్శంగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం పాలకొల్లులో ఏడీఏ అడ్డాల పార్వతి వెల్లడించారు. రామానాయుడు మొత్తం ఆరెకరాల విస్తీర్ణంలో వరి పీఆర్‌ 126 రకం (గ్రేడ్‌ ఎ) సాగు చేయగా.. 390 బస్తాల దిగుబడి వచ్చిందన్నారు. సకాలంలో నారు పోసి నాట్లు వేయడం, సరిపడా ఎరువులు, పురుగుమందుల వినియోగం, నీటి యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ చర్యలు, శాస్త్ర వేత్తల సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించారని తెలిపారు.

Read More

రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలేనా!

ఉద్యాన, పశువైద్యశాఖలూ పాల్గొనాలని మంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఉద్యాన, పశువైద్యశాఖలు, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొనకపోవడంపై వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా శాఖలు సైతం పాల్గొనాలని ఆయన ఆదేశించారు. రైతులకు పంటలు, వాటి అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఇటీవల ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టింది. దీనిలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖల అధికారులు, సిబ్బంది, ఆయా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొనాలంది. వ్యవసాయశాఖ అధికారులు, విశ్వవిద్యాలయం, పరిశోధనఃనా కేంద్రాలు, కృషివిజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు, కళాశాలలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఉద్యానవనాలు, పాడి, చేపల పెంపకం, పశువైద్య సమస్యలపైనా శాస్త్రవేత్తలను రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయాధికారులు ఈ అంశాన్ని మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆయా శాఖల అధికారులను, విశ్వవిద్యాలయాల అధికారులను ప్రశ్నించారు. తమకు శాస్త్రవేత్తలు తక్కువగా ఉన్నారని వర్సిటీలు చెప్పగా… ఎంతమంది ఉన్నా హాజరు కావాల్సిందేనని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.

Read More

మామిడిలో భారీగా కార్బైడ్‌ వినియోగం

నాణ్యత పరీక్ష ఫలితాల ఆధారంగా చర్యలు: మంత్రి తుమ్మల

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా మామిడికాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులు హానికరమైన కార్బైడ్‌తోపాటు మోతాదుకు మించి ఎథిలీన్‌ సాచెట్లను వినియోగిస్తున్నట్లు తేలింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెటింగ్‌, ఆహారభద్రత విభాగం అధికారులు మంగళవారం 110 నమూనాలను సేకరించి, నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా కార్బైడ్‌ ప్యాకెట్లతోపాటు ఎథిలిన్‌ సాచెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జాంబాగ్‌, గడ్డి అన్నారం, బాటసింగారం, వరంగల్‌, జగిత్యాల తదితర మార్కెట్లలోని వ్యాపారులు తెచ్చిన పండ్లను తనిఖీ చేశారు. పలువురు కార్బైడ్‌ వాడిన పండ్లతో, మరికొందరు ఎథిలీన్‌ సాచెట్లతో దొరికారు. దాంతో అధికారులు వారి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ”సీజన్‌ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం అన్ని మార్కెట్లతోపాటు పండ్ల విక్రయ ప్రాంతాల్లో మామిడి పండ్లను తనిఖీ చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే లైసెన్సుల రద్దుతోపాటు కేసులు నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.

Read More

క్షీర ధేనువు!

రోజుకు 20 లీటర్ల పాలతో ఒంగోలు ఆవు రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో రైతు వేగుళ్ల మురళీకృష్ణకు చెందిన ఒంగోలు ఆవు ఒక్క రోజులో 21.19 కిలోల (20.56 లీటర్లు) పాలు ఇచ్చి సరికొత్త రికార్డు సాధించినట్లు కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి. రాజేశ్వరరావు తెలిపారు. పథకంలో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన యాప్‌లో… ఉదయం, సాయంత్రం పాల దిగుబడి వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఆవు సోమవారం వరకు రోజుకు 18 కిలోల పాలు ఇచ్చేదని చెప్పారు. మంగళవారం 21.19 కిలోల (ఉదయం 11.52, సాయంత్రం 9.67) పాలు ఇచ్చిందని వివరించారు. ఐదేళ్ల వయసు గల గోవు 2023లో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన దేశీయ ఆవు పాల పోటీలో పూటకు 7.17 కిలోలు ఇచ్చి ప్రథమ బహుమతి సాధించిందన్నారు. పోషక విలువల దాణా ఇవ్వడంతో ఈ దిగుబడి సాధ్యమైందని పశువైద్య ఉన్నతాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

Read More

పోలవరం-బనకచర్లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలి: చంద్రబాబు

పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించేలా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఏర్పాట్లపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఏయే అనుమతులు కావాలో అవి పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు సూచించారు.

Read More

రైతులే నిజమైన శాస్త్రవేత్తలు : మంత్రి తుమ్మల

రైతులే నిజమైన శాస్త్రవేత్తలని, వారి అనుభవాలతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పంట బీమా వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తే నష్టాలుండవన్నారు. రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా లక్షలమంది రైతులకు భూహక్కులు కల్పిస్తామన్నారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, వ్యవసాయశాఖ కమిషనర్‌ గోపి, జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

*మామిడి పక్వానికి కార్బైడ్‌ వాడితే కఠిన చర్యలు*

మామిడికాయలు పండేందుకు హానికర రసాయనం కార్బైడ్‌ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. సోమవారం మామిడి మార్కెట్లపై మార్కెటింగ్‌ డైరెక్టర్‌ సురేంద్రమోహన్‌ ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ”ఈ సీజన్‌లో కార్బైడు భారీగా వాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరైనా కార్బైడ్‌ను వినియోగిస్తున్నారని తేలితే వారి లైసెన్సులు రద్దు చేస్తాం” అని మంత్రి చెప్పారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం నుంచి మార్కెటింగ్‌ అధికారులు, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రత విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ప్రసాద్‌రావు తదితరులు హైదరాబాద్‌లోని జాంబాగ్‌, బాటసింగారం పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల పండ్లను నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపారు.

Read More