విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

4 Jun, 2026
