4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్‌ చేసిన కోదండరెడ్డి

ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేశారు రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి. ఈరోజు ఇబ్రహీం పట్నం సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్‌ చేశారు. రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం ఐనా యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా వుంది. ఇక శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వివరించారు. ఐతే దానికి సంబంధించిన అధికారికంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గురువారం ముగిసింది. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ హర్షన్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరుపున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్‌, కమిషన్‌ అధికారి హరివెంకట ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read More

14 నుంచి 16 వరకుతిరుపతిలో పంచగవ్య జాతీయ వైద్యసదస్సు

ఈ నెల 14 నుంచి 16 వరకు పంచగవ్య జాతీయ 13వ వైద్య సదస్సు.. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో పంచగవ్య, సంప్రదాయ, గోఆధారిత వైద్యం, స్థిరమైన జీవనంపై చేసిన పరిశోధనలను పంచుకునేందుకు, చర్చించేందుకు జాతీయ స్థాయిలో ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు రానున్నట్లు వివరించారు. https://www.gavyasid- dh.org వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 89500 95000, 94449 61723, 94450 66626 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Read More

పంట నష్టం నమోదు గడువు మరో రెండురోజులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్లో మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టం నమోదును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వంద శాతం పూర్తిచేశామని తెలిపారు.

Read More

హైటెక్స్ లో పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన

పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. భారత పౌల్ట్రీ పరికరాల తయారీ సంఘం ఈ విషయం వెల్లడించింది. ఒక దేశం-ఒక గుడ్డు నినాదంతో నిర్వహించే ఈ అంతర్జాతీయ ప్రదర్శనకు 50 దేశాల నుంచి 500 మందికి పైగా ప్రదర్శకులు, 40,000 మందికి పైగా సందర్శకులు, అంతర్జాతీయ నిపుణులు, ఉత్పత్తిదారులు హాజరవుతారని తెలిపింది. దక్షిణాసియాలోనే ఇది అతి పెద్ద ప్రదర్శన అని పేర్కొంది. బుధవారం హైదరాబాద్లో ప్రదర్శన గోడపత్రికను వివిధ సంఘాల నేతలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. “వికసిత్ భారత్ దిశగా పౌల్ట్రీ రంగ సుస్థిర భవిష్యత్ కోసం వరుసగా 17వ సంవత్సరంలో అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తున్నాం. 25న హైటెక్స్ నోవోటెల్ హోటల్లో నాలెడ్జ్ చేతో ప్రదర్శన ప్రారంభమవుతుంది. పౌల్ట్రీరంగ సమస్యల పరిష్కారం, కృత్రిమ మేధ, ఆటోమేషన్ సాంకేతికత, పౌల్ట్రీ వ్యాధుల నివారణ, ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాల వంటి ముఖ్యమైన అంశాలపై చర్చా గోష్టులు నిర్వహిస్తాం” అని తెలిపారు. వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజ్ ఆనంద్, శ్రీనివాస ఫార్మా ఎండీ చిట్టూరి సురేష్ రాయుడు, నేషనల్ ఎగ్, చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు బాలస్వామి, రాష్ట్ర పార్టీ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, భాస్కరరావు, నెద్ హైదరాబాద్ జోన్ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలు అనిల్ ధుమాల్, చక్రధరరావు, నరసింహారెడ్డి, వలసన్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఎర్రచందనం రైతులకు రూ.3 కోట్లు

‘యాక్సెస్‌ అండ్‌ బెనిఫిట్‌ షేరింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌’ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం పండిస్తున్న 198 మంది రైతులతోపాటు ఆంధ్ర యూనివర్సిటీకి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నట్లు జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బిఏ) ప్రకటించింది. ఎర్రచందనం పరిమాణాన్ని బట్టి ఇందులో ఒక్కో రైతుకు రూ. 33 వేల నుంచి రూ. 22 లక్షల దాకా అందుతుందని తెలిపింది. జీవవైవిధ్య సంరక్షణ కోసం గతంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక అటవీ శాఖలు, ఆంధ్రప్రదేశ్‌ జీవవైవిధ్య మండళ్లకు రూ.48 కోట్లు, తమిళనాడు రైతులకు రూ.55 లక్షలు విడుదల చేసినట్లు ఎన్‌.బి.ఏ. వెల్లడించింది. ప్రస్తుతం ఏపీకి విడుదల చేసిన రూ. 3 కోట్ల మొత్తం చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని 48 గ్రామాల్లో ఉన్న 198 మంది రైతులకు వెళ్తుందని తెలిపింది.

Read More

మక్కల కొనుగోలు పరిమితి ఎకరానికి 25 క్వింటాళ్ళు

తెలంగాణలో మద్దతు ధరలతో మొక్కజొన్న కొనుగోలు పరిమితిని పెంచుతూ ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు పెంచేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.గతంలో ఎకరానికి 18 క్వింటాళ్ల వరకే కొనుగోలు పరిమితి ఉంది. పలు జిల్లాల్లో పరిమితికి మించి రైతులు మక్కలను తీసుకురాగా.. అధికారులు వాటిని నిరాకరించారు. దీనిని ప్రజాప్రతినిధులు, రైతులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిమితి పెంచాలని కోరారు. మక్కలను కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయిస్తోంది. ఇప్పటికే రూ.2400 కోట్ల మేరకు కొనుగోళ్లకు వెచ్చించింది.

Read More

తల్లి వర్ధంతి సందర్భంగా రైతుల అప్పు తీర్చిన బాబూభాయ్‌

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపార వేత్త బాబూభాయ్‌ జిరావాలా (ఛాద్వాడియా).. తన తల్లి వర్ధంతి సందర్భంగా 290 మంది రైతుల అప్పులను తీర్చారు. మొత్తం రూ. 89,89,209 ను ఆయన రైతులకు అందజేశారు. ఈ రుణ సమస్య అమ్రేలీ జిల్లాలోని జిరా గ్రామస్థులను 1995 నుంచీ వేధిస్తోంది. 290 మంది రైతులు ఎంత రుణం తీర్చినా ఇంకా మిగిలిపోతోంది. దీనికి శాశ్వత పరిష్కారంగా బాబూ భాయ్‌.. రుణాన్ని తీర్చాలని నిర్ణయించి తీర్చేశారు.

Read More

బొప్పాయి పాలు.. రైతులకు ఆదాయ వనరు

ఆంధ్రప్రదేశ్‌ లోని నంద్యాల జిల్లా చిన్నవంగలితో పాటు సమీపంలోని గ్రామాలైన వైఎస్సార్‌ కడప జిల్లా కానగూడూరు, క్రిష్ణంపల్లె గ్రామాల్లో రైతులు అధికంగా బొప్పాయి సాగు చేస్తుంటారు. మొక్క నాటిన కాలం నుంచి తొమ్మిది నెలలకు పంట చేతికొస్తుంది. పండ్ల సేకరణ అనంతరం 13 నెలల తర్వాత మిగిలినవి, ముదురు కాయలకు గాట్లు పెట్టి పాలను సేకరిస్తున్నారు. తెల్లవారుజాము సమయంలోనే కాయలకు గాట్లు పెడితే కేవలం రెండు గంటల్లోనే పాలు ఊరుతాయి. ఇలా సేకరించిన పాలను రాయచోటి, రాజంపేటకు చెందిన వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. 20 లీటర్ల పాలు రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. సేకరించిన పాలను పరిశ్రమల్లో మందులు, కాస్మోటిక్స్‌, సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు. బెంగళూరు, చెన్నైతో పాటు నాణ్యతను బట్టి విదేశాలకు సైతం పాలను ఎగుమతి చేస్తున్నారు.

Read More

ఎకరానికి ఏడు క్వింటాళ్ళు మాత్రమే అన్న నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. 20 తేమ శాతం ఉన్నా కొనాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు, సీసీఐ ఎండీ లలిత్‌ కుమార్‌ గుప్తాలకు సోమవారం ఆయన లేఖ రాశారు. ”అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి… దిగుమతి సుంకాలు ఎత్తి వేయడం వల్ల పత్తి రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ తరుణంలో కేంద్రం అసంబద్ద ఆంక్షలతో వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. కిసాన్‌ కపాస్‌ యాప్‌లో నమోదు, జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌1, ఎల్‌2గా విభజించడం, తేమ శాతాన్ని 8-12కు పరిమితం చేయడం సమస్యగా మారింది. రాష్ట్రంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే సీసీఐ ఒక్కో రైతు నుంచి ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసింది. ఈ తరుణంలో 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ కొనవద్దంటూ కొనుగోలు కేంద్రాల అధికారులను సీసీఐ ఆదేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నిబంధనను వెంటనే ఎత్తివేయాలి. రైతులతో పాటు జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి” అని లేఖలో తుమ్మల కోరారు.

Read More

పకడ్బందీగా కొత్త విత్తన చట్టం-2025

తెలంగాణా రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా కొత్త విత్తన చట్టం-2025 ముసాయిదాను పకడ్బందీగా రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. ఆదివారం సచివాలయంలో కొత్త విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన కమిటీతో తుమ్మల సమావేశమయ్యారు. వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ముసాయిదా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘నాణ్యమైన విత్తనోత్పత్తికి కంపెనీలను ప్రోత్సహించేలా, మోసం చేసే వాటి పట్ల కఠినంగా వ్యవహరించేలా ముసాయిదా రూపొందించాలి. అది న్యాయ సమీక్షకు అనుగుణంగా ఉండాలి. పంట నష్టపోయే రైతులకు సంపూర్ణ పరిహారం అందేలా చొరవ చూపాలన్నారు. కొత్త విత్తన చట్టం రూపకల్పన అనంతరం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపుతాం’ అని తుమ్మల పేర్కొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ‘విత్తన రైతులకు రుణ సౌకర్యం, సాంకేతిక శిక్షణ వంటి అంశాలను జోడించాలి. విత్తనోత్పత్తి సంఘాల ఏర్పాటు, లైసెన్సు కలిగిన సంస్థలకే విక్రయ అనుమతివ్వాలి. రైతు, ఆర్గనైజర్‌, కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉండాలి’ అని సూచించారు.

Read More