మూసీ పరీవాహకం.. పూలసాగుకే అనుకూలం

ప్రభుత్వానికి వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక

తెలంగాణ రాష్ట్రంలోని మూసీనది పరీవాహకంలో కలుషిత జలాలతో పండించిన పంట ఉత్పత్తులు ప్రమాదకరంగా మారుతున్నందున ఆహార పంటల సాగును నిలిపివేసి ప్రత్యామ్నాయంగా పూలసాగును చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు. మూసీ నదిలో క్యాన్సర్‌ కారక ఆర్సెనిక్‌, క్రోమియం, కాపర్‌, నికెల్‌, లెడ్‌ వంటి రసాయనాలుండగా.. ఆ నీటితో పండించే పంట ఉత్పత్తుల్లో భారలోహాలున్నట్లు ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. మురికినీటితో సాగు చేయడంవల్ల వ్యవసాయ భూములు పంటలకు పనికిరాకుండా పోతున్నాయని గుర్తించారు. ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు మూసీ పరీవాహకంలోని పలు గ్రామాల్లో పర్యటించి అక్కడి పంటల పరిస్థితులను అధ్యయనం చేశారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమం కింద అన్నదాతలతో మాట్లాడి, ప్రజాభిప్రాయాలను తెలుసుకుని నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.

అధ్యయన అంశాలివి..
ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 81 గ్రామాల్లో పంటల సాగు జరుగుతోంది. ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది మూసీ నీటిని ఉపయోగిస్తుండగా.. 30 శాతం మంది వరకు బోర్ల కింద సాగు చేస్తున్నారు. వరి, జొన్న, బత్తాయి, కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. తాము పర్యటించిన ప్రాంతాల్లో కలుషిత మూసీ నీటితో పంటలు సాగవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వరి, ఇతర ఆహారపంటలు, కూరగాయలు, ఆకుకూరలను సాగుచేయవద్దని, పండ్ల తోటలను పెంచవద్దని రైతులను కోరారు. ఇక్కడి గడ్డిని పశువులు మేస్తే అవి అనారోగ్యం బారిన పడతాయన్నారు. మూసీ నీటిని శుద్ధి చేస్తేనే ఈ భూములు పంటల సాగుకు అనుకూలంగా మారతాయన్నారు. అప్పటివరకు రైతులు భూములను వదులుకునే పరిస్థితి లేనందున.. అక్కడ పూల సాగును చేపట్టాలని, వాటివల్ల రైతులకు ఆదాయం వస్తుందని, ప్రజలకు ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు.

Read More

రాష్ట్రంలో పంటల భీమా పథకం అమలుకు కసరత్తు

రైతులందరికి ప్రయోజనం చేకూరేవిధంగా చర్యలు – మంత్రి తుమ్మల
ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు మరియు ఇతర అధికారులతో పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఈ పథకం కింద రైతులందరికి భీమా అందేలా మరియు ఏఏ పంటలకు భీమా పథకాన్ని వర్తింపచేయాలనే విషయాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా వానాకాలం మరియు యాసంగి కాలాల్లో ఏఏ పంటలకు ఏఏ విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు.
నష్టం కలిగే సంభావ్యత ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించడం జరిగిందని, సాధారణంగా వానాకాలం సీజన్‌లో సుమారు 128 లక్షల ఎకరాలు పంటలు వేయడం జరుగుతుందని, వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23, పత్తి 44.75, మిర్చి 1.90, సోయాబీన్‌ 3.80, కంది 5.21 లక్షల ఎకరాలు సాగవగా, యాసంగి పంటకాలంలో మొత్తం 78 లక్షల ఎకరాలల్లో పంటలు సాగవగా, వరి 59 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు మంత్రిగారికి వివరించారు.
ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికిగాను మొత్తం ప్రీమియంలో రైతు వాటా 2 శాతం, యాసంగి పంటకాలంలో 1.5 శాతం, వాణిజ్య మరియు ఉద్యానపంటలకు గాను 5 శాతం ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం 50:50 భరించడం జరుగుతుందని తెలిపారు. రైతులందరికి పంటలభీమా వర్తింపచేయడం వలన స్థూల పంట విస్తీర్ణంలోని 98 శాతం విస్తీర్ణానికి భీమా వర్తిస్తుందని మంత్రిగారికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాతావారణ మార్పుల వలన ప్రధానంగా అకాల వర్షాల వలనగాని, అధిక వర్షాల వలన గాని, వడగండ్ల వానల వలన, వర్షాభావ పరిస్థితుల వలన గాని కలిగే పంట నష్టానికి పంటల భీమా వల్ల రైతులకు కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీచేసే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దిగుబడి ఆధారిత భీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్‌, వేరుశనగ, శనగ, నువ్వులు, మొదలైన పంటలు మరియు వాతావరణ ఆధారిత భీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్‌ పామ్‌, టమాట, బత్తాయి మరియు మొదలైన పంటలకు భీమా వర్తింపచేసే విషయంలో పూర్తిస్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షం వలన నష్టపోయే వరి మరియు మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలుచేస్తున్నాయో అధ్యయనం చేసి, రైతులందరికి ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాలను రూపొందించడం మరియు నష్టపోయిన పంటల విషయంలో భీమా కంపెనీలు సత్వరమే భీమా క్లెయిమ్‌ అందించుటకు గల విధివిధానాలను రూపొందించాలని సూచించారు. వానాకాలం మరియు యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని రకాల ప్రధాన పంటలకు భీమా ప్రీమియం అంచనా వేయుటకు వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

Read More

రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యం – మంత్రి తుమ్మల

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి మరియు ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ”గ్రామ గ్రామానికి జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం” అనే నూతన కార్యక్రమాన్ని జూన్‌ మొదటి వారంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అనేక రకాల కొత్త వంగడాలను అభివృద్ధి పరిచారని, వాటిలో ప్రాముఖ్యం పొందిన విత్తనాలను రైతాంగానికి అందించటం ద్వారా రైతులను నాణ్యమైన విత్తనాలను వారి స్థాయిలోనే ఉత్పత్తి చేసుకొనే విధంగా ప్రోత్సహించవచ్చన్నారు.


వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి, అన్ని రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించిన విత్తనాలను, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,000 గ్రామాలలోని ప్రతి గ్రామం నుండి మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్‌ మొదటి వారంలో ఈ పథకం కింద పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకంలో సుమారుగా 2500-3000 క్వింటాళ్ళ ఐదు ప్రధాన పంటల విత్తనాలను (వరి, కంది, పెసర, మినుము మరియు జొన్న) దాదాపు 40,000 మంది రైతులకు అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ పథకం ద్వారా నాణ్యమైన విత్తనం పొందిన రైతులు తిరిగి ఆయా పంటలలో పండిన విత్తన పంటను ఆయా గ్రామాలలో తమతోటి రైతాంగానికి తక్కువ ధరకు అందజేయటం ద్వారా వచ్చే మూడు సంవత్సరాలలో గ్రామంలోని రైతులందరకి నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంటుందన్నారు. దీని ఫలితంగా రైతాంగం నకిలీ విత్తనాల మోసాల బారినుండి రక్షించబడటమే కాకుండా నాణ్యమైన విత్తనం ద్వారా 10-15% అదనంగా దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయన్నారు. దీంతో రైతు నికరాదాయం కూడా పెరుగుతుందని మంత్రిగారు తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ సిబ్బంది మరియు విత్తన సంచాలకులు డా. నగేష్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

Read More

రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముచ్చటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ”వరి కొయ్యలు కాల్చడం నష్ట నివారణ చర్యలు” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సెక్రటేరియట్‌ నుంచి పాల్గొని రైతులతో ముచ్చటించడం జరిగింది. అదేవిధంగా పత్తి మరియు వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలోని రైతులతో మంత్రిగారు ముచ్చటించి అక్కడి సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో 06.03.2024 నాడు 110 రైతు వేదికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున దృశ్య శ్రావణ పరికరములు ఏర్పాటు చేసి రైతులతో నేరుగా మాట్లాడే ”రైతు నేస్తం” కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయంతెలిసిందే.
.రైతు నేస్తం కార్యక్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవసాయ మరియు అనుబంధ శాఖల కార్యకలాపాలపై రైతు సమాజానికి అవగాహన కల్పించడానికి ప్రతి మంగళవారం, ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పటివరకు 33 ఎపిసోడ్‌లను నిర్వహించి రైతులకు విజయవంతంగా శిక్షణ ఇవ్వడం జరిగింది
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ”వరి కొయ్యలు కాల్చడం నష్ట నివారణ చర్యలు” పై వ్యవసాయ శాస్త్రవేత్త టి. ప్రభాకర్‌ రెడ్డి, కెవికె, పాలెం నుండి దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. అభ్యుదయ రైతులు చంద్రయ్య మరియు దేవేందర్‌ రెడ్డి గార్లు వారి అనుభవాలను పేర్కొంటూ వరి కొయ్యలు కాల్చవద్దని, తద్వారా కలిగే లాభాలను తమ అభిప్రాయాలను తోటి రైతులతో పంచుకొన్నారు.
మంత్రివర్యులు ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నాగర్‌ కర్నూల్‌ రైతులతో కూడా పత్తి కొనుగోలు అంశాలపై మట్లాడుతూ, వరి మరియు పత్తి కొనుగోలు విషయంలో సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు. పంట సాగుచేసిన రైతుల ఖాతాలలో మాత్రమే నగదు జమ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. కామారెడ్డి, జనగాం, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి జిల్లాలలోని రైతులతో వరి కొనుగోలు కేంద్రాల నుండి ముఖాముఖి మాట్లాడి, వరి ధాన్యం దిగుబడులు, కొనుగోలు కేంద్రాలలో రైతులకు సంబందించిన సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వరి సన్న ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ గురించి, సన్న ధాన్యం పండించి, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలలో అమ్మి, బోనస్‌ డబ్బులు జమ అయిన రైతులతో మాట్లాడినారు.
ఈ సందర్భముగా రైతులు స్పందిస్తూ, వరి కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు బాగున్నాయని, ముఖ్యముగా సన్న ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజులలోనే బోనస్‌ డబ్బులు రూ.500 ప్రతి క్వింటాలుకు జమ అవుతున్నాయని, రాష్ట్రంలో మొదటిసారిగా ఈ విధమైన చర్యలు చేపట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు.
పిమ్మట మంత్రి గారు మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, పత్తి పంటలు, కోసిన తర్వాత, వాటి అవశేషాలను రైతులు కాల్చి వేయడం వలన, భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గుతుందని, ఈ విధంగా చేయడం వలన భూమి కొంతకాలానికి నిస్సారంగా మారుతుందని, పంట అవశేషాలను రైతులు కాల్చకుండా, భూమిలో కుళ్ళి పోయేటట్లు చేసుకోవాలని, ఈ విషయమై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది, మరియు రైతులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్‌ వింగ్‌, వ్యవసాయ విశ్వ విద్యాలయం రాజేంద్రనగర్‌ నుండి హాజరై రైతులకు అవగహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ఉదయ్‌ కుమార్‌ వ్యవసాయ అదనపు సంచాలకులు విజయ కుమార్‌ మరియు పౌర సరఫరా అధికారులు పాల్గొన్నారు.

Read More

నవంబర్‌ నెలలో సేద్యపు పనులు

ఆంధ్రప్రదేశ్‌లో 26కి గాను 20కి పైగా జిల్లాల్లో కరువు విపరీతంగా ఉంది. నిండిన జలాశయాలు లేనిచోట, తెలంగాణాలో కూడా వర్షాలు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు నీరులేక కాలువ నీటితో పంటలు పెట్టలేదు. వర్షాకాలపు పంటలు పండక రైతులు బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ (స్వాతి కడరోజులు, విశాఖ, అనూరాధ కార్తెలు)లో వివిధ పంటలలో చేయవలసిన పనుల గురించి…

కొత్తిమీర/ధనియాలు: అధిక ధనియాలు మరియు కొత్తిమీర దిగుబడులు సాధించడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుట వాతావరణ రీత్యా అనుకూలం. ఒత్తుగా ఉన్న మొక్కలను పీకి కొత్తిమీరగా అమ్మవచ్చు. బిపి, షుగరు, మూత్ర పిండాల రోగాలు, కొలెస్ట్రాల్‌ సమస్యలు తగ్గడానికి మంచిదని కొత్తిమీర వినియోగం అన్ని కాలాలలోనూ పెరుగుతున్నది. ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మంచి విత్తనదిగుబడికి అనుకూలమైన రకాలు: హిస్సార్‌ సురభి, గుజరాత్‌ ధనియా, సింపోస్‌-33, ధనియాల ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. 

జొన్న: ఇప్పుడు జొన్న తినే వాళ్లు పెరుగుతున్నారు. సరిపడినంత పంట మార్కెట్లో లేక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాదు రీటైల్‌ మార్కెట్లలో మంచి క్వాలిటీ జొన్న పిండి ధర కిలోకు రూ. 90. పూర్వం జొన్న రకాలు తక్కువ దిగుబడినిచ్చేవి (10-12 క్వి/ఎ.). ఇప్పుడు 20-25 క్వి/ఎ. అంతకంటే ఎక్కువ దిగుబడి నిచ్చే రకాలు అందుబాటులోకొచ్చాయి. ఉదా: పర్భనిశక్తి (ఐ.సి.ఎస్‌.ఆర్‌-14001): గింజ దిగుబడి నీటి ఆధారంగా 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. రెండు తెలుగు రాష్ట్రాలలోను, మహారాష్ట్రలోనూ పండించవచ్చు. ఐరన్‌, జింకు, ప్రోటీన్లు ఎక్కువ. తెల్లగింజ రకం. చలికాలం/యాసంగిలో (నవంబర్‌లో కూడా) విత్తవచ్చు. నీటి సౌకర్యముండాలి. ఐ.సి.ఎస్‌.హెచ్‌-14002: హైబ్రిడ్‌. తెల్లగింజ. చలికాలం/యాసంగిలో విత్తవచ్చు. నీటి ఆధారంగా గింజ దిగుబడి 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. నీటి ఆధారంతో ఈ నెలలో విత్తవచ్చు. ఐరన్‌, జింక్‌ ఎక్కువ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహారాష్ట్రలోనూ విత్తుటకుపయోగం. చొప్ప దిగుబడి కూడా ఎక్కువ. ఎన్‌.టి.జె-5: గింజ దిగుబడి నల్ల నేలల్లో 20-25 క్వి/ఎ. తేలిక నేలల్లో 14-16 క్వి/ఎ. జొన్న మద్ధతు ధర: హైబ్రిడ్‌: రూ. 3180/క్వి. మల్దండి: రూ. 3225/క్వి. జొన్నను నీటి సౌకర్యంతో ఈనెలలో విత్తవచ్చు.

మొక్కజొన్న: అత్యధిక దిగుబడులు సాధించాలంటే విత్తడానికి అనుకూలమైన సమయం అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు. ఈ సమయంలో విత్తడానికి సిఫారస్‌ చేయబడిన ప్రైవేటు హైబ్రిడ్‌లు: 100-120 రోజులవి: 900 ఎం. గోల్డ్‌, ఎన్‌.కె-6240. 90-100 రోజులవి: కోహినూర్‌, ప్రభల్‌. 90 రోజులలోపువి: పయనీర్‌-3342, ఎం.ఎం.హెచ్‌-133. తీపిమొక్కజొన్న కాంపోజిట్‌లు (రైతు పండించిన విత్తనాలను తిరిగి విత్తుకోవచ్చు): ప్రియ, మాధురి, విన్‌ఆరంజ్‌, అల్మోరా. తీపిమొక్కజొన్న హైబ్రిడ్లు (రైతు పండించిన విత్తనాలు తిరిగి విత్తితే దిగుబడి బాగా పడిపోతుంది): షుగర్‌-75, బ్రైట్‌ జీన్‌. తీపిమొక్కజొన్న గింజలలో చక్కెర 20-24 శాతం ఉంటుంది. బేబీకార్న్‌కు అనువైన కాంపోజిట్‌లు: మాధురి తీపి మొక్కజొన్న, హిమ్‌-129, హిమ్‌-123, వి.ఎల్‌-42. బేబికార్న్‌కు అనువైన హైబ్రిడ్లు: హిమ్‌-128, ప్రకాశ్‌, హెచ్‌.ఎం-4. పేలాల రకాలు: అంబర్‌ పాప్‌కార్న్‌, పెర్ల్‌ పాప్‌కార్న్‌, వి.ఎల్‌. అల్మోరా పాప్‌కార్న్‌. క్వాలిటీ ప్రోటీన్‌ రకాలు: ఇందులో రెట్టింపు లైసిన్‌ మరియు ట్రిప్టోఫిన్‌ అనే అమైనోఆమ్లాలుంటాయి. అంబర్‌శక్తి, హెచ్‌.క్యు.పి.ఎం-7, వివేక్‌ క్యు.పి.ఎం-9. పశుగ్రాస రకాలు: ఎ.పి.ఎఫ్‌.ఎం-8, గంగ-5, విజయ కాంపోజిట్‌. వరిమాగాణుల్లో మొక్కజొన్న: దుక్కి దున్నే ఖర్చు మిగులుతుంది. నెలరోజుల పంటకాలం కలిసొస్తుంది. బరువైన తేమను నిలుపుకొనే నేలల్లోనే ఈ పద్ధతి పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుండి జనవరి మొదటి వారం వరకు, రాయలసీమ, తెలంగాణలలో నవంబరు నుండి డిశంబరు వరకు విత్తవచ్చు. ఆ తర్వాత విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. మొక్కజొన్న మద్ధతు ధర: రూ. 2090/క్వి.

శనగ: ఈ పంట మద్ధతు ధర రూ. 5335/క్వి. మద్ధతు ధర కంటే, మార్కెట్‌ ధర అధికంగా ఉంది. ఈ పంట అధిక దిగుబడికి ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 15 నుండి నవంబరు 15 లోగా విత్తాలి. తెలంగాణాలో అక్టోబరు మొదటి నుండి నవంబరు 15 లోగా విత్తాలి. అత్యధిక దిగుబడులనిచ్చే ఎండుతెగులును తట్టుకునే రకాలు: నంద్యాలగ్రామ్‌-857 (ఎన్‌.బిఇ.జి-857): దేశవాళీరకం. దిగుబడి 1-2 నీటి తడులతో 12-14 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. 90-105 రోజుల పంట. తమిళనాడు, కర్ణాటకల్లో కూడా సాగు చేయడానికి అనుకూలం. నంద్యాల గ్రామ్‌-452 (ఎన్‌.బిఇ.జి.-452): దేశవాళి రకం. దిగుబడి 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. ధీర (ఎన్‌.బిఇ.జి-47): దేశవాళీ రకం. 90-105 రోజులు. దిగుబడి 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. యంత్రంతో కోయడానికి అనుకూలం. నంద్యాల గ్రామ్‌-119 (ఎన్‌.బిఇ.జి-119): కాబూలీ రకం. లావు గింజ. 90-100 రోజులు. దిగుబడి 1-2 నీటి తడులతో 10 క్వి/ఎ. వర్షాధారంగా 6-8 క్వి/ఎ.

పెసర: వరి తర్వాత వేసే పెసర పంటను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: టి.ఎం-96-2: గింజ లావుగా మెరుస్తూ ఉంటుంది. అధిక తేమను బూడిద తెగులును తట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుకూలం. డబ్లు.జి.జి.-37(ఏకశిల): తెలంగాణకు అనుకూలం. గింజలు పచ్చగా మెరుస్తుంటాయి. ఎల్లోమొజాయిక్‌ తెగులును తట్టుకుంటాయి. దిగుబడి 5-6 క్వి/ఎ. ఎల్‌.జి.జి-407: ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలం. మెరుపుగింజ. మధ్యస్థలావుగింజ. పల్లాకు, నల్లమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి: 5- క్వి/ఎ. పెసర మద్దతు ధర: రూ. 8558/క్వి. 

మినుము: వరి తర్వాత పంట పెట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ నెలలో మినుము విత్తవచ్చు. అనుకూలమైన పల్లాకు తెగులును తట్టుకునే మధ్యస్థ లావు గింజ గల పాలిష్‌ రకాలు: టి.బి.జి-104: దిగుబడి: 8-9 క్వి/ఎ. 70-75 రోజులు. జి.బి.జి-1: దిగుబడి: 8-9 క్వి/ఎ. 70-75 రోజులు. మినుము మద్ధతు ధర రూ. 6950/క్వి. మార్కెట్‌ ధర మద్ధతు ధర కంటే ఎక్కువగా ఉంది.

వరి: సన్నబియ్యానికి భారతదేశంలోను, ప్రపంచమంతా మస్తు గిరాకీ ఉంది. ఎంత పండించినా మంచి రేటుకు అమ్ముకునేందుకు అవకాశమున్నా ఉపయోగించుకోవడం లేదు. ఉదాహరణకు అమెరికాలో సన్నబియ్యం రెండు రెట్లు ఎక్కువ ధర పెట్టినా సూపర్‌ మార్కెట్‌లలో సరిగా దొరకడం లేదు. కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు బియ్యాన్ని పంచుదామంటే వారికి బియ్యం లభ్యం కాలేదు. తెలంగాణలో బియ్యం నిల్వలు మూలుగుతున్నాయి. దీనికదనంగా ఖరీఫ్‌ పంట చేతికొస్తున్నది. దాన్ని ప్రొక్యూర్‌ చేసి నిల్వ చేయడానికి స్థలం దొరకడం కష్టయ్యే పరిస్థితులు. ఈ విరుద్ధ పరిస్థితులన్నీ సులభంగా అధిగమించవచ్చు. రైతులు ఇంకొంత ఎక్కువ ఆదాయం పొందడానికి, ప్రపంచ మరియు భారతదేశ ప్రజలకు మంచి బియ్యం సులభంగా అనుకూలమైన ధరల్లో లభించేందుకు, రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో మార్పులు రావాలి. సన్నబియ్యాన్ని పండించడాన్ని బాగా ప్రోత్సహించాలి. ఎక్కడికయినా పంపించుకునే హక్కు రైతులకు, ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. మన దేశ స్ట్రాటజిక్‌ అవసరాలకు మించి ఉన్న సరుకునంతా ఎగుమతి చేసుకోవడానికి ఫ్రీగా పర్మిషన్‌ ఉండాలి. రైతులు, వినియోగదారులు దీనివలన లాభపడతారు. వీలయినంతవరకు కంట్రోల్స్‌ తీసివేయడం మంచిదని నా అభిప్రాయం. విదేశీ మారక ద్రవ్యం కూడా ఎక్కువగా సంపాదించవచ్చు. ఖరీఫ్‌ పంట కోతలు నవంబరులో ఎక్కువగా ఉంటాయి. వరి తయారైన వెంటనే కోసి, తుపాన్ల వలన కలిగే నష్టాల నుండి కాపాడాలి. వరి మద్ధతు ధర సాధారణ రకాలకు రూ 2185/క్వి. ఏ గ్రేడ్‌ రకాలకు రూ. 2203/క్వి. వర్షాభావ పరిస్థితుల వలన రిజర్వాయర్లలో నీరులేనిచోట, రబీలో వరి పంట వేయలేకపోతే ఆరుతడి పంటలు కూరగాయలు, పూలు, పశుగ్రాసాలు పండించాలి. చలికాలం/యాసంగిలో, అత్యధిక దిగుబడికి డిశంబరు రెండవ పక్షం నుండి, జనవరి మొదటి వారంలోపు వరినారు పోయడం అనుకూలం. చలికాలపు పంట కడథలో నీటి లభ్యత కష్టమయ్యే పరిస్థితులుంటేగాని, రబీ పంట తర్వాత అపరాలు, కూరగాయలు పండించాలంటే గాని నవంబరులో నారు పోయవచ్చు. ఈ నారు చలి తీవ్రత వలన మెల్లగా ఎదుగుతుంది. పంటకాలం 10-12 రోజులు ఎక్కువవుతుంది. దిగుబడి కూడా సుమారు 15 శాతం వరకు తగ్గుతుంది. మీ ప్రాంతంలో పండించగల్గిన మంచి ధర వచ్చే సన్నగింజ రకాలను సాగు చేసి మంచి ధరల కోసం ప్రభుత్వాలపై ఆధారపడడం తగ్గించుకోండి.

గోధుమ: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నవంబరు 15 లోగా విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: రవ్వకు: ఎం.ఏ.సి.ఎస్‌-2846. 120-130 రోజులు. దిగుబడి: 12 క్వి/ఎ. చపాతీకి: ఎం.ఏ.సి.ఎస్‌-2496. 110-125 రోజులు. దిగుబడి: 15 క్వి/ఎ. బ్రెడ్‌ తయారీకి: డి.డబ్ల్యు.ఆర్‌-162. 126-134 రోజులు. దిగుబడి: 15 క్వి./ఎ.

రాగి: ఆంధ్రప్రదేశ్‌లో రబీ పంటగా నవంబరు-డిశంబరు నెలల్లో విత్తవచ్చు. నారు పెంచి కూడా నాటవచ్చు. రాగి మద్ధతు ధర: రూ. 3846/క్వి. అన్ని కాలాలలోను (ఖరీఫ్‌, రబీ, వేసవి) పండించడానికి అనుకూలంగా ఉండి, అగ్గితెగులును తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే రకాలు: ఇంద్రావతి: 14-15 క్వి/ఎ. పాముపొడ తెగులును కూడా తట్టుకుంటుంది. కాల్షియం, ఐరన్‌, జింక్‌ ఎక్కువ. 115-120 రోజుల పంట. సువర్ణముఖి: 14-15 క్వి/ఎ. 105-110 రోజులు. పంట చివరి థలో వచ్చు బెట్టను తట్టుకుంటుంది. వరి మాగాణుల్లోనూ సాగుకు అనుకూలం. తిరుమల: 14-15 క్వి/ఎ. 115-120 రోజులు. గింజ నాణ్యత ఎక్కువ. చొప్ప దిగుబడి కూడా ఎక్కువ.

ప్రత్తి: నవంబరులో మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. ప్రత్తి మద్దతు ధర మీడియమ్‌ స్టేపుల్‌ రూ. 6620/క్వి. లాంగ్‌ స్టేపుల్‌ రూ. 7020/క్వి. పంట ఖర్చులు పెరుగుతున్నందున ఈ ధరతో రైతులు సంతృప్తి చెందడం లేదు. మార్కెట్‌ ధరలు కూడా 7000-8000 మధ్యనే ఉన్నాయి. ఇప్పటికే రైతులు ప్రత్తి పండించడం తగ్గించారు. ధరలు బాగుంటేనే వచ్చే సీజన్‌లో ప్రత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. లేకుంటే విస్తీర్ణాన్ని తగ్గించే అవకాశముంది. దిగుబడి తగ్గవచ్చు. దిగుమతి చేసుకున్న ప్రత్తి ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలుపుకుంటే, మన రైతులకిచ్చే దానికంటే ధర బాగా ఎక్కువవుతుంది. అందువలన మద్ధతు ధర పెంచి మన రైతులకు మేలు చేసి దేశ అవసరాలకు కావలసినంత ప్రత్తి ఇక్కడే పండించుకునేటట్లు చేయాలి. పంట ఎక్కువగా పండితే ఎగుమతి చేయాలి.

కంది: నవంబర్‌ నెలలో ఈ పంటపై ముఖ్యంగా మారుకా మచ్చల పురుగు, కాయతొలుచు పురుగు, కాయఈగ ఆశించే అవకాశముంది. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కంది మద్ధతు ధర: రూ. 7000/క్వి.

బఠాణి: ఈ పంటను నవంబరు 15 వరకు విత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ రకాల కంటే దాదాపు రెట్టింపు గింజ దిగుబడినిచ్చే రకం: పంత్‌ అనుపమ (ఐ.పి-3), కాయకు 7 గింజలు. పచ్చికాయ దిగుబడి: 100క్వి/ఎ. 

ఉల్లి: నవంబరులో నారుపోసి డిశంబరులో నాటవచ్చు. అనువైన రకాలు: అర్కనికేతన్‌ : ఎరుపుగడ్డలు, ఘాటు ఎక్కువ. దిగుబడి: 132 క్వి/ఎ. అర్క ప్రగతి: గుండ్రని ఎరుపు గడ్డలు. దిగుబడి: 130 క్వి/ఎ.

కీరదోస: కీరదోసను సాలాడ్‌గా వాడడం ఎక్కువయినందున చలికాలంలో కూడా ధర తగ్గడం లేదు. పాలీహౌస్‌లలో ఈ పంట సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు.

పూలు: కార్తీక సోమవారాలలోను, కార్తీక పౌర్ణమిరోజు నోములు, పూజలున్నందున పూలకు మంచి గిరాకీ ఉంటుంది. దీపావళికి కూడా పూల వినియోగమెక్కువ. పూజలెక్కువగా ఉండే రోజులకు 2-3 రోజుల ముందునుండే పూలను కొని ప్రిజ్‌లలో పెట్టుకునే అలవాటుంటుంది. దీనిని గమనించి పూలను తెంపడం, మార్కెట్‌కు తరలించడం పండుగకు 2-3 రోజుల నుండి పండుగ రోజులోపల పూర్తి చేయాలి. ధరలు అప్పుడే ఎక్కువగా ఉంటాయి.

పశుగ్రాస పంటలు: ఈ నెలలో విత్తదగిన పశుగ్రాస పంటలు: మొక్కజొన్న, జొన్న, జనుము, లూసర్న్‌, ఓట్స్‌్‌, అలసంద, పిల్లిపెసర.

గెనుసుగడ్డ/చిలగడదుంప: నవంబరులో తీగలను నాటవచ్చు.

పూలు: పాలీహౌస్‌లలో కార్నేషన్‌, గులాబీ సాగు ఈనెలలో చేపట్టవచ్చు. గులాబీ, మల్లె, జెర్బెరా, చామంతి పూల మొక్కలను ఈ నెలలో నాటవచ్చు.

మిరప: రబీ పంటగా అక్టోబరు, నవంబరు నెలల్లో నారుపోసి, 6 వారాల నారును నాటవచ్చు. మంచి రకాలు: ఎల్‌.సి.ఏ-625, ఎల్‌.సి.ఏ-620, ఎల్‌.సి.ఏ-436, ఎల్‌.సి.ఏ-424, కాశీఅభ.

క్యాబేజి, కాలీఫ్లవర్‌, క్యారెట్‌: నవంబర్‌లో నాటవచ్చు.

విలువలు – రైతు ప్రజా సంఘాలు: ప్రజాజీవితంలో విలువలను పెంచి ప్రజల అభివృద్ధి రాజకీయాలకతీతంగా జరిపేందుకు సహాయపడగల రైతు ప్రజా సంఘాల ఏర్పాటుకు సహకరిద్దాం. నీతి, న్యాయం, ధర్మం, నిలబెట్టాలంటే అభివృద్ధిలో అందరూ కులమతాలకతీతంగా ఉత్సాహంగా పాల్గొనేందుకు రైతు ప్రజాసంఘాలను అన్ని ఆవాస ప్రాంతాల్లో ప్రోత్సహిద్దాం.

Read More