నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం అందుతుంది కాబట్టి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భూసార ఆరోగ్య వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా నేల సారాన్ని పెంచాలి. పంట అవశేషాలు తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలి. నేల ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా నిర్వహించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. వారు రైతులకు నేల యాజమాన్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి చేస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలి” అని మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హిమాన్ష్ పాఠక్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, అగ్రివర్సిటీ వీసీ రాజిరెడ్డి, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

7 Apr, 2026
నేల ఆరోగ్యంతోనే పౌష్టికాహారం
#AgriNews, #CropManagement, #EcoFarming, #farmerslife, #GreenAgriculture, #GreenManure, #HealthyFood, #HealthySoil, #ICRISAT, #IndianFarmers, #NaturalFarming, #OrganicFarming, #RaituNestham, #Rythu, #SaveSoil, #SoilFertility, #SoilHealth, #SustainableAgriculture, #TelanganaFarming, #ZeroBudgetFarming, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
