సేంద్రియ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు యాప్

సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం దేశంలో తొలిసారిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్ ‘టీజీ ఆర్గానిక్స్’ రానుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద వ్యవసాయ వారోత్సవాలలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 4న యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారు. నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసి రైతులు పండించే స్వచ్ఛమైన సేంద్రియ ఉత్పత్తులు వినియోగదారులకు లభ్యమయ్యేలా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ దీనిని అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో నేంద్రియ వ్యవసాయం విస్తరిస్తోంది. రాష్ట్రంలో జనవరి 2026 నాటికి 10 వేల మంది రైతులు, 24 రైతు ఉత్పత్తిదారుల సంఘాల వారు 50 వేల ఎకరాల్లో ఈ సాగు చేస్తున్నారు. ప్రత్యేక మార్కెట్లు లేకపోవడం వల్ల వారు పంట ఉత్పత్తులను దుకాణాల చుట్టూ తిరిగి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు నకిలీ ఉత్పత్తులను నేంద్రియం పేరుతో విక్రయిస్తున్నారు. ఇలా మోసాలు పెరగడం, రైతులకు సరైన మద్దతు లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రి తుమ్మల ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థకు సూచించారు.
ధర నిర్ణయించే అధికారం రైతుకే
ప్రారంభంలో ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన 100 సేంద్రియ ఉత్పత్తులు, 500 మంది రైతుల సమాచారం యాప్‌లో ఉంటుంది. 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే రైతుల వివరాలు వస్తాయి. మున్ముందు మరింత మంది రైతులను, ఉత్పత్తులను ఇందులో చేరుస్తారు. ఆయా ఉత్పత్తులు కావాలనుకున్న వారు నేరుగా టీజీ ఆర్గానిక్స్ యాప్ ద్వారా రైతులను సంప్రదించవచ్చు. రైతు మొబైల్ నంబరు, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. ధర నిర్ణయించే అదికారం రైతుకు మాత్రమే ఉంటుంది. రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు.

Read More

90 లక్షల టన్నుల ధాన్యం ఈ యాసంగిలో ఉత్పత్తి అవుతుంది

“తెలంగాణలో యాసంగి పంటలో వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యం మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో కేంద్ర మంత్రిని దిల్లీలో కలిసి ఈ అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ బియ్యానికి డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం (10% నూకతో) సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని, దీని కారణంగా పౌర సరఫరాలశాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయించాలని విన్నవించారు. ఉప్పుడు బియ్యం సరఫరాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

మొక్కజొన్నను ధరల మద్దతు పథకంలో చేర్చాలి

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నను ధరల మద్దతు పథకం (ప్రైజ్ సపోర్ట్ స్కీమ్)లో చేర్చి, సగం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సోమవారం లేఖ రాశారు. ప్రస్తుత సీజన్‌లో సుమారు 11,21,494 ఎకరాల్లో పంట సాగు కాగా.. దాదాపు 29.79లక్షల టన్నుల దిగుబడి రానుంది.
మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న ప్రస్తుతం క్వింటాలు సగటు ధర రూ.1,759 పలుకుతుండగా.. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400తో పోలిస్తే ఇది రూ. 641 తక్కువ. రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం 92 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటివరకు 65వేల టన్నులు కొనుగోలు చేసింది. మార్కెట్లో అనిశ్చితి వల్ల ధరలు పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్నను పీఎసఎస్ కింద చేర్చి, మొత్తం ఉత్పత్తిలో 50% కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

Read More

పసుపు కొనుగోళ్ళపై సమీక్ష

అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు తేమతో ఉన్న పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో పసుపు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు వస్తోంది. సోమవారం అర్ధరాత్రి బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 3,450 మంది రైతులకు చెందిన 7,080 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేసేందుకు ఆదేశించాం’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించబోయే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.

Read More

మొక్కజొన్న పంట ఉత్పత్తి మొత్తానికి సాయం అందించాలి

ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడంతోపాటు.. 100% పంట ఉత్పత్తికి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘2025-26 రబీలో రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 37.61 లక్షల టన్నుల దిగుబడి లభిస్తుందని అంచనా. అత్యధికంగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగైంది. రబీ పంట జూన్ వరకు చేతికొస్తోంది. అధిక ఉత్పత్తి కారణంగా, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కు వగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారు’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. కర్షకుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని 50:50 నిష్పత్తిలో కాకుండా మొత్తం కేంద్రమే భరించాలని, మొత్తం పంట ఉత్పత్తిలో 25% మాత్రమే కాకుండా 100% ఉత్పత్తికి సాయం అందించాలని పేర్కొన్నారు. జూన్ వరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More

పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు సడలించాలి

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) 18% తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేసేలా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో దీనిపై మాట్లాడారు. ”పత్తి కొనుగోలు చేయాలంటే అందులో తేమశాతం 8-12%కి మించకూడదన్న నిబంధన రైతులకు గుది బండగా మారింది. ఆంధ్రరాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా తీరప్రాంతంలో తేమశాతం దీనికంటే ఎక్కువగా ఉంటుంది. రైతులకు ఎల్‌1/ఎల్‌2/ఎల్‌ జిన్నింగ్‌ మిల్లులు కేటాయించడం వల్ల వాళ్లు తమ సమీపంలో ఉన్న మిల్లులను ఎంచుకొనే వీల్లేకుండా పోతోంది. దానివల్ల వారు తక్కువ ధరలకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ నిబం ధనలను సడలించాలి. అదే సమయంలో అన్ని జిన్నింగ్‌ మిల్లులను తెరిచి 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలుచేసి ఆ నిష్పత్తి ప్రకారం కనీస మద్దతు ధర చెల్లించేలా నిర్దేశించాలి. వర్షం నీరు తాకిన, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రైతులు ఇప్పటికే పలు వైపరీత్యాలతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలతో వారి కష్టాలను రెట్టింపు చేయడం భావ్యం కాదు. వ్యవసాయదారుల జీవనోపాధిని రక్షించి, రాష్ట్రంలో పత్తిసాగును కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసే తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ యేటా 20 లక్షల బేళ్లు అందిస్తోంది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 5.39 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే మొంథా తీవ్రతుపాను కారణంగా 1.08 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. సుమారు 1.25 లక్షల టన్నుల పత్తి రంగుమారింది. తీరప్రాంతంలోని ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని రైతులు తీవ్ర ప్రభావానికి గురయ్యారు” అని లావు పేర్కొన్నారు.

Read More

రొయ్యకు దేశీయ మార్కెట్‌ పెరగాలి

దేశీయంగా రొయ్యలకు బలమైన మార్కెట్‌ కల్పించేందుకు ఆర్థిక తోడ్పాటు అందించాలని.. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని రొయ్య రైతుల సమాఖ్య అధ్యకక్షుడు మోహన్‌రాజు కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డులకు ఆయన ఈ మేరకు లేఖలు రాశారు. ఇటీవల మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన సూచన మేరకు దేశీయ మార్కెట్‌ పెంచేందుకు అవసరమైన సవివర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి పంపినట్లు ఆయన తెలిపారు. మత్స్య అభివృద్ధి బోర్డు ద్వారా ఒక్కోటి రూ.50 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 3 వేల టన్నుల సామర్థ్యంతో 20 రొయ్యల నిర్వహణ, మార్కెటింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Read More

జీడి, మిర్చి, మామిడి రైతుల ప్రయోజనాల కోసం బోర్డులు ఏర్పాటు చేయమని కేంద్రమంత్రిని కోరిన లోకేశ్‌

‘జీడిపప్పు ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రాసెసింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ, సరైన మార్కెటింగ్‌ కోసం జీడి బోర్డు అవసరం. మిర్చి బోర్డు ఏర్పాటైతే ధరల హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చు. రాష్ట్రంలో ఏటా దాదాపు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. ఈ పంటలు సాగు చేసే రైతుల కష్టాలు తొలగడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో జీడి, గుంటూరులో మిర్చి, చిత్తూరులో మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రవాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. మూలపేట, చిలమత్తూరు, కుప్పం, దొనకొండల్లో 4 కొత్త పారిశ్రామిక నోడ్‌లను అభివృద్ధి చేసేందుకు అనుమతులివ్వాలి. నీరు, విద్యుత్తు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.5,811 కోట్ల గ్రాంట్‌ మంజూరు చేయండి. విజయవాడ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు నోడ్‌కు అనుమతివ్వాలి. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌ల మాస్టర్‌ప్లాన్లు ఆమోదం పొంది, టెండర్లకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఈపీసీ విడుదలకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఆమోదం ఇప్పించండి’ అని విజ్ఞప్తి చేశారు.

Read More

తోతాపురి మామిడి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును భరించమని కేంద్ర వ్యవసాయ మంత్రికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి వినతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తోతాపురి మామిడి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలని ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ను కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది దిగుబడులు పెరగడము వలన తోతాపురి మామిడి ధరలు తగ్గాయి. దీంతో రైతులు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద కిలో మామిడికి కనీస మద్దతు ధరను రూ.12గా నిర్ణయించింది. అందులో వ్యాపారులు 8 రూపాయలు, మిగిలిన 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయించింది. ఈ ఏడాది 6.50 లక్షల టన్నుల సరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా. కిలోకు రూ.4 చొప్పున చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.260 కోట్ల భారం పడుతోంది. ప్రభుత్వ ఆర్ధిక సమస్యల దృష్ట్యా ఈ మొత్తాన్ని కేంద్రమే అందించేలా చర్యలు తీసుకోండి’ అని విజ్ఞప్తి చేశారు.

Read More

తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

కేంద్ర పథకం కింద ఏర్పాటు

దేశంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌-ఎఫ్పీవో)ల ఏర్పాటు, ప్రోత్సాహక పథకం కింద తెలంగాణలో 311 సంఘాలు ఏర్పాటు కానున్నాయి. 2025లో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా 10వేల సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో తెలంగాణకు 311 కేటాయించింది. అన్నదాతల ఆదాయం పెంపు, పెట్టుబడి రాయితీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సభ్యులకు తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ, పంట ఉత్పత్తులశుద్ది, గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెట్‌ అనుసంధానానికి ప్రస్తుతం దేశంలోని ఎఫ్పీవోలు కృషి చేస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎఫ్‌పీవోలో ఇలా..: కేంద్ర పథకం కింద ఎంపికయ్యే సంఘాలలో కనీసం 300 మంది సభ్యులు ఉండాలి. రూ.2 వేలు వాటాధనం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. సంఘం యాజమాన్య బోర్డులలో మహిళా రైతులు ప్రాతినిధ్యం ఉండాలి. సంఘాల సభ్యులకు వ్యాపార ప్రణాళికల తయారు, వాటి అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి సంఘానికి ఈక్విటీ గ్రాంట్‌ కింద కేంద్రం రూ.15 లక్షలు, నిర్వహణకు ఏటా రూ.6 లక్షల చొప్పున మూడేళ్లు గ్రాంటు ఇస్తుంది. కేంద్ర పథకం కింద ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ రూ.1500 కోట్లు కేటాయించారు. దీని కింద సంఘాలకు రుణాలు ఇస్తారు. ఇందులో 85 శాతం వరకు పూచీకత్తును కేంద్రం ఇస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)నే ఎఫ్‌పీవోలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థంగా నడుస్తున్న పీఏసీఎస్‌లను ఎంపిక చేయాలని సహకార యూనియన్‌ను ఆదేశించింది.

Read More