రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, “భారత హరిత విప్లవానికి దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అద్భుత సేవలు” అనే అంశంపై విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1964లో స్థాపించబడిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ భవనాలను 1966లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రారంభించడం విశ్వవిద్యాలయ చరిత్రలో గర్వకారణమని పేర్కొన్నారు.
1960లలో దేశం ఎదుర్కొన్న తీవ్ర ఆహార సంక్షోభం నుంచి బయటపడటానికి శ్రీమతి ఇందిరా గాంధీ రాజకీయ నాయకత్వం, డా. ఎం.ఎస్. స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల కృషి కలిసి హరిత విప్లవానికి దారితీశాయని మంత్రి కొనియాడారు. ఆ విప్లవ ఫలితంగానే భారత్ నేడు ప్రపంచంలో అగ్రగామి ఆహార ధాన్య ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు.
గత 62 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయం 525 పంట రకాలను అభివృద్ధి చేసిందని, తెలంగాణ సోనా, బీపీటీ-5204, ఎంటీయూ-1010 వంటి వరి రకాలు, డీహెచఎం సిరీస్ మొక్కజొన్న సంకర రకాలు దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ పొందాయని తెలిపారు. వేలాది మంది వ్యవసాయ పట్టభద్రులు, పరిశోధకులను తయారు చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిందన్నారు.
రైతు నేస్తం, డ్రోన్ అకాడమీ, అగ్రిహబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలతో విశ్వవిద్యాలయం భవిష్యత్ వ్యవసాయానికి కేంద్రబిందువుగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వ్యవసాయం ప్రస్తుతం ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లు, ప్రెసిషన్ అగ్రికల్చర్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, తెలంగాణ కూడా ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇకపై కేవలం ఉత్పత్తి పెంపుపై కాకుండా పంటలకు విలువ పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రైతు ఆదాయం పెరగాలంటే విలువ ఆధారిత వ్యవసాయం, మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని చెప్పారు.
అలాగే భవిష్యత్తులో కార్బన్ క్రెడిట్స్, బయో ఎకానమీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి రంగాలు రైతులకు కొత్త ఆదాయ వనరులుగా మారనున్నాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ ఆధారిత, సాంకేతిక ఆధారిత, మార్కెట్ ఆధారిత వ్యవసాయంగా రూపాంతరం చెందాలని, ఆ మార్పుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాయకత్వం వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మరియు కమిషన్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్ౙి బి సుదర్శన్ రెడ్డి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్, మధుర స్వామినాథన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, పాలసీ అనలిస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మరియు ప్రస్తుత వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, జ్ఞానేందర్, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.