సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం దేశంలో తొలిసారిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్ ‘టీజీ ఆర్గానిక్స్’ రానుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద వ్యవసాయ వారోత్సవాలలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 4న యాప్ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారు. నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసి రైతులు పండించే స్వచ్ఛమైన సేంద్రియ ఉత్పత్తులు వినియోగదారులకు లభ్యమయ్యేలా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ దీనిని అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో నేంద్రియ వ్యవసాయం విస్తరిస్తోంది. రాష్ట్రంలో జనవరి 2026 నాటికి 10 వేల మంది రైతులు, 24 రైతు ఉత్పత్తిదారుల సంఘాల వారు 50 వేల ఎకరాల్లో ఈ సాగు చేస్తున్నారు. ప్రత్యేక మార్కెట్లు లేకపోవడం వల్ల వారు పంట ఉత్పత్తులను దుకాణాల చుట్టూ తిరిగి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు నకిలీ ఉత్పత్తులను నేంద్రియం పేరుతో విక్రయిస్తున్నారు. ఇలా మోసాలు పెరగడం, రైతులకు సరైన మద్దతు లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రి తుమ్మల ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక యాప్ను రూపొందించాలని రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థకు సూచించారు.
ధర నిర్ణయించే అధికారం రైతుకే
ప్రారంభంలో ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన 100 సేంద్రియ ఉత్పత్తులు, 500 మంది రైతుల సమాచారం యాప్లో ఉంటుంది. 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే రైతుల వివరాలు వస్తాయి. మున్ముందు మరింత మంది రైతులను, ఉత్పత్తులను ఇందులో చేరుస్తారు. ఆయా ఉత్పత్తులు కావాలనుకున్న వారు నేరుగా టీజీ ఆర్గానిక్స్ యాప్ ద్వారా రైతులను సంప్రదించవచ్చు. రైతు మొబైల్ నంబరు, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. ధర నిర్ణయించే అదికారం రైతుకు మాత్రమే ఉంటుంది. రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు.

2 May, 2026
