యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More

పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, “భారత హరిత విప్లవానికి దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అద్భుత సేవలు” అనే అంశంపై విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1964లో స్థాపించబడిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ భవనాలను 1966లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రారంభించడం విశ్వవిద్యాలయ చరిత్రలో గర్వకారణమని పేర్కొన్నారు.

1960లలో దేశం ఎదుర్కొన్న తీవ్ర ఆహార సంక్షోభం నుంచి బయటపడటానికి శ్రీమతి ఇందిరా గాంధీ రాజకీయ నాయకత్వం, డా. ఎం.ఎస్. స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల కృషి కలిసి హరిత విప్లవానికి దారితీశాయని మంత్రి కొనియాడారు. ఆ విప్లవ ఫలితంగానే భారత్ నేడు ప్రపంచంలో అగ్రగామి ఆహార ధాన్య ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు.

గత 62 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయం 525 పంట రకాలను అభివృద్ధి చేసిందని, తెలంగాణ సోనా, బీపీటీ-5204, ఎంటీయూ-1010 వంటి వరి రకాలు, డీహెచఎం సిరీస్ మొక్కజొన్న సంకర రకాలు దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ పొందాయని తెలిపారు. వేలాది మంది వ్యవసాయ పట్టభద్రులు, పరిశోధకులను తయారు చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిందన్నారు.

రైతు నేస్తం, డ్రోన్ అకాడమీ, అగ్రిహబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలతో విశ్వవిద్యాలయం భవిష్యత్ వ్యవసాయానికి కేంద్రబిందువుగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వ్యవసాయం ప్రస్తుతం ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లు, ప్రెసిషన్ అగ్రికల్చర్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, తెలంగాణ కూడా ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇకపై కేవలం ఉత్పత్తి పెంపుపై కాకుండా పంటలకు విలువ పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రైతు ఆదాయం పెరగాలంటే విలువ ఆధారిత వ్యవసాయం, మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని చెప్పారు.

అలాగే భవిష్యత్తులో కార్బన్ క్రెడిట్స్, బయో ఎకానమీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి రంగాలు రైతులకు కొత్త ఆదాయ వనరులుగా మారనున్నాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ ఆధారిత, సాంకేతిక ఆధారిత, మార్కెట్ ఆధారిత వ్యవసాయంగా రూపాంతరం చెందాలని, ఆ మార్పుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాయకత్వం వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మరియు కమిషన్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్ౙి బి సుదర్శన్ రెడ్డి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్, మధుర స్వామినాథన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, పాలసీ అనలిస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మరియు ప్రస్తుత వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, జ్ఞానేందర్, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More

రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

Read More

జూన్ 12న తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

దేశంలోనే రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964 జూన్ 12 వ తేదీన రాజేంద్రనగర్‌లో ఏర్పాటు అయింది. ప్రస్తుత వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనంతో పాటు ఇతర మౌలిక వసతుల సముదాయాన్ని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జూన్, 1966 లో ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రముఖ తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్బంగా జూన్ 12 వ తేదీన నిర్వహించ తలపెట్టిన 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భారత హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఇవ్వనున్నారు. అదే విధంగా యం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ ఈ జాతీయ సదస్సు అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్, విధాన విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం
ఈ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం, ఇతర మౌలిక వసతులని ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించి 60 ఏళ్ళు అయిన సందర్బంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశ్వవిద్యాలయం కోరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని నిర్వహించనున్నట్లు అల్దాస్ జానయ్య తెలిపారు.1966-84 మధ్యలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసి దేశానికి ఆహార భద్రతని అందించిన ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని, ఆనాటి రైతు అనుకూల విధానాలని, వివిధ సంస్థలని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉప కులపతి పేర్కొన్నారు. అందుకే ఈ 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.

Read More

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More

పత్తి రైతులకు వరం ‘కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌

కేంద్ర కేబినెట్ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌కు రూ.5,659.22 కోట్ల వ్యయంతో ఆమోదం తెలపడం దేశంలోని పత్తి రైతులకు వరం లాంటిదని భాజపా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. “ఈ మిషన్ పత్తి ఉత్పాదకతను పెంచడంతో పాటు, ప్రపంచ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పంట క్షేత్రం నుంచి విదేశాల వరకు (ఫాం టు ఫారిన్) అనే లక్ష్యానికి అనుగుణంగా రైతులు, పరిశ్రమ, సాంకేతికత ఎగుమతులను అనుసంధానిస్తుంది. సుమారు 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా ఈ మిషన్ కొనసాగుతుంది అని రామచందర్రావు అన్నారు.

Read More

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

పీఎం ఆషా పథకం కింద మొక్కజొన్న రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని.. ఏపీని ప్రత్యేకంగా పరిగణించి ధరల వ్యత్యాసంలో 100% కేంద్రమే భరించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ. 2,400 కంటే ఇది చాలా తక్కువ. రోజురోజుకు ధరలు పడిపోతున్నాయి’ అని వివరించారు. ‘రాష్ట్రంలో 42.06 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 14.26 లక్షల టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు. నాఫెడ్, ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలి. జూన్ 2026 వరకు పథకాన్ని పొడిగించాలి’ అని సీఎం కోరారు.

Read More

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల

తెలంగాణలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2206 కోట్లు రైతు భరోసా రెండో విడత కింద మంగళవారం జమయ్యాయి. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న 68,89,955 మందికి, తాజాగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో సీఎం రెండో విడతలో రెండు ఎకరాల వరకు భరోసా నిధులను విడుదల చేశారు. గత రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు రైతు భరోసా కోసం రూ.5,653 కోట్లు విడుదల కాగా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ది పొందారని మంత్రి వివరించారు. రైతు భరోసాలో ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 5,40,693 మంది రైతులకు రూ.448.09 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,45,142 మందికి రూ. 271.52 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,66,343 మందికి రూ.271.05 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3,28,818 మందికి రూ.246.30 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,98,352 మందికి రూ.236.49 కోట్లు జమయ్యాయి.

Read More

మొక్కజొన్నను ధరల మద్దతు పథకంలో చేర్చాలి

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నను ధరల మద్దతు పథకం (ప్రైజ్ సపోర్ట్ స్కీమ్)లో చేర్చి, సగం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సోమవారం లేఖ రాశారు. ప్రస్తుత సీజన్‌లో సుమారు 11,21,494 ఎకరాల్లో పంట సాగు కాగా.. దాదాపు 29.79లక్షల టన్నుల దిగుబడి రానుంది.
మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న ప్రస్తుతం క్వింటాలు సగటు ధర రూ.1,759 పలుకుతుండగా.. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400తో పోలిస్తే ఇది రూ. 641 తక్కువ. రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం 92 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటివరకు 65వేల టన్నులు కొనుగోలు చేసింది. మార్కెట్లో అనిశ్చితి వల్ల ధరలు పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్నను పీఎసఎస్ కింద చేర్చి, మొత్తం ఉత్పత్తిలో 50% కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

Read More