పంటలో జన్యువులు వృద్ధి కారణంగా వేరుశనగ దిగుబడిలో ప్రతి యేటా పెరుగుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మెట్టప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తోపాటు వివిధ ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని స్పానింగ్‌బంచ్, వర్జీనియాబంచ్ అనే రెండు ప్రధాన రకాలలో కాయ దిగుబడి, గింజ శాతం, గింజ బరువు ప్రాతిపదికన రెండేళ్లలో నాలుగు పంట సీజన్లలో విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయం తేల్చింది. మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పండే పంటకు యేటా హెక్టారుకు సుమారు 27 కిలోలు.. ఆరు నెలల్లో కాతకొచ్చే రకాల్లో హెక్టారుకు 25 కిలోల దిగుబడి పెరుగుదలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్రిశాట్ గత 20 ఏళ్లలో 240 వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది. కంప్యూటెడ్ టోమోగ్రఫీ, జన్యు ఎంపికల వంటి అధునాతన సాధనలతో పరిశోధనలు జరిపి, మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు.
జీలుగ బెల్లం, నీరా తయారీకి ప్రోత్సాహంజీలుగ బెల్లం, నీరా తయారీని ప్రోత్సహించి అరకు కాఫీ మాదిరిగా గుర్తింపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టరు వెంగయ్య తెలిపారు. హెచ్‌ఐర్ ఎస్ శాస్త్రవేత్తలు, డాక్టరు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టరు మధుమతితో జీలుగ నీరా, బెల్లం తయారీపై గురువారం అమరావతిలో సీఎం సమీక్ష జరిపారు.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే పది సంవత్సరాలలో అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళిక ఇది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ డి. రాజిరెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ. 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే రూ. 942.50 కోట్లు డ్రిప్ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది. వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా కార్యాచరణను అమలు చేయాలని, మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు గుర్తించి, వాటికి అనుగుణంగా విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్ వంటి అంశాలను ప్రణాళికలో సమగ్రంగా వివరించారు. ప్రణాళికలోని ప్రధాన అంశాలు విస్తీర్ణం పెంచడం: పండ్లు, కూరగాయలలో విస్తీర్ణం పెంచడానికి అనువైన జిల్లాలను నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఉద్యాన విశ్వవిద్యాలయం ఎంపిక చేసింది. పండ్ల పంటలలో జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ (కమలం పండు). ద్రాక్ష, ఖర్జూరం అంజీర్, నేరేడు, ఉసిరి మరియు సీతాఫలం 1.32 లక్షల ఎకరాలలో 2030 వరకు అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో విస్తీర్ణం పెంచుకోవచ్చు. కూరగాయలలో 2030కు 2.45 లక్షల ఎకరాలలో అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో టమాటో, వంగ, క్యారెట్, క్యాబేజ్, దోస, కాలిఫ్లవర్, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర మరియు చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలి. ఆఫ్ సీజన్ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలుపరచాలి. సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్యతకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్ నెట్లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధతులను అవలంబించాలి. ఉత్పాదకత పెంచడం: ఉద్యాన విశ్వవిద్యాలయం పెంపొందించిన సాంకేతికతను పండ్లు, కూరగాయలు, ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల పంటలలో అమలుపరిచి అధిక దిగుబడి పొందేందుకు ప్రయత్నం చేయాలి. పంట నష్టాలను తగ్గించడానికి వాతావరణ ఆధారిత సూచనలు సమయానుకూలంగా విడుదల చేయాలి. ప్రతి మండలంలో వ్యవసాయ యంత్రాల కొరకు కనీసం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు సకాలంలో సాగు పనులు పూర్తి చేయగలిగి నష్టాలను తగ్గించు కోగలుగుతారు. ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి. కోతానంతర పంట యాజమాన్యం: కోత అనంతరం పంట నష్టం తగ్గించడానికి కావలసిన శీతల నిల్వ గిడ్డంగులు, పండ్లను మాగబెట్టే కేంద్రాలు, నిల్వ వసతులతో మార్కెటింగ్ యార్డ్, శీతల రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఉల్లి పండించే ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో నిల్వ సదుపాయాలు కల్పించాలి. ఎగుమతులు ప్రోత్సహించడానికి హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తగిన మౌలిక సదుపాయాలతో సమీకృత ప్యాక్ హౌస్ ఏర్పాటు చేయాలి. నాణ్యత పెంచడం, నిల్వ మరియు కోతానంతర పంటల నిర్వహణ, పురుగుమందు అవశేషాలు లేని ఉత్పత్తి, నిల్వకాలం పెంచడం, విలువ జోడింపు పై పరిశోధనలు విస్తృతం చేయాలి. మార్కెటింగ్: రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా సామూహిక క్రయవిక్రయాలను, పంట సాగు మరియు కోతానంతర పంట యాజమాన్యంలో సామూహిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన వ్యవసాయ మార్కెట్ యార్డులలో పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలను సక్రమంగా అమలుపరిచేలా చర్యలు చేపట్టాలి, ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కలిసి నిర్వహించేలా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయంలో నెలకొల్పాలి. ఈ సూచనలు రైతులకు సకాలంలో అందాలి.
ఈ ప్రణాళిక పుస్తకాన్ని డాక్టర్ డి. రాజి రెడ్డి, డాక్టర్ ఎ. భగవాన్, డాక్టర్ జి.పి. సునందిని రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.136.29 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు, మరో రెండు డ్యాంల మరమ్మతులకు పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురంలోని హంద్రీనీవా నుంచి ఉరవకొండ నియోజకవర్గంలో ఎత్తయిన ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీటిని ఎత్తిపోసేందుకు, అక్కడ డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసేందుకు ఆమోదం తెలియజేశారు. వజ్రకరూరు మండలంలో నీటిని ఎత్తిపోసేందుకు రాగులపాడు గ్రామం వద్ద కొట్టాలపల్లి ఎత్తిపోతలను నిర్మించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగా స్లూయిస్ల నిర్మాణం, నూతన కట్టడాలతో పాటు వరద కట్ట, రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. నెల్లూరులోని డి. వి.సత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లోని కాళింగ వరద కట్టల నిర్మాణానికి గతంలో అప్పగించిన ప్యాకేజీకి సంబంధించిన రెండు పనులను ముందస్తుగా ముగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రాజెక్టు కొత్త నిర్మాణం/మరమ్మతులు మంజూరు చేసిన మొత్తం (రూపాయల్లో) అమిద్యాల ఎత్తిపోతల నిర్మాణం 72,30,00,000 కొట్టాలపల్లి ఎత్తిపోతల నిర్మాణం 55.60.00.000 మైలవరం డ్యాం గేట్ల బలోపేతం, ఇతర మరమ్మతులు 3,19,48,000 మిడ్ పెన్నార్ డ్యాం రేడియల్ గేట్ల మరమ్మతులు, ఇతర పనులు 5,20,00,000 మొత్తం 136,29,48,000
వరి, పత్తి రైతులతో పోలిస్తే ఆయిల్ పామ్ రైతులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని, దేశంలో ఇతర అన్ని పంటల కంటే ఆయిల్ పామ్ అత్యంత లాభదాయక పంట అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడయింది. దేశీయ అవసరాలకు వినియోగించే నూనెల్లో పామాయిల్ దిగుమతులు అత్యధికంగా 21 శాతంగా ఉన్నాయని, దాన్ని తగ్గించే దిశగా సాగు మరింత పెరగాలని, 2047 నాటికి 50% వరకు స్వయం సమృద్ధి సాధించాలని నిర్దేశించింది. దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు, వినియోగం, ఇతర ప్రయోజనాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నేతృత్వంలో కేంద్రం అధ్యయనం నిర్వహించి, ఆ నివేదిక-2025 ను తాజాగా విడుదల చేసింది. ముఖ్యాంశాలిలా ఉన్నాయి. దేశంలో వంట నూనెల వార్షిక తలసరి వినియోగం 19.7 కిలోలుగా ఉంది. వినియోగంలో 16.9 మిలియన్ టన్నులు భారత్ దిగుమతి చేసు కుంటోంది. అందులో 56% పామాయిలే. ఇది ప్రపంచ పామాయిల్ దిగు మతులలో 21 శాతం. వినియోగం ఇదే స్థాయిలో ఉంటే 2047 నాటికి డిమాండ్ 66.8 మిలియన్ టన్నులకు చేరుతుంది. లాభం-ఖర్చు నిష్పత్తి పామాయిల్ పంటకు అధికంగా ఉంది. ఆయిల్‌పామ్‌కు పెట్టిన రూ. 1 ఖర్చుకు రూ.1.49 లాభం వస్తోంది. వరిలో అయితే రూ.1 ఖర్చుకు.. లాభం రూ.1.03, పత్తిలో రూ.1 ఖర్చుకు లాభం 1.13 శాతంగా ఉంది. అభివృద్ధికి సూచనలు ఆయిల్‌పామ్ దిగుబడి హెక్టారుకు 2.4 మెట్రిక్ టన్నులుగా ఉంది. దాన్ని 4-5 మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రణాళిక అవసరం. దేశంలో ప్రస్తుతం వరి, పత్తి తదితర పంటలు సాగయ్యే 1.6 కోట్ల ఎకరాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి. నర్సరీలు, శుద్ధి సామర్థ్యాలు పెంచేదిశగా పెట్టుబడులను ప్రోత్సహించాలి. రైతులకు మార్కెటింగ్ వనరులను అందుబాటులోకి తేవాలి. చిన్న రైతులకు తేలికగా రుణ లభ్యత ఉండేలా చూడాలి.
వచ్చే నెల 6 నుంచి ఫిబ్రవరి 5 వరకు హైదరాబాద్లోని కేంద్ర వ్యవసాయ అనుబంధ జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థలో సేందియ, ప్రకృతి వ్యవసాయంపై 3 నెలల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ కో-ఆర్డినేటర్ దామోదరాచారి తెలిపారు. వివరాలకు 9542638020 నంబర్లో సంప్రదించాలన్నారు.
e-Cropఈనెల 25లోగా ఈ శాప్ నమోదు పూర్తి చేయాలని.. ఈ-కాల్ నమోదులో భూకమతానికి రూ.10 చొప్పున ప్రోత్సాహకంగా రైతు సేవా కేంద్రాల్లోని సహాయకులకు అందిస్తామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 100% లక్ష్యం సాధించాలని నిర్దేశించారు. కలెక్టర్ల సహకారంతో అదనంగా గ్రామ సచివాలయ సిబ్బందినీ నియమించుకుని ఈ-పంట నమోదును వేగవంతం చేయాలని సూచించారు. ఈ-క్రాప్ నమోదుపై వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి రాజశేఖర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు నమోదు వివరాలను ఢిల్లీరావు వివరించారు.
రెడ్ కొరీడ్ బగ్స్ చీడపురుగులు పంటను ఆశిస్తే రైతుకు తీవ్ర నష్టం తప్పదు. పత్తి, వేరుసెనగ వంటి పంటలను ఎక్కువగా ఆశిస్తాయి. ఆకుల రసం పీల్చే యడం వల్ల దిగుబడి తగ్గడంతో పాటు పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని దర్శి కృషివిజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సీహెచ్ వరప్రసాదరావు తెలి పారు. వేపనూనె పిచికారీ ద్వారా వీటిని నివారించవచ్చని వివరించారు. ప్రకాశం జిల్లాలో వర్షాలు పడుతుండడంతో ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఓ పొలంలో కనిపించాయి.
అధిక వర్షాలు పడినప్పుడు టమాటలు నేలను తాకి తడిసి మురిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నరెడ్లగూడలో రైతు మిట్ట బాలకృష్ణారెడ్డి పంటను కాపాడుకునేందుకు ఉద్యాన శాస్త్రవేత్తల సలహా కోరారు. మొక్కలు ఎదిగే దశలో కొమ్మలను లేపడం వల్ల కాయలకు నష్టం తగ్గుతుందని చెప్పారు. ఆయన తన రెండు ఎకరాల కూరగాయల తోటలో వరుసకు వరుసకు మధ్య రెండు అడుగుల స్థలం వదిలి, ప్రతి సాలు పొడవునా ఎనిమిది అడుగుల ఎత్తైన కట్టెలను పాతారు. ఆ కట్టెలకు తీగ కట్టారు. మొక్క అడుగు ఎత్తు పెరగగానే దాని కొమ్మలను లేపి తీగకు తాడుతో కట్టారు. ఇలా మూడు అడుగుల వరకు మొక్క పెరిగిన కొద్దీ తీగ ఎత్తు పెంచుకుంటూ వెళ్లారు. గత నెలలో భారీ వర్షాలతో నీరు చేరినా టమాటకు నష్టం జరగలేదు. కర్రలు, తీగలకు ఎకరానికి రూ.20 వేల ఖర్చు అయిందని అయినా రూ.80 వేల పంట దక్కిందని బాలకృష్ణా రెడ్డి చెప్పారు.
వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేసి అక్కడ ఉత్పత్తి పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద తెలంగాణ నుంచి ఎంపికైన జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జనగామ జిల్లాలకు ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న పౌసుమి బసుకు జోగులాంబ గద్వాల, మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న నీతూ కుమారి ప్రసాద్‌కు నాగర్‌కర్నూల్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ తెలంగాణ కేడర్ అధికారులు. కేంద్ర సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి రమణకుమార్‌కు నారాయణపేట, హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఏజీఎంయూటీ కేడర్ అధికారిణి సుష్మాచౌహాన్‌కు జనగామ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈ పథకం క్రింద పంట మార్పిడిని ప్రోత్సహించడంతో పాటు సాగునీటి వసతిని, దిగుబడుల నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ నెల నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాలను సమ్మిళితం చేసి దీని కింద అమలుచేస్తారు.