నూనెగింజలు, ఆయిల్‌పామ్‌ పంటలే లాభదాయకం

తెలంగాణలో రైతులు నూనె గింజలు, ఆయిల్‌పామ్‌ పంటలను అత్యధికంగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. జాతీయ నూనె గింజల పథకం కింద రూ.46.14 కోట్లతో 2025-26కి గాను మేలిమిరకం వేరుసెనగ విత్తనాల ఉచిత పంపిణీని మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించారు. ‘ఇతర పంటల కంటే నూనెగింజలు, ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. సాగును పెంచేందుకు వీలుగా 38,434 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయించాం. నూనెగింజల పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల ఎరువుల వాడకాన్ని అలవర్చుకోవాలి’ అని తుమ్మల సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ పామ్‌ కెనెల్‌ ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు

క్రూడ్‌ పామ్‌ కెనెల్‌ ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌ ఏలూరు జిల్లాలో రూ.209. 77 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్‌ ఆగ్రో వెట్‌ లిమిటెడ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్‌ మొదటి దశను 2026 మార్చి నాటికి, 2029 మార్చి నాటికి రెండో దశ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

Read More

మార్కెటింగ్‌, మార్క్‌ ఫెడ్‌, హాకా, ఆర్‌ఐసి సంస్థల ఎండీలతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్ష

తెలంగాణా రాష్ట్రంలో వివిధ పంటల కోతలు ప్రారంభమైన సందర్భంగా వాటి సేకరణ, మరియు మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వరి ధాన్య సేకరణలో అవసరమయ్యే క్లీనర్లు, టార్పలిన్లు, మున్నగు వాటి జిల్లాల వారి లభ్యతపై సమీక్షించారు.
మొక్కజొన్న కొనడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, ఐనప్పటికి రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు రేపటి నుండి మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా సోయాబీన్‌ కొనుగోలు కేంద్రాలు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సిసిఐ టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. కావున వెంటనే కలెక్టర్లు జిన్నింగ్‌ సెంటర్లు రేపటిలోగా నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక హెచ్‌ఓడీని అన్ని పంటల కొనుగోళ్లకు సమన్వయ అధికారిగా నియమించడం జరిగిందని, వీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లతో సమన్వయం చేసుకొని రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు ఎండి, వేర్‌ హౌజ్‌, వరంగల్‌ జిల్లాకు డైరెక్టర్‌, హార్టీకల్చర్‌, నల్లగొండ జిల్లాకు డైరెక్టర్‌, అగ్రికల్చర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు ఎండి, హాకా, ఖమ్మం జిల్లాకు డైరెక్టర్‌ మార్కెటింగ్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు డైరెక్టర్‌, సీడ్‌ సర్టిఫికేషన్‌, కరీంనగర్‌ జిల్లాకు ఎండి, ఆగ్రోస్‌, మెదక్‌ జిల్లాకు ఎండి, మార్క్‌ ఫెడ్‌, రంగారెడ్డి జిల్లాకు ఎండి, ఆయిల్‌ ఫెడ్‌ గార్ల స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, హాకా ఎండీ చంథ్రేఖర్‌ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Read More

ప్రాణహితపై నిర్మించనున్న ‘తుమ్మిడిహెట్టి’ సమగ్ర ప్రాజెక్టు నివేదికపై దృష్టి పెట్టండి

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ప్రాణహితపై నిర్మించ నున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ.. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లేదా సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపునకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) రూపకల్పనపై దృష్టి సారించాలని ఇంజినీర్లను తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి ఆదేశించారు. ‘బ్యారేజీ నుంచి 71 కిలోమీటర్ల వరకు గతంలోనే కాలువ తవ్వకం పూర్తయింది. అక్కడి నుంచి ఎల్లంపల్లి లేదా సుందిళ్లకు నిర్మించాల్సిన కాలువపై నిర్ణయం జరగాల్సి ఉంది. వచ్చే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం జరుగుతుంది. బ్యారేజీ ఎక్కడ నిర్మించాలనేది సాంకేతిక పరీక్ష తర్వాత ఖరారవుతుంది. నీటిని తరలించే మార్గాన్ని ఖరారు చేసేందుకు ఏదైనా ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలా.. లేదంటే ఇంజినీర్లే చేస్తారా.. అనేది స్పష్టత ఇవ్వండి’ అని పేర్కొన్నట్లు తెలిసింది. టెండరు ద్వారా ఏజెన్సీకి అప్పగించాలన్న చర్చ జరగ్గా.. మంచిర్యాల యూనిట్‌ ద్వారా పూర్తి చేయాలని మంత్రి సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎల్లంపల్లి లేదా సుందిళ్లకు కాలువ నిర్మాణానికి సంబంధించిన అంచనాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు అనుమతి

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా బియ్యం సేకరణ లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల టన్నులకు కేంద్రం పెంచిందని ఎఫ్‌సీఐ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్‌, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. విజయవాడలోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో సోమవారం ఆయన ధాన్యం సేకరణ, నిల్వ, పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ.. ”గతేడాది రబీలో రాష్ట్రంలో 9.33 లక్షల టన్నుల బియ్యం సేకరిం చారు. ఈ ఏడాది మరింత పెరుగుతుంది. పల్నాడు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, గోదాములు నిర్మించేందుకు ఎఫ్‌సీఐ సంసిద్ధత తెలిపింది. ఈ గోదాముల్లో 45 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్యానెల్స్‌ ఏర్పాటుకు అవకాశం ఉంది. ఎఫ్‌సీఐ ద్వారా ప్రతి నెల 1.54 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ అవుతోంది” అని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గోదాముల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎఫీసీఐ జీఎం విజయ్‌కుమార్‌ యాదవ్‌, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.

Read More

ధాన్యం తడిస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే బాధ్యత

తెలంగాణాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సంబంధించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైస్‌ మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు, నిర్వహణ, రవాణా, లెక్కల నమోదులో అనుసరించాల్సిన నియమ నిబంధనల్ని స్పష్టం చేస్తూ జిల్లాల వారీగా ఆదేశాలు జారీ అయ్యాయి.
కౌలు రైతులు తాము సాగుచేసిన భూమి వివరాల్ని ముందుగానే వ్యవసాయశాఖ ఓపీఎంఎస్‌ లాగిన్‌లో కౌలు రైతు కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
కొనుగోలు కేంద్రాలు ఎత్తయిన ప్రదేశంలో రవాణాకు అనుకూలంగా ఉండాలి. సెంటర్లో ధాన్యం తడిస్తే నిర్వాహకులదే పూర్తి బాధ్యత.
సన్న ధాన్యం నింపే బస్తాలను గుర్తించేందుకు వీలుగా ఎర్రదారంతో, దొడ్డు ధాన్యం బస్తాలను ఆకుపచ్చ దారంతో కుట్టాలి. సన్నధాన్యం బస్తాలపై ‘ఎస్‌’ అనే అక్షరం రాయాలి.
రైతులు మద్దతు ధర పొందాలంటే తేమ 17% మించొద్దు. చెత్త, తాలు 1%, మట్టిపెళ్లలు, రాళ్లు 1%, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యం 5%, పూర్తిగా తయారుకాని ధాన్యం 3% దాటొద్దు.
ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు మిల్లుకు పంపించాలి. ధాన్యం రవాణా చేసే ముందే ఓపీఎంఎస్‌ లో వివరాల్ని పీపీసీ సెంటర్‌ నిర్వాహకులు నమోదుచేయాలి.

  • దళారులు ధాన్యంకొంటే కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చర్యలుంటాయి.
Read More

నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో నిష్క్రమణ

3,4 రోజుల్లో ‘ఈశాన్యం’ ఆగమనం
నైరుతి రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేగంగా నిష్క్రమిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారాల్లో నైరుతి వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా ‘నైరుతి’ నిష్క్రమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Read More

ఆయకట్టు వివరాలు పక్కాగా అందచేయాలి

తెలంగాణా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు వివరాలను తేడాలు లేకుండా పక్కాగా అందజేయాలని చీఫ్‌ ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ సూచించింది. జిల్లా కలెక్టర్లు, సీఈలు ఇస్తున్న డేటాకు మధ్య పొంతన ఉండటం లేదని, పలు అనుమతులకు కేంద్రానికి ఆయకట్టు వివరాలు సమర్పించే సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయకట్టు అభివృద్ధి, సాగునీటి విభాగం సీఈ రఘునాథరావు శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు పలు సూచనలు చేశారు.

Read More

గేదె బరువు వెయ్యి కిలోలు

గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే జాఫరాబాదీ జాతి గేదెలు సాధార ణంగా 700 నుంచి 800 కిలోల బరువు ఉంటాయి. జునాగఢ్‌లోని కామధేను విశ్వవిద్యాలయ పశుసంవర్ధక కేంద్రంలో ఏడేళ్ల వయసున్న ఒక గేదె ఏకంగా వెయ్యి కిలోల బరువుతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ గేదె ఇటీవల ఒక దూడకు జన్మనిచ్చింది. ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడం వల్ల ఇది ఆర్ధిక ప్రయోజనాలనూ అందిస్తుందని, వీటి పాలలో 11 నుంచి 14 శాతం వెన్న అదనంగా ఉంటుందని పాడి రైతులు చెబుతున్నారు.

Read More

డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పురుగుల మందుల, ఎరువుల వాడకాన్ని తగ్గే విధంగా 'ఏఐ' సాంకేతికతను వినియోగించాలి
  • తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్‌ లా కాకూడదు
  • నాణ్యమైన ఉత్పత్తులు తీసే విధంగా తెలంగాణ వ్యవసాయ విధానములో సమూలంగా మార్పులు తెచ్చే దిశలో యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • శాటిలైట్‌ డేటాతో నేలలో పోషకాల లభ్యతను పరీక్షించే సాంకేతికతను వివరించిన జర్మనీ ప్రతినిధులు
  • నేడు సెక్రటేరియట్‌లో ACRAT ప్రతినిధులతో సమావేశమై చర్చించిన మంత్రి తుమ్మల డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి తేవాలని, పర్యావరణానికి మేలు చేసే స్మార్ట్‌ వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు సచివాలయంలో జర్మనీకి చెందిన ACRAT ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ”డిజిటల్‌ అగ్రికల్చర్‌ తెలంగాణ రోడ్‌మ్యాప్‌” పత్రాన్ని మంత్రివర్యులకు అందజేశారు.
    మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ.. AI, IoT ఆధారిత డిజిటల్‌ వ్యవసాయ సేవలతో ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలి. పంజాబ్‌లా మరో క్యాన్సర్‌ బెల్ట్‌గా తెలంగాణ మారకూడదు. నేల ఆరోగ్యాన్ని కాపాడే, రైతు ఆదాయాన్ని పెంచే, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయం మన లక్ష్యం కావాలి” అన్నారు. జర్మనీ – భారత్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని తొలి ITU ప్రమాణిత డిజిటల్‌ వ్యవసాయ యూజ్‌కేస్‌ను వేములవాడలో విజయవంతంగా అమలు చేసినట్లు ప్రతినిధులు వివరించారు. ఉపగ్రహ, డ్రోన్‌, మరియు సెన్సర్‌ ఆధారిత ఈ మోడల్‌ ద్వారా నేలలోని N,P,K మరియు సూక్ష్మ పోషకాల లభ్యత విశ్లేషణ చేసి, అవసరమైన ఎరువుల పరిమాణాన్ని మాత్రమే సిఫారసు చేస్తున్నామని, AI ఆధారిత పంట గుర్తింపు మోడల్‌, ఉపగ్రహ డేటాతో సబ్సిడీలు, బీమా, రుణాల పారదర్శక పంపిణీ వంటి అంశాలను కూడా మంత్రికి వివరించారు. సమగ్ర డిజిటల్‌ వ్యవసాయ ప్లాట్‌ఫార్మ్‌ను రూపొందించి, రైతులు, పరిశోధకులు మరియు విద్యార్థులు, అందరూ ఉపయోగించుకోగల వేదికగా అభివృద్ధి చేయాలని మంత్రి గారు సూచించారు. ”ఈ సాంకేతికత రైతుల వ్యయాన్ని తగ్గించేలా, నేల ఆరోగ్యాన్ని కాపాడేలా మరియు పంట నాణ్యతను పెంచేలా ఉండాలన్నారు. ”రైతు ఆలోచన దిశగా వ్యవసాయ విధానాలు రూపకల్పన చేస్తేనే స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డా. గోపి డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ, డా రఘు చాలిగంటి (ITU-T SG20), డా. సెబాస్టియన్‌ బోసె (ఫ్రాన్హోఫర్‌ హెచెచ్‌ఐ), శ్రీ యాన్‌-క్రిస్టియన్‌ రెడ్‌లిచ్‌ (బాండ్‌ కన్సల్టింగ్‌ GmbH), ప్రొఫెసర్‌ జానయ్య గారు (వైస్‌ ఛాన్సలర్‌, పీజేటీఎస్‌ఏయూ), మరియు రమేశ్‌ రెడ్డి (చైర్మన్‌, పర్యాటక శాఖ) పాల్గొన్నారు.
Read More