పురుగులు, తెగుళ్ళ నివారణకు మ్యాజిక్ కంపోస్టు
కావలసిన పదార్థాలు
పశువుల పేడ : 1 కిలో
పశువుల మూత్రం : 1 లీటరు
వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి)
బెల్లం : 50 గ్రా.
తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.
- చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
- ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
- పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
- చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.
పంటల ఎదుగుదలకు మిశ్రమం :
పశువుల పేడ : 100 కిలోలు
పశువుల మూత్రం : 100 లీటర్లు
వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు
పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.










