తేనె : మొక్కల యొక్క “మకరంద గ్రంధుల” (నెక్టరీస్) ద్వారా స్రవించు మకరందం (నెక్టార్) అను తియ్యని ద్రవముతో తేనె ఉత్పత్తి అవుతుంది. తేనెపట్టులోని కూలి ఈగలు మకరందమును సేకరించుకుని తమ తేనెపొట్టలో (honey stomach) ఉంచుకునిపట్టుకువస్తాయి. పొలం నుండి ఈ కూలిఈగలు తీసుకువచ్చిన ఈ మకరందాన్ని పట్టులోని ఈగలు గదులలోకి చేర్చుతాయి. ఈ అపరిపక్వ తేనెను తేనెటీగల పొట్టలోని “ఇన్వర్టేజ్” అను ఎంజైమ్ కలుపుట ద్వారా అందులోని సంక్లిష్ట చక్కెరలు సాధారణ చక్కెరలుగా మార్చబడి పరిపక్వ తేనెగా రూపొంది పట్టులోని గదులలో నిల్వచేయబడుతుంది. ఈ ప్రక్రియలో అందులోని తేమ కూడా తగ్గించబడుతుంది.

తేనె- ఉపయోగములు
- తేనెలో ఔషధ నాణ్యత, రుచి, వన్నె, రంగు మరియు సువాసన తేనె లభించిన భౌగోళిక ప్రాంతము మరియు సేకరించిన తేనెటీగల జాతిని బట్టి, ఏ రకమైన మొక్కల నుండి సేకరించినవో, దానిని బట్టి తేనెలోవ్యత్యాసముంటుంది.
- మన జీర్ణ వ్యవస్థ త్వరగా తేనెలోని చక్కెరలను పీల్చుకొనుటను బట్టి త్వరగా శరీరానికి శక్తిని సమకూర్చును కాబట్టి త్వరిత గతిన శక్తినిచ్చే పదార్ధముగా తేనెను వాడవచ్చును.
- తేనె ప్రకృతి సిద్ధమైన భద్రపరిచే గుణము మరియు తీపి నిచ్చే పదార్ధములు కల్గియున్నది.
- తేనె-శిలింద్ర మరియు బాక్టీరియానాశిని గాను, చర్మం నుండి మలినములను బయటకు పంపి వాపును తగ్గించి, కందిపోయిన చర్మాన్నిపగలకుండా నిరోధిస్తుంది.
- తేనె వాపును తగ్గించే లక్షణాన్ని బట్టి శరీరంలోని వాపును, మచ్చలను నిరోధించి అదనపు గాయాలు ఏర్పడకుండా కాపాడుతుంది.
- ఆరోగ్యకరమైన కణజాల వృద్ధికి తోడ్పడుతుంది.
- తేనె మంచి యాంటి ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను మరియు కేన్సర్ ను నిరోధిస్తుంది.
- కణుతులు ఏర్పడకుండా చేయు గుణము తేనెలో ఉన్నది.
- అల్సర్లను స్వస్థపరచుటలో చాలా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల ఆస్త్మాను, దగ్గును, వికారమును, వాంతులను బాగుచేస్తుంది.
- మూత్రపిండాల ఇన్ఫెక్షన్ ను తేనె సాధారణస్థాయికి తీసుకొనివచ్చును. మూత్రనాళ రుగ్మతలను తగ్గించుటలో ఉపయెగపడుతుంది.
- విరేచనకారిగా పనిచేస్తుంది మరియు పక్కతడుపు రుగ్మతలను తొలగించుటలో చాలా వుపయోగపడుతుంది.
- తేనె- చిగుళ్లను ఆరోగ్యoగా వుంచి రక్త ప్రసరణను బాగా జరుగునట్లు చేయును. ఆకలిని పుట్టిస్తుంది.
- అధిక మధ్యపాన సేవన ద్వారా పాడైన కాలేయాన్ని పునరుద్ధరించి కాపాడుతుంది.
- రక్తాన్నిశుద్ధి చేసి హిమోగ్లోబిన్లను మరియు ఎర్ర రక్త కణాల సమతుల్యస్థితి ని కాపాడుతుంది.
- కీటకముల కాట్లు మరియు విషపూరిత మైన మొక్కల విషాన్ని హరించి దురదను ఆపుచేస్తుంది.
- కొవ్వును తగ్గించుటలోను, జీర్ణకోశాన్నిశుభ్రపరచుటలోను సహాయపడుతుంది.
- గుండె కండరాలను బలపరచి వాటి పనితనాన్నివృద్ధిచేస్తుంది.
- సిద్ధమైన విరేచనాకారిగా పనిచేసి మలబద్దకాన్ని,విరేచనాలను మరియు నీళ్ళ విరేచనాల్నితగ్గిస్తుంది.
- ఆస్త్మామరియు క్షయ రోగులకు ఉపశమనం కలిగించి మానసిక పని ఎక్కువగా చేయు వారికి లాభకరంగా ఉంటుంది.
- విష పూరిత ఆహారాలు ప్రేవులలో పేరుకొనిపోకుండా ఆపి ప్రేవుల పనితనాన్ని, శక్తిని, బలాన్నిసాధరణ పనితనాన్ని పెంచుతుంది.
- క్రీడాకారులకు అలసటను తగ్గించి లాభదాయకంగా ఉంటుంది.
- రోగ నిరోధక శక్తిని పెంచి శరీర చురుకుదనాన్ని అధికం చేస్తుంది.
- ఒత్తిడి మరియు నిస్సత్తువ కు ఖచ్చితమైన విరుగుడు తేనె మాత్రమే.

తేనెతో కొన్నిగృహచిట్కాలు
- క్యారెట్ ర సానికి 2 చెంచాల తేనెను కలిపి ఉదయ కాలపు అల్పాహారానికి ముందుగా రోజూ తీసుకున్నట్లయితే కను దృష్టిని వృద్ధి చేయుటలో సహాయపడుతుంది. ఎక్కువ సమయాన్ని కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- జింజివైటిస్ అనే చిగుళ్ళ వ్యాధితో బాధపడువారికి తేనె కలిపిన నీళ్లతో పుక్కిలించిన యెడల చాలా లాభదాయకంగా ఉంటుంది.
- రెండు టీ చెంచాల తేనెకు అంతే మోతాదులో అల్లం రసం కలిపి సేవించిన యెడల జలుబు, దగ్గు, గుండె పట్టేసి నట్లుగా ఉన్న స్థితిని నివారిస్తుంది. ఈ మిశ్రమం ఊపిరితిత్తులలోని మ్యూకస్ ను బయటకు తెచ్చి జలుబు నుండి, దగ్గు నుండి మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగజేస్తుంది.
- వెక్కిళ్ళ ను ఆపు చేయడానికి ఒక టీ చెంచా తేనెకు అంతే మోతాదులో ఆముదాన్ని ఒక పాత్రలో కలపాలి ఈ మిశ్రమంలోనికి చూపుడు వ్రేలును ముంచి చప్పరించాలి. వెక్కిళ్ళు పూర్తిగా ఆగిపోయే వరకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఈ విధంగా చేయాలి.
- ఒక గ్లాసు గోరు వెచ్చని నీటికి ఒక టీ చెంచా తేనెను మరియు ఒక టీ చెంచా నిమ్మరసాన్ని కలిపి సేవించినట్లయితే కొవ్వును తగ్గించి రక్తాన్నిశుద్ధిచేస్తుంది.
- ప్రతిరోజు ఒక చెంచా తేనెను సేవించి ఆరోగ్యకరమైన జీవితాన్నిగడపవచ్చును.
- చిన్నచిన్నపైనాపిల్ ము క్కలను అర చెంచాడు తేనెలో కలిపి నమిలినట్లయిన సిగరెట్ తాగాలనే ఆలోచన తగ్గుతుంది.
- ఊపిరి సలప నివ్వని దగ్గు మరియు తెమడతో బాధపడుతున్న వారు ఒక చిటికెడు నల్ల మిరియాల పొడిని తేనెను కలిపి భోజనంతరువాత తాగిన యెడల దగ్గు తగ్గుతుంది.
- బేఆకును (Bay Leaf) నూరగా వచ్చిన పొడిని పావుచెంచా అజువాన్ విత్తనములను (వాము) మరియు ఒక చెంచా తేనెను కలిపి ప్రతి దినం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనానికి ముందు తీసుకొన్న యెడల పొట్టలో వచ్చే నొప్పి నుండి నివారణ పొందవచ్చును.
- క్రమం తప్పకుండా ప్రతిరోజు కండ్లను బయట మరియు లోపల తేనెను వేసికొన్నయెడల ప్రారంభదశలో ఉన్న గ్లుకోమావ్యాధిని నివారించవచ్చు.
- దీర్ఘకాలంగా జ్వరము బాధించేటప్పుడు ఒక చెంచా తులసి ఆకుల కషాయాన్నిఒక కప్పువేడి నీళ్లు పావు టీచెంచా మిరియాల పొడి మరియు ఒకటీ చెంచా తేనెను కలిపి రోజుకు రెండు మూడుసార్లు తీసుకొనవలను.
- ఒక చెంచాడు తేనెకు సగం నిమ్మకాయ నుండి తీసిన రసాన్ని ఒక కప్పు గోరు వెచ్చని నీటికి కలిపి సేవించిన యెడల టానిక్ గా పని చేసి శరీరంలో ని మలినాలు తొలగించబడతాయి.
- శరీరంలో ని శక్తి కోల్పోకుండా బరువును తగ్గించవచ్చును. తేనెను నిమ్మరసాన్ని తీసుకొనిన ఉపవాసంతో ఉన్న వారికి ఉపశమనంలభించును.
- తేనె, లవంగ పోడి లేదా నూనెను ఉపయోగించి పేస్టులాగ ఉపయోగించి పంటి నొప్పిని నివారించవచ్చును.
- రోజూ2,3సార్లు ఈ పేస్టును పంటి నొప్పి లాగే వరకు వ్రాసుకొన్నయెడల ఉపశమనం కలుగుతుంది.
- రెండు గ్రాముల ఉల్లి రసానికి అంతే మోతాదులో తేనెను బాగా కలిపి గాజు కడ్డీతో కళ్ళకు రాసుకొనిన అపరిపక్వ కంటి శుక్లాలను నివారించవచ్చు.
- ఒక గ్లాసు వేడిపాలకు ఒక చెంచా తేనెను కలిపి త్రాగినట్లయితే పొట్టలోని అధిక ఆమ్లాన్ని తటస్థపరచును.
- ఒక మోస్తరు అల్లం తేనీటికి తేనెను కలిపి తీసికొనిన వాంతులకు మరియు వికారమునకు మంచి విరుగుడుగా పనిచేయును.
- కీళ్ళవాతము, కీళ్ళనొప్పులు, అపరిపక్వ ముసలితనము, అధికబరువు, అధిక వేడికలిగిన నిస్సత్తువ, విరిగిపోయేగోళ్లు, నోటి దుర్వాసన అధిక రక్తపోటు మరియు అధిక కొలస్ట్రాల్ మోతాదులకు యాపిల్ రసంతో చేసిన వెనిగర్ తేనె మిశ్రమ చికిత్సకు సమర్ధవంతమైన విరుగుడు.
- 30 మి.లీ కొబ్బరి వెనిగర్ కు అంతే మోతాదులో తేనె 100 మి.లీ నీటికి కలిపి రోజుకు రెండు సార్లు ఇచ్చినట్లయితే కీళ్లకు సంబంధించిన రోగాలు తగ్గించును.
- 15 మి.లీ తేనెను సేవించినట్లయితే మంచి సుఖ నిద్రకు మార్గము.
- 25 గ్రాముల నల్ల మిరియాల పొడి, 5 మి.లి. తేనె మరియు అంతే మోతాదులో అల్లం రసం రోజుకు మూడుసార్లు సేవించినట్లయితే ఆస్త్మాకు విరుగుడుగా పనిచేయును.
- ఒక టీ చెంచా తేనెను అంతే మోతాదు అల్లం రసమునకు కలిపి ప్రతి ఉదయం సాయంత్రం తీసుకొనిన యెడల అధిక రక్తపోటును నివారించవచ్చును.

తేనె- సౌందర్య సాధనము
- తేనెను కొన్ని బాదం పప్పులను మరియు నిమ్మరసాన్ని కలిపి నూరి ఫేషియల్ స్క్రబ్ ఇంటిలోనే తయారుచేసుకొవచ్చు.
- మెరిసే మరియు కాంతి వంతమైన కురులకు ఒక టి చెంచా తేనెను వెంట్రుకలకు పట్టించుకొనవలెను
- పెదవులకు వాడే క్రీము కొరకు బాదంనూనె,తేనెటీగల మైనము మరియు తేనెల మిశ్రమాన్నిమనకు నచ్చిన పాళ్ళల్లో అయింట్మెంట్ గా తయారు చేసికొని క్రీముగా వాడుకొనవచ్చును.
- నాలుగు చెంచాల తేనెను, 3 కోడి గుడ్ల తెల సొన మరియు పిండి కలిపి చేతులకు మరియు శరీరమునకు పట్టించుకొన్న యెడల లోషన్ గా గాని మాయిశ్చరైజర్ గా వాడినట్లయితే పొడి చర్మ ప్రభావాన్నితొలగిస్తుంది.
- తేనె మరియు ఆల్కహాలు మిశ్రమము కేశాల వృద్ధికి తోడ్పడుతుందనే నమ్మకము గలదు.

తేనెను సేవించుటకు ముందుగా తీసికొనవలసిన జాగ్రత్తలు:
- ఆయుర్వేదం ప్రకారం తేనెను ఎప్పుడుపడితే అప్పుడు సేవించరాదు.
- వేడివాతావరణంలో పని చేయుచున్నప్పుడు తేనెను తినరాదు.
- తేనెను ఎన్నడూ వేడిగా ఉన్నమషాలాలతో నిండిన, ఆల్కాహాలుతోగాని, నూనెతో గాని కలుపరాదు. ఎందువలన అనగా ఈ పదార్ధములలో తేనె కలిపినప్పుడు విషప్రభావం ఎక్కువగుతుంది.
- తేనెను అధిక మోతాదులో తిన్నట్లయితే“మధుజీర్ణ” అనే స్థితికి దారితీస్తుంది. (తేనెఅజీర్ణము)
- తేనెను 18 నెలల కన్నా తక్కువ వయస్సు గల బిడ్డలకు ఎన్నడూ తినిపించకూడదు. ఎందుకనగా తేనెలో సహజసిద్ధంగా తేనెటీగలు పుష్పాల నుంచి మకరందరమును సేకరించేటప్పుడు మకరందంతో పాటు కొన్ని బాక్టీరియా బొటులినమ్ (Bacterium botulinum) స్పోరులుంటాయి. ఇవి తేనెలో వుండి ఇన్ఫాంట్ బొటులిజం (Infant botulism) అనే ప్రమాదకరమైన స్థితి చిన్న పిల్లలలో దారి తీయవచ్చును.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి
అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము(ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము), విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము (ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము) విజయరాయి-534475, ఏలూరు జిల్లా.

