వ్యవసాయ వ్యర్థాలకు నిప్పుతో అనేక ప్రమాదాలు

ధూమపానం చేసే వారి నిర్లక్ష్యంతో, విద్యుదాఘాతంతో ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగేవి. ప్రస్తుతం పంట వ్యర్థాల దహనం పేరిట, పెట్టే మంటలకు సమీప రైతుల ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పంటలను తగలబెట్టడం మంచిది కాదని హితబోధ చేస్తున్నా, పెడచెవిన పెడుతున్న వ్యక్తులతో నిత్యం ఎక్కడో చోట మంటలు రేగుతూనే ఉన్నాయి. పచ్చని చేలు సైతం బూడిదగా మారుతున్నాయి. ఈ ఏడాది మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 25 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన నెలన్నర రోజులుగా కోతలు ముమ్మరంగా సాగగా, ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. కోతల అనంతరం ఖరీఫ్‌కు చేలను సిద్ధం చేయాలన్న ఆలోచనలో రైతులు, కంకులు విరవగా, ఉన్న పంట వ్యర్థాలను తగలబెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఒకరిని చూసి, మరొకరు ఇదే పనికి పూనుకుంటున్నారు. ఏ చేను చూసిన మసిగా మారి కన్పిస్తోంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు వెళ్తున్న అగ్నిమాపక శకటాలకు సరైన దారిలేక మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుండటంతో సకాలంలో ఆర్పలేకపోతున్నారు.
20కి పైగా ప్రమాదాలు: మైలవరం ఫైర్ స్టేషన్ పరిధిలోని ఆరు మండలాల్లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 20 వరకు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అవన్నీ పొలాల్లో నిప్పు పెట్టినవే. విలువైన జామాయిల్ పంటలతో పాటు సాగునీటి సరఫరా సామగ్రి దగ్ధమ య్యాయి. ఎండలు మండుతున్న తరుణంలో, పూర్తిగా ఎండిన చేలల్లో అగ్గిపుల్ల గీసేసి వెళ్తుండటంతోనే పక్క చేలకు వ్యాపించి, ప్రమాద స్థాయి పెరుగుతోంది. కొన్నిసార్లు మంటలార్పేందుకు మేము దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది అని మైలవరం అగ్నిమాపక అధికారి అన్నారు.

Read More

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి

అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ అదికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలో వర్షాల బీభత్సంపై ఆయన బుధవారం ఆ జిల్లాతో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసు కురావాలని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు మార్కెటింగ్ అదికారులను వెంటనే మంచిర్యాలకు వెళ్లాలని ఆదేశించారు.

Read More

సజ్జాపూర్ చామదుంప భౌగోళిక గుర్తింపునకు దరఖాస్తు

తెలంగాణా రాష్ట్రంలో కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో పండించే ప్రసిద్ధి పొందిన సజ్జాపూర్ చామగడ్డకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ఇవ్వాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయంలో మంగళవారం దరఖాస్తు చేసుకుంది. ఈ చేమ దుంప ప్రపంచంలోనే అరుదైందని, అత్యంత పోషకవిలువలతో సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగి ఉందని వివరించింది. జీఐ కోసం దరఖాస్తు చేసిన మొట్ట మొదటి దుంప రకంగా ఇది నమోదైంది. సజ్జాపూర్ చామదుంప విశిష్టతను గుర్తించిన ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్త పిడిగం సైదయ్య దీనిపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు టీజీవోఎస్‌టీ సహకారం అందించింది. ఈక్రమంలో చామదుంప పుట్టుక, దాని రకపు లక్షణాలు, జీవరసాయన ప్రొఫైలింగ్, సాగు పద్దతులు, డీఎనఏ, ఇతర విశిష్ట లక్షణాలకు భౌగోళిక సంబంధాలు వంటి కీలక సమాచారాన్ని సేకరించారు. సంకర లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రకాల మాదిరిగా కాకుండా.. సజ్జాపూర్ చామదుంపను స్థానిక రైతులు శతాబ్దానికి పైగా సంప్రదాయ శాఖీయ పద్ధతుల ద్వారా సంరక్షించి, వ్యాప్తి చేస్తున్నారు. ఈ వివరాల నివేదికతో జీఐ నిపుణుడు శుభజీత్ సాహా ద్వారా జీఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేశారు. దరఖాస్తును ఆమోదించిన రిజిస్ట్రీ.. పరిశీలనకు స్వీకరించినట్లు వెల్లడించింది.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కౌలు ధరలు

ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది రబీ ఇంకా పూర్తిగా ముగియక ముందే పొలాలు కౌలుకు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న పొలాలైతే ఎకరాకు రూ.40 వేలు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. మిరప సాగు అనుకూలించడమే దీనికి కారణం. ఈ ఏడాది వాతావరణంలో మార్పు కారణంగా జనవరి నుంచి మిరపలో నల్లతామర ప్రభావం తగ్గింది. తోటలు ఏపుగా పెరిగాయి. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తోంది. అక్కడక్కడా ఎకరాకు 40-50 క్వింటాళ్లు వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మిరప ధరలు క్రమంగా పెరుగుతూ సగటున క్వింటాలు రూ.20 వేలకు చేరాయి. పెట్టుబడులు పోగా కొంతైనా మిగులుతుందని, అప్పుల నుంచి ఎంతోకొంత బయటపడతామనే ఆశ రైతుల్లో ఉంది. విత్తన మొక్కజొన్న రైతులకూ అధిక దిగుబడులే వచ్చాయి. అందుకే వచ్చే ఖరీఫ్, రబీల్లో ఈ రెండు పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. వచ్చే ఏడాది కూడా మిరప సాగు పెరుగుతుందని అంచనా. గురజాల, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేటతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల్లో సాగు అధికం. గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ముందే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం ప్రాంతంలో బోర్ల కింద ఉన్న భూములకు ఎకరా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది.
“ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిరప సాగు కొన్నేళ్లుగా పెరిగింది. హంద్రీ-నీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ పరిధిలో మిరప విస్తృతంగా పండిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ మిరప వేసేందుకు పొలాలను కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ.45వేల మధ్య చెల్లించేలా కౌలుకు తీసుకుంటున్నారు.

Read More

తెలంగాణాలో కూరగాయల రైతులకు సమీపంలోనే విక్రయ కేంద్రాలు

కూరగాయ పంటలు పండించే చోటే స్థానిక మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాలను దీని కోసం గుర్తించింది. కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుదల ప్రణాళికలో భాగంగా రైతు సమస్యలపై ఉద్యానశాఖ, ఉద్యానవర్సిటీలు అధ్యయనం చేశాయి. పంటలు పండించిన తర్వాత విక్రయాలు, మార్కెటింగ్ సమస్యగా మారిందని, దీంతో రైతులు సాగుకు వెనకాడుతున్నారని అధ్యయనంలో తేల్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. అవీ నగరాలు, పట్టణాల్లోనే ఏర్పాటయ్యాయి. తెల్లవారుజామునే పంటను అక్కడికి తరలించడం రైతులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు తమ గ్రామాల సమీ పంలోనే మార్కెట్లను ఏర్పాటు చేసి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని ఉద్యానశాఖ, వర్సిటీలు సూచించాయి. దీనికి అనుగుణంగా స్థలాలను గుర్తించాలని సర్కారు అన్ని జిల్లాల కలెక్టర్లను ఇటీవలే ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల రహదారులకు సమీపంలో రవాణా సౌకర్యం ఉన్నవాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది. కలెక్టర్లు మొదటి విడతలో 60 ప్రాంతాలను గుర్తించారు. అక్కడ కూరగాయల నిల్వ, విక్రయాల కోసం మార్కెటింగ్ శాఖ షెడ్లను నిర్మించనుంది. కూరగాయల లభ్యతపై సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. రవాణా కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులా లకు అక్కడి నుంచే కూరగాయలు పంపిణీ చేయనున్నారు.

Read More

బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో 8

బర్డ్ ఫ్లూ స్వేచ్ఛా ప్రాంతాలు (బర్డ్ ఫ్లూ ఫ్రీ ఏరియా)గా ఆంధ్రరాష్ట్రంలో ఆరు జిల్లాల్లోని 8 ప్రాంతాలను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రాంతాల్లో ఫ్లూ ప్రబలడంతో ఆ ప్రాంతాలను అప్పట్లో బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. తర్వాత నెలకు రెండుసార్లు చొప్పున ఈ ప్రాంతాల్లోని కోళ్లు / పక్షుల నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఐకార్-ఎనఐహెచఎసఏడీ)కు పంపించారు. వరుసగా నెగెటివ్ వస్తుండటంతో ఈ ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలుగా ప్రకటించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కమర్షియల్ పౌల్ట్రీలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని వేల్పూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని కానూరు అగ్రహారం, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుముల్లంక, ఎ.కోడూరు మండలంలోని కృష్ణారావుపాలెం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని 21వ వార్డు, గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామం మరియు బాతులు ప్రభావితమైన ప్రాంతం కర్నూలు జిల్లాలో ఎనఆర్‌పేట, కర్నూలును బర్డ్ ఫ్లూ ఫ్రీ ప్రాంతాలుగా ప్రకటించారు.

Read More

నేల ఆరోగ్యంతోనే పౌష్టికాహారం

నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం అందుతుంది కాబట్టి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భూసార ఆరోగ్య వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా నేల సారాన్ని పెంచాలి. పంట అవశేషాలు తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలి. నేల ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా నిర్వహించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. వారు రైతులకు నేల యాజమాన్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి చేస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలి” అని మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హిమాన్ష్ పాఠక్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, అగ్రివర్సిటీ వీసీ రాజిరెడ్డి, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

23 వేల రూపాయలకు చేరువలో పామాయిల్ ధర

కరోనా సమయంలో పామాయిల్ గెలలకు గరిష్ఠంగా టన్నుకు రూ.23 వేల పైచిలుకు ధర లభించింది. అప్పటివరకు గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో, ఎన్‌టిఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపించిన సాగు ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నర్సరీల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచడమేగాక, మొక్కలు ఉచితంగా అందిస్తుండటంతో ఏటా సాగు పెరుగుతూ వస్తోంది. గతేడాది వరకు ఎన్‌టిఆర్ జిల్లా వ్యాప్తంగా కేవలం 7,500 ఎకరాల్లో సాగవగా, గడిచిన ఒక్క ఏడాదిలోనే 6,150 ఎకరాల్లో విస్తీర్ణం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. *మళ్లీ దూకుడు:* తొలుత రూ.12 వేలు ఉన్న టన్ను 2022లో గరిష్ఠంగా రూ.23,467 పలికింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు రూ.15 వేల లోపే ఉంది. గతేడాది మళ్లీ రూ.20 వేలు దాటింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 20 వేల దిగువనుండగా, గడిచిన మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణాలో ఇప్పటికే రూ.23 వేలు దాటింది.పెరుగుదల (టన్నుకు రూ.ల్లో)

జనవరిలో : 19,850

ఫిబ్రవరి మొదట్లో : 20,180

ఫిబ్రవరి చివరిలో : 21,546

మార్చిలో : 22,936

Read More

పసుపు కొనుగోళ్ళపై సమీక్ష

అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు తేమతో ఉన్న పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో పసుపు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు వస్తోంది. సోమవారం అర్ధరాత్రి బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 3,450 మంది రైతులకు చెందిన 7,080 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేసేందుకు ఆదేశించాం’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించబోయే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.

Read More
  • 1
  • 2