జీనోమ్‌ ఎడిటింగ్‌తో కొర్రల్లో కొత్త వంగడాలు

చిరుధాన్యాలను ప్రతిఒక్కరూ ఆహారంలో భాగం చేసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యా లయం(హెచ్‌సీయూ)లోని మిల్లెట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ ‘జీనోమ్‌ ఎడిటింగ్‌’ ద్వారా నూతన వంగడాలను సృష్టిస్తోంది. కొర్రల్లో ఫైటిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండి… జీర్ణక్రియ స్వల్పంగా మందగించేలా చేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఆహారంగా తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఫైటిక్‌ యాసిడ్‌ను తగ్గించడంపై మిల్లెట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ పరిశోధకులు దేశంలోనే తొలి సారిగా రెండేళ్ల క్రితం జీనోమ్‌ (జన్యు) ఎడిటింగ్‌ ప్రక్రియను చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్‌ శివారులోని ఇక్రిశాట్‌ నుంచి 155 రకం కొర్రలను, దిల్లీ శివారులోని వ్యవసాయ వర్సిటీ నుంచి 185 రకాన్ని తెప్పించారు. ల్యాబ్‌లో ప్రయోగాల ద్వారా 155 రకంలో ఫైటిక్‌ యాసిడ్‌ను 70 శాతానికి.. 185 రకంలో 81 శాతానికి తగ్గించి కొత్త రకం వంగడాలను సృష్టించారు.

Read More

సజ్జకు మద్దతు ధర దక్కడం లేదు

ఆంధ్రప్రదేశ్‌లో సజ్జల క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775 ఉంటే.. రైతుకు రూ. 2వేలు కూడా దక్కడం లేదు. ఎకరానికి సగటున రూ.25 వేల పెట్టుబడి పెట్టారు. నాణ్యత లేదంటూ ప్రకాశం, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో క్వింటాలు రూ.1,600 నుంచి రూ.1,800కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌ లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జ సాగైంది. ప్రకాశం జిల్లాలో 17 వేల ఎకరాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 28,000, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11 వేల ఎకరాల్లో వేశారు. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో పాటు తుపాను ప్రభావంతో పంట దెబ్బతింది. అధిక శాతం రైతులకు ఎకరానికి 2-3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట నాణ్యతా తగ్గింది. ఈ తరుణంలో ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరపై మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Read More

చెట్ల కొమ్మలకు కోళ్ళ వసతి

వివిధ సమయాల్లో కోళ్ళకు వచ్చే వ్యాధులు, కోళ్ళ పేను తదితర సమస్యలతో చాలామంది పెరటి కోళ్ళ పెంపకందారులు ఇబ్బందులు పడుతన్నారు. కొందరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాటి పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కోళ్లు.. గుడ్లను పొదిగే సమయంలో వాటికి పేను ఆశించే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించేందుకు చెట్టుకు కోళ్ల గంపలను వేలాడదీసి అందులో కోడి గుడ్లను పొదిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కొదురుపాకలో ఓ రైతు తమ ఇంటి ఆవరణలో చెట్ల కొమ్మలకు గూళ్లను కట్టి కోళ్లు పొదిగే ఏర్పాటు చేశారు.

Read More

మధ్యతరగతి పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ఉద్యాన హబ్‌ ప్రణాళిక రూపొందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొని దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం. మధ్య తరగతి పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు పప్పులు, కూరగాయలు, పండ్లు అవసరం. సీఎం ఈ అవసరాన్ని గుర్తించి రాయలసీమలోని 9 జిల్లాల్లో కూరగాయలు, పండ్లు పండించి ఎగుమతి చేస్తామంటున్నారు. ఎక్కడ మార్కెట్‌ ఉంటే అక్కడికి రవాణా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తేనే రైతులకు తక్షణ ప్రయోజనాలు అందుతాయి. రాయలసీమ హబ్‌కు అవసరమైన ఇన్ఫ్రా ఏర్పాటుకు బ్యాంకులు సాయం చేయాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్యాకేజి యూనిట్లు, రవాణా వ్యవస్థ, కోల్డ్‌ స్టోరేజి యూనిట్ల ఏర్పాటుకు, ఉత్తమ విత్తనాల సరఫరాకు బ్యాంకులు తోడ్పాటు అందించాలి. ఈ హబ్‌ ప్రభావం కేవలం సీమ జిల్లాలకే పరిమితం కాదు. రాష్ట్రం యావత్తూ ఉంటుంది. తమిళనాడు నుంచి కొబ్బరి, మహారాష్ట్ర నుంచి అరటి ముంబయి, దిల్లీ వంటి నగరాలకు రవాణా చేసేందుకు కేంద్రం వారానికి 2, 3 సార్లు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అలా రాయలసీమ నుంచీ పంపాలి’ అని నిర్మలా సీతారామన్‌ సూచించారు.

Read More

తెలంగాణాలో ధాన్యం కొనుగోలు ఊపందుకుంది

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వరి కోతలు ముమ్మరం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా వస్తోంది. శుక్రవారం నాటికి 35.96 లక్షల టన్నులు కొనుగోళ్లు జరిగాయి. మద్దతు ధరతో పాటు బోనస్‌ కలిపి రూ. 6,688.63 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 10,434 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. 8,465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, 8,361 కేంద్రాలను ప్రారంభించారు. దొడ్డు రకం 22.86 లక్షల టన్నులు, సన్నాలు 18.66 కలిపి మొత్తం 41.52 లక్షల టన్నులు కేంద్రాలకు రాగా, 35.96 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. ఇందులో 35.39 లక్షల టన్నులు మిల్లులకు తరలించారు. గోదాముల్లో 2,750 టన్నులు నిల్వ చేశారు. 54,241 టన్నుల వడ్లను కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాల్సి ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌.. అక్టోబరులో ధాన్యం కొను గోళ్ల ప్రక్రియలో జాప్యమైంది. సీఎం రేవంత్రెడ్డి ఈ అంశంపై దృష్టి పెట్టి.. ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో నవంబరులో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి.

Read More

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 28,29 తేదీల్లో డిగ్రీ కోర్సులకి తుది కౌన్సిలింగ్‌

* రైతు కోటాలో ఖాళీగా ఉన్న సుమారు 22 సీట్లు

.* రైతు కూలీల కోటాలో ఖాళీగా ఉన్న సుమారు 40 సీట్లకి 28వ తేదీన కౌన్సిలింగ్‌ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ రెగ్యులర్‌ డిగ్రీ, స్పెషల్‌ కోటా యూజీ కోర్సులలో ప్రవేశాలకు చివరి థ కౌన్సిలింగ్‌ ఈనెల 28వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. రైతు కోటాలో సుమారు 22 సీట్లు, రైతు కూలీల కోటాలో సుమారు 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిని ఈ కౌన్సిలింగ్‌ ద్వారానే భర్తీ చేయనున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. తల్లిదండ్రులు, విద్యార్థులు కేటగిరీల వారీగా సీట్ల వివరాలని వెబ్‌సైట్‌లో చూసి కౌన్సిలింగ్‌కి హాజరు కావాల్సిందిగా విశ్వవిద్యాలయం సూచించింది. అదేవిధంగా నవంబర్‌ 29న (శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్‌ఆర్‌ఐ / ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ), బిటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌), బిఎస్సీ (ఆనర్స్‌), కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి వాక్‌-ఇన్‌-కౌన్సిలింగ్‌ జరగనుందని విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ రెండు కౌన్సిలింగ్‌లు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలోనే జరగనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, వెబ్‌సైట్‌లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలనీ, పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ *www.pjtau.edu.in* లో చూడవచ్చు.

Read More

నవంబరు 1 నుండి ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ 20.01 శాతం

తెలంగాణాలో ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు అంగీకరించకపోయినా అధికారులు, రైతు సంఘ ప్రతినిధులు పట్టుబట్టడంతో ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌- నూనె దిగుమతి శాతం) 20.01 శాతానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గెలల నుంచి వచ్చే నూనె దిగుమతిపై 20.01 శాతం, గింజల బరువుపై 10.08 శాతం ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ, ఉద్యానశాఖ కమిషనర్‌ యాస్మిన్‌ బాషా, సంయుక్త సంచాలకులు సరోజ, ఆయిల్‌ ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, రైతు సంఘ ప్రతినిధులు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, మహేశ్‌, బండి భాస్కర్‌, ప్రభాకరవర్మ, జ్యోత్స్న పలువురు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గెలలు, గింజలపై నుంచే కాక.. కెర్నల్‌ ఆయిల్‌పై కూడా రైతులకు వాటా చెల్లించాలని రైతు సంఘం ప్రతినిధులు అధికారులను కోరారు. నూతన ఓఈఆర్‌ 20.01 శాతం 2025 నవంబరు 1 నుంచి.. 2026 అక్టోబరు 31 క వరకు అమలులో ఉంటుందని, ఈ రేటు దేశంలోనే అత్యధికమని టీజీ ఆయిల్‌ ఫెడ్‌ జీఎం సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత టమాటో వాల్యూచైన్‌ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టి.జి. భరత్‌ కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ను ఆయన దిల్లీలో కలిసి సమీకృత టమాటో వాల్యూ చైన్‌ ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్ల అభివృద్ధికి సంబంధించిన అంశాల పైనా ఆయనతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ.. ”రాష్ట్రంలోని ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పివో)లను ప్రోత్సహించేందుకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలి. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్ర్‌ప్రైజెన్‌ పథకం కింద స్టార్టప్‌లు, సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు వీలుగా తిరుపతి, బాపట్ల, లాం, పులివెందుల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపాలి. రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కల్పించేందుకు పంట కోత తర్వాత నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి యూనిట్లను బలోపేతం చేయడంలో కేంద్రం సహకరించాలి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు” అని వెల్లడించారు.

Read More

సౌర విద్యుత్‌ రైతుకి ఆదాయం

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 29.10 లక్షల వ్యవసాయ బోర్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా అవుతోంది. వీటితో పాటు భవిష్యత్తులో ఇచ్చే కనెక్షన్లకు కూడా కలిపి అన్నింటికీ వచ్చే నాలుగేళ్లలో సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి నాలు గేళ్ల పాటు ఇదే పథకం రెండో థ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు, ప్రతి పాదనలు పంపాలని కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు వ్యక్తిగతంగా తమ పొలంలో ఏర్పాటు చేసుకునే సౌర ఫలకాల ఏర్పాటుకయ్యే వ్యయంలో రాయితీ ఇవ్వాలని రాష్ట్రం కోరింది. ఇలా వచ్చే నాలుగేళ్లలో 28.60 లక్షల బోర్లకు రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఒక విద్యుత్‌ ఫీడర్‌ ప్రాంతంలో పొలాలు ఉండి వాటిలో వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లు కలిగిన రైతులు సంఘంగా ఏర్పడి ఒకచోట సోలార్‌ ప్లాంటు పెట్టుకుంటే ఆ కరెంటును కొనేందుకు కేంద్రం అనుమతిస్తుంది. ఇలా వచ్చే నాలుగేళ్లలో మొత్తం 4,500 మెగావాట్ల ప్లాంట్లను రైతు సంఘాలతో ఏర్పాటు చేయించేందుకు అనుమతించాలని రాష్ట్రం కోరింది.రూ.15 వేల కోట్ల మిగులు: ప్రస్తుతం ఏటా రూ.11 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రాయితీగా డిస్కంలకు ఇస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ఇది రూ.15 వేల కోట్లను దాటుతుందని అంచనా. పీఎం కుసుమ్‌ కింద వ్యవసాయ బోర్లన్నింటికీ సోలర్‌ ఏర్పాటుచేస్తే ఈ సొమ్ము మిగులుతుందని ప్రభుత్వ అంచనా. పొలాల్లో 24,500 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసి డిస్కంకు కరెంటు విక్రయించడం వల్ల ప్రతి రైతుకు కచ్చితమైన ఆదాయం వస్తుందని అంచనా.

Read More

రాయలసీమ పంటలు అంతర్జాతీయ మార్కెట్‌కు

పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి కల్పించేలా రూ.40 వేల కోట్లతో కార్యాచరణ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీరాజ్‌ రోడ్ల లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పూర్వోదయ పథకంలో రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. ప్రపంచబ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏయే అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై అధికారులతో చర్చించారు. ”ప్రపంచంలో డిమాండ్‌ ఉన్న ఉద్యానపంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే పండుతున్నాయి. ఉద్యాన రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. రాయలసీమను ఉద్యానపంటల హబ్‌ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకోవాలి. సర్టిఫికేషన్‌, ట్రేసబిలిటీ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. రాయలసీమలో 65 రకాల ఉద్యానపంటలు పండుతుంటే 18రకాల పంటలకు మంచి డిమాండ్‌ ఉంది. వీటిపై రైతులను ప్రోత్సహించాలి. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెగ్యులర్‌ పంటల కంటే భవిష్యత్తులో ప్రజల అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించాలి” అని సూచించారు.

.*ఇతర దేశాలకు ఉత్పత్తులు* ”50 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటల ద్వారా పెద్ద ఎత్తున రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యాన పంటలకు రవాణా, మార్కెటింగ్‌, కోల్డ్‌ చైన్‌ తదితర సదుపాయాలు కల్పించాలి. దుబాయ్‌ లాంటి ప్రాంతాలకు విమానాల్లో పంపితే, అక్కడి నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పంపొచ్చు. రాయలసీమకు మంచి రహదారులు వచ్చాయి. మారుమూల ప్రాంతాలను కలుపుతూ మరికొన్ని రహదారులు రావాలి. దీంతో మార్కెటింగ్‌ మెరుగుపడుతుంది. ఉద్యాన పంటల సాగు మొదలుకుని మార్కెటింగ్‌ వరకు వివిధ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఇందులో రాయితీ రూపంలో రూ. 9వేల కోట్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అరటి, చీనీ, బొప్పాయి, దానిమ్మ, మామిడి, ఉల్లి, టమాటా, మిరప, నిమ్మ లాంటి పంటలపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తి, టేబుల్‌ వెరైటీలను పండించి వాటికి విలువ జోడించాలి. అప్పుడు రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. ఆక్వారంగంలాగే ఉద్యాన రంగం సైతం భవిష్యత్తులో అగ్రస్థానానికి చేరుతుంది” అని తెలిపారు. హంద్రీనీవా సహా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేయడంతో సీమలో ఉద్యానసాగు గతంతో పోల్చుకుంటే సులభతరమైందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. పంటలు చక్కగా పండడంతో రైతులకు ఆదాయం రావడంతో పాటు భూముల ధరలు పెరిగాయని దీనికి తమ అనంతపురం జిల్లానే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన చెప్పారు.

Read More