పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు సడలించాలి
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 18% తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేసేలా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో దీనిపై మాట్లాడారు. ”పత్తి కొనుగోలు చేయాలంటే అందులో తేమశాతం 8-12%కి మించకూడదన్న నిబంధన రైతులకు గుది బండగా మారింది. ఆంధ్రరాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా తీరప్రాంతంలో తేమశాతం దీనికంటే ఎక్కువగా ఉంటుంది. రైతులకు ఎల్1/ఎల్2/ఎల్ జిన్నింగ్ మిల్లులు కేటాయించడం వల్ల వాళ్లు తమ సమీపంలో ఉన్న మిల్లులను ఎంచుకొనే వీల్లేకుండా పోతోంది. దానివల్ల వారు తక్కువ ధరలకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ నిబం ధనలను సడలించాలి. అదే సమయంలో అన్ని జిన్నింగ్ మిల్లులను తెరిచి 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలుచేసి ఆ నిష్పత్తి ప్రకారం కనీస మద్దతు ధర చెల్లించేలా నిర్దేశించాలి. వర్షం నీరు తాకిన, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రైతులు ఇప్పటికే పలు వైపరీత్యాలతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలతో వారి కష్టాలను రెట్టింపు చేయడం భావ్యం కాదు. వ్యవసాయదారుల జీవనోపాధిని రక్షించి, రాష్ట్రంలో పత్తిసాగును కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసే తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ యేటా 20 లక్షల బేళ్లు అందిస్తోంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 5.39 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే మొంథా తీవ్రతుపాను కారణంగా 1.08 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. సుమారు 1.25 లక్షల టన్నుల పత్తి రంగుమారింది. తీరప్రాంతంలోని ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని రైతులు తీవ్ర ప్రభావానికి గురయ్యారు” అని లావు పేర్కొన్నారు.











