వ్యవసాయ వర్సిటీ నిర్ణయంతో రైతులకు మేలు

తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), ఏరువాక (డాట్‌ సెంటర్‌) కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగిలిన 15 జిల్లాల్లో ఏరువాక కేంద్రాలు లేదా కృషివిజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ అల్దాస్‌ జానయ్య ఇటీవల జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 3 విస్తరణ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో రైతులకు ఎంతగానో ఉపకరించనుంది. ఇదివరకే దేశవ్యాప్తంగా జిల్లాకొక ‘కృషివిజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) నెలకొల్పాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేవీకేలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లాలో ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో కేవీకేలు పనిచేస్తున్నాయి. తాజాగా వ్యవసాయ వర్సిటీ నిర్ణయంతో పెద్దపల్లి జిల్లాలో కేవీకే ఏర్పాటు కానుండగా ప్రభుత్వ హామీ మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉద్యాన కేవీకేను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇదివరకున్నవి, నూతనంగా ఏర్పాటుచేసే అన్ని కేవీకేలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా, జిల్లాస్థాయి సమగ్ర వ్యవసాయకేంద్రాలుగా తీర్చి దిద్దనున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే కేవీ కేల నిర్వహణ, జీతభత్యాలను పూర్తిగా కేంద్ర వ్యవసాయశాఖనే భరిస్తుంది. పరిశోధన స్థానాల్లో అభివృద్ధి చేసిన నూతన వంగడాలను తొలుత కేవీకేల్లోని క్షేత్రాల్లో సాగుచేసి ఫలితాలను సమీక్షిస్తారు. కేవీకేల్లోని శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఫలితాలపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన సాగు విధానాలపైనా వీటిల్లో పరిశోధనలు చేపడతారు. భూసార పరీక్ష కిట్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు అందిస్తారు. వాతావరణ సమాచారం, చీడపీడల నివారణపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారు. ఒక్కో కేవీకేలో ఒక సీనియర్‌ సైంటిస్టు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాస్త్రవేత్తలు ఆరుగురితో పాటు ఒక మేనేజర్‌, ఇద్దరు కార్యక్రమ సహాయకులు, మరో ఇద్దరు పరిపాలన సిబ్బంది, ఒక ట్రాక్టర్‌ డ్రైవర్‌, ముగ్గురు సాంకేతిక ఉద్యోగులను నియమిస్తారు. ఒక్కో కేవీకేను దాదాపు 50-75 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు చొరవ తీసుకొని స్థలాన్ని సమకూర్చి కేవీకేలు, డాటా సెంటర్లను ఏర్పాటుచేస్తే వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ సమాచారం ఒకేచోట లభించి ఉమ్మడి జిల్లాలోని రైతులకు సాగు సంబంధిత సేవలు మరింతగా దరిచేరతాయి.