సాగు పరికరాలు అద్దెకు

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గేలా సాగుకు అవసరమైన పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. డ్వాక్రా మహిళా రైతులతో (వారి కుటుంబ సభ్యులు)కూడిన ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఉండగా వాటి పరిధిలో తొలి విడతగా 300 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

60 కోట్లు కేటాయింపు
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద సీహెచ్‌సీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. సీహెచ్‌సీల ఏర్పాటుకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలే అందుబాటులో ఉంచుతారు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎఫ్‌పీవో పరిధిలో 1500 నుంచి 2 వేల మంది సన్నచిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇవి మండలానికి ఒకటి చొప్పున ఉన్నాయి. రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలను కొని సీహెచ్‌సీల్లో ఉంచుతారు. రైతులకు ఈ పరికరాలను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అద్దెకిస్తారు. సీహెచ్‌సీల నిర్వహణను ఎఫ్‌పీవోనే చూస్తుంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాటి నిర్వహణకే వెచ్చిస్తారు.

Read More

వ్యవసాయ యంత్రపరికరాలపై 50% సబ్సిడీ

గతంలో ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.101.83 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. సన్నకారు, చిన్న, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించనున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ (సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌-స్మామ్‌) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులకు తమ వాటా కలిపి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం సన్నద్ధమైంది.

మార్గదర్శకాలు…
పేరొందిన 16 కంపెనీలను గుర్తించి ఎంప్యానెల్‌లో చేర్చింది. వాటి నుంచి రైతులు స్వయంగా పరికరాలను కొనుగోలు చేయాలి. సబ్సిడీని కంపెనీలకు అందజేస్తారు. పంపిణీ చేసిన పరికరాల వినియోగాన్ని వ్యవసాయాధికారులు ఐదేళ్లపాటు పర్యవేక్షించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.లక్ష కంటే ఎక్కువ సబ్సిడీ పొందిన వారు ఆరేళ్లవరకు, రూ.3 వేల నుంచి రూ.లక్ష వరకు పొందిన వారు మూడేళ్ల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించింది. రూ. లక్ష, అంత కంటే ఎక్కువ విలువైన యంత్రాలకు జియో ట్యాగింగ్‌ చేస్తారు. ట్రాక్టర్లు, ఇతర స్వయం చాలిత యంత్రాలకు ఏఐ-ఆధారిత టెలిమాటిక్స్‌ కిట్‌ అమరుస్తారు. దీంతో యంత్రం ఎక్కడ ఉందో, ఎంత పని చేసిందో ట్రాక్‌ చేయవచ్చు. యంత్రాలపై చెరిపివేసే వీలు లేకుండా లేజర్‌ కట్‌తో గుర్తింపు సంఖ్య ఉంటుంది.

సబ్సిడీపై అందుబాటులో ఉండే యంత్రాలు…
విత్తనాలు చల్లే యంత్రాలు, కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రొటోవేటర్లు, ప్లౌ, ట్రాలీ, సీడర్‌, కలుపు తీసే యంత్రాలు, పవర్‌ టిల్లర్లు, వీడర్లు, సీడ్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ డ్రిల్‌, స్ట్రాబాలర్లు, బండ్‌ ఫార్మర్‌ వంటి 15 రకాల యంత్రాలకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని పంపిణీ ప్రారంభించనుంది. ఈ పరికరాలతో పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ పనుల్లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

Read More

మూడు ఎకరాలకు 391 టన్నుల చెరకు దిగుబడి

కర్ణాటకలోని బెళగావి జిల్లా కల్లోళి గ్రామానికి చెందిన 72 ఏండ్ల అభ్యుదయ రైతు బాళప్ప బసప్ప బెళకోడ మూడెకరాల్లో పండిన మొత్తం 391 టన్నుల చెరకును మిల్లుకు తరలించి రూ.12,90,300 బిల్లును పొందారు. ‘సీఓ 86032’ రకం చెరకును నాటుకున్నారు. ‘నాటే ముందు మట్టి పరీక్షలు చేయించా. ఫలితాల ఆధారంగా భూమికి అవసరమైన పోషకాల కోసం సేంద్రియ, పరిమితంగా రసాయనిక ఎరువులను డ్రిప్‌ ద్వారా తోటకు అందించా. ఎకరానికి రూ.65 వేల చొప్పున ఖర్చు వచ్చింది. చెరకు ఎదిగే వరకూ అంతర పంటలుగా మినుము, శనగ, టమాటా, ఉల్లి పండించా. వాటి ఫలసాయం అందాక ఆ మొక్కలను తోటలోనే తొక్కి, ఎరువుగా మార్చా. జీవామృతం, సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టును స్వయంగా చేసుకుంటున్నా. సాగు విధానాలు తెలుసుకునేందుకు చైనా, ఇజ్రాయెల్‌, జపాన్‌లకు వెళ్లి వచ్చా. ఎకరానికి 200 టన్నుల దిగుబడి సాధించే దిశగా ఈసారి ఐదెకరాల్లో చెరకు సాగు చేయాలనుకుంటున్నా’ అని బాళప్ప వివరించారు.

Read More

విష పురుగులను పారదోలే ప్రత్యేక కర్ర!

రైతులకు పాముకాట్లు, తేలుకాట్ల బెడద ఎక్కువ. గుజరాత్‌లోని సర్‌ భావసింహ్‌ాజీ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి క్రిష్‌ దోడియా, అతడి మిత్రుడు కలిసి ఈ విషపురుగులను పారదోలే ప్రత్యేక కర్రను రూపొందించారు. ఈ కర్ర మూడున్నర మీటర్ల పీవీసీ పైపులో మూడున్నర మీటర్ల వైరు, ఒక స్ప్రింగు, ఒక డీసీ మోటార్‌, రెండు లిథియం బ్యాటరీలు, ఒక బ్యాటరీ కేస్‌, టీ జాయింట్‌, ఒక క్యాప్‌తో రూపొందింది. దీన్ని నేలకు తాకిస్తే ప్రకంపనలు వచ్చి పాములు, తేళ్లను పారదోలతాయి. ఈ కర్ర తయారీకి అయిన ఖర్చు కేవలం రూ.410. దీనికి ఎల్‌ఈడీ బల్బులు అమర్చవచ్చు. రైతు పాముకాటుకు గురైతే పక్కవారిని హెచ్చరించడానికి బజర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కర్రకు ప్రాథమిక చికిత్స సాధనాలతో చిన్న సంచిని అమర్చవచ్చు. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపల పాము, తేలు విషం వ్యాప్తిని నిదానింపజేసే మాత్రలనూ ఆ సంచిలో అందించవచ్చు.

Read More

9 రకాల చిరుధాన్యాలతో 190 రకాల ఉత్పత్తులు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ మిల్లెట్స్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం (సీఓఈఎం) చిరుధాన్యాలను ‘రెడీ టూ ఈట్‌’లా సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ సంస్థ.. ఔత్సాహికులకు ఆయా సాంకేతికతలను అందిస్తోంది. మైసూరులోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఎఐ) లో గతేడాది డిసెంబరులో సీఓఈఎం ఏర్పాటైంది. ఏడాది పూర్తి చేసుకోబోతున్న ఈ కేంద్రం.. చిరుధాన్యాలలో సాధించిన ఘన ఆవిష్కరణలు…

గంటకు 500 కిలోల సామర్థ్యం
చిరుధాన్యాల ఉత్పత్తిలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. రైతులు మాత్రం అవగాహన లేక నష్టపోతున్నారు. సీఓఈఎం ముందుగా రైతు నుంచి కార్యాచరణ మొదలుపెట్టింది. రూ.20 కోట్లతో 3 రకాల ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని నేరుగా ఈ కేంద్రాలకు తరలించేలా అవగాహన కల్పించింది. ధాన్యం నాణ్యత, శుద్ధి, అనుబంధ ఉత్పత్తుల తయారీ రైతుల కళ్లముందే చేపడుతోంది. ప్రత్యేక ప్రాసెసింగ్‌ యంత్రాలతో గంటకు 500 కిలోల ధాన్యం శుద్ధి చేసి, ఉత్పత్తులనూ తయారు చేయడంతో రైతులకు కేంద్రంపై గురి కుదిరింది.

మెక్‌ డొనాల్డ్‌ మెచ్చింది
సీఓఈఎంలో జొన్న, రాగి, సజ్జ తదితర ధాన్యాలతో చేసిన బన్‌.. మెక్‌డొనాల్డ్‌ సంస్థకు ఎంతో నచ్చింది. దాన్ని ‘మిల్లెట్‌ బన్‌ బర్గర్‌’గా మార్చి ప్రపంచ విపణికి పరిచయం చేసింది.

వివిధ రకాల ఉత్పత్తులు
చిరుధాన్యాలు శుద్ధి చేసేటప్పుడు వచ్చే వ్యర్థాలనూ ఈ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో వృథాగా పోనివ్వడం లేదు. రాగి పొట్టు నుంచి అయిల్‌, విరిగిన రాగులతో సేలాలు, పగుళ్లిచ్చిన గింజలతో ‘రాగి రైస్‌’, నూకతో రవ్వ, మురుకులు ఇలా.. ఒక్క రాగులతోనే 45 రకాల ఉత్పత్తులు చేస్తోంది. వాటికి అదనపు పోషకాలూ జోడిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో 9 రకాల ధాన్యాలను 190 రకాల ఉత్పత్తులుగా మలిచే వ్యవస్థలున్నాయి. బయో డిగ్రేడబుల్‌, తినదగిన ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు తయారు చేస్తోంది. వినియోగదారుడు కోరుకున్న రంగులు, రుచులను చేర్చేందుకు ఎలక్ట్రానిక్స్‌ నోస్‌, మౌత్‌ అప్లికేషన్లు, ప్యాకేజింగ్‌ వ్యవస్థలూ తీసుకొచ్చింది.

నిల్వకు పెద్దపీట..

  • చిరు ధాన్యాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. వాటి పిండి, రవ్వ ఇతర ఉత్పత్తుల నిల్వ కాలం తక్కువ.
  • సీఓఈఎం ప్రత్యేక పద్ధతుల్లో 4-5 నెలలపాటు నిల్వ చేసుకునేలా చేసింది.
  • ఇందుకు తొలుత వైబ్రో క్లీనర్ల ద్వారా ధాన్యం శుభ్రం చేసి, స్టీమింగ్‌ ట్యాంకర్లు, డ్రైయర్‌ బెడ్ల ద్వారా ఆరబెట్టి ఎప్పుడంటే అప్పుడు వాడుకు నేలా పాలిష్‌ చేస్తోంది.
  • ఆ తర్వాత వినియోగదారుడికి అవసరమైన ఉత్పత్తులుగా మార్చుతోంది.
  • ధాన్యం నిల్వకూ ఈ కేంద్రంలోనే గోదాములు ఏర్పాటు చేసింది.
Read More

ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం

కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 3 ఎకరాల్లో ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ), ఐదు ఎకరాల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు రైతు ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కొబ్బరి పరిశ్రమ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల కోసం రాజోలు నియోజకవర్గంలోని తూర్పుపాలెం, అమలాపురం నియోజక వర్గంలోని మామిడికుదురు మండలంలో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కొబ్బరికాయల తొక్క వొలిచి, ఎండు కొబ్బరికాయలను తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పంపుతున్నారు. కోనసీమలో కొబ్బరి ప్రాసెసింగ్‌ పరిశ్రమలు లేకపోవడమే కారణం. దీనిపై అధ్యయనం చేసి జిల్లా స్థాయిలో చర్యలు చేపట్టాలి. నిల్వ సౌకర్యాలు, పరీక్షా కేంద్రానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు 10 ఎకరాలు కేటాయించే అవకాశముంది. ఉభయ గోదావరి జిల్లాలకు ఇది ఎంతో ఉపయోగం’ అని మంత్రి పేర్కొన్నారు.

Read More

తెలంగాణాలో ‘సహకార’ రైస్‌ మిల్లు, గోదాం నిర్మాణం

రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం, బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు కల్పించడం, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రికల్చర్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌- ఏఐఎఫ్‌) పథకం ముఖ్య ఉద్దేశాలు. దీని కింద తెలంగాణాలో తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లో రూ.3.38 కోట్లతో నాలుగు టన్నుల రా రైస్‌ మిల్లు, 500 టన్నుల సామర్థ్యమున్న గోదాం నిర్మించారు. 3,993 మంది సభ్యులున్న ఈ సంఘం సుమారు రూ.36 లక్షల లాభంలో నడుస్తోంది. రా రైస్‌ మిల్లు, గోదాం నిర్మాణానికయ్యే వ్యయంలో రూ.67.72 లక్షలను ఏఐఎఫ్‌ పథకాన్ని అమలుకు చేసే నాబార్డుకు సంఘం చెల్లించింది. రూ.2.70 కోట్లను కేంద్రం రుణంగా అందజేసింది. గంభీరావుపేట మండలం గోరింటాలలో రా రైస్‌ మిల్లు, గోదాము నిర్మాణానికి ఎకరా ప్రభుత్వ స్థలం కేటాయించారు. ఇటీవలే నిర్మాణం పూర్తయింది. రైస్‌ మిల్లు నిర్వహణ అనుభవం కోసం సమీపంలోని మరో రైస్‌ మిల్లుకు కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యం మిల్లింగ్‌ చేస్తున్నారు. వచ్చే సీజన్‌ నుంచి సంఘం ఆధ్వర్యంలో సన్న ధాన్యం సేకరించి… మిల్లింగ్‌, మార్కెటింగ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్కెటింగ్‌కు అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బియ్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంఘం పురోభివృద్ధికే వినియోగించనున్నారు. మిల్లు నిర్వహణతో సుమారు 20 మంది ఉపాధి పొందుతారు.

Read More

నల్లబర్లీ సాగును అరికట్టాలి

వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

నల్లబర్లీ పొగాకు సాగును అరికట్టాలని, తెల్లబర్లీ పొగాకును సాగు చేసే రైతులు సంబంధిత కంపెనీలతో 100% కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సూచించారు. బర్లీ పొగాకు సాగుపై గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… తెల్లబర్లీ పొగాకు కొనుగోలుకు ఇకపై ప్రభుత్వం ఎలాంటి బాధ్యతా వహించదని, అనధికార నల్లబర్లీ పొగాకు సాగు కట్టడి చేయడంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాల్ని చైతన్యం చేయాలని సూచించారు. గత ఏడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్రంలోనే మొదటిసారి 11,990 మంది రైతుల నుంచి 19.79 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు చేశామని, రూ.146 కోట్లు విడుదల చేశామని వివరించారు. తెల్లబర్లీ పొగాకు సాగుదారుల జాబితాతోపాటు కొనుగోలు ఒప్పందాల వివరాల్ని జత చేసి ఇవ్వాలని డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీని ఆదేశించారు.

Read More

కూరగాయల సాగులో కేరళ విధానం అమలు చేయాలి: కోదండరెడ్డి

కూరగాయల సాగు, మార్కెటింగ్‌లో కేరళ విధానం ఆదర్శంగా ఉందని, దానిని తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి సూచించారు. కూరగాయల సాగుపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ”రాష్ట్రంలో కూరగాయలు సాగు చేసే రైతులు అమ్ముకోడానికి ఇబ్బంది పడుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో నిత్యం కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల కేరళలో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేశాం. ఆ మాదిరిగానే రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాలి. మధ్య దళారీ వ్యవస్థను నివారించాలి. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి. దీనిపై నెలరోజుల్లో నిర్దిష్టమైన ఆలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం’ అని కోదండరెడ్డి పేర్కొన్నారు.

Read More

రైతులకు మేలు జరిగేలా అగ్రిటెక్‌ విధానాలు

ప్రాంతాలవారీగా పంటల సాగుకు అనుగుణంగా రైతులకు మేలు జరిగేలా అగ్రిటెక్‌ విధానాల్ని అనుసరిస్తున్నామని, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 7,500 హెక్టార్లలో ఆటోమేషన్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ తెలిపారు. రాయలసీమలో ఎక్కువగా వినియోగించనున్నట్లు వెల్లడించారు. సంప్రదాయ డ్రిప్‌ విధానానికి ఆటోమేషన్‌ను జత చేస్తే పంట ఉత్పత్తి వృద్ధితో ఆదాయం పెరుగుతుందని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో అగ్రిటెక్‌పై వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫీసియో కార్యదర్శి రాజశేఖర్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 'మార్చి 2026 నాటికి 25 లక్షలమంది అగ్రిటెక్‌ ప్లాట్‌ఫారం అనుసంధానమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వ్యవసాయంలో ఏఐ వినియోగానికి సంబంధించి నీతి ఆయోగ్‌ సూచించిన 28 అంశాలకుగాను 18 అంశాల్లో ఇప్పటికే అమలు చేసి దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపాం. ఎరువులు, పురుగు మందుల వాడకం, విత్తనాలు చల్లడంలోనూ డ్రోన్లను వినియోగిస్తున్నాం. దీని వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. 2024-25 ఏడాదిలో 68 వేల హెక్టార్లు పురుగు మందుల పిచికారి చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 61 వేల హెక్టార్లలో పిచికారి జరిగింది' అని వివరించారు.. డ్రోన్‌ దీదీ, కిసాన్‌ డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక యాప్‌ను తయారు చేసి డ్రోన్‌ యజమానులు, రైతుల్ని ఒకే ప్లాట్‌ఫాం పైకి తీసుకొస్తున్నాం.. పురుగుల మందు వాడకం సాగు మొత్తం కాకుండా ఏ మొక్కకు అవసరమో దాన్ని గుర్తించి పిచికారి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా డ్రోన్‌ వినియోగ ఖర్చు కూడా తగ్గుతుంది. పరిమాణం చిన్నదిగా ఉండి తక్కువ సమయంలోనే ఛార్జీ అయ్యే, ఎక్కువ బరువు తీసుకెళ్లగలిగే డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఉద్యాన పంటల సాగులో రాయలసీమ గ్లోబల్‌ హబ్‌ మార్చేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఆహారశుద్ధి రంగంలో వాల్యూ చైన్‌ను విశ్లేషిస్తే రా మెటీరియల్‌ ఉత్పత్తి చేసే రైతులతో పోలిస్తే మిగతా ఎక్కువ ఆదాయం ఉంది. ఎఫ్‌పీవోలు, ఎంఎస్‌ఎంఈల ద్వారా వీరికి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఎక్స్‌పోర్ట్‌ ఓరియెంటెడ్‌ అగ్రి బిజినెస్‌ మోడల్స్‌, స్మార్ట్‌ ఫార్మింగ్‌ టెక్నాలజీస్‌ను అమలు చేస్తున్నామని అన్నారు.

Read More