పాడిరైతులకు రాయితీపై పశుగ్రాసం పంపిణీ

దారిద్య్ర రేఖకు (బీపీఎల్‌) దిగువనున్న సన్నకారు, పాడి రైతులకు రబీ కరవు సమయంలో 50 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని సరఫరా చేసేందుకు రూ. 25.16 కోట్ల మంజూరుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనాపరమైన అనుమతినిచ్చింది. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన నిబంధనలను అనుసరించి ఈ పంపిణీ చేయాలని సూచించారు.

Read More

ధరల మద్దతు పథకం కింద తెలంగాణలో పంటదిగుబడుల సేకరణ

2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో తెలంగాణలో ఉత్పత్తి అయిన మినుము పంటలో 100%, పెసర, సోయాబీన్‌ పంటలో 25% చొప్పున కనీస మద్దతు ధరతో ప్రధానమంత్రి అన్నదాత ఆదాయ సంరక్షణ పథకం కింద సేకరించడానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో పప్పు దినుసులు, నూనెగింజల పంటల సేకరణపై ఆయా రాష్ట్రాల మంత్రులు, సీనియర్‌ అధికారులతో సోమవారం కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించి ఈ మేరకు హామీ ఇచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో ఆయా పంటల సేకరణకుగానూ రూ. 15,095 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఉత్పత్తి అయిన పెసర పంటలో 25% (దాదాపు 4,430 టన్నులు) ధరల మద్దతు పథకం కింద కొనుగోలు చేస్తారు. నాఫెడ్‌ ద్వారా కంది, మినుము, మసూర్‌ పప్పు 100% కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Read More

పంటవ్యర్థాలు దహనం చేయని రైతులకు నగదు ప్రోత్సాహం

ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను (వరిగడ్డి) పొలాల్లోనే కాల్చడం వలన ఉత్పన్నమయ్యే పలు రకాల సమస్యల పరిష్కారానికి పంజాబ్‌లోని బర్నాలా జిల్లా అధికారులు చక్కటి యోచన చేశారు. పంట వ్యర్థాలను దహనం చేయని రైతులను ప్రోత్సహించడానికి రూ.7 లక్షల కేటాయింపుతో ‘లక్కీ డ్రా’ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ప్రతి వారం 25 మంది రైతులను విజేతలుగా ప్రకటించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరిస్తారు. ప్రథమస్థానంలో నిలిచిన రైతుకు రూ.20,000, రెండో స్థానానికి రూ.15,000, మూడోస్థానానికి రూ. 10,000 అందజేస్తారు. మరో 22 మంది రైతులకు రూ.2,500 చొప్పున ఇస్తారు. ఈ పథకాన్ని ప్రారంభించిన బర్నాలా డిప్యూటీ కమీషనరు టి. బెనిత్‌ మొదటివారం విజేతలు 25 మందిని నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

Read More

మొంథా’ తుపాను ప్రభావంతో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగు తోంది. అది ఆదివారం సాయంత్రానికి పోర్టుబ్లెయిర్‌కు 670 కిలోమీటర్లు, చెన్నైకు 720, కాకినాడకు 780, విశాఖపట్నానికి 790, గోపాలపూర్‌ (ఒడిశా)కు 900 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి, అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి, తర్వాత బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో గరిష్ఠంగా గంటకు 110 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పింది.

Read More

ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా పసుపు సాగు చేయండి: మంత్రి తుమ్మల

ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం సచివాలయంలో మంత్రి తుమ్మలను పసుపు బోర్డ్‌ సెక్రెటరీ శ్రీమతి ఎన్‌. భవానీ శ్రీ కలిసి కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కోత అనంతరం ఉపయోగపడే పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పాలిషర్స్‌, గ్రైండర్లు వంటి వాటిని రైతులకు సరఫరా చేస్తున్నట్లు సెక్రటరీ తెలిపారు. అలాగే పసుపు రైతు ఉత్పత్తి సంఘాలను గుర్తించి వారికి 23 లక్షల వరకు రాయితీ కల్పించి, కోత అనంతరం పసుపులో అవసరమయ్యే పనిముట్లను, యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌లో తోడ్పాటునందిస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం పసుపును పౌడర్‌ రూపంలో ఐటిసి, పతంజలి వంటి వివిధ కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు, మధ్యమ దేశాలకు సరఫరా చేసే ఒక ప్రముఖ కంపెనీ 10 ఎకరాల స్థలంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ కూడా నిజామాబాద్‌లో స్థాపించడానికి ముందుకు వచ్చిందని మంత్రికి తెలియచేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కుర్క్‌ మిన్‌ పసుపులో అధికంగా వచ్చే నూతన రకాల సాగు, పురుగు, కలుపు రకాల వినియోగం తగ్గించడం ద్వారా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించడం, ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. పసుపు ఉత్పత్తులకు ఫార్మా మరియు ఆయుర్వేద రంగంలో ఉన్న అవసరాల దృష్ట్యా బోర్డు ద్వారా మార్కెటింగ్‌ లింకేజీలు కల్పించాలని కోరారు. ఆదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియచేశారు.

Read More

తెలంగాణలో 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు అనుమతి

తెలంగాణలో మూడు కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శివారు మగ్దుంనగర్‌, వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం అప్పాయిపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రస్తుత (2025-26) విద్యా సంవత్సరంలో 30 నుంచి 60 సీట్లతో వీటిని ప్రారంభించాలని, ఆ తర్వాత సంవత్సరం నుంచి సీట్ల సంఖ్యను 120కు పెంచాలని సూచించింది. ఈ మూడు కళాశాలల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

Read More

పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు తక్కువగా ఉన్నందున.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో 12 మార్కెట్‌ యార్డులు కాగా.. మిగిలినవి జిన్నింగ్‌ మిల్లులు. ఈ సీజన్‌లో క్వింటా పత్తి మద్దతు ధర రూ. 8,110గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్రంలో 4,56,107 హెక్టార్లలో పత్తి సాగు చేయగా.. 8 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పత్తి సేకరణలో భాగస్వాములయ్యే అధికారులందరికీ బుధవారం గుంటూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు తమ సందేహాల నివృత్తికి కాల్‌ సెంటర్‌ 76599 54529 నంబరులో సంప్రదించాలని అధికారులు కోరారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇథనాల్‌ పరిశ్రమ

తిరుపతి జిల్లా కోనేటిరాజుపాళెం సమీపంలో ఎమ్మెస్‌ నయారా ఎనర్జీ లిమిటెడ్‌ గ్రేస్‌ డిస్టిలరీ కంపెనీ. రూ.581.88 కోట్లతో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల 13న ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనున్నారు. పారిశ్రామిక వాడలో ఇది రెండో ఇథనాల్‌ పరిశ్రమ కానుంది. పెట్రోలుపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ఈ-20 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. స్థానికంగా ఉన్న వరి, జొన్న, సజ్జ, గోధుమలు, చెరకు పిప్పి ద్వారా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసి 50 శాతం పెట్రోలు భారం తగ్గించాలన్నదే కేంద్రం లక్ష్యంగా మారింది.

Read More

జాతీయ నమూనాగా రాజస్థాన్‌లోని గోశాల

ఆవుల సంరక్షణ కోసం 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సంరక్షణ యూనిట్‌ను రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ లోని హింగోనియా గోశాలలో ప్రారంభించారు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పశువులకు ఇక్కడ చికిత్స చేస్తారు. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక పశువైద్య భవనం కూడా నిర్మితమవుతోంది. ఈ పునరావాస కేంద్రంలో సుమారు 18,000 పశువులు సంరక్షణ పొందవచ్చు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న కొన్ని వందల పశువులను జైపుర్‌ మున్సిపల్‌ కార్పొరేషను సిబ్బంది, జంతు ప్రేమికులు ప్రతిరోజూ ఈ కేంద్రానికి తీసుకువస్తారు. హింగోనియాను దేశంలో గోసేవకు ఆదర్శవంతమైన నమూనాగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పునరావాస కేంద్రం మేనేజరు ప్రేమ్‌ ఆనంద్‌ తెలిపారు.

Read More

రేపటి నుండి సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో నిర్వహించిన ”రైతు నేస్తం” కార్యక్రమంలో పాల్గొని, ఈ యాసంగి సీజన్‌లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎం మరియు ఎన్‌ఎంఇఓ పథకాల ద్వారా 50% రాయితీతో ఇవ్వనున్న శనగ, ప్రొద్దుతిరుగుడు మరియు కుసుమ పంటల విత్తనాలను రైతులకు అందజేసారు. రేపటి నుండి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి మరియు రైతునేస్తం వేంకటేశ్వరరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Read More