ఉల్లి రైతులు నష్టపోకుండా క్వింటాలుకు రూ.1,200 చొప్పున వెంటనే కొనుగోలు చేయడం ప్రారంభించి, నష్టాన్ని మార్కెట్ జోక్యం పథకం కింద భరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబజార్ల సంఖ్యను 150 నుంచి 200కు పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోలుపై సచివాలయంలో గురువారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే పది రోజుల్లో 5 వేల టన్నుల పంట మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది’ అని అధికారులు సీఎంకు వివరించారు.
సీఎం సూచనలు…
కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టండి. రైతులకూ అక్కడ నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. రైతు బజార్లను ఆధునికీకరించాలి. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డు స్థలాలను ఉపయోగించుకోవాలి. అందులోని 2-3 ఎకరాల భూమిని ఉపయోగించుకుని కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. గోదాములు, కోల్డ్ చైన్ వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలి.

29 Aug, 2025
