సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ప్రాణహితపై నిర్మించ నున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ.. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లేదా సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపునకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పనపై దృష్టి సారించాలని ఇంజినీర్లను తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి ఆదేశించారు. ‘బ్యారేజీ నుంచి 71 కిలోమీటర్ల వరకు గతంలోనే కాలువ తవ్వకం పూర్తయింది. అక్కడి నుంచి ఎల్లంపల్లి లేదా సుందిళ్లకు నిర్మించాల్సిన కాలువపై నిర్ణయం జరగాల్సి ఉంది. వచ్చే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం జరుగుతుంది. బ్యారేజీ ఎక్కడ నిర్మించాలనేది సాంకేతిక పరీక్ష తర్వాత ఖరారవుతుంది. నీటిని తరలించే మార్గాన్ని ఖరారు చేసేందుకు ఏదైనా ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలా.. లేదంటే ఇంజినీర్లే చేస్తారా.. అనేది స్పష్టత ఇవ్వండి’ అని పేర్కొన్నట్లు తెలిసింది. టెండరు ద్వారా ఏజెన్సీకి అప్పగించాలన్న చర్చ జరగ్గా.. మంచిర్యాల యూనిట్ ద్వారా పూర్తి చేయాలని మంత్రి సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎల్లంపల్లి లేదా సుందిళ్లకు కాలువ నిర్మాణానికి సంబంధించిన అంచనాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.

14 Oct, 2025
