రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

Read More

భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతుల్లో భయం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ…”రైతులు పంటల ఎంపిక, పెట్టుబడుల ప్రణాళిక, మార్కెట్ పరిస్థితుల అంచనాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిస్థితి ప్రతికూలంగా మారింది. వాణిజ్య ఒప్పందం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ఏ పంట వేయాలి… ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాల్లో రైతులకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందడం లేదు. దీంతో రాష్ట్రాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఎరువుల సరఫరా విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఏప్రిల్‌కు కేటాయించిన ఎరువులు ఇంకా అందలేదు. రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించాలి. ఎరువుల సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి” అని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

Read More

పసుపు కొనుగోళ్ళపై సమీక్ష

అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు తేమతో ఉన్న పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో పసుపు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు వస్తోంది. సోమవారం అర్ధరాత్రి బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 3,450 మంది రైతులకు చెందిన 7,080 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేసేందుకు ఆదేశించాం’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించబోయే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.

Read More

రుణభారం తెలంగాణ రైతులకు తక్కువ

వివిధ రాష్ట్రాల్లో రైతులకు ఉన్న అప్పుల మొత్తంపై తమిళనాడు ఎంపీ ఎ. రాజా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు వ్యవసాయ ప్రధానమైన కర్ణాటక, తమిళనాడు, ఏపీ లతో పోలిస్తే తెలంగాణలో రైతులకు రుణభారం తక్కువగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘2025 డిసెంబరు 31 నాటికి తమిళనాడు రైతులపై రూ.5,06,290.45 కోట్లు, ఏపీ రైతులపై రూ. 3,75,254. 59 కోట్లు, కర్ణాటక రైతులపై రూ.2,10,244.47 కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రైతులపై రూ.1,75,960. 56 కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్పారు. రైతు రుణభారంపై జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) 2025 డిసెంబరు 31 నాటికి కటాఫ్ డేట్‌గా తీసుకొని ఈ వివరాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

Read More

సహజ వ్యవసాయం కోసం తెలంగాణాలో 489 క్లస్టర్లు ఏర్పాటు

తెలంగాణలో 24,736 హెక్టార్లలో సహజ వ్యవసాయం జరుగుతున్నట్లు, సహజ వ్యవసాయాన్ని క్లస్టర్ విధానంలో అమలు చేస్తున్నామని, ఇందుకోసం తెలంగాణలో 489 క్లస్టర్లను ఏర్పాటుచేశామని, ఈ పథకం కింద 61,125 మంది రైతులు నమోదైనట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి భగీరథ్ చౌదరి తెలిపారు.

Read More

కేంద్ర విత్తన చట్టంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల చట్టాన్ని చేర్చాలి

తెలంగాణ ఉద్యాన నర్సరీల నమోదు (నియంత్రణ) చట్టం-2010ని కేంద్ర విత్తన చట్టం-2025లో చేర్చాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖను కోరింది. వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి నేతృత్వంలో కేంద్ర విత్తనచట్టం ముసాయిదా కోసం రూపొందించిన ప్రతిపాదనలను గురువారం కేంద్రానికి పంపింది. ‘ప్రైవేటు కూరగాయల విత్తనాలు, పండ్ల నర్సరీలను నియంత్రించడంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్‌ నియంత్రణ చట్టం విజయం సాధించింది. రైతులు ప్రయోజనాల పరిరక్షణతో పాటు లైసెన్సును తనిఖీ చేయడం, నిలిపివేయడం, రద్దు చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. దీనిని నమూనాగా తీసుకొని భారతదేశ ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర విత్తన చట్టం రూపొందించాలి’ అని ఉద్యాన వర్సిటీ కేంద్రాన్ని అభ్యర్థించింది.

Read More

మక్కల కొనుగోలు పరిమితి ఎకరానికి 25 క్వింటాళ్ళు

తెలంగాణలో మద్దతు ధరలతో మొక్కజొన్న కొనుగోలు పరిమితిని పెంచుతూ ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు పెంచేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.గతంలో ఎకరానికి 18 క్వింటాళ్ల వరకే కొనుగోలు పరిమితి ఉంది. పలు జిల్లాల్లో పరిమితికి మించి రైతులు మక్కలను తీసుకురాగా.. అధికారులు వాటిని నిరాకరించారు. దీనిని ప్రజాప్రతినిధులు, రైతులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిమితి పెంచాలని కోరారు. మక్కలను కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయిస్తోంది. ఇప్పటికే రూ.2400 కోట్ల మేరకు కొనుగోళ్లకు వెచ్చించింది.

Read More