ద్వితీయ వ్యవసాయం – రైతుకు అదనపు ఆదాయం అందించే బంగారు బాట

“పంట ఒక్కటే కాదు… పంటతో పాటు మరెన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయి”

ఈరోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగా పంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండవు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి.
ఇదే భావనతో ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు శాస్త్రవేత్తలు “ద్వితీయ వ్యవసాయం (Secondary Agriculture)” అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.

ద్వితీయ వ్యవసాయం అంటే ఏమిటి?
పొలంలో పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు.

సరళంగా చెప్పాలంటే…
“పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవడమే ద్వితీయ వ్యవసాయం.”

  1. పంటలకు విలువ జోడించండి – ఎక్కువ ధర పొందండి
    చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేస్తారు. అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది.
    వరిని బియ్యంగా మార్చడం ,బియ్యంతో అటుకులు, మురమురాలు తయారు చేయడం ,వేరుశెనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం ,మిరపతో మిరప పొడి తయారు చేయడం ,పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం , మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం.దీనివల్ల రైతు సాధారణంగా పొందే ఆదాయం కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం అనేది ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన మరియు స్థిరమైన రంగం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే రైతులు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మహిళా సంఘాలు, యువ రైతులు, FPOలు మరియు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఇది ఉపాధి కల్పించడంతో పాటు, పోషకాహార భద్రతను మెరుగుపరచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందువల్ల చిరుధాన్యాల విలువ జోడింపును ద్వితీయ వ్యవసాయం అభివృద్ధికి ఒక ప్రధాన వ్యూహంగా ప్రోత్సహించడం అవసరం.
  2. కోత అనంతర నష్టాలను తగ్గించండి
    భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కోత అనంతరం గణనీయమైన నష్టం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

రైతులు ఈ చర్యలు పాటించాలి:
పంటను బాగా ఆరబెట్టాలి, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి ,తేమ రాకుండా నిల్వ చేయాలి, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ ఉపయోగించాలి, శుభ్రమైన సంచుల్లో ప్యాకింగ్ చేయాలి.

  1. గ్రామంలోనే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి
    గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది.అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.
    చిన్న పరిశ్రమలు : రైస్ మిల్లు, నూనె గానుగ , పప్పు మిల్లు, పిండి మిల్లు , మసాలా తయారీ, పండ్ల ప్రాసెసింగ్
  2. పాల ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ ఆదాయం
    రైతు ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు ఆదాయం వస్తుంది.
    పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్
    తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది.పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి.
  3. తేనెటీగల పెంపకం – తేనెతో పాటు పంట దిగుబడీ పెరుగుతుంది
    తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు.
    దీని ద్వారా తేనె , బీస్‌వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి.
    అంతేకాదు, తేనెటీగలు పరాగసంపర్కం చేయడం వల్ల ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, పండ్ల పంటల దిగుబడి బాగా పెరుగుతుంది.
  4. పుట్టగొడుగుల సాగు – చిన్న గదిలో పెద్ద ఆదాయం
    వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషాలను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు.
    చిన్న గదిలోనే సాగు చేయవచ్చు.ఈ వ్యాపారం మహిళలకు, యువతకు , స్వయం సహాయక సంఘాలకు
    అత్యంత అనుకూలంగా ఉంటుంది.
  5. చేపల పెంపకం – నీటి వనరులతో అదనపు ఆదాయం
    వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు.
    వరి సాగుతో పాటు చేపల పెంపకం (Rice-Fish Farming) చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయం పొందవచ్చు.
  6. పశుపోషణ – రైతుకు నమ్మకమైన ఆదాయం
    వ్యవసాయం మరియు పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి.
    పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి.
    పశువుల పేడ : వర్మీకంపోస్ట్ ,బయోగ్యాస్ ,సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
  7. కోళ్ల పెంపకం – తక్కువ పెట్టుబడి, త్వరగా ఆదాయం
    పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బతింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. గుడ్లు, మాంసం సొంత అవసరాల వినియోగానికే కాకుండా అమ్మకాలతో ఆదాయం కూడా పొందవచ్చు. గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా మార్కెట్ ఉంటుంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు. గిరిరాజ, వనరాజ, గ్రామ ప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను పెంచుకోవచ్చు

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75-80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవ త్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

  1. వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చండి
    చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవశేషాలను కాల్చివేస్తారు.
    అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్ , కంపోస్ట్ ,బయోగ్యాస్ ,బయోచార్ ,పుట్టగొడుగుల సాగు , పశుగ్రాసం తయారు చేయవచ్చు. ఇది పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుంది.
  2. పూలు, ఔషధ మొక్కలు – తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం
    మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
  3. నర్సరీలు మరియు విత్తన ఉత్పత్తి
    నాణ్యమైన నారు మొక్కలు, ధృవీకరించిన విత్తనాలకు రైతుల్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కూరగాయల నారు , పండ్ల మొక్కలు, పూల మొక్కలు ,అటవీ మొక్కలు తయారు చేసి విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

స్వపరాగసంపర్క పంటల్లో వరి , శనగ ,పెసర , మినుము ,ఉలవలు మరియు వేరుశెనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. ధృవీకరించిన విత్తన ఉత్పత్తి, శుభ్రపరచడం, గ్రేడింగ్, విత్తన శుద్ధి, ప్యాకింగ్, బ్రాండింగ్ వంటి విలువ జోడింపు చర్యలను చేపట్టడం ద్వారా రైతులు సాధారణ ధాన్యం విక్రయంతో పోలిస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి పెంపుకు మరియు నాణ్యమైన విత్తనాల లభ్యతకు ముఖ్యమైన సాధనంగా నిలుస్తుంది.

  1. అగ్రో టూరిజం – వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా మార్చండి
    ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభవించడానికి ఆసక్తి చూపుతున్నారు.
    రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు , గ్రామీణ ఆహారం ,పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
  2. రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే అనుబంధ ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలు:
    టెర్రస్ వ్యవసాయం (Terrace Farming) : ఇళ్ల పైకప్పులపై (Terrace) కుండీలు, గ్రో బ్యాగులు, ట్రేలు లేదా ఎత్తైన బెడ్లలో కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పూలు మరియు ఔషధ మొక్కలను సాగు చేయడాన్ని టెర్రస్ వ్యవసాయం అంటారు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్నప్పటికీ, పైకప్పు స్థలాన్ని సద్వినియోగం చేసుకొని తాజా, సురక్షితమైన మరియు రసాయన అవశేషాలు తక్కువగా ఉండే కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు. టెర్రస్‌లో పండించిన ఉత్పత్తులను సేంద్రియ కూరగాయలుగా విక్రయించడం, నారు మొక్కలు తయారు చేసి అమ్మడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, విలువ జోడింపు చేసి ప్యాకింగ్ చేయడం
    ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.

కిచెన్ గార్డెన్ (Kitchen Garden / పోషక తోట)
ఇంటి పరిసరాల్లో లేదా పెరట్లో కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కలను పండించే తోటను కిచెన్ గార్డెన్ లేదా పోషక తోట అంటారు.
దీని ప్రధాన లక్ష్యం కుటుంబానికి ఏడాది పొడవునా తాజా పోషకాహారాన్ని అందించడం.

పండించే పంటలు : టమాట, వంకాయ, బెండ, మిరప, పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగ, బొప్పాయి

కిచెన్ గార్డెన్ ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు కూరగాయలు, నారు మొక్కలు లేదా విత్తనాలను విక్రయించడం ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంట్లో తయారుచేసిన కంపోస్ట్, వర్మీకంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ పథకాల వినియోగం
రైతులు ఈ పథకాల ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు.
• ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME)
• వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agriculture Infrastructure Fund)
• జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్
• డెయిరీ అభివృద్ధి పథకాలు
• NABARD గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు

నేటి వ్యవసాయ పరిస్థితుల్లో “పంట పండించడం మాత్రమే కాదు… పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం.” ద్వితీయ వ్యవసాయం ద్వారా రైతులు పంటలతో పాటు పాలు, తేనె, పుట్టగొడుగులు, చేపలు, కోళ్లు, సేంద్రియ ఎరువులు, ప్రాసెసింగ్ ఉత్పత్తులు, నర్సరీలు వంటి అనేక ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబానికి సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ప్రతి రైతు తన వ్యవసాయానికి అనువైన కనీసం ఒకటి లేదా రెండు ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టి “ఉత్పత్తిదారుడు” నుండి “వ్యవసాయ పారిశ్రామికవేత్త”గా ఎదగడానికి కృషి చేయాలి.”వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

డా. కె.తేజస్వర రావు మరియు డా . బి. సహదేవ రెడ్డి
ఆచార్య N G రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము

Read More

సాంకేతికతను సాగుకు అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు

వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని సాగుకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు చేయాలని నాబార్డ్ మాజీ చైర్మన్, ఐఐఎఫఎల్ సంస్థ ఫైనాన్స్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 63వ వ్యవస్థాపక దినోత్సవాలు గుంటూరు సమీపంలోని లాంఫాం ఆడిటోరియంలో శుక్రవారం జరిగాయి. వాతావరణ మార్పు అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్రూ అభివృద్ధికి రూ.3 లక్షలు విరాళం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన ‘మారనున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులకు సుస్థిర వరి వ్యవసాయం’, గుంటూరు జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ప్రచురించిన ‘కంది సాగు సమగ్ర యాజమాన్యం, మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, అపరాల సాగులో సమగ్ర కలుపు యాజమాన్యం’ పుస్తకాలను ఆవిష్కరించారు.

Read More

రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

Read More

ఖరీఫ్‌లో 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా ఈ ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. 7.83 లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించగా ప్రభుత్వం రూ.11,557 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. అధికశాతం రైతులకు 48 గంటల్లోపే ఈ చెల్లింపులు పూర్తిచేశారు. 2025 ఖరీఫ్‌లో 43.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 94 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. మార్చి 31 కి 48.70 లక్షల టన్నులు సేకరించారు.

Read More

పసుపు కొనుగోళ్ళపై సమీక్ష

అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు తేమతో ఉన్న పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో పసుపు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు వస్తోంది. సోమవారం అర్ధరాత్రి బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 3,450 మంది రైతులకు చెందిన 7,080 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేసేందుకు ఆదేశించాం’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించబోయే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.

Read More

71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

తెలంగాణాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా, దొడ్డు ధాన్యం 32.78 లక్షల టన్నులు. సన్న ధాన్యం రైతులకు క్వింటాకు రూ.500 అదనంగా చెల్లించారు. కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సాగు పెరగడంతో పాటు ఇటు పీపీసీలకు సన్నాలు భారీగా వచ్ౘ్ాయి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించగా.. ఇందులో 99.25% మంది అన్న దాతలకు ప్రభుత్వం సోమవారం నాటికి రూ.1,939.58 కోట్లను బోనస్‌గా అందించింది. మరో రూ.14.62 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Read More

రానున్న సంవత్సరాలలో ప్రకృతి వ్యవసాయానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయశాఖా మంత్రి తెలిపారు. సెక్రటేరియట్‌లో ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్‌ విజయ కుమార్‌, ఇతరులు, పక్క రాష్ట్రాలలో, వివిధ దేశాలలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను మరియు వారి అనుభవాలు ప్రకృతి వ్యవసాయం ఆచరించి అధిక ఆదాయం పొందుతున్న రైతుల విజయ గాధలు, ప్రకృతి వ్యవసాయంలో మెరుగైన నేల ఆరోగ్యం మరియు ఆరోగ్యకర ఉత్పత్తులను మంత్రికి వివరించి తాము తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.
సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌, వ్యవసాయ శాఖా సంచాలకులు డా. గోపి ఈ సంవత్సరం నుండి ఆరంభించిన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రగతిని వివరించి ఇప్పటికే రాష్ట్రంలో 489 క్లస్టర్లు ఏర్పాటు చేసి 61,125 రైతులను ఎంపిక చేసినట్లు (50 హెక్టార్లు ప్రతి క్లస్టర్లు), దీనికి గాను కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 42.07 కోట్లు కేటాయించిందని రిసోర్స్‌ పర్సన్‌లకు వాలంతరి ఆధ్వర్యంలో శిక్షణను పూర్తి చేశామని తెలియచేసారు. ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు సూచించిన విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసారు.
తరువాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటిదాకా రైతులలో ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయని ఒక అపోహ ఉందని, కానీ ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధుల అనుభవాలు మరియు నా అనుభవం, తోటి రైతుల అనుభవాలు ఇది తప్పని నిరూపించాయని, రైతుల నికరాదాయం, మొదటి సంవత్సరం నుండి పెరగడం ఆరంభమైందని తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు తీసి మార్కెటింగ్‌ అవకాశాలను పెంచుకొనే అవకాశం కలదని, వర్షాధార ప్రాంతాలలో కూడా 3 పంటలు తీసే అవకాశం కలదని, అలాగే కలుపు, చీడపీడల సమస్య కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత కర్తవ్యం నేల ఆరోగ్యాన్ని కాపాడడం తద్వారా మానవాళి ఆరోగ్యం కాపాడడమే కాకుండా రైతుకు నికర ఆదాయం పెంచడమని, ఇది ఒక్క ప్రకృతి వ్యవసాయంతోనే సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఈ రోజు వికారాబాద్‌ జిల్లా కోత్రేపల్లి గ్రామంలో నిర్వహించిన మేగా ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ సాగు ప్రాధాన్యత, దీని ద్వారా లభించే ఆర్థిక లాభాలు, మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు.

Read More

రైతుకు లాభం… దేశానికి దన్ను!

కొత్త కంది వంగడంతో ఏటా మూడు పంటలు
ఎకరాకు టన్ను దిగుబడితో రూ.2.70 లక్షల రాబడి
నూతన వంగడం రూపకర్త, ఇక్రిశాట్‌ ప్రధాన శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్‌

హైదరాబాద్‌లో కొత్తగా ఆవిష్కరించిన కంది వంగడం దేశ పప్పుదినుసుల రంగంలో విప్లవాత్మక మార్పులు తేనుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చాక.. రైతుల రాబడి పెరగడంతోపాటు వినియోగదారులకు ప్రస్తుత ధరలకంటే తక్కువకే కంది పప్పు లభిస్తుందని ఐసీపీవీ 25444 వంగడం సృష్టికర్త హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ సీనియర్‌ శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్‌ భరోసా ఇస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఆయన జెనెటిక్స్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇక్రిశాట్‌లో పదేళ్లుగా పనిచేస్తున్న ప్రకాశ్‌ పలు అంతర్జాతీయ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. తాజాగా ఆయన రూపొందించిన కంది రకం భారత్‌తో సహా పలు దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వంగడం విడుదల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.

స్పీడ్‌ బ్రీడ్‌ విధానాన్ని పాటించాం
‘మనదేశంలో 1.13 కోట్ల ఎకరాల్లో, తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల్లో, ఏపీలో నాలుగు లక్షల ఎకరాల్లో కంది సాగవుతోంది. అదేసమయంలో ఇతర ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ల లో దీని సాగు యేటేటా పెరుగుతోంది. ఈ దేశాలతో పోలిస్తే మన దిగుబడి తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో కందిపై 2021లో పరిశోధనలు ప్రారంభించాం. సంప్రదాయ విధానంలో కొత్త వంగడం రూపకల్పనకు 15 సంవత్సరాలు పడుతుంది. దీనికి భిన్నంగా స్పీడ్‌ బ్రీడ్‌ విధానాన్ని ప్రపంచంలో తొలిసారిగా వినియోగించి ఐసీపీవీ 25444 వంగడాన్ని తయారు చేశాం. తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలలో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా అద్భుత ఫలితాలు వచ్చాయి. దీనికి పెట్టుబడితోపాటు ఎరువులు, నీటి వినియోగం తక్కువ. దిగుబడి ఎక్కువ. ప్రతి 120 రోజులకు ఒకసారి చొప్పున ఏడాదికి మూడు పంటలు వేయవచ్చు. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు చాలు. తక్కువ ఎత్తు ఉండడంతో ఎకరం విస్తీర్ణంలో సాధారణ పంట కంటే 30% అధికంగా మొక్కలను వేయొచ్చు. దాంతో ఎకరానికి టన్ను దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు రూ. 9 వేల చొప్పున కందికి ధర ఉండగా… ఎకరాకి 90 వేల మేరకు ఆదాయం రైతుకు ఒక పంటకు వస్తుంది. మూడు పంటలతో రూ.2.70 లక్షల మేరకు రాబడి పొందొచ్చు. దేశంలో ఏటా 3.5 మిలియన్‌ టన్నుల కందుల ఉత్పత్తి జరుగుతుంది. దేశీయ అవసరాలకు యేటా 1.5 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకుంటున్నాం. కొత్త వంగడంతో దేశంలో ఉత్పత్తి సామర్థ్యం మరో పది లక్షల టన్నుల మేరకు పెరిగే అవకాశముంది. తద్వారా దిగుమతుల భారం భారీగా తగ్గి, విదేశీమారక ద్రవ్యం మిగులుతుంది. కొత్త విత్తనాలను తెలుగు రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం అని ప్రకాశ్‌ అన్నారు.

Read More