తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో పండించే పసుపు పంటకు భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో గురువారం అధ్యయనం ప్రారంభమైంది. విశ్వ విద్యాలయ ప్రధాన పరిశోధకులు పిడిగం సైదయ్య నేతృత్వంలో కమ్మర్‌పల్లి లోని పసుపు పరిశోధన స్థానం అధిపతి బి. మహేందర్‌, నాబార్డు నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధి అధికారి ప్రవీణ్‌, రైతులతో కూడిన బృందం.. ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, నందిపేట మండలాల్లో పర్యటించింది. సాగు భూములు, పసుపు రకాలు, వాటి లక్షణాలు, పంట విత్తుకొనే దూరం, సాగుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, ఎరువులు, సాగునీటి పారుదల తదితర అంశాలపై సమగ్ర సమాచారం సేకరించింది. నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీని సందర్శించి పసుపు ధరలు, కొనుగోళ్ల తీరును తెలుసుకుంది.