ప్రభుత్వానికి వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక
తెలంగాణ రాష్ట్రంలోని మూసీనది పరీవాహకంలో కలుషిత జలాలతో పండించిన పంట ఉత్పత్తులు ప్రమాదకరంగా మారుతున్నందున ఆహార పంటల సాగును నిలిపివేసి ప్రత్యామ్నాయంగా పూలసాగును చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు. మూసీ నదిలో క్యాన్సర్ కారక ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, నికెల్, లెడ్ వంటి రసాయనాలుండగా.. ఆ నీటితో పండించే పంట ఉత్పత్తుల్లో భారలోహాలున్నట్లు ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. మురికినీటితో సాగు చేయడంవల్ల వ్యవసాయ భూములు పంటలకు పనికిరాకుండా పోతున్నాయని గుర్తించారు. ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు మూసీ పరీవాహకంలోని పలు గ్రామాల్లో పర్యటించి అక్కడి పంటల పరిస్థితులను అధ్యయనం చేశారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమం కింద అన్నదాతలతో మాట్లాడి, ప్రజాభిప్రాయాలను తెలుసుకుని నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.
అధ్యయన అంశాలివి..
ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 81 గ్రామాల్లో పంటల సాగు జరుగుతోంది. ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది మూసీ నీటిని ఉపయోగిస్తుండగా.. 30 శాతం మంది వరకు బోర్ల కింద సాగు చేస్తున్నారు. వరి, జొన్న, బత్తాయి, కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. తాము పర్యటించిన ప్రాంతాల్లో కలుషిత మూసీ నీటితో పంటలు సాగవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వరి, ఇతర ఆహారపంటలు, కూరగాయలు, ఆకుకూరలను సాగుచేయవద్దని, పండ్ల తోటలను పెంచవద్దని రైతులను కోరారు. ఇక్కడి గడ్డిని పశువులు మేస్తే అవి అనారోగ్యం బారిన పడతాయన్నారు. మూసీ నీటిని శుద్ధి చేస్తేనే ఈ భూములు పంటల సాగుకు అనుకూలంగా మారతాయన్నారు. అప్పటివరకు రైతులు భూములను వదులుకునే పరిస్థితి లేనందున.. అక్కడ పూల సాగును చేపట్టాలని, వాటివల్ల రైతులకు ఆదాయం వస్తుందని, ప్రజలకు ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు.

