విత్తన చట్టం-2025లో రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి

విత్తన చట్టం- 2025లో రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నకిలీ లేదా నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టపోయే రైతులకు చట్టబద్ధమైన, కాల పరిమితితో కూడిన పరిహారం చెల్లించే నిబంధన ఉండాలని, రైతు పొందగలిగే అత్యధిక దిగుబడి ఆధారంగా పరిహారం లెక్కించాలన్నారు. విత్తన చట్టం ముసాయిదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేర్చాల్సిన అంశాలు, అభ్యంతరాలపై తుది నివేదిక రూపకల్పనకు బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు.

విత్తనోత్పత్తి చేసే రైతులను రక్షించడానికి ప్రత్యేక విభాగం ఉండాలి. విత్తనాలను సరసమైన ధరలతో రైతులకు అందించేలా ధరల నియంత్రణను తప్పనిసరి చేయాలి. రాష్ట్ర విత్తన కమిటీకి ప్రత్యేకమైన విత్తన రకాలను ఎంపిక చేసుకునే అధికారం ఇవ్వాలి.

రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు విత్తన ధరలను నియంత్రించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దాఖలు పరచాలి. విత్తన ధరలపై సమీక్ష, హేతు బద్ధమైన ధరల పరిమితిని సిఫార్సు చేయడానికి రాష్ట్ర విత్తన కమిటీలను అనుమతించాలి.

ఉత్పత్తి సంస్థలు నేరాలకు పాల్పడితే అయిదేళ్లపాటు విత్తన ఉత్పత్తి అమ్మకాలను నిషేధించాలి. విత్తన కంపెనీలకు లైసెన్సు జారీ చేయడానికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు రూపొందించాలి’ అని తుమ్మల సూచించారు. ఆయా అంశాలను మూసాయిదా బిల్లులో చేర్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని మంత్రి తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.

విత్తన చట్టం ముసాయిదాలో సవరణలపై నివేదిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు.

Read More

51 లక్షల టన్నులకు గాను 17.3 లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికే సేకరించాము

నిన్న ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ 'ఈ ఏడాది రాష్ట్రంలో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించగా, ఇప్పటికే 17.30 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. 2.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,120 కోట్లు జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 16 వేల మంది సిబ్బంది, 32 వేల వాహనాలు పని చేస్తున్నాయి. 7.85 కోట్ల గోనె సంచులు అందించామ'ని మంత్రి మనోహర్‌ తెలిపారు. 'రాష్ట్రంలో ఎఫ్‌సీఐకి ప్రస్తుతం 7.85 కోట్ల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా, మరో 3.87 కోట్ల టన్నుల మేర పెంచేందుకు కేంద్ర మంత్రి జోషీ అంగీకరించారు. ఇందుకోసం పీపీపీ విధానంలో స్టీల్‌ సైలోస్‌లు ఏర్పాటు చేస్తాం. వడ్లు అధికంగా పండించే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీటిని నిర్మిస్తాం. తద్వారా ధాన్యం నిల్వనష్టాలు తగ్గి, గింజ నాణ్యత పెరుగుతుంది' అని వివరించారు.
Read More

తెలంగాణాకు వెన్నెముక రైతులే

హైదరాబాదులో నిన్న ప్రారంభమయిన గ్లోబల్‌ సదస్సులో ”విలువ ఆధారిత ఉత్పత్తుల గొలుసు విధానం-రైతుల ఆదాయం రెట్టింపు” అనే అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”తెలంగాణకు వెన్నెముక రైతులే. జనాభాలో ఎక్కువ మంది జీవనోపాధికి సేద్యం వనరుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. గత రెండేళ్లలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయం, దాని అనుబంధ ఆర్థిక వ్యవస్థ దాదాపు 34.6 బిలియన్‌ డాలర్లు. 2047 నాటికి దీనిని 400 బిలియన్‌ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ఆ స్థాయిలో వృద్ధి సాధించడానికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌, రంగాల వారీ వ్యూహంతో పనిచేస్తున్నాం. అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్‌ వ్యవసాయం, డ్రోన్లు, యాంత్రీకరణ, మార్కెట్‌ లింకేజీలు, ఈ-ట్రేడింగ్‌ బలోపేతం, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీ.. లాజిస్టిక్‌ వ్యవస్థలు, సహకార సంస్థలు, వ్యవసాయ స్టార్టప్‌ల బలోపేతం, రైతు భరోసా, పంటలబీమా, వ్యవసాయ యంత్రాలకు రాయితీ, ఆహార శుద్ధి జోన్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం. ఇవి రైతుల ఆదాయాలను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయి. పొలం నుంచి మార్కెట్‌ వరకు మార్కెట్‌ ఆధారిత గొలుసు వ్యవస్థలను నిర్మించడం, గిట్టుబాటు ధరలను నిర్ధారించడం, వృథాను తగ్గించడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం’ అని తెలిపారు. చర్చలో భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు సలహాదారు శ్రీనివాసన్‌, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత మోదడుగు విజయ్‌ గుప్తా, కోసాంబ్‌ ఎండీ జె.ఎస్‌. యాదవ్‌, ఆదిత్య బిర్లా గ్లోబల్‌ ట్రేడింగ్‌ ఎండీ, సీఈవో రాజేష్‌ సోమాని, వ్యవసాయ పరిశోధన సంస్థ మాజీ అధిపతి డాక్టర్‌ సమరేందు మహంతి, మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్‌ అధ్యకక్షుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఐఐఎంఆర్‌ ప్రోత్సాహకంతో వివిధ రాష్ట్రాలలో చిరుధాన్యాల సాగు

చిరుధాన్యాల సాగు విస్తరణకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌) వివిధ రాష్ట్రాల్లో ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఆర్థిక తోడ్పాటుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుంటున్న ఎఫ్‌పివోలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని ఐఐఎంఆర్‌ శాస్త్రవేత్తలు సంకల్పించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం రాజుపాకలు కేంద్రంగా చిరుధాన్యాల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై పనిచేస్తున్న లంబసింగి ట్రైబల్‌ ప్రొడక్ట్స్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌కు తోడ్పాటును అందించేందుకు ముందుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో లంబసింగి ఎఫ్‌పిఓసభ్యులు పండిస్తున్న చిరుధాన్యాలతోపాటు వాటితో తయారుచేసిన విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా సంచార విక్రయశాలను ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తారా సత్యవతి ప్రారంభించారు

Read More

తేనెటీగల విషంలో ఔషధ గుణాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలోని సమీకృత తేనెటీగల పెంపక కేంద్రంలో తేనెటీగల నుంచి విషాన్ని సేకరిస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్‌ కలిగిన బీ వీనం కలెక్టర్‌ (బీవీసీ) అనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని తేనెటీగల పెట్టె ప్రవేశద్వారం చెంత అమర్చారు. పెట్టె వద్ద తేనెటీగలు రాకపోకలు సాగించేటప్పుడు అవి బీవీసీ కంపార్టుమెంట్‌పై వాలగానే ఎలక్ట్రిక్‌ వైబ్రేషన్‌కు గురై వాటికున్న స్టింగ్‌ల ద్వారా విషపూరిత స్రావాన్ని విడుదల చేస్తున్నాయి. ఆ స్రావాలు కంపార్టుమెంటులోని అద్దంపై మైనంలా ఏర్పడుతున్నాయి. వాటిని సేకరించి గాజుసీసాలో భద్రపరుస్తున్నారు. తేనెటీగలు కుట్టినప్పుడు విడుదల చేసే విషపూరిత స్రావాల్లో వివిధ రసాయనాలుంటాయని, వీటిని చర్మ సమస్యలు, అర్ధరైటిస్‌ వంటి చికిత్సల్లో ఉపయోగిస్తారని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. ఒక గ్రాము విషాన్ని సేకరించడానికి సుమారుగా 10 వేల నుంచి 15 వేల తేనెటీగలను పరికరంలోకి పంపాల్సి ఉంటుందని చెప్పారు.

Read More

వ్యాధిని బట్టి వెల్లుల్లి రకం

ప్రకృతి ప్రసాదించిన వెల్లుల్లిలోని ఎలిసిన్‌… అంటువ్యాధులు, శ్వాసకోశ రుగ్మతలపై పనిచేస్తుంది. గంధక ధాతువులు.. అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. సెలీనియం క్యాన్సర్‌ కణాలవ్యాప్తిని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్లు గుండె ధమనులను కాపాడతాయి. యాంటీఆక్సిడెంట్లు మధుమేహం, వృధ్ధాప్యం మీద పనిచేస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. వెల్లుల్లిపై సరికొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. వెల్లుల్లికి ఉన్న ఈ సహజ రోగ నిరోధక లక్షణాలను నానో టెక్నాలజీతో మరింత ఇనుమడింపజేయవచ్చని అలహాబాద్‌ విశ్వవిద్యాలయ ఆచార్యుడు కె.ఎన్‌. ఉత్తమ్‌ నిర్ధారించారు. ఆయన ఆధ్వర్యంలో పరిశోధకులు వెల్లుల్లి మొక్కపై టైటానియం డయాక్సైడ్‌ నానో పార్టికిల్స్‌ను ప్రయోగించారు. ఈ నానో అణువులు వెల్లుల్లిలోని పోషక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. ఫలితంగా వెల్లుల్లిలో గంధకం, భాస్వరం, క్యాల్షియం, జింక్‌, ఇనుము ధాతువులు సాధారణం కన్నా ఎక్కువగా ఏర్పడ్డాయి. యాంటీ ఆక్సిడెంట్లు 30 నుంచి 40 శాతం పెరిగాయి. వెల్లుల్లిలోని ఏ ధాతువు ఏ వ్యాధి చికిత్సకు తోడ్పడుతుందో నిర్ధారించుకుని ఆయా రోగాల చికిత్సకు పరిశోధనశాలలో వేర్వేరు వెల్లుల్లి రకాలను రూపొందించి పొలాల్లో సాగు చేయించాలని ఉత్తమ్‌ బృందం యోచిస్తోంది. ఇలాంటి రకాలకు పేటెంట్లు తీసుకుని రెండేళ్లలో రైతులకు అందించాలనుకుంటున్నమని ఉత్తమ్‌ చెప్పారు.

Read More

తెలంగాణలో వ్యవసాయరంగానికి ఉజ్జ్వల భవిష్యత్తు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం అని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుమారు 200 బిలియన్ డాలర్ల వద్ద ఉందని, వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 15 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే మహాదృక్పథానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల సమ్మిట్లో ప్రదర్శించాల్సిన ఏవీల కంటెంట్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి సామర్థ్యాలు, విదేశీ పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్ విజన్ స్పష్టంగా ప్రతిబంబించేలా ఏవీలను రూపొందించాలన్నారు. వ్యవసాయ రంగమే రాష్ట్ర ఆర్థిక లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ జనాభాలో 66 శాతం మందికి ఉపాధి అందించే వ్యవసాయం రాష్ట్ర జిఎస్ఏలో 17 శాతం వరకు వాటా కలిగి ఉందని, అందువల్ల తెలంగాణ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉంటుందని పేర్కొన్నారు. రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు ఇవన్నీ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలు అని మంత్రి అధికారులకు వివరించారు. ఐఓటి ఆధారిత సూక్ష్మ నీటిపారుదల, నేల ఆరోగ్య నిర్వహణ, అగ్రిటెక్ పరిశోధన, టిఏఆర్ సిసి, గ్లోబల్ సీడ్ లీడర్ షిప్, హార్టీకల్చర్ మెగా క్లస్టర్లు, ఆయిల్ష్పామ్ విస్తరణ, ఫామ్ టూరిజం, ఎఫ్పిఓలను ఫుడ్ డెలివరీ కంపెనీలతో అనుసంధానం చేయడం, పాలు, మాంసం, మత్స్య రంగాల పెంపు, అధునాతన అగ్రిలాజిస్టిక్స్ వంటి కార్యక్రమాలు తెలంగాణ వ్యవసాయాన్ని గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఇవి రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచడమే కాకుండా, వేల కోట్ల రూపాయల విలువైన అగ్రి-ఎగుమతులకు మార్గం సుగమం చేయనున్నాయని, విజన్ 2047 డాక్యుమెంట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి ఒక దిశ నిర్దేశిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అని, రైతు భరోసా, రుణమాఫీ, పంట నష్టపరిహారం, రైతు బీమా వంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవనోపాధిని మెరుగపరచడంతో పాటు భవిష్యత్ వృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు. ఇకపై సాంకేతిక-ఆధారిత, డేటా-ఆధారిత, మార్కెట్-ఆధారిత వ్యవసాయ మోడల్ ద్వారా రైతులను మరింత సాధికారులను చేయడం ప్రభుత్వం యొక్క సంకల్పమని స్పష్టం చేశారు.”వ్యవసాయ రంగం బలపడితేనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు శ్రమే రాష్ట్ర అభివృద్ధికి మూలం. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ, వ్యవసాయం-సాంకేతికత-పెట్టుబడుల నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి జానయ్య, హార్టీకల్చర్ యూనివర్సిటి విసి రాజిరెట్టి, మార్కెఫెడ్ ఎండి శ్రీనివాస రెడ్డి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి మరియు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Read More

కోతుల బెడద నివారణకు నోడల్ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కోతుల బెడదతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి లోకసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ సమస్యను అటవీశాఖ దృష్టికి తీసుకెళ్తే మాకేమీ సంబంధంలేదంటున్నారు. అలాగే పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలు కూడా నోడలు ఏజెన్సీలుగా వ్యవహరించడంలేదు. కేంద్రం తక్షణం స్పందించి కోతులు, జింకల నివారణ కోసం ఒక ప్రత్యేక నోడల్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.

Read More

ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హాస్టళ్లు

యానిమల్ హాస్టల్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. స్థలం.. సమయం లేని వారి పశువులను ఈ హాస్టళ్లల్లో పెట్టి ఆలనాపాలన వారే చూసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రాథమికంగా రాష్ట్రంలో నియోజకవర్గానికో హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక్కో హాస్టల్ అరెకరం స్థలంలో ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఇందులో 20-25 పశువులు పట్టేలా నిర్మాణం చేపడతారు. మిగిలిన స్థలంలో గడ్డి అభివృద్ధి చేస్తారు. నిర్మాణానికి రూ. 10లక్షల నిధులు ఉపాధిహామీ నుంచి విడుదల చేస్తారు. ఇవన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. కొద్ది రోజులు నిర్వహించిన తర్వాత పాడి రైతులంతా సంఘాలుగా ఏర్పడి ఇలాంటి హాస్టళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సొంత స్థలం ఉంటే సరే లేదంటే ప్రభుత్వమే స్థలం సమకూరుస్తుంది. షెడ్డు నిర్మాణానికి సైతంఉపాధి హామీ నుంచి నిధులు సమకూర్చేలా అధికారులు సమాలోచన చేస్తున్నారు. గ్రామాల్లో ఆసక్తి ఉన్నవారు తమ పశువులను అక్కడికి తరలిస్తే వాటికి దాణా, గడ్డి, నీరు అన్నీ నిర్వాహకులు చూసుకుంటారు. ఉదయం సాయంత్రం వెళితే యజమానుల ముందే పాలు పితికి అప్పగిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహణక అయ్యే ఖర్చు యజమానులు చెల్లించాల్సి ఉంటుంది.

Read More

ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించండి

ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, రసాయన వ్యవసాయాన్ని క్రమంగా వీడి ప్రకృతి సేద్యానికి మళ్లాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక సీజన్‌కు ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని సామాజిక మాధ్యమం ‘లింక్డిన్‌’లో బుధవారం పెట్టిన పోస్టు ద్వారా వివరించారు. గత నెలలో కోయంబత్తూరులో నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రకృతి సేద్యం సదస్సు-2025’కు రైతులు ఆహ్వానించగా వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయపరిచాయని పేర్కొన్నారు. వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు, విద్యాధికులు, వృత్తి నిపుణులు, కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలి వచ్చిన వ్యక్తులు కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారని తన దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం తదితరాలను చేపట్టి విజయపథంలో కొనసాగుతున్నారని తెలిపారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలనూ ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకుంటున్నారని తెలిపారు.

Read More