– గతేడాది రికార్డు స్థాయిలో పంటల ఉత్పత్తులు
– 275 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి
– రాష్ట్ర అర్థ, గణాంకశాఖ అంచనాల్లో వెల్లడి
దేశ ప్రజల ఆకలి తీర్చే బృహత్కార్యంలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రికార్డుస్థాయి బియ్యం ఉత్పత్తితో దేశంలోనే ముందుందని రాష్ట్ర అర్థ, గణాంకశాఖ తెలిపింది. వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వ సానుకూల విధానాలతో గతేడాది (2024-25) రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని ఈ శాఖ తాజాగా విడుదల చేసిన అంచనాల్లో వెల్లడించింది. బియ్యం ఒకటే కాకుండా పలు ఇతర పంటల దిగుబడి సైతం అంతకుముందుతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు వివరించింది. తాజా నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ శాఖ అందజేసింది. *సాధారణ సాగు విస్తీర్ణానికి మించి..* అంతకుముందు ఏడాది (2023-24)లో 168.75 లక్షల టన్నుల ఉత్పత్తి చేసిన తెలంగాణ మరుసటి ఏడాది (2024-25) దాన్ని అధిగమించి ఏకంగా 183.57 లక్షల టన్నులు సాధించింది. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని అర్థ, గణాంకశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ తర్వాత వరుసగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఉన్నాయి. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి వేయడంతో దిగుబడులు వెల్లువెత్తాయి. ఉదాహరణకు గత రబీ (యాసంగి సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 16 లక్షల హెక్టార్లు కాగా… గతేడాది ఏకంగా 24.04 లక్షల హెక్టార్లలో సాగయింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు 29 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లు తీసుకున్నారు. వీటికి నిరంతరాయ ఉచిత కరెంటు సరఫరాతో కర్షకులు వరి సాగుకే మొగ్గుచూపారు. ఫలితంగా తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 2025 మార్చి 20న 17,162 మెగావాట్ల కరెంటు డిమాండు నమోదైనట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. గతేడాది ఖరీఫ్ (వానాకాలం), రబీ(యాసంగి)లో కలిపి మొత్తం 275 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. దీని నుంచి 183 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తయినట్లు నివేదిక తెలిపింది. ఏటా రెండు సీజన్లలో సాగు, దిగుబడులపై క్షేత్రస్థాయిలో పంటకోత ప్రయోగాల ద్వారా శాఖ అంచనాలు వేసి నాలుగుసార్లు నివేదిక పంపుతుంది. తాజాగా మూడో ముందస్తు అంచనాల నివేదిక పంపింది. దీని ప్రకారం రాష్ట్రంలో గతేడాది మొత్తం 224 లక్షల టన్నుల ఆహారధాన్యాలు పండినట్లు కేంద్రం ప్రకటించింది. బియ్యం, పప్పు, తృణధాన్యాల దిగుబడులను మాత్రమే కేంద్రం ఆహారధాన్యాల కింద చూపుతుంది. వరిధాన్యం దిగుబడి లెక్కను పరిగణనలోకి తీసుకోదు. తృణ, చిరుధాన్యాలు కలిపి తెలంగాణలో 37.19 లక్షల టన్నులు, కందులు 1.99 లక్షల టన్నులు, శనగలు 1.10 లక్షల టన్నులు, మినుములు 43,570, పెసలు 24,170, నూనెగింజలు 5.50 లక్షల టన్నులు పండినట్లు శాఖ వివరించింది.*రాష్ట్రంలో బియ్యం దిగుబడి (లక్షల టన్నుల్లో)* 2022-23 158.77 2023-24 168.75 2024-25 183.57*తెలంగాణలో ప్రధాన పంటల దిగుబడి తీరు (టన్నుల్లో)* పంట 2023-24 2024-25 వరి 2,60,89,000 2,75,30,800 మొక్కజొన్న 27,76,000 34,13,000 వేరుశనగ 2,25,000 2,29,510 సోయా 2,69,000 2,90,630



