వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రైతులు తమకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడంతో పాటు, వారి అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
నాణ్యతకు ప్రాధాన్యత.. పరీక్షించిన యంత్రాలే రైతులకు సరఫరా…
యాంత్రీకరణ పథకం కింద రైతులకు నాణ్యమైన, ప్రమాణాలు కలిగిన వ్యవసాయ యంత్ర పరికరాలను మాత్రమే అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తయారీదారులు, సరఫరాదారులు అందించే ఉత్పత్తులను ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ లేదా కేంద్ర వ్యవసాయ శాఖ (DA&FW) ద్వారా గుర్తింపు పొందిన సంస్థల వద్ద పరీక్షించిన తర్వాతనే రైతులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.
రైతుల భద్రత, యంత్రాల నాణ్యత, పనితీరు వంటి అంశాల్లో ఎలాంటి రాజీ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గతంలో ఉన్న సమస్యలకు ఇక తావులేదు…
యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించే పరికరాలు వారు కోరుకున్న విధంగా లభించడం లేదని, సబ్సిడీపై అందించే యంత్రాలకు, మార్కెట్లో లభించే యంత్రాలకు తేడా ఉంటుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రస్తావించారు. సబ్సిడీ పరికరాలకు ఇచ్చే కొటేషన్ ధరలు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న యంత్రాలను ఎక్కువగా అందించాలని, డ్రోన్లను కూడా అధిక సంఖ్యలో అందించాలని కోరారు.
దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ, ఎమ్మెల్సీ ప్రస్తావించిన అంశాలు గతంలో ఉన్న పరిస్థితులకు సంబంధించినవని, ప్రస్తుతం ఆ విధానం లేదని స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పనిముట్టును, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా ప్రస్తుత యాంత్రీకరణ విధానాన్ని రూపొందించామని తెలిపారు.
గత ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది…
గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను వినియోగించుకోకుండా యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి తిరిగి అమలులోకి తీసుకొచ్చిందన్నారు.
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం ద్వారా రైతులపై శారీరక శ్రమ తగ్గడంతో పాటు, సాగు ఖర్చులు తగ్గి, సమయానికి వ్యవసాయ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
రూ.63.11 కోట్లతో 15,565 యంత్ర పరికరాల సరఫరా…
2025-26 ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణ పథకం కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు కేటాయించగా, రూ.63.11 కోట్లు ఖర్చు చేసి 15,565 వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు సరఫరా చేసినట్లు మంత్రి వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణ పథకానికి రూ.147.91 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుల డిమాండ్‌ను అనుగుణంగా, అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను యాంత్రీకరణ పథకం కింద సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీ…
యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందించే పరికరాలపై ప్రభుత్వం గణనీయమైన సబ్సిడీని అందిస్తోందని మంత్రి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు రైతులపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఎంప్యానెల్‌మెంట్‌లో రైతులకు భాగస్వామ్యం…
రైతులు కోరుకునే విధంగా వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉండేలా ఎంప్యానెల్‌మెంట్ కమిటీలో రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు మంత్రి తెలిపారు. కమిటీలో శాస్త్రవేత్తలు, టెక్నికల్ ఇంజనీర్లు, అధికారులతో పాటు ఆదర్శ రైతులు, ఎఫ్‌పీవోలు (FPOs) ప్రతినిధులను కూడా భాగస్వాములను చేశామని వివరించారు. రైతుల వాస్తవ అవసరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, వివిధ ప్రాంతాల్లో సాగు విధానాలను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాల ఎంపిక జరిగేలా ఈ విధానం రూపొందించామని తెలిపారు.
యాంత్రీకరణ పథకం కింద పరికరాలను సరఫరా చేసేందుకు 444 కంపెనీలు ఎంప్యానెల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయని మంత్రి వెల్లడించారు. అయితే ప్రతి కంపెనీని ఎంపిక చేయడం జరగదని, నిర్దేశిత ప్రమాణాలను పాటించే కంపెనీలను, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలు గుర్తించి ఎంపిక చేసే ప్రమాణాలను అనుసరించే కంపెనీలను మాత్రమే జాబితాలో చేర్చుతామని స్పష్టం చేశారు.
దీంతో రైతులకు నాణ్యత లేని లేదా ప్రమాణాలు లేని యంత్ర పరికరాలు అందకుండా చూడటంతో పాటు, నాణ్యమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు.
రైతుకే పూర్తి స్వేచ్ఛ.. నచ్చిన కంపెనీ నుంచే కొనుగోలు…
యాంత్రీకరణ పథకంలో రైతుకు కొనుగోలు విషయంలో పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు తనకు నచ్చిన పనిముట్టును, తనకు నచ్చిన కంపెనీ దగ్గరే కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రభుత్వం రైతుల తరఫున ఒక నిర్దిష్ట కంపెనీ నుంచి మాత్రమే యంత్రాన్ని కొనుగోలు చేయాలని నిర్దేశించడం లేదన్నారు. అదేవిధంగా, రైతులు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణమైన తమకు నచ్చిన పరికరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు.
సబ్సిడీ నేరుగా రైతు ఖాతాలోకి…
యాంత్రీకరణ పథకంలో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు.
దళారులకు, మధ్యవర్తులకు అవకాశం లేకుండా రైతుకు నేరుగా ప్రయోజనం అందేలా వ్యవస్థను రూపొందించామని తెలిపారు. రైతు తన అవసరానికి అనుగుణంగా పరికరాన్ని ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, సబ్సిడీ కూడా నేరుగా రైతు ఖాతాలో జమ కావడం ద్వారా పథకం అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.
రైతుల డిమాండ్‌కు అనుగుణంగా యంత్రాల సరఫరా…
రాష్ట్రంలో పంటల సాగు విధానాలు, రైతుల అవసరాలలో ఉండే అసమానతల వలన, యాంత్రీకరణకు ఉన్న డిమాండ్ ప్రాంతాల వారిగా భిన్నంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అందువల్ల రైతులకు అవసరం లేని పరికరాలను పెద్ద ఎత్తున సరఫరా చేయడం కాకుండా, రైతుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన యంత్రాలను అందుబాటులోకి ఉంచుతున్నామని స్పష్టం చేశారు.
డ్రోన్లు సహా ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరికరాలకు పెరుగుతున్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోందన్నారు.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం…
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని, వచ్చే మూడు సంవత్సరాల్లో మరో 6 లక్షల ఎకరాలను ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అనుగుణంగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను కూడా యాంత్రీకరణ పథకం కింద అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న అత్యుత్తమ యంత్ర పరికరాలను గుర్తించి, అవసరమైన వాటిని దిగుమతి చేసుకుని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
ఈ యంత్ర పరికరాలను ఫ్యాక్టరీ వద్దే రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్‌పామ్ సాగులో యాంత్రీకరణ పెంచి, రైతుల శ్రమను తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతు ప్రయోజనమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, రైతుల శ్రమను తగ్గించడం, సాగు ఖర్చులను తగ్గించడం, వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు యాంత్రీకరణ కీలకమని మంత్రి తుమ్మల అన్నారు.
రైతులకు అవసరమైన పరికరాలను వారి డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, నాణ్యత విషయంలో రాజీ పడకుండా, సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ పారదర్శకమైన, రైతు కేంద్రిత యాంత్రీకరణ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
రైతు ఏ పనిముట్టు కోరుకుంటున్నాడో, ఏ కంపెనీ పరికరం తనకు అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకే ఉండేలా ప్రభుత్వం విధానాలను రూపొందించిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణను మరింత విస్తరించి, రాష్ట్ర రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.







