తెలంగాణలో మద్దతు ధరలతో మొక్కజొన్న కొనుగోలు పరిమితిని పెంచుతూ ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు పెంచేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.గతంలో ఎకరానికి 18 క్వింటాళ్ల వరకే కొనుగోలు పరిమితి ఉంది. పలు జిల్లాల్లో పరిమితికి మించి రైతులు మక్కలను తీసుకురాగా.. అధికారులు వాటిని నిరాకరించారు. దీనిని ప్రజాప్రతినిధులు, రైతులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిమితి పెంచాలని కోరారు. మక్కలను కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా వీటిని కొనుగోలు చేయిస్తోంది. ఇప్పటికే రూ.2400 కోట్ల మేరకు కొనుగోళ్లకు వెచ్చించింది.
బియ్యం ఎగుమతుల నిపుణుడు, వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ పురస్కార గ్రహీత సమరేందు మహంతి తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు మరింతగా పెరగాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్‌లో మంగళవారం బియ్యం ఎగుమతులపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 2014-2024 మధ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పటికే ‘తెలంగాణ రైస్’ అనే బ్రాండ్ పేరుతో ఇక్కడి బియ్యం ఫిలిప్పైన్స్‌కి ఎగుమతి అవుతున్నాయి. దాన్ని మరింత పెంచాలి’ అని సూచించారు. దీనికై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, పౌరసరఫరాల శాఖ సంచాలకులు హనుమంత్ కొండిబ, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే పది సంవత్సరాలలో అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళిక ఇది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ డి. రాజిరెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ. 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే రూ. 942.50 కోట్లు డ్రిప్ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది. వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా కార్యాచరణను అమలు చేయాలని, మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు గుర్తించి, వాటికి అనుగుణంగా విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్ వంటి అంశాలను ప్రణాళికలో సమగ్రంగా వివరించారు. ప్రణాళికలోని ప్రధాన అంశాలు విస్తీర్ణం పెంచడం: పండ్లు, కూరగాయలలో విస్తీర్ణం పెంచడానికి అనువైన జిల్లాలను నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఉద్యాన విశ్వవిద్యాలయం ఎంపిక చేసింది. పండ్ల పంటలలో జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ (కమలం పండు). ద్రాక్ష, ఖర్జూరం అంజీర్, నేరేడు, ఉసిరి మరియు సీతాఫలం 1.32 లక్షల ఎకరాలలో 2030 వరకు అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో విస్తీర్ణం పెంచుకోవచ్చు. కూరగాయలలో 2030కు 2.45 లక్షల ఎకరాలలో అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో టమాటో, వంగ, క్యారెట్, క్యాబేజ్, దోస, కాలిఫ్లవర్, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర మరియు చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలి. ఆఫ్ సీజన్ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలుపరచాలి. సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్యతకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్ నెట్లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధతులను అవలంబించాలి. ఉత్పాదకత పెంచడం: ఉద్యాన విశ్వవిద్యాలయం పెంపొందించిన సాంకేతికతను పండ్లు, కూరగాయలు, ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల పంటలలో అమలుపరిచి అధిక దిగుబడి పొందేందుకు ప్రయత్నం చేయాలి. పంట నష్టాలను తగ్గించడానికి వాతావరణ ఆధారిత సూచనలు సమయానుకూలంగా విడుదల చేయాలి. ప్రతి మండలంలో వ్యవసాయ యంత్రాల కొరకు కనీసం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు సకాలంలో సాగు పనులు పూర్తి చేయగలిగి నష్టాలను తగ్గించు కోగలుగుతారు. ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి. కోతానంతర పంట యాజమాన్యం: కోత అనంతరం పంట నష్టం తగ్గించడానికి కావలసిన శీతల నిల్వ గిడ్డంగులు, పండ్లను మాగబెట్టే కేంద్రాలు, నిల్వ వసతులతో మార్కెటింగ్ యార్డ్, శీతల రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఉల్లి పండించే ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో నిల్వ సదుపాయాలు కల్పించాలి. ఎగుమతులు ప్రోత్సహించడానికి హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తగిన మౌలిక సదుపాయాలతో సమీకృత ప్యాక్ హౌస్ ఏర్పాటు చేయాలి. నాణ్యత పెంచడం, నిల్వ మరియు కోతానంతర పంటల నిర్వహణ, పురుగుమందు అవశేషాలు లేని ఉత్పత్తి, నిల్వకాలం పెంచడం, విలువ జోడింపు పై పరిశోధనలు విస్తృతం చేయాలి. మార్కెటింగ్: రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా సామూహిక క్రయవిక్రయాలను, పంట సాగు మరియు కోతానంతర పంట యాజమాన్యంలో సామూహిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన వ్యవసాయ మార్కెట్ యార్డులలో పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలను సక్రమంగా అమలుపరిచేలా చర్యలు చేపట్టాలి, ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కలిసి నిర్వహించేలా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయంలో నెలకొల్పాలి. ఈ సూచనలు రైతులకు సకాలంలో అందాలి.
ఈ ప్రణాళిక పుస్తకాన్ని డాక్టర్ డి. రాజి రెడ్డి, డాక్టర్ ఎ. భగవాన్, డాక్టర్ జి.పి. సునందిని రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.136.29 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు, మరో రెండు డ్యాంల మరమ్మతులకు పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురంలోని హంద్రీనీవా నుంచి ఉరవకొండ నియోజకవర్గంలో ఎత్తయిన ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీటిని ఎత్తిపోసేందుకు, అక్కడ డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసేందుకు ఆమోదం తెలియజేశారు. వజ్రకరూరు మండలంలో నీటిని ఎత్తిపోసేందుకు రాగులపాడు గ్రామం వద్ద కొట్టాలపల్లి ఎత్తిపోతలను నిర్మించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగా స్లూయిస్ల నిర్మాణం, నూతన కట్టడాలతో పాటు వరద కట్ట, రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. నెల్లూరులోని డి. వి.సత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లోని కాళింగ వరద కట్టల నిర్మాణానికి గతంలో అప్పగించిన ప్యాకేజీకి సంబంధించిన రెండు పనులను ముందస్తుగా ముగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రాజెక్టు కొత్త నిర్మాణం/మరమ్మతులు మంజూరు చేసిన మొత్తం (రూపాయల్లో) అమిద్యాల ఎత్తిపోతల నిర్మాణం 72,30,00,000 కొట్టాలపల్లి ఎత్తిపోతల నిర్మాణం 55.60.00.000 మైలవరం డ్యాం గేట్ల బలోపేతం, ఇతర మరమ్మతులు 3,19,48,000 మిడ్ పెన్నార్ డ్యాం రేడియల్ గేట్ల మరమ్మతులు, ఇతర పనులు 5,20,00,000 మొత్తం 136,29,48,000
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలవారీగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల సంఖ్యనూ ఖరారు చేసింది. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ లక్ష్యంలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో 39.08 లక్షల టన్నుల సన్నాలు, 35.91 లక్షల టన్నుల దొడ్డు రకాలు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సన్నాలు, దొడ్డు రకాలు కలిపి- ఖమ్మం జిల్లాలో 2,78,892 టన్నులు కొనాలని అంచనా. 326 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో 2,44,522 టన్నులు, 244 కేంద్రాలు, నారాయణపేట 2,35,917 -117, మహబూబ్‌గర్ 2,26,418 – 190, భువనగిరి 2,26,410- 325, కొత్తగూడెం 2,23,272-193, మహబూబాబాద్ 2,18,373 – 237 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు.
దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం
ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ విజయవంతం
సీఎం రేవంత్ రెడ్డి లాంగ్ విజన్‌తో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ
ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుంది….
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం: మంత్రి తుమ్మల
నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీతో ఆయిల్‌పామ్ రైతులకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం నాడు అధికారులతో కలసి సిద్దిపేట జిల్లా నర్మేట్టలో ఆయిల్‌ఫెడ్ 300 కోట్లతో నిర్మాణం చేసిన పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి లాంగ్ విజన్‌తో నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామని, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, అంతర పంటల సాగుతో అదనపు లాభాలు రైతులకు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుందనీ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థ ప్రస్తుత పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించి సంస్థకు పూర్వవైభవం తెస్తామని వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. సోమవారం ఆయన మలక్ పేటలోని ఆ సంస్థను తమ సభ్యులతో కలిసి సందర్శించారు.
ఉల్లి రైతులు నష్టపోకుండా క్వింటాలుకు రూ.1,200 చొప్పున వెంటనే కొనుగోలు చేయడం ప్రారంభించి, నష్టాన్ని మార్కెట్ జోక్యం పథకం కింద భరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబజార్ల సంఖ్యను 150 నుంచి 200కు పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోలుపై సచివాలయంలో గురువారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే పది రోజుల్లో 5 వేల టన్నుల పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది’ అని అధికారులు సీఎంకు వివరించారు. సీఎం సూచనలు… కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టండి. రైతులకూ అక్కడ నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. రైతు బజార్లను ఆధునికీకరించాలి. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డు స్థలాలను ఉపయోగించుకోవాలి. అందులోని 2-3 ఎకరాల భూమిని ఉపయోగించుకుని కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. గోదాములు, కోల్డ్ చైన్ వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలి.
కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్ హాలును ఈ రోజు తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే అన్ని సౌకర్యాలతో హార్టికల్చర్ యూనివర్సిటీని తెలంగాణాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయరంగానికే అత్యంత ప్రాధాన్యం ఉంది. భవిష్యత్తు అంతా వ్యవసాయానిదే. గత 4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు మూతపడినా, నాగలి ఆగలేదు. రైతు శ్రమ ఆగలేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగింది. హార్టికల్చర్ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనీ, విద్యార్థులు ప్రావీణ్యతను పెంచుకుంటే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కన్నా, మీకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు మొత్తం కోర్సులో సగానికి కన్నా ఎక్కువ రోజులు పొలాల్లో ఉండి, వ్యవసాయంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని, రైతు చేసే వ్యవసాయ విధానాలను పరిశీలించాలని తెలిపారు. హార్టికల్చర్ పంటలను అభివృద్ధి చేస్తే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దేశంలో లక్ష కోట్లతో పామాయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, పామాయిల్ దిగుమతి తగ్గించాలంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎకరాలలో ఉన్న పామాయిల్ పంటను 70 లక్షల ఎకరాలకి విస్తరించినట్లయితే, డిమాండ్‌ను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయడం జరుగుతుందని, ఆయిల్ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోఉందని, రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్రంలో పామాయిల్ పంటను 10 లక్షల ఎకరాలకు విస్తరించడానికి ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. కూరగాయలు, పండ్ల తోటలతో పాటుగా జాజి, వక్క, మెకడమియా లాంటి పంటలను పండించడానికి తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు అంతా హార్టికల్చర్‌దే అని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగడానికి ఉద్యానపంటలు ఒక గ్రోత్ ఇంజన్‌గా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. హార్టికల్చర్ శాస్త్రవేత్తలు, రైతులు హార్టికల్చర్ పంటలు సాగుచేయడానికి అవసరమైన పరిశోధనలను విస్తృతం చేసి, సూచనలు సలహాలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక బోధన విషయాలలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్ రావు, వ్యవసాయ కమిషన్ సభ్యులు మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
‘జీడిపప్పు ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రాసెసింగ్ వ్యవస్థ ఆధునికీకరణ, సరైన మార్కెటింగ్ కోసం జీడి బోర్డు అవసరం. మిర్చి బోర్డు ఏర్పాటైతే ధరల హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చు. రాష్ట్రంలో ఏటా దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. ఈ పంటలు సాగు చేసే రైతుల కష్టాలు తొలగడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో జీడి, గుంటూరులో మిర్చి, చిత్తూరులో మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రవాణిజ్యమంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి లోకేశ్ కోరారు. మూలపేట, చిలమత్తూరు, కుప్పం, దొనకొండల్లో 4 కొత్త పారిశ్రామిక నోడ్‌లను అభివృద్ధి చేసేందుకు అనుమతులివ్వాలి. నీరు, విద్యుత్తు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.5,811 కోట్ల గ్రాంట్ మంజూరు చేయండి. విజయవాడ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు నోడ్‌కు అనుమతివ్వాలి. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌ల మాస్టర్‌ప్లాన్లు ఆమోదం పొంది, టెండర్లకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఈపీసీ విడుదలకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఆమోదం ఇప్పించండి’ అని విజ్ఞప్తి చేశారు.