అగ్రి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 18 వరకు గడువు పొడిగింపు

2025-26 విద్యా సంవత్సరానికి ఆచార్య ఎన్‌. జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ, ఎంబీఏ (ఎస్‌ఎఫ్‌క్యూ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పొడిగించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం.వి. రమణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించి, హార్డ్‌ కాపీని ఈ నెల 22 లోపు లాంలోని వర్సిటీ పరిపాలన భవనంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు గీగీగీ.బిదీవీజీబితి.బిబీ.రిదీ వెబ్‌సైట్‌ను చూడాలని చెప్పారు.

Read More

4 వేల మంది సాగుదారులకు కొత్తగా భూపట్టాలు

నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలంలో అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4 వేల మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలివ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని భూ సమస్యలపై మంగళవారం సచివాలయంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బాలూనాయక్‌, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, పీసీసీఎఫ్‌ సి. సువర్ణ, నల్గొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”భూభారతి పైలట్‌ ప్రాజెక్టులో తిరుమలగిరి (సాగర్‌) మండలంలో 23 వేల ఎకరాల్లో సర్వే చేపట్టాం. 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించాం. దీనిలో 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. 4 వేల ఎకరాలకు పాసుపుస్తకాలు ఉన్నాయి. మిగిలిన 4 వేల ఎకరాలకు కొత్తగా పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. 3,069 మంది పేరుతో 2,936 ఎకరాలకు బోగస్‌ పాసుపుస్తకాలు ఉన్నట్లు గుర్తించి రద్దు చేశాం. వీటికి రైతుభరోసా, రైతు బీమా కూడా రద్దు చేశాం. 7 వేల ఎకరాల అటవీ భూమి గుర్తించాం. పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ, అటవీ శాఖలు మానవీయ కోణంలో ఆలోచన చేయాలి” అని మంత్రి ఆదేశించారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో పశుసంపద పెంచాలని ప్రభుత్వానికి విజయ డెయిరీ ప్రతిపాదనలు

తెలంగాణలో రాష్ట్రంలో రోజుకు కేవలం 4 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తవుతున్నాయి, 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇక్కడ పశుసంపద వృద్ధి చెందకపోవడమే. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గడంతో.. పాడి, దాని అనుబంధ ఉత్పత్తులపై ప్రభావం పడింది. పాడి రైతులు పోసే పాలు రోజువారీ 50 వేల లీటర్ల మేరకు తగ్గాయి. సమస్య తీవ్రత, ప్రజావసరాల దృష్ట్యా పాడి రంగాన్ని ఆదుకునేందుకు పాడిపశువుల సంఖ్య పెంపుదల, ఇతర చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019తో పోలిస్తే తాజాగా జరిగిన పశుగణనలో పాలిచ్చే గేదెలు, ఆవులు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది.

పశువుల సంఖ్య తగ్గింది: 2019లో ఆవులు 42,32,383 ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 30,69,524 (27.48%)కి తగ్గింది. గేదెల సంఖ్య 42,26,603 నుంచి 3052102 (27.78%) కి తగ్గింది. మేకలు 49,34,673 నుంచి 45,48,999 (7.82%) కి తగ్గాయి.
సూర్యాపేట జిల్లాలో ఆవులు 62.65%, సంగారెడ్డి 50.74%, మెదక్‌ 45.26%, మహబూబాబాద్‌లో 43.64% తగ్గాయి. గేదెలు సంగారెడ్డి జిల్లాలో 46.14%, కామారెడ్డి 45.92%, మెదక్‌ 45,32%, మహబూబాబాద్‌ లో 43.23% తగ్గాయి. మేకలు హైదరాబాద్‌లో 40.87%, రంగారెడ్డి జిల్లాలో 25.83 % క్షీణించాయి.

పాడిపరిశ్రమకు ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ రైతు కుటుంబాల్లో 0.87% మాత్రమే పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాయని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశువుల పంపిణీ పథకాన్ని చేపట్టి, లబ్దిదారులకు వాటిని పంపిణీ చేయాలని విజయ డెయిరీ ప్రభుత్వాన్ని కోరింది.
Read More

యూరియా వాడకం తగ్గించిన రైతులకు రూ. 800 లు ప్రోత్సాహం

రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రైతులకే బదిలీ చేస్తామని, యూరియా వాడకం తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తాకు రూ.800 చొప్పున ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెప్పారు. సచివాలయంలో సోమవారం జీఎస్‌ డీపీపై జరిగిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘యూరియా విక్రయాలను సరిగా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. ప్రభుత్వంలో అన్ని శాఖలనూ ప్రక్షాళన చేశాం. ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం. అందుకే సమస్య వచ్చింది’ అని పేర్కొన్నారు. ‘రబీకి యూరియా ఇబ్బంది లేకుండా ఈ-క్రాప్‌ ద్వారా ఎవరికి ఎంత అవసరమో గుర్తించాలి. అవసరమైతే ఆధార్‌ అనుసంధానించి ఇంటికే డెలివరీ చేద్దాం’ అని చెప్పారు. పంటల అమ్మకాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్దేశించారు.

Read More

ఇంటిపంటల సంరక్షణకు మాలి

చెన్నై నగరంలో ఇంటిపంటను పెంచుకునేవారు ఏదైనా సమస్య ఎదురైతే ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తారు. కాసేపటికే ఓ మహిళ వచ్చి తోటను బాగుచేసి వెళ్తారు. అంతేకాదు, ఆ తోటకు కావాల్సినప్పుడల్లా కేర్‌ టేకర్‌గానూ ఉంటారు. నగర ఇళ్లలో తోటల పెంపకం కోసం ఈ తరహా మహిళలు ప్రత్యేక నిపుణులుగా ఎదిగారు. వాళ్లనే ‘మద్రాస్‌ మాలి’గా పిలుస్తున్నారు.

ఇంట్లో కాస్త ఖాళీ స్థలమున్నా ఏదో ఒక మొక్క వేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్రత్యేకంగా నగరాల్లో ఇలాంటి ఆవరణ, మిద్దెతోటలు చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే చెన్నై రెసిలెన్స్‌ సెంటర్‌ (సీఆర్‌సి) స్వచ్చంద సంస్థ ఏళ్లుగా ఇంటి ఆవరణల్లో తోటలు పెంచేలా ప్రోత్సహిస్తోంది. వేలాది మంది ఈ ఒరవడికి అలవాటుపడ్డారుగానీ.. వారికి తోటపనిలో తరచుగా వచ్చే సమస్యల్ని తీర్చేందుకు నిపుణులు లేక నిరుత్సాహపడేవారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆలోచించిన సంస్థ సభ్యులు.. మహిళా తోట సంరక్షణ నిపుణుల్ని తీసుకొచ్చారు. స్వయం సహాయక బృంద సభ్యులు (ఎస్‌హెచ్‌జీ)గా ఉంటూ చురుకైన పాత్ర పోషించే 250మందిని చెన్నైలో ఎంపికచేశారు. రెండేళ్లు శిక్షణ ఇవ్వడంతో పాటు ‘మద్రాస్‌ ‘మాలి’ పేరుతో వారికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ఇంటి తోటల్ని పెంచుతున్నవారికోసం వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

నెలనెలా ఆదాయం
మద్రాస్‌ మాలి.. ఇప్పుడు ఎస్‌హెచ్‌జీలోని పేద, మధ్యతరగతి మహిళలకు ఆదాయవనరుగా మారుతోంది. ‘ఆసక్తి చూపినవారి తోటలకు కేర్‌టేకర్లుగా ఉంటారు. ప్రతీవారం వారి ఇళ్లను సందర్శిస్తారు. ఏ సమయంలో ఏ మొక్కలు నాటాలి. మంచి దిగుబడి ఎలా రాబట్టాలి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు నిర్వహణ… వంటివి వారికి వివరిస్తుంటారు. ఇలా నెలకు రూ.20వేల దాకా సంపాదిస్తున్నారు.

ఇంటి పంటపై అవగాహన
ఇళ్లలోనే కాదు.. చెన్నైలోని 114 అంగన్వాడీ కేంద్రాలు, 16 ప్రభుత్వ పాఠశాలల్ని ‘మద్రాస్‌ మాలి’ సభ్యులు తోటలతో పర్యావరణహితంగా మార్చారు. అక్కడ పనిచేసే ఆడవారికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లోని పిల్లలకు ఈ తోటల్లోని ఆరోగ్యకర కూరగాయలే వండి తినిపించేలా చేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని వివిధ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లతో కలిసి ఆయా కాలనీల్లో పట్టణ తోటలమీద అవగాహన పెంచుతున్నారు. కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోన్న చెన్నైలాంటి నగరాలు దేశంలో చాలా ఉన్నాయి. వాటన్నింటికీ పరిష్కారంగా మేం ‘మద్రాస్‌ మాలి’ వ్యవస్థను రూపొందించాం అని సంస్థ సభ్యులు అంటున్నారు.

Read More

పొగాకు ‘ధర’ కిలోకు రూ.418

వర్జీనియా పొగాకు ధరలు నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. గురువారం అమ్మకాలు ముగిసే సమయానికి కిలో ధర రూ.395కు చేరింది. శుక్రవారం వేలంలో రూ. 23 పెరిగి రూ.418తో రికార్డు ధర లభ్యమైంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెండో వేలం కేంద్రం, కొయ్యలగూడెం కేంద్రాల్లో శుక్రవారం జరిగిన వేలంలో కిలోకు రూ.418 ధర నమోదైంది. ఈ పొగాకు ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. గత సీజన్‌లో కిలోకు రూ.411తో మార్కెట్‌ ముగిసింది. మేలు రకం పొగాకుకు మంచి ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి ఎన్‌ఎల్‌ఎస్‌లోని ఐదు వేలం కేంద్రాల్లో 58.25 మిలియన్‌ కిలోల కొనుగోళ్లు జరిగాయి.

Read More

40 శాతం సబ్సిడీతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం

తెలంగాణ రాష్ట్రంలో 2025-26లో 40 శాతం రాయితీతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తున్నామని, దీన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్‌ బాషా కోరారు. పండ్లు, పూలతోటలు, సుగంధ ద్రవ్యాలు, అల్లం, పసుపు, వెల్లుల్లి, పుట్టగొడుగుల పెంపకానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఆసక్తి గల రైతులు స్థానిక ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు.

Read More

దేశ విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణ

దేశ అవసరాల్లో 60% విత్తనాలను సరఫరా చేస్తూ తెలంగాణ.. దేశానికి విత్తనోత్పత్తి కేంద్రంగా ఎదిగిందని, 20కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, శుద్ధి, నిల్వ సదుపాయాలతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారా తెలంగాణ విత్తనాలకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందన్నారు. గురువారం హైదరాబాద్‌లో భారత ఆహార, వ్యవసాయ వాణిజ్యమండలి (ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌) ఆఫ్రికా విత్తన వాణిజ్య సంస్థ (ఆఫ్రికన్‌ సీడ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌)లు సంయుక్తంగా నిర్వహించిన భారత్‌-ఆఫ్రికా విత్తన సదస్సు -2025లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘భారత్‌, ఆఫ్రికా దేశాలు వ్యవసాయాభివృద్ధికి సంయుక్తంగా కృషి చేయాలి. రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు సంక్షేమ విధానాలను ఆఫ్రికా దేశాలు అనుసరిస్తే నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుంది” అని పేర్కొన్నారు.

Read More

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన మొక్కజొన్న సాగు

మన దేశ ఆహార వినియోగంలో 9% వాటా ఉంది. వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న మూడో ఆహార పంట. అన్ని రాష్ట్రాల్లో కలిపి వానాకాలం సీజన్‌లలో 80%, యాసంగిలో 20% పండుతుంది. ఈ పంట దిగుబడులకు ఇథనాల్‌ పరిశ్రమలు పోటీపడి కొనడంతో డిమాండ్‌ విపరీతంగా ఏర్పడింది. 2024-25లో 70% మేరకు సరకును అవే తీసుకున్నాయి. ఈ ఏడాది కొనుగోళ్లు మరింత పెరుగుతాయని వ్యవసాయ, పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

రొట్టెపిండి, బిస్కట్లు, పాప్‌కార్న్‌, ఔషధాలు, సౌందర్య సాధనాలు, ఫిల్మ్‌, వస్త్ర, జిగురు, ప్యాకింగ్‌, ఆల్కహాల్‌, కాగితం పరిశ్రమలు వంటి వాటికి మొక్కజొన్నలు ముడిసరకుగా ఉపయోగపడుతున్నాయి. పశువులు, కోళ్లకు దాణాగా, ఇతర పశుగ్రాస ఉత్పత్తులకు ముడిసరకుగా ఉంది. దేశంలో నాలుగేళ్లు నుంచి ఇథనాల్‌ పరిశ్రమలు రంగంలోకి దిగడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది.

ఇంధన దిగుమతులను తగ్గించడానికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ని కలపాలనే కేంద్ర నిర్ణయంతో ఇథనాల్‌ పరిశ్రమ యాజమాన్యాలు మొక్కజొన్నలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. నూకలు, చెరకు పిప్పి తదితర ప్రత్యామ్నాయాలు ఉన్నా మక్కలపైనే దృష్టి నిలిపాయి. చెరకు, వరిని అధిగమించి 2023-24లో మొక్కజొన్న మొత్తం ఇథనాల్‌ ఉత్పత్తిలో 42.74% వాటాను పొందింది. 2024లో 7.5 మిలియన్‌ టన్నుల మక్కలను ఇథనాల్‌ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది అది 13.3 టన్నులకు చేరనుంది. ఇది మొత్తం ఉత్పత్తిలో 70% కావడం గమనార్హం. ఇథనాల్‌ కంపెనీల పోటీతో మక్కలకు మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా…
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025-26 వానా కాలం సీజన్లో 91.89 లక్షల హెక్టార్లలో మక్కలు వేశారు. నిరుడు ఇదే సమయానికి 83.15 లక్షల హెక్టార్లు ఉండగా… ఈ సీజన్‌ లో 10.5% పెరిగింది. గత ఐదేళ్ల సగటుతో పోలిస్తే ఈసారి పెరుగుదల 16.3% ఎక్కువగా ఉంది. మక్కల ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా… తెలంగాణ, ఏపీ 5, 7 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్లో తెలంగాణలో 6,27,540 ఎకరాల్లో పంట వేశారు. ఇది సాగు లక్ష్యం కంటే 120% ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో 3.58 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ఇది గత ఏడాది కంటే 139% ఎక్కువ. రెండు రాష్ట్రాల్లో మక్కల విత్తనోత్పత్తి కూడా పెరిగింది. 60 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తికి కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకున్నాయి.

సాగు పెరగాలి
ఆది నుంచి కోళ్ల దాణాలో 50% మేరకు మొక్క జొన్నలను వాడుతున్నారు. ఇథనాల్‌ కంపెనీల కారణంగా పౌల్ట్రీ, ఇతర పరిశ్రమలకు కొరత ఏర్పడింది. మార్కెట్‌లో 30% మాత్రమే మక్కల లభ్యత ఉండటంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. దీంతో సాగును భారీఎత్తున పెంచాలని ఆహార, పౌల్ట్రీ పరిశ్రమల నుంచి డిమాండ్‌ వస్తోంది.

Read More

జై జవాన్‌ – జై కిసాన్‌

వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం సైన్యం, నౌకా, వైమానిక దళాల్లో పనిచేస్తూ త్వరలో పదవీ విరమణ పొందనున్న అధికారులకు కల్పించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఏటా సైన్యంలో పదవీ విరమణ పొందే అధికారులు వివిధ వృత్తుల్లో స్థిరపడుతున్నారు. వ్యవసాయ రంగంలో అవకాశాలు మెండుగా ఉండటంతో దానిపై అవగాహన కల్పించి పరిశ్రమల స్థాపన దిశగా వారిని ప్రోత్సహించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ‘జైజవాన్‌ – జైకిసాన్‌’ పేరిట ఎంపిక చేసినవారికి నాలుగు నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. 43 మందితో కూడిన తొలి బృందానికి శిక్షణను బుధవారం హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మెనేజ్‌)లో సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ హనుమాన్‌ సింగ్‌, హైదరాబాద్‌ ఆర్టిలరీ సెంటర్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఆకాశ్‌ గెరా ప్రారంభించారు. పంటల సాగు, ఉత్పత్తి, ఆహార శుద్ధి, మార్కెటింగ్‌లతో పాటు పరిశ్రమలు, వ్యాపార నిర్వహణ, వ్యవస్థాపకతపై వచ్చే డిసెంబరు 26 వరకు నిపుణులతో శిక్షణ ఇస్తామని హనుమాన్‌ సింగ్‌ తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలున్న సైనికాధికారులు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా, నాయకులుగా ఎదగాలని కర్నల్‌ ఆకాశ్‌ గెరా ఆకాంక్షించారు.

Read More