ఆయిల్ పామ్ తోటల్లో గానోడెర్మా వేరు కుళ్ళు / కాండం కుళ్ళు (Ganoderma Basal Stem Rot – BSR) అనేది అత్యంత ప్రమాదకరమైన శిలీంధ్ర (Fungal) వ్యాధి. ఇది గానోడెర్మా లూసిడమ్ (Ganoderma lucidum) అనే ఫంగస్ వల్ల వస్తుంది.
నివారణ మరియు యాజమాన్య పద్ధతులు:

తెగులు సోకినప్పుడు మట్టలు కిందికి వేలాడటం
- తెగులు లక్షణాలు
• ఆకుల మార్పులు: తోటలో చెట్టు ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఆకులు వాలిపోయి కాండం చుట్టూ గొడుగు ఆకారంలో వేలాడుతుంటాయి.
• మొవ్వు పడిపోవడం: చెట్టు పైభాగంలో ఉన్న కొత్త మొవ్వులు సరిగ్గా విచ్చుకోవు, క్రమంగా ఎండిపోయి విరిగిపోతాయి.
• గాయం మరియు రసం కారడం: కాండం అడుగు భాగంలో (మొదలు వద్ద) నల్లటి/గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, అక్కడి నుండి జిగురు లాంటి ఎర్రటి ద్రవం కారుతుంది.
• పుట్టగొడుగుల ఎదుగుదల (Brackets): వర్షాకాలంలో చెట్టు మొదలు భాగంలో లేదా వేర్ల దగ్గర విసనకర్ర ఆకారంలో గట్టి పుట్టగొడుగులు (Ganoderma brackets) పెరుగుతాయి.
• దిగుబడి తగ్గడం: గెలల సైజు తగ్గిపోవడం, గెలలు సరిగ్గా ఊరకపోవడం మరియు చివరికి చెట్టు కూలిపోవడం జరుగుతుంది. - తెగులు వ్యాప్తి (Mode of Spread)
• వేర్ల స్పర్శ ద్వారా: ఆరోగ్యవంతమైన చెట్టు వేర్లు వ్యాధి సోకిన పాత చెట్టు వేర్లతో తాకినప్పుడు ఈ ఫంగస్ ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది.
• మట్టి ద్వారా: నేలలో మిగిలిపోయిన పాత కుళ్ళిన వేర్లు మరియు కాండం అవశేషాల ద్వారా ఫంగస్ చాలా సంవత్సరాలు జీవించి ఉంటుంది. - సమగ్ర నివారణ చర్యలు
తోట పరిశుభ్రత & నివారణ చర్యలు (Cultural Management) - వ్యాధి సోకిన చెట్ల తొలగింపు: తీవ్రంగా వ్యాధి బారిన పడి ఎండిపోయిన చెట్లను వేర్లతో సహా పెకలించి తోట బయట తగలబెట్టాలి.
- కాలువ తవ్వకం: వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి వ్యాధి సోకిన చెట్టు చుట్టూ 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతుతో కాలువ తవ్వాలి. ఇది వేర్ల ద్వారా పక్క చెట్లకు ఫంగస్ వ్యాపించకుండా నిరోధిస్తుంది.
- చెట్లకు గాయాలు కాకుండా చూసుకోవడం: దిగుబడి కోసేటప్పుడు లేదా ఆకులు నరికేటప్పుడు కాండానికి గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి.

కాండం అడుగు భాగంలో పుట్టగొడుగులు (బూజు/ఫంగస్ ఫలదేహాలు) పెరగడం.
జైవిక నివారణ (Biological Control)
- ట్రైకోడెర్మా విరిడే (Trichoderma viride): ప్రతి చెట్టుకు సంవత్సరానికి 50 కిలోల పశువుల ఎరువు లేదా వేపపిండితో 200 గ్రాముల ట్రైకోడెర్మా విరిడే లేదా సూడోమోనాస్ ఫ్లోరొసెన్స్ కలిపి చెట్టు మొదల్లో వేయాలి.
- వేప పిండి: చెట్టుకి 5 కిలోల వేప పిండి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు అందిస్తే నేలలో ఉండే హానికర ఫంగస్ అదుపులోకి వస్తుంది.
ముఖ్యమైన సూచన
ఆయిల్ పామ్ తోటలో ఈ వ్యాధి కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా చుట్టుపక్కల ఉన్న చెట్లకు కూడా ముందస్తు జాగ్రత్తగా జైవిక ఎరువులు (ట్రైకోడెర్మా) మరియు నీటి యాజమాన్యం సరిగ్గా నిర్వహించాలి.
డా. పి. నీలిమ, డా. డి. స్రవంతి, డా. బి. దీపక్ రెడ్డి, డా. ఎన్. జమీమా, డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి మరియు డా. జె. హేమంత కుమార్, డా. బి. శివ, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భ. కొత్తగూడెం జిల్లా- 507 301
Ph: 8184929874

