జులై 6 ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా….. జూనోటిక్ వ్యాధుల నియంత్రణతో ప్రజారోగ్యానికి భరోసా

ఆధునిక ప్రపంచంలో మానవులు, జంతువులు మరియు పర్యావరణం మధ్య సంబంధాలు మరింత పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, అటవీ ప్రాంతాల తగ్గుదల, వాతావరణ మార్పులు మరియు జంతువులతో సన్నిహిత సంబంధాల కారణంగా జూనోటిక్ వ్యాధుల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది.

జంతువుల నుండి మనుషులకు లేదా మనుషుల నుండి జంతువులకు సహజంగా సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు (Zoonotic Diseases) లేదా సంక్రమిత వ్యాధులు అని అంటారు. “జూనోసిస్” అనే పదం గ్రీకు భాషలోని “Zoon” (జంతువు) మరియు “Nosos” (వ్యాధి) అనే పదాల నుండి వచ్చింది. ఈ వ్యాధులు వైరస్‌, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు మరియు ఇతర సూక్ష్మజీవుల ద్వారా వ్యాపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం మానవుల్లో కనిపించే అంటువ్యాధులలో 60% కంటే ఎక్కువ జంతు మూలం కలిగినవే. కొత్తగా ఉద్భవించే అంటువ్యాధులలో సుమారు 75% జూనోటిక్ వ్యాధులే.

ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 జూలై 6న మొదటిసారిగా రేబీస్ వ్యాధికి వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను విజయవంతంగా ఒక బాలుడికి అందించారు. రేబీస్ సోకిన కుక్క కాటుకు గురైన ఆ బాలుడు ఆ వ్యాక్సిన్ వల్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఈ సంఘటన వైద్య శాస్త్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించడంలో టీకాల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకే ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.

జూనోటిక్ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి?

  1. ప్రత్యక్ష సంపర్కం ద్వారా
    వ్యాధి సోకిన జంతువులను తాకడం, వాటి రక్తం, లాలాజలం, మూత్రం లేదా ఇతర శరీర స్రావాలతో సంపర్కంలోకి రావడం ద్వారా.
    ఉదాహరణ: రేబీస్, ఆంత్రాక్స్.
  2. పరోక్ష సంపర్కం ద్వారా
    జంతువులు ఉపయోగించిన పరికరాలు, షెడ్లు, మేత పాత్రలు లేదా కలుషితమైన పరిసరాల ద్వారా.
  3. ఆహారం ద్వారా
    సరిగా ఉడకని మాంసం, పాశ్చరైజ్ చేయని పాలు లేదా కలుషిత ఆహార పదార్థాల ద్వారా.
    ఉదాహరణ: బ్రూసెల్లోసిస్, సాల్మొనెల్లోసిస్.
  4. నీటి ద్వారా
    వ్యాధికారక సూక్ష్మజీవులతో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల.
    ఉదాహరణ: లెప్టోస్పిరోసిస్.
  5. వాహక కీటకాల ద్వారా
    దోమలు, పేలు, ఈగలు, టిక్స్ వంటి కీటకాల ద్వారా.
    ఉదాహరణ: కైసానూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD).
  6. గాలి ద్వారా
    కొన్ని వ్యాధికారకాలు గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చు.
    ఉదాహరణ: బోవైన్ ట్యూబర్‌క్యులోసిస్.

జూనోసిస్ దినోత్సవం ప్రాముఖ్యత

  1. జంతు-మానవ ఆరోగ్య సంబంధంపై అవగాహన కల్పించడం.
  2. జూనోటిక్ వ్యాధుల నివారణ చర్యలను ప్రజలకు తెలియజేయడం.
  3. పశువైద్యులు, వైద్యులు, ప్రజారోగ్య అధికారులు కలిసి పనిచేసే “వన్ హెల్త్ (One Health)” విధానాన్ని ప్రోత్సహించడం.
  4. వ్యాధుల పర్యవేక్షణ, నివారణ మరియు నియంత్రణ కార్యక్రమాలను బలోపేతం చేయడం.
  5. ఆహార భద్రత మరియు ప్రజారోగ్య పరిరక్షణకు తోడ్పడడం.

ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు

  1. రేబీస్ (Rabies) లేదా పిచ్చికుక్కకాటు వ్యాధి
    కారకం – రేబీస్ వైరస్ / లిస్సా వైరస్
    వ్యాప్తి – కుక్కలు, పిల్లులు, కోతులు, నక్కలు, గబ్బిలాలు వంటి జంతువుల కాటు ద్వారా మరియు లాలాజలం ద్వారా.
    • కుక్కలు, పిల్లులు మరియు ఇతర జంతువుల కాటు ద్వారా వ్యాపిస్తుంది.
    లక్షణాలు – జ్వరం, తలనొప్పి, నీటిని చూసి భయపడటం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం
    నియంత్రణ
    • పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలి.
    • కాటు జరిగిన వెంటనే సబ్బు మరియు నీటితో గాయాన్ని 15 నిమిషాల పాటు కడగాలి.
    • వెంటనే టి.టి.ఇంజెక్షన్ వేయాలి.
    • యాంటీ రేబీస్ టీకా 0, 3, 7, 14, 28 మరియు 90 రోజు తప్పకుండా ఇప్పించాలి.
    • గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూసి వుంచరాదు. సూర్య కాంతి తగిలేలా చూడాలి.
    • గాయం బాగా లోతుగా వున్నట్లైతే రేబీస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ తో పాటు యాంటీబయాటిక్ మందులు కూడా డాక్టరు సలహా మేరకు వాడాలి.
  2. బ్రూసెల్లోసిస్ (Brucellosis)
    కారకం : బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా.
    వ్యాప్తి – కలుషిత పాలు, పాల ఉత్పత్తులు, గర్భస్రావం జరిగిన పశువుల స్రావాలతో సంపర్కం.
    లక్షణాలు – దీర్ఘకాలిక జ్వరం, కీళ్ల నొప్పులు మరియు బలహీనత
    నియంత్రణ – పాలను మరిగించి మాత్రమే త్రాగడం, పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం, ఈసుకుపోయిన పశువులను లేదా జీవాలను పరీక్షించేటప్పుడు మాస్కులను మరియు గ్లౌజులను వేసుకోవడం
  3. లెప్టోస్పిరోసిస్ (Leptospirosis)
    కారకం – లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా.
    వ్యాప్తి – ఎలుకల మూత్రంతో కలుషితమైన నీరు, వరద నీటిలో నడవడం.
    లక్షణాలు – జ్వరం, కండరాల నొప్పులు, కళ్ళు ఎర్రబడటం మరియు మూత్రపిండాల సమస్యలు
    నియంత్రణ – నిల్వ నీటిలో నడిచేటప్పుడు బూట్లు ధరించడం, ఎలుకల నియంత్రణ చేపట్టడం మరియు పరిశుభ్రత పాటించడం.
  4. ట్యూబర్‌క్యులోసిస్ / క్షయ వ్యాధి/ టి.బి.
    కారకం – మైకోబ్యాక్టీరియం బోవిస్ అనే బ్యాక్టీరియా
    వ్యాప్తి – కలుషిత పాలు త్రాగడం ద్వారా మరియు వ్యాధి సోకిన పశువుల దగ్గు ద్వారా.
    లక్షణాలు – దీర్ఘకాలిక దగ్గు, బరువు తగ్గడం మరియు అలసట
    నియంత్రణ – పాలను పాశ్చరైజ్ చేయడం ద్వారా, పశువులను క్రమం తప్పకుండా పరీక్షించడం ద్వారా మరియు బి.సి.జి.టీకాలు ఇప్పించడం ద్వారా
  5. ఆంత్రాక్స్ (Anthrax) / దొమ్మ వ్యాధి
    కారకం – బేసిల్లస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా.
    • పశువులు, గొర్రెలు, మేకలలో కనిపించే బ్యాక్టీరియా వ్యాధి.
    వ్యాప్తి – వ్యాధి సోకిన జంతువులతో సంపర్కం మరియు కలుషిత మాంసం లేదా చర్మం.
    లక్షణాలు – చర్మంపై నల్లటి పుండ్లు, జ్వరం మరియు శ్వాస సమస్యలు
    నియంత్రణ – పశువులకు టీకాలు వేయడం మరియు చనిపోయిన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయాలి.
  6. బర్డ్ ఫ్లూ (Avian Influenza)
    కారకం – ఇన్‌ఫ్లుయెంజా వైరస్.
    వ్యాప్తి – వ్యాధి సోకిన పక్షులతో ప్రత్యక్ష సంపర్కం, పక్షుల విసర్జనల ద్వారా.
    లక్షణాలు – జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు
    నియంత్రణ – పౌల్ట్రీ ఫారాల్లో బయోసెక్యూరిటీ పాటించడం, అనారోగ్య పక్షులను వెంటనే వేరుచేయడం మరియు పక్షి ఉత్పత్తులను పూర్తిగా వండుకుని తినడం.
  7. నిఫా వైరస్ వ్యాధి
    కారకం – నిఫా వైరస్.
    వ్యాప్తి – గబ్బిలాలు తాకిన పండ్లు, వ్యాధి సోకిన జంతువులు.
    లక్షణాలు – తీవ్రమైన జ్వరం, మెదడు వాపు మరియు శ్వాస సమస్యలు
    నియంత్రణ – గబ్బిలాలు తాకిన పండ్లు తినకూడదు మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

జూనోటిక్ వ్యాధుల నివారణచర్యలు

  1. పశువులకు నిర్దిష్ట టీకాలు వేయించడం.
  2. పశువుల షెడ్లలో పరిశుభ్రత పాటించడం.
  3. పాలను మరిగించి లేదా పాశ్చరైజ్ చేసి వినియోగించడం.
  4. మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం.
  5. చేతులను సబ్బుతో తరచుగా కడుక్కోవడం.
  6. అనారోగ్య జంతువులను వెంటనే వేరుచేయడం.
  7. చనిపోయిన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయడం.
  8. పశువులలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్య అధికారులను సంప్రదించాలి.
  9. పందులను మానవ పరిసరాల నుండి దూరంగా ఉంచాలి.
  10. ఎలుకలు పరిసరాల్లో లేకుండా చూడాలి.
  11. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం
  12. సురక్షిత ఆహారాన్ని తీసుకోవడం
  13. జంతువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం
  14. మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం మరియు పర్యావరణ ఆరోగ్యం పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఈ మూడు రంగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే జూనోటిక్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించగలం. దీనినే “వన్ హెల్త్” విధానం అంటారు.
  15. రైతులు, పశుపాలకులు, పశువైద్యులు మరియు సాధారణ ప్రజలు కలిసి పనిచేస్తేనే జూనోటిక్ వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుంది.

“జంతు ఆరోగ్యం – మానవ ఆరోగ్యానికి రక్షణ కవచం; జూనోసిస్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత.”

డా.తనూజ నాదెళ్ళ, సహాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం, వి. బి. ఆర్. ఐ., విజయవాడ. Phone: 9121000747

Read More

ఆయిల్ పామ్ తోటలలో పరాగసంపర్కం చేసే వీవిల్స్ (ఎలైడోబియస్ కామెరూనికస్) విడుదల యొక్క విధి విధానాలు

పరాగసంపర్కం అంటే పుప్పొడి రేణువులు మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాలలోని కీలాగ్రానికి బదిలీ కావడం. దీని ఫలితంగా ఫలదీకరణం జరిగి పండ్లు ఏర్పడుతాయి. ఆయిల్ పామ్ ఒక మోనోషియస్ పంట, అనగా ఒకే చెట్టుపై మగ మరియు ఆడ పుష్పగుచ్ఛాలు విడివిడిగా ఏర్పడటమే కాక, వేరు వేరు అభివృద్ధి దశలలో ఉంటాయి. కాబట్టి, కీలాగ్రం గ్రహణ స్థితిలో ఉన్నప్పుడు పుప్పొడి రేణువులు మగ పువ్వుల నుండి ఆడ పువ్వులకు సహజంగా బదిలీ కావు. ఈ తరుణంలో ఆయిల్ పామ్ లో పరాగసంపర్కం కొరకు వీవిల్, ఎలైడోబియస్ కామెరూనికస్ (Elaeidobius kamerunicus) అనే ఒక చిన్న కీటకం దోహదపడుతుంది. ఈ కీటకం పుప్పొడి రేణువులను మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాల కీలాగ్రానికి గ్రహణశీల దశలో ఉన్నపుడు తీసుకువెళుతుంది. ఐతే ఆడ పుష్పాల గ్రహణశీలత కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఆయిల్ పామ్ ఉత్పాదకతను కాపాడుకోవడానికి, ఏ తోటలోనైనా ఆయిల్ పామ్ పరాగసంపర్కం చేసే వీవిల్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగాలి.

కొత్తగా స్థాపించబడిన తోటలలో విడుదల చేయడానికి, వీవిల్స్ తో కూడిన ఆయిల్ పామ్ మగ పుష్పగుచ్ఛాలను సేకరించడాన్ని సూచించే ఫ్లోచార్ట్

ఏదైనా తోటలో మొక్క బాల్య దశలో (రెండున్నర సంవత్సరాలు తర్వాత) పరాగసంపర్క వీవిల్స్ స్థిరపడితే పామాయిల్ తోట జీవితకాలం పాటు వాటి జనాభా స్వయంపోషకంగా కొనసాగుతుంది. అదేవిధముగా పెద్ద తోటలకు సమీపంలో (సుమారు 1 కి.మీ. దూరంలో) కొత్త తోట ఉంటే, వీవిల్స్ సహజంగానే వచ్చి స్థిరపడతాయి. ఐతే శత్రు జీవాలు అధికంగా ఉండటం లేదా పురుగు మందులు ఎక్కువుగా వాడటం వలన కూడా పరాగసంపర్క వీవిల్ సంఖ్య పడిపోతుంది. అటువంటి పరిస్థితులలో లేదా ఏదైనా పెద్ద తోట నుండి 2 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఏకాంత తోటలకు మరియు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, సహజంగా వీవిల్స్ జనాభా తక్కువగా ఉన్న (ఒక్కో మగ కంకెకు100-120 కంటే తక్కువ వీవిల్స్) తోటలలో వీవిల్స్ ను కృత్రిమంగా విడుదల చేయవలసిన అవసరం ఉంది.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేసే సాంకేతిక అంశాలు
కావలసిన సామగ్రి: గుడ్డ సంచి, ప్లాస్టిక్ డబ్బా/కంటైనర్ (20 లీటర్ల సామర్థ్యం), పుష్ప గుచ్చాన్ని నరకడానికి కత్తి, హై-టెన్షన్ తాడు, డేటా రికార్డింగ్ షీట్, ఎయిర్ కండిషన్డ్ (28-30°C) వాహనం మరియు పరాగసంపర్క వీవిల్స్‌తో కూడిన మగ పుష్పగుచ్ఛం.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేయడానికి కనీసం ఇద్దరు మనుషుల అవసరం ఉంటుంది. దాత తోటను మరియు గణనీయమైన పరాగసంపర్క పురుగులు ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గుర్తించడానికి, అలాగే గ్రహీత తోటలో విడుదల సమయం మరియు విడుదల ప్రదేశాలను నిర్ణయించడానికి ఒక పర్యవేక్షకుడు. గ్రహీత తోటకు పురుగులను విడుదల చేయడానికి, రవాణా చేయడానికి, ముందు మరియు తర్వాత పర్యవేక్షణ కోసం ఒక క్షేత్ర స్థాయి సాంకేతిక నిపుణుడు. రవాణా రోజున, ఉదయం వేళల్లో (8:00 – 10:30 గంటల మధ్య), దాత తోటలో పుష్పించిన రెండవ రోజున ఉన్న మగ పుష్పగుచ్ఛాన్ని గుర్తించి, అందులో ప్రతి కంకికి కనీసం 200 వీవిల్స్‌ ఉండేలా చూసుకోవాలి. పుష్పగుచ్ఛం యొక్క కాండం కనిపించేలా దాని అనుబంధ మట్టను కత్తిరించాలి. 10-15 నిమిషాల తర్వాత, కాండం వరకు వీవిల్స్‌ తో పాటు పుష్పగుచ్ఛాన్ని వేగంగా గుడ్డ సంచి కప్పి, ఒక తాడు సాయంతో సంచి మూతిని కాండంతో పాటు గట్టిగా కట్టాలి. తరువాత పుష్పగుచ్ఛం కాండం యొక్క అడుగు భాగాన్ని నరికి, సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిటారుగా జాగ్రత్తగా ఉంచాలి. సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛంతో పాటు ప్లాస్టిక్ డబ్బాను జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి, అదే రోజున వీవిల్స్ విడుదల చేసే తోటకి రవాణా చేయాలి.

మగ పుష్పగుచ్ఛంలో పుష్పించే దశలు
A. పుష్పించే ముందు B. మొదటి రోజు C. రెండవ రోజు D. మూడవ రోజు

వీవిల్స్ విడుదల చేసే తోటలో కనీసం 10 శాతం చెట్లు ఆ వారం లో పూతకు సిద్ధంగా ఉన్న మగ పుష్పగుచ్ఛాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. సులభంగా గుర్తించడానికి చెట్లకు/మగ పుష్పగుచ్ఛాలకు ట్యాగ్‌లు తగిలించాలి. స్వీకరించే తోటకు చేరుకున్న తర్వాత, వీవిల్స్ తో ఉన్న మగ పుష్పగుచ్ఛాలు గల డబ్బాను 20-30 నిమిషాల పాటు నీడలో ఉంచాలి. ఆ తర్వాత, ట్యాగ్ చేసిన ప్రతి విడుదల స్థానం లో, గుడ్డ సంచి మూతిని మెల్లగా తెరిచి, తట్టడం ద్వారా కొన్ని వీవిల్స్ సంచి నుండి బయటకు వచ్చేలా చేయాలి. పురుగులను పూర్తిగా విడుదల చేసిన తర్వాత, పుష్పగుచ్ఛం నుండి 3-4 కంకులను కత్తిరించి, తదుపరి తరం వీవిల్స్ విడుదల కోసం వాటిని మట్టల మొదలు వద్ద ఉంచాలి. తేదీ, సమయం, GPS కోఆర్డినేట్‌లు, విడుదల కోసం ఉపయోగించిన పుష్పగుచ్ఛాల సంఖ్య మొదలైన వివరాలను నమోదు చేయాలి.

ఈ విధంగా విడుదల చేసిన 15-20 రోజుల తర్వాత, వీవిల్స్ విడుదల చేసిన ప్రదేశాల సమీపంలోని పూత దశలో ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గమనించాలి. ఆ పుష్పగుచ్ఛాలమీద వీవిల్స్ కదలిక ఉంటె అక్కడ స్థిరపడ్డాయని నిర్ధారించుకోవచ్చు. అదే విధంగా, మగ పుష్పగుచ్ఛాలపై వీవిల్స్ సంఖ్య నెలవారీగా పర్యవేక్షించాలి. ప్రతిసారి పురుగుల సంఖ్య పెరగడం, అవి తోటలో స్థిరపడ్డాయని నిర్ధారిస్తుంది. వీవిల్స్ సంఖ్య తక్కువగా ఉంటే (ప్రతి కంకికి 50 కంటే తక్కువ పురుగులు) విడుదల ప్రక్రియను పునరావృతం చేయండి. ఐతే ఈ పెరుగుదల వేసవి లేదా వర్షాకాలం లో తక్కువుగా ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు
• భారీ వర్షాలు లేదా తీవ్ర వేసవి కాలంలో వీవిల్స్ సేకరించడం, విడుదల చేయడం మరియు విడుదల తర్వాత పర్యవేక్షించడం వంటివి చేయకూడదు. శీతాకాలం ప్రారంభంలో విడుదల చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
• మగ పుష్పగుచ్ఛాలను ఉదయం వేళల్లో (8.00-10.30 గంటల మధ్య) సేకరించడం మంచిది మరియు అదే రోజున వీవిల్స్ విడుదల చేయడం ఉత్తమం. ఒక రోజు కంటే ఎక్కువ ఉండే ప్రయాణాలకు, సాపేక్ష ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్లాస్టిక్ డబ్బాను గోనె సంచితో అవసరాన్నిబట్టి మూసివేయవచ్చు. సుమారు 28-30°C ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉపయోగించాలి.
• వీవిల్స్ సేకరించే సంచి లేదా ప్లాస్టిక్ కంటైనర్ లోపల అధిక సాపేక్ష ఆర్ద్రత లేదా నీటి బిందువులు ఏర్పడటం వల్ల వీవిల్స్ చనిపోతాయి.
• వీవిల్స్ పై ఒత్తిడిని తగ్గించడానికి, వాటిని తెల్లవారుజామున (07:30-10:00 గంటల మధ్య) లేదా సాయంత్రం (15:00-17:00 గంటల మధ్య) విడుదల చేయాలి.
• విడుదల చేసిన మొక్కల మధ్య మరియు చుట్టుపక్కల కనీసం రెండు నెలల పాటు రసాయన పురుగుమందులు వాడకూడదు.
• రెండు నెలల తర్వాత కూడా తదుపరి పర్యవేక్షణలో వీవిల్స్ కనిపించకపోతే, వాటిని తిరిగి విడుదల చేయాలి. ఐతే వీవిల్స్ సంఖ్య తగ్గడానికి కారణాలు ఐనటువంటి, పురుగుమందుల వాడకం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ఇతర వాతావరణ పరిస్థితులు, మగ పుష్పగుచ్ఛాల కొరత, వేటాడే జీవుల (చీమలు, సాలీడులు, బల్లులు మొదలైనవి) వంటి వాటిని తనిఖీ చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
• వీవిల్స్ సంఖ్య పెరుగుదలకు సాలీడు గూళ్లు ప్రధాన అవరోధంగా ఉండి వాటి ప్రత్యక్ష మరణానికి కారణమవుతాయి. అందువలన తోట నుండి అన్ని సాలీడు గూళ్లను తొలగించాలి.
• వీవిల్స్ సంఖ్య తగినంత ఉన్నప్పటికీ గెలలో పళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే, పోషకాల లోపం (ముఖ్యంగా బోరాన్) లేదా నీటి ఒత్తిడి వంటి ఇతర కారణాలను గుర్తించి, వాటిని సరి చేసుకోవాలి.
• అధిక లింగ నిష్పత్తి (high sex ratio) గల తోటలలో (కేవలం ఆడ పుష్పగుచ్ఛాలను మాత్రమే ఉత్పత్తి చేసే చెట్లు) ఉన్న తోటలలో, మగ పుష్పగుచ్ఛాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 10% చెట్లకు నీటిపారుదలని నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ చెట్లలో మగ పొత్తులు వేస్తాయి.

ఆడ పువ్వుల రంగు తెలుపు నుండి గులాబీ రంగులోకి మారడం ద్వారా వీవిల్స్ ద్వారా పరాగసంపర్కం జరిగిందని నిర్ధారించవచ్చు. అదేవిధంగా, ఒక గెలలో పండ్ల సంఖ్య పెరగడం అనేది, ఆ తోటలో వీవిల్స్ స్థిరపడ్డాయని సూచిస్తుంది.

ఏ ఆర్ ఎన్ ఎస్ సుబ్బన్న, సి హెచ్ గిరీష్, టి. ఫణి కుమార్
భా. వ్య. ప. మ. – భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి – 534435
ప్రీ యునిక్యూ (ఇండియా) Pvt Ltd, ప్లాట్ No. 26, గ్రీన్ ల్యాండ్ కాలనీ, మాధవ రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ- 500032. Phone: 96391 75431, 7300788301

Read More

లోడర్, ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు : మంత్రి తుమ్మల

ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘ఎర్త్‌కాన్ ఎక్స్‌పో-2026’ ఎక్సిబిషన్లో ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల, స్టాల్‌లో ప్రదర్శించిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ, లోడర్, ఎక్సవేటర్ వంటి యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి యంత్రాలు రైతులకు పెద్ద ఎత్తున ఉపయుక్తమవుతాయని, తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునేందుకు తోడ్పడతాయని తెలిపారు. రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ తరహా వినూత్న యంత్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ
ఈ యంత్రాలను వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చినట్లయితే రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో పనిచేసే నమూనాలను కూడా త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు. బ్యాటరీ ఆధారిత యంత్రాలు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయాలని కోరగా, త్వరలోనే అలాంటి యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

2027 నాటికి ఈవీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ లక్ష్యం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.5 టన్నుల సామర్థ్యం గల మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మోడల్‌ను 2027 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే వినియోగదారుల కోసం ప్రత్యేక డెమో జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Read More