కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాయి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తదితర పథకాలను అమలు చేస్తూ రాయితీలను అందజేస్తున్నాయి.
సమీకృత ఉద్యాన అభివృద్ధి.. పథకం ద్వారా పండ్ల తోటలు, నీటి కుంటలు, కూరగాయల సాగును ప్రోత్సహిసున్నారు. రాయితీతో కూరగాయల నారును అందించడంతోపాటు, ప్రస్తుత సంవత్సరం డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, మామిడి, జామ, కూరగాయలు, తదితర పంటల సాగుకు సైతం రాయితీని కల్పిస్తున్నారు.
ఆయిల్‌పామ్ సాగు
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర సేద్యంపై రాయితీ ఇస్తున్నారు. ఎకరాకు రూ.4,200 ల చొప్పున నాలుగేళ్లపాటు రాయితీ అందుతుంది.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
20 గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి రూ.50 వేల సబ్సిడీ అందిస్తున్నారు. గరిష్టంగా 2.20 ఎకరాల వరకు రాయితీ అందుతుంది. సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని కూరగాయలు సాగు చేపట్టొచ్చు. రైతులకు అవగాహన కల్పిస్తూ వీటిపై మొగ్గు చూపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జాతీయ వెదురు పథకం
సాగుకు యోగ్యం కాని భూముల్లో, పొలం గట్లపైన, వెదురు మొక్కలు నాటే రైతులకు ప్రభుత్వం రెండేళ్ల వరకు నిర్వహణ ఖర్చు కింద మొదటి సంవత్సరం రూ. 75 రెండో సంవత్సరం రూ. 45 చొప్పున అందజేస్తారు.
బిందు సేద్యం
ఉద్యాన పంటలు సాగు చేయడానికి డ్రిప్, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతో పరికరాలను అందిస్తున్నారు. బీసీ రైతులకు 90 శాతం, అయిదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. తుంపర సేద్యం పరికరాలకు అందరికీ 75 రాయితీని అందిస్తున్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు పొందేందుకు రైతులు పట్టాదారు పాస్‌బుక్, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటోతో సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు అందజేయాలి. గరిష్ఠంగా అయిదెకరాల భూమి కలిగిన రైతులు అర్హులు.
-కేఆర్ లత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారిణి