కిసాన్ సారథి-రైతుకు డిజిటల్ వ్యవసాయ సలహాల వారధి

పరిచయం:
ఆధునిక భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు సరైన సమాచారం సరైన సమయంలో అందించడం అత్యంత అవసరం. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచార సాంకేతికత వ్యవసాయ రంగంలో వేగంగా విస్తరిస్తూ, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, మొబైల్ అప్లికేషన్లు, సామాజిక మాధ్యమాలు మరియు డిజిటల్ సేవలు రైతులకు వ్యవసాయ సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో అప్రమాణిక వ్యవసాయ సమాచారం విస్తృతంగా ప్రచారం కావడం వల్ల రైతులు శాస్త్రీయ, విశ్వసనీయ సమాచారాన్ని పొందడం అత్యంత అవసరంగా మారింది. వాతావరణ మార్పులు, చీడ పీడల సమస్యలు, మేలైన యాజమాన్య పద్దతులు, పంటల ధరల హెచ్చుతగ్గులు, ఆధునిక సాంకేతికతల అవసరం వంటి అంశాల కారణంగా రైతులు నిపుణుల సలహాలను తరచుగా పొందాల్సి వస్తోంది. ఇటు వంటి పరిస్థితుల్లో రైతులకు సరైన సమాచారం, సరైన సమయంలో, సరైన భాషలో, అందించడం వ్యవసాయాభివృద్ధికి కీలకం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మరియు డిజిటల్ ఇండియా కార్పొరేషన్ సంయుక్తంగా “కిసాన్ సారథి” (Kisan Sarathi) అనే ఆధునిక డిజిటల్ వేదికను అభివృద్ధి చేశారు. ఇది మొబైల్ ఆధారిత వ్యవసాయ సలహా వ్యవస్థగా పనిచేస్తూ రైతులను నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ నిపుణులు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలతో అనుసంధానిస్తుంది.

కిసాన్ సారథి గురించి:
కిసాన్ సారథి అనేది భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) రూపొందించిన వ్యవసాయ సమాచార ప్రసార మరియు సాంకేతిక డిజిటల్ వేదిక. ఇది ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ సిస్టమ్ (IIDS) సాంకేతికత ఆధారంగా, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC), ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY), భారత ప్రభుత్వం సహకారంతో జులై 16, 2021వ సంవత్సరంలో అభివృద్ధి చేయబడి, గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారి చేతులమీదుగా ప్రారంబించడం జరిగింది. ఇది “సరైన సమాచారం- సరైన సమయంలో రైతు మాతృ భాషలో” అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. రైతులు తమ పంట, భూమి రకం, ప్రాంతం, సమస్యల వివరాలను నమోదు చేసుకుంటే, వాటి ఆధారంగా వ్యక్తిగతీకరించిన వ్యవసాయ సలహాలు అందుతాయి. ప్రస్తుతం ప్రతి జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతులను ఈ పోర్టల్ లో నమోదు చేసి, వారికి వ్యవసాయ, ఉద్యాన, పసుపోషణ, వాతావరణ, సలహాలు సూచనలు సంక్షిప్త సమాచారం (message) రూపం లో అందిస్తున్నారు. అయితే ఈ మెసేజ్ కేవలం 150 అక్షరాల్లో మాత్రమే అందించడం జరుగుతున్నది. రైతు తమ మొబైల్ ఫోన్ ద్వారా నేరుగా సంబందిత జిల్లా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800 123 2175 ను వినియోగించవచ్చు. పోర్టల్ సేవలే కాక ప్రస్తుతం కిసాన్ సారథి రైతు అప్లికేషన్ (APP) ను రూపొందించి రైతుకు అందుబాటులో వుంచారు.

కిసాన్ సారథి రైతు యాప్:
యాప్‌లో ఉన్న “Talk to Expert” సౌకర్యం ద్వారా రైతులు రెండు ప్రధాన సేవలను వినియోగించుకోవచ్చు:
• కిసాన్ కాల్ సెంటర్ (KCC) – టోల్ ఫ్రీ నంబర్ 1800 180 1551, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
• కిసాన్ సారథి సహాయ కేంద్రం – నంబర్ 14426, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ సేవల ద్వారా రైతులు పంటల సాగు, ఎరువుల వినియోగం, పురుగు, తెగుళ్ళ నివారణ, విత్తనాల ఎంపిక, పశుసంవర్ధక అంశాలు మరియు ప్రభుత్వ పథకాలపై నిపుణుల సలహాలను పొందవచ్చు.

సమస్య నమోదు: (Raise a problem):
యాప్‌లో ఉన్న “Raise a Problem” సౌకర్యం ద్వారా రైతులు తమ పంటకు సంబంధించిన సమస్యలను వ్రాత రూపంలో నమోదు చేయడంతో పాటు ఫోటో, వీడియో లేదా వాయిస్ సందేశాన్ని జతచేసి నిపుణులకు పంపవచ్చు. దీనివల్ల సమస్యను ఖచ్చితంగా విశ్లేషించి, రైతులకు వేగవంతమైన మరియు శాస్త్రీయ పరిష్కార సూచనలు అందించబడతాయి

చాటింగ్ సౌకర్యం: (Chat boat):
యాప్‌లో ఉన్న ‘భారత్ విస్తార్’ AI చాట్‌బాట్ సౌకర్యం ద్వారా రైతులు తమ వ్యవసాయ సందేహాలను తెలుగు సహా స్థానిక ఇతర 13 భాషల్లో అడిగి తక్షణమే సమాధానాలు పొందవచ్చు. పంటల సాగు, పురుగు నివారణ, ఎరువుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై 24×7 సమాచారాన్ని అందిస్తుంది.

కిసాన్ సారథి యాప్ ముఖ్య లక్షణాలు:
కిసాన్ సారథి యాప్ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక వినూత్న సౌకర్యాలతో రూపొందించబడింది. ఇందులోని ముఖ్య లక్షణాలు:
• నిపుణులతో ప్రత్యక్ష సంభాషణ (Talk to Expert): కిసాన్ కాల్ సెంటర్ (1800 180 1551) మరియు కిసాన్ సారథి హెల్ప్ లైన్ (14426) ద్వారా రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడి తమ సందేహాలకు పరిష్కారం పొందవచ్చు.
• సమస్య నమోదు (Raise a Problem): పంటకు సంబంధించిన సమస్యలను వ్రాత రూపంలో నమోదు చేయడంతో పాటు ఫోటో, వీడియో లేదా వాయిస్ సందేశాన్ని జతచేసి నిపుణులకు పంపే సౌకర్యం.
• AI ఆధారిత చాట్‌బాట్ (భారత్ విస్తార్): తెలుగు సహా స్థానిక భాషల్లో రైతుల వ్యవసాయ సందేహాలకు 24×7 తక్షణ సమాధానాలు అందించే కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్‌బాట్.
• వ్యక్తిగతీకరించిన వ్యవసాయ సలహాలు: రైతు పంట, భూమి, ప్రాంతం మరియు సమస్యల ఆధారంగా ప్రత్యేక సిఫార్సులు.
• వాతావరణం మరియు అత్యవసర హెచ్చరికలు: ప్రాంతానికి అనుగుణంగా వాతావరణం, చీడపీడలు, ఇతర పశువుల వ్యాధులపై తక్షణ హెచ్చరికలు మరియు సూచనలు.
• స్థానిక భాషలో సేవలు: రైతులు తమ మాతృభాషలోనే సమాచారం మరియు సలహాలను పొందవచ్చు.
• ఎక్కడైనా-ఎప్పుడైనా సేవలు: స్మార్ట్ మొబైల్ ద్వారా ఇంటి వద్ద నుంచే లేదా పొలంలో నుంచే సేవలను వినియోగించుకునే అవకాశం.
• గత సలహాలు భద్రపరచడం: గతంలో పొందిన సలహాలను అవసరమైనప్పుడు తిరిగి పరిశీలించుకునే సౌకర్యం.

రైతులకు కలిగే ప్రయోజనాలు:
ప్రయోజనం
నిపుణుల సలహాలు: వివరణ – వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణులతో నేరుగా సంప్రదించే అవకాశం.
సమస్యలకు వేగవంతమైన పరిష్కారం: ఫోటో, వీడియో లేదా వాయిస్ ద్వారా సమస్యను పంపి త్వరితగతిన శాస్త్రీయ సూచనలు పొందవచ్చు.
AI ఆధారిత తక్షణ సమాచారం: భారత్ విస్తార్ AI చాట్‌బాట్ ద్వారా 24×7 వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు.
సమయానుకూల హెచ్చరికలు: వాతావరణ మార్పులు, చీడపీడలు మరియు వ్యాధులపై ముందస్తు సమాచారం అందుతుంది.
ఉత్పాదకత పెరుగుదల: శాస్త్రీయ సూచనల అమలు ద్వారా దిగుబడి మరియు నాణ్యత మెరుగుపడుతుంది.
ఖర్చు తగ్గింపు: ఎరువులు, పురుగుమందులు మరియు ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లను అవసరానికి అనుగుణంగా వినియోగించి ఖర్చు తగ్గించుకోవచ్చు.
స్థానిక భాషలో సేవలు: తెలుగు సహా స్థానిక భాషల్లో సులభంగా సమాచారం అందుబాటులో ఉంటుంది.
డిజిటల్ సాధికారత: రైతులు ఆధునిక సమాచార సాంకేతికతను వినియోగించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు.

ముగింపు: వ్యవసాయ రంగం వేగంగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో కిసాన్ సారథి యాప్ రైతులకు విశ్వసనీయ డిజిటల్ సహచరుడిగా మారుతోంది. కిసాన్ సారథి యాప్ రైతులకు శాస్త్రీయ, విశ్వసనీయ మరియు సమయానుకూల వ్యవసాయ సమాచారాన్ని అందించే సమగ్ర డిజిటల్ వేదిక. నిపుణులతో ప్రత్యక్ష సంభాషణ, పంట సమస్యల నమోదు, AI ఆధారిత చాట్‌బాట్ వంటి సేవల ద్వారా రైతులు మెరుగైన వ్యవసాయ నిర్ణయాలు తీసుకొని ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు కిసాన్ సారథి యాప్‌ను ఉపయోగించి డిజిటల్ వ్యవసాయ సేవల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి.

ఈడిగ రవి గౌడ్, విస్తరణ శాస్త్రవేత్త,
కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె, నంద్యాల జిల్లా, ఆ.ప్ర.-518124
Ph: 9640230518

Read More

పాలవెల్లువ 2.0

గ్రామీణ స్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, తద్వారా పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా 19.9.2024న కేంద్ర సహకార మరియు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పాలవెల్లువ 2.0కు శ్రీకారం చుట్టింది. మహిళల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల్లో సహకార సంఘాల ద్వారా 50% పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కొత్తగా 75000 బహుళార్థ సాధక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, 46000 పాలఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, ఐదు సంవత్సరాల చివరికి రోజుకు 1000 లక్షల లీటర్ల పాలఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కేంద్ర సహకార మరియు పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖలు ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో సమావేశాలు జరిపి నిరంతరం ప్రగతిని సమీక్షిస్తున్నాయి.

1998 నుండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానం పదిలపరుచుకుంటున్న భారత్, స్థూల ఉత్పత్తికి 25% వాటా సమకూరుస్తుంది. డిసెంబర్ 2014 నుండి అమలవుతోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెల్లో పాలఉత్పాదకత 36.63% పెరిగిందని తెలుస్తోంది. అంతేకాక ఆధునిక పాలపరీక్షా పరికరా…తో పాల నాణ్యత పరిశీలన పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.

రాష్ట్రాలవారీగా 2024 నుండి 2029 వరకు పాలఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యం ఇలా ఉంది.

తెలంగాణాపరంగా చూస్తే –
2024-2026కు గాను కొత్త సంఘాల ఏర్పాటు 8%, బలోపేతం 42% గా నమోదయింది.
ప్రస్తుత సంవత్సరంకి 306 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఉంది.
పాడి సుస్థిర అభివృద్ధికి 3 అంచెల సహకార వ్యవస్థ రామరక్షగా నాడే క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ చెప్పారు. కాగా తెలంగాణలో బలహీనంగా ఉన్న గ్రామస్థాయి సహకార సంఘాల పాల సేకరణకు సవాల్‌గా మారింది.
ఉన్న సంఘాల్లో ఆడిట్ జరగక పోవడం, సభ్యుల నిర్లిప్త భావన, సంఘ స్ఫూర్తికి విఘాతంగా నిలిచింది.
తెలంగాణ సహకార యూనియన్ మరింతగా సభ్యుల అవగాహనా కార్యక్రమాలు విస్తృతపరచాల్సిన అవసరం ఉంది.
గ్రామస్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో యూనియన్లు రాష్ట్ర స్థాయిలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పాడి రైతులు సంఘటితంగా ఉంటే, పక్క రాష్ట్రం, కర్నాటకలో రోజుకు కోటి లీటర్లు పాలసేకరణ సాధ్యపడుతుండగా, విస్తృత విపణి అవకాశాలున్నా, తెలంగాణలో వివిధ సహకార వ్యవస్థలు, ప్రైవేటు ఆధిపత్యానికి దారితీస్తోంది.
తెలంగాణలో కరీంనగర్ పాడి రైతుల కంపెనీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, నల్లగొండ రంగారెడ్డి యూనియన్, విజయడెయిరీ ఇలా 4 రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి.
1964 చట్టంలో ఉన్న విజయ డెయిరీ వ్యవస్థాగత అసమానతలతో ఆశించినంతగా పాలసేకరణ, మార్కెటింగ్ లక్ష్యాలకు చేరువ కావాలంటే, పాడిరైతుల సంఘటిత ముందడుగు ఎంతో అవసరం.
సహకారశాఖ ద్వారా త్వరితగతిన సంఘాల ఏర్పాటు, పశుసంవర్థక శాఖ ద్వారా పాడిరైతులకు సేవలు సమ్మిళితంగా లభిస్తే, పాడి రైతు బతుకులో భరోసా వస్తుంది. అలాగే, సబ్సిడీతో పాడిపశువులకు రుణాలు దొరకకపోవడం, పాడిపరిశ్రమపై బడ్జెట్ లో తగు కేటాయింపులు జరగకపోవడం పాడిపరిశ్రమపై నీలినీడలు ప్రసరించడానికి కారణం అవుతోంది. కర్నాటకలో ఏటా 2000 కోట్లు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టే, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. తద్వారా నిర్వహణ ఖర్చులు అదుపులో ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణలో కూడా –
1) పాడి పశువులను సబ్సిడిపై ఇచ్చే పథకం అమలు
2) పాల ప్రోత్సాహకం విడుదల
3) సాంకేతిక వనరుల సరఫరా
4) పశు ఆరోగ్యంకై నిరంతర సేవలు
5) సంఘాల ఏర్పాటు అనివార్యం చేయడం
అనే పంచ సూత్రాలు అమలయితే పాల ఉత్పత్తి పెరిగి, జీవనోపాధులు మెరుగు కాగలవు.

మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం

గొర్రెల పెంపకదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.

చిటుకు వ్యాధి గొర్రెలలో ఆకస్మిక మరణాలకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రెలు మేత తినకపోవడం, నీరసం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి.

అందువల్ల ఈ వ్యాధి నివారణకు టీకా వేయించడం అత్యంత అవసరం. టీకా ద్వారా గొర్రెలను చిటుకు వ్యాధి నుండి రక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను కూడా తగ్గించవచ్చు.

కావున అన్ని గొర్రెల కాపరులు, పెంపకదారులు తమ గ్రామాలలో నిర్వహించే ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి గొర్రెకు తప్పనిసరిగా టీకా వేయించాలి.

గొర్రెల ఆరోగ్యం – రైతు అభివృద్ధికి పునాది.
చిటుకు వ్యాధికి టీకానే రక్షణ!

Read More

యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More

పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, “భారత హరిత విప్లవానికి దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అద్భుత సేవలు” అనే అంశంపై విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1964లో స్థాపించబడిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ భవనాలను 1966లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రారంభించడం విశ్వవిద్యాలయ చరిత్రలో గర్వకారణమని పేర్కొన్నారు.

1960లలో దేశం ఎదుర్కొన్న తీవ్ర ఆహార సంక్షోభం నుంచి బయటపడటానికి శ్రీమతి ఇందిరా గాంధీ రాజకీయ నాయకత్వం, డా. ఎం.ఎస్. స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల కృషి కలిసి హరిత విప్లవానికి దారితీశాయని మంత్రి కొనియాడారు. ఆ విప్లవ ఫలితంగానే భారత్ నేడు ప్రపంచంలో అగ్రగామి ఆహార ధాన్య ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు.

గత 62 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయం 525 పంట రకాలను అభివృద్ధి చేసిందని, తెలంగాణ సోనా, బీపీటీ-5204, ఎంటీయూ-1010 వంటి వరి రకాలు, డీహెచఎం సిరీస్ మొక్కజొన్న సంకర రకాలు దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ పొందాయని తెలిపారు. వేలాది మంది వ్యవసాయ పట్టభద్రులు, పరిశోధకులను తయారు చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిందన్నారు.

రైతు నేస్తం, డ్రోన్ అకాడమీ, అగ్రిహబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలతో విశ్వవిద్యాలయం భవిష్యత్ వ్యవసాయానికి కేంద్రబిందువుగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వ్యవసాయం ప్రస్తుతం ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లు, ప్రెసిషన్ అగ్రికల్చర్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, తెలంగాణ కూడా ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇకపై కేవలం ఉత్పత్తి పెంపుపై కాకుండా పంటలకు విలువ పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రైతు ఆదాయం పెరగాలంటే విలువ ఆధారిత వ్యవసాయం, మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని చెప్పారు.

అలాగే భవిష్యత్తులో కార్బన్ క్రెడిట్స్, బయో ఎకానమీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి రంగాలు రైతులకు కొత్త ఆదాయ వనరులుగా మారనున్నాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ ఆధారిత, సాంకేతిక ఆధారిత, మార్కెట్ ఆధారిత వ్యవసాయంగా రూపాంతరం చెందాలని, ఆ మార్పుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాయకత్వం వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మరియు కమిషన్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్ౙి బి సుదర్శన్ రెడ్డి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్, మధుర స్వామినాథన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, పాలసీ అనలిస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మరియు ప్రస్తుత వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, జ్ఞానేందర్, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More

రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

Read More

జూన్ 12న తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

దేశంలోనే రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964 జూన్ 12 వ తేదీన రాజేంద్రనగర్‌లో ఏర్పాటు అయింది. ప్రస్తుత వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనంతో పాటు ఇతర మౌలిక వసతుల సముదాయాన్ని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జూన్, 1966 లో ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రముఖ తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్బంగా జూన్ 12 వ తేదీన నిర్వహించ తలపెట్టిన 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భారత హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఇవ్వనున్నారు. అదే విధంగా యం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ ఈ జాతీయ సదస్సు అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్, విధాన విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం
ఈ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం, ఇతర మౌలిక వసతులని ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించి 60 ఏళ్ళు అయిన సందర్బంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశ్వవిద్యాలయం కోరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని నిర్వహించనున్నట్లు అల్దాస్ జానయ్య తెలిపారు.1966-84 మధ్యలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసి దేశానికి ఆహార భద్రతని అందించిన ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని, ఆనాటి రైతు అనుకూల విధానాలని, వివిధ సంస్థలని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉప కులపతి పేర్కొన్నారు. అందుకే ఈ 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.

Read More

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More

పత్తి రైతులకు వరం ‘కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌

కేంద్ర కేబినెట్ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌కు రూ.5,659.22 కోట్ల వ్యయంతో ఆమోదం తెలపడం దేశంలోని పత్తి రైతులకు వరం లాంటిదని భాజపా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. “ఈ మిషన్ పత్తి ఉత్పాదకతను పెంచడంతో పాటు, ప్రపంచ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పంట క్షేత్రం నుంచి విదేశాల వరకు (ఫాం టు ఫారిన్) అనే లక్ష్యానికి అనుగుణంగా రైతులు, పరిశ్రమ, సాంకేతికత ఎగుమతులను అనుసంధానిస్తుంది. సుమారు 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా ఈ మిషన్ కొనసాగుతుంది అని రామచందర్రావు అన్నారు.

Read More