నిన్న ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్జోషీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ 'ఈ ఏడాది రాష్ట్రంలో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించగా, ఇప్పటికే 17.30 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. 2.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,120 కోట్లు జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 16 వేల మంది సిబ్బంది, 32 వేల వాహనాలు పని చేస్తున్నాయి. 7.85 కోట్ల గోనె సంచులు అందించామ'ని మంత్రి మనోహర్ తెలిపారు. 'రాష్ట్రంలో ఎఫ్సీఐకి ప్రస్తుతం 7.85 కోట్ల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా, మరో 3.87 కోట్ల టన్నుల మేర పెంచేందుకు కేంద్ర మంత్రి జోషీ అంగీకరించారు. ఇందుకోసం పీపీపీ విధానంలో స్టీల్ సైలోస్లు ఏర్పాటు చేస్తాం. వడ్లు అధికంగా పండించే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీటిని నిర్మిస్తాం. తద్వారా ధాన్యం నిల్వనష్టాలు తగ్గి, గింజ నాణ్యత పెరుగుతుంది' అని వివరించారు.

9 Dec, 2025
