రోజూ చిరుధాన్యాలు తినండి: ఏడో భారతీయ సంస్కృతి ఉత్సవంలో డాక్టర్‌ ఖాదర్‌ వలీ

పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలు కావొద్దని మిల్లెట్‌ మ్యాన్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలీ సూచించారు. ”సామలు, ఊదలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు రోజూ రెండు పూటలు తినడం ద్వారా అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా చిరుధాన్యాలు వర్షాభావ ప్రాంతాల్లోనూ పండుతాయి. వరి, గోధుమల సాగుకు నీటి వనరులు ఎక్కువగా అవసరమవడమే కాకుండా… వీటిని పరిమితికి మించి తిన్నవారి శరీరంలోని రక్తంలో క్రమంగా గ్లూకోజ్‌ పెరుగుతుంది. తిండికి, ఆరోగ్యానికి, వ్యవసాయానికి సంబంధం ఉన్నప్పుడు దీనిపై ఎందుకు ఎవరూ అంతగా మాట్లాడటం లేదు. ఏదో ఒకటి తిని మాత్రలు మింగాల్సిన పరిస్థితి రాకూడదంటే రోజూ చిరుధాన్యాలు తీసుకోవాలి. దీంతో ఆరోగ్యకర జీవనం సాగించవచ్చు” అని కర్ణాటకలోని సేడంలో జరుగుతున్న ఏడో భారతీయ సంస్కృతి ఉత్సవంలో డా|| ఖాదర్‌ వలీ పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో ఆహార ఆరోగ్య సదస్సును కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆదివారం ప్రారంభించారు.

Read More

లక్ష ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు లక్ష్యం

  • మంత్రి పయ్యావుల కేశవ్‌
    అనంతపురం జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. గురువారం ఉరవకొండలో సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.

Read More

వ్యవసాయానికి ఏఐ సాయం!

ఎన్‌ఐఆర్డీలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు కేంద్రం బాధ్యతలు

హైదరాబాద్‌లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్డీ) లోని ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’కు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, విస్తరణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.కృత్రిమ మేధ: అభివృద్ధి చెందిన పలు దేశాల్లో అన్ని రంగాల్లో కృత్రిమ మేధను వాడుతున్నారు. ప్రకృతి విపత్తులపై రైతులను ముందుగానే అప్రమత్తం చేయడం.. కాలానికి తగిన పంటల సాగు, ఎరువులు, పురుగు మందుల వాడకంలోనూ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అల్గందం వాడకం వల్ల కచ్చితమైన విశ్లేషణ లభిస్తుంది. మెషిన్‌ లెర్నింగ్‌తో పంటల నుంచి కలుపు మొక్కలను తొలగించడానికి ఆకులు పరిమాణం, ఆకారం, రంగును కంప్యూటర్‌ విజన్‌ విశ్లేషిస్తుంది.

*వివిధ దేశాల్లో ఇలా…*

డ్రోన్లు: విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పిచికారీతో పాటు మొక్కల వ్యాధులను గుర్తించడానికి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. దిగుబడి అంచనాలు.. గ్రేడింగ్‌: పంట దిగుబడులను తెలుసుకునేందుకు రియల్‌ టైమ్‌లోఏఐ.. అల్గరిదంలను ఉపయోగిస్తుంది. 3డీ మ్యాపింగ్‌, సెన్సర్లు, డ్రోన్ల నుంచి డేటాను విశ్లేషించి కచ్చితమైన దిగుబడిని అంచనా వేస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో పంట ఉత్పత్తులను పరిమాణం, రంగు ఆధారంగా గ్రేడింగ్‌ చేయవచ్చు.పంటలకు రక్షణ: దొంగలు, జంతువులు, పకక్షుల నుంచి పంటల రక్షణకు ఏఐ ద్వారా వీడియో సర్వైలెన్స్‌ సిస్టమ్‌.. కంప్యూటర్‌ విజన్‌తో పశువులు, దొంగల ప్రవేశాలను గుర్తించి అప్రమత్తం చేస్తుంది.

*మన దేశంలో ఇప్పుడిప్పుడే..*

కేంద్ర ప్రభుత్వం రూ.2,817 కోట్లతో డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ను ఏర్పాటు చేసింది. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఏఐ, బిగ్‌ డేటా, రిమోట్‌ సెన్సింగ్‌లతో సహా సరికొత్త సాంకేతికతలను ఇందులో పొందుపరిచింది. అన్ని రాష్ట్రాల్లో ఏఐ ప్రాజెక్టుల నిర్వహణకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థకు బాధ్యతలు అప్పగించింది. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకం కింద మహిళా సంఘాల ద్వారా 15 వేల డ్రోన్లను మంజూరు చేసింది. దేశంలో ఇప్పటికే ఏఐ సాయంతో తయారు చేసిన ‘కిసాన్‌ సువిధ’ లాంటి యాప్‌లు రైతులకు సేవలందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, సిస్కో సంస్థలతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తగిన సాంకేతికత, మౌలిక వసతులు లేనందున దేశంలో ఏటా పెద్దఎత్తున పంట వృథా అవుతోంది. కృత్రిమమేధ సాయంతో ఆ సమస్యను పరిష్కరించి, దిగుబడినీ పెంచాలన్నది ఈ ఒప్పందం లక్ష్యం. దీనికోసం ఐదు కోట్ల మంది రైతుల సమాచారాన్ని కేంద్రం ఈ సంస్థలకు అందజేసింది. మైక్రోసాఫ్ట్‌ వంద గ్రామాల్లో పని ప్రారంభించగా, అమెజాన్‌ మొబైల్‌ యాప్‌తో రైతులకు మార్గనిర్దేశం చేస్తోంది. ఈ చర్యలను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన చోట గత ఏడాది 30 శాతం అధిక దిగుబడి సాధించినట్లు ‘నీతి ఆయోగ్‌’ పేర్కొంది.

*ఏఐ విస్తరణకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సాయం*

కేంద్రం మాకు కీలక బాధ్యతలు అప్పగించింది. దీనిపై ఇటీవలే అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో వర్క్‌షాపు ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాం. ఏఐ విస్తరణకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సాయం అందిస్తుంది. విస్తృత పరిశోధనలు చేపట్టడంతోపాటు, అంకురాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో వినూత్న ప్రాజెక్టులను రూపకల్పన చేసి ప్రయోగాత్మకంగా వాటిని అమలు చేస్తాం.- ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ నరేంద్రకుమార్‌

Read More

విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌గా సతీశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌గా యడ్లపల్లి సతీశ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన విభాగ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను ఏడాది కాలానికి డిప్యుటేషన్‌పై నియమించింది.

Read More

మత్స్యశాఖ కమిషనర్‌గా రామశంకర్‌ నాయక్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రామశంకర్‌ నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా వ్యవహరించిన ఐఓఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ సర్వీస్‌)కు చెందిన డోలా శంకర్‌ మాతృశాఖకు వెళ్లారు.

Read More

పాముకాటుకు చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టండి

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

పాముకాటు సమస్య దేశమంతటా ప్రబలంగా ఉందని, దీనికి సంబంధించిన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాముకాటు చికిత్సలో కీలకమైన యాంటీ (పాలీ)వీనమ్‌ కొరత కారణంగా దేశం గణనీయమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏటా సుమారు 58,000 పాము కాటు మరణాలు భారత దేశంలో సంభవిస్తున్నాయని, యాంటీవీనమ్‌ కొరత కారణంగా చికిత్స ఆలస్యమై బాధితులు మరణిస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు మరణాలను తగ్గించడానికి ప్రజా చైతన్య ప్రచారాలను నిర్వహించాని విజ్ఞప్తి చేశారు. అన్ని వైద్య కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులతో పాముకాటు చికిత్స, సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరారు. ఈ సమస్యపై కేంద్రంతో పాటు రాష్ట్రాలూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల వైద్య ప్రతినిధులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం తరపు న్యాయవాదికి తెలిపింది.
Read More

కలుపు తీసే ‘బ్యాటరీ’ యంత్రం

అన్నదాతల ఇబ్బందులను తొలగించేందుకు బ్యాటరీతో నడిచే కలుపు తీసే యంత్రాన్ని రూపొందించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనకాపల్లి వ్యవసాయ ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. ఆ వివరాలను ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు, డాక్టర్‌ పి. శ్రీదేవి సోమవారం విలేకరులకు వివరించారు. ‘చెరకు సాగులో కలుపు ప్రధాన సమస్య. రెండు పర్యాయాలు కలుపు తీయాలి. ఇందుకు రైతులు ఒకసారికి దాదాపు రూ. 10 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. కలుపు తీసేందుకు డీజిల్‌, పెట్రోల్‌తో నడిచే వీడర్లు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. నాలుగు బ్యాటరీలను ఉపయోగించి కలుపు తీసే వీడర్‌ను విద్యార్థులు తయారు చేశారు. దీనిద్వారా ఎకరా భూమిలో కలుపు తీయడానికి మూడు గంటల సమయం పడుతుంది. బ్యాటరీలు ఒక సారి ఛార్జి చేస్తే నాలుగు నుంచి ఐదు గంటలు నడుస్తుంది. సౌరశక్తితోనూ ఛార్జింగ్‌ చేయవచ్చు. ఒక కేవీ సామర్థ్యం కలిగిన ప్యానల్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ యంత్రం ఖరీదు రూ. 80 వేలు. దీన్ని విద్యార్థులు మణిరత్నం, ప్రశాంతి, అజయ్‌, భాను, రష్మి, జనార్ధన్‌, జహ్నివిరాణి, సాయి సుదర్శిని, లావణ్య తయారు చేశారు’ అని శాస్త్రవేత్తలు వివరించారు.

Read More

ప్రకృతి.. సేంద్రియ వ్యవసాయం పెంచండి

గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారులు సంఘాల (ఎఫ్‌పీవో) ఏర్పాటు ద్వారా సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణం పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తులు ధ్రువీకరణ సంస్థ చైర్మన్‌ శావల దేవదత్‌ సూచించారు. తిరువూరులో బుధవారం నియోజకవర్గంలోని వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామ సహాయకులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 66 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా అందులో 2,300 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయానికి నిధులు అధికంగా కేటాయిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణం పెంచాలన్నారు. డీఏవో విజయకుమారి, ఏడీఏ కెనడి పాల్గొన్నారు.

Read More

ఉద్యాన పంటల సాగును పెంచాలి వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యులు కేవీఎన్‌రెడ్డి, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, భవానీ, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మీన్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Read More

చిరుధాన్యాలకు చిరునామా దక్షిణ భారత్‌ పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న సాగుసంపూర్ణ ఆహార భద్రతకు ఊతం ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనంలో వెల్లడి

చిరుధాన్యాలకు దక్షిణ భారత రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) అధ్యయనం వెల్లడించింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళలలో వీటి సాగు భారీగా పెరుగుతోందని, వినియోగం విస్తరిస్తోందని పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, యాంత్రీకరణతో కూడిన నవీన సాగు విధానాలు, అధిక దిగుబడులకు అనుకూలతలు, ఆధునాతన శుద్ధి, మెరుగైన మార్కెటింగ్‌ మార్గాలు వీటి సాగు విస్తరణకు దోహదపడుతున్నాయని వివరించింది. ఈ పంటలను ప్రోత్సహిస్తే ఆదాయం 5 రెట్లు పెరుగుతుందని వెల్లడైనట్లు తెలిపింది. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో సంస్థ అధ్యయనం నిర్వహించి ''చిరుధాన్యాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. దక్షిణ భారత అధ్యయనం నుంచి పాఠాలు'' పేరిట తాజాగా నివేదికను విడుదల చేసింది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ అధ్యయనంలో అలివర్‌కింగ్‌, భారతీయ గణాంకసంస్థ ఆర్ధిక విశ్లేషణ విభాగ ''శాఖాధిపతి మధురస్వామినాథన్‌, ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌ శాస్త్రవేత్త పి. పి.యువరాజ్‌, పోషకాహార శాస్త్రవేత్త డీజే నిత్యల బృందం పాల్గొంది. దేశంలో చిరుధాన్యాల స్థితిగతులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు, సాగు పునరుజ్జీవం, రైతులకు ఆదాయం పెంపు వంటి అంశాలపై తమ నివేదికను తాజాగా వెల్లడించింది. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలోని కె.హిల్స్‌ బ్లాక్‌ కేంద్రంలో అధ్యయనాంశాలను వెల్లడించింది. 

స్థితిగతులు ఇలా..
దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 200 మిలియన్‌ టన్నులు కాగా.. అందులో చిరుధాన్యాల ఉత్పత్తి 20 మిలియన్‌ టన్నుల కంటే తక్కువగా ఉంది. దేశంలో చిరుధాన్యాలకు ప్రస్తుత నికర రాబడి హెక్టారుకు దాదాపు రూ.10,000 మాత్రమే. కందగడ్డను పండించడం ద్వారా హెక్టారుకు రూ.25 వేలు వస్తోంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ గణాంకాలను అనుసరించి ఆహారధాన్యాల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. 2011-15 సంవత్సరాలలో వరికి వెచ్చించిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయం 224 శాతం, గోధుమలకు 304 శాతం కాగా, చిరుధాన్యాలకు 100 శాతమే ఉంది.

ఆరోగ్యసిరి ధాన్యాలు
అత్యధిక పోషక విలువలకు చిరుధాన్యాలు పేరు పొందాయి. వాటిలో ప్రొటీన్‌, డైటరీ ఫైబర్‌, సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కరవు నిరోధక పంటలు. తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. వీటిని బంజరుభూముల్లోనూ సాగు చేయవచ్చు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019- 21)లో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల పెరుగుదల స్థాయి స్వల్పంగా తగ్గింది. బరువు తగ్గుతున్న వారి శాతం 38 నుంచి 36కి, తక్కువ బరువు ఉన్నవారి శాతం 21 నుంచి 19కి తగ్గింది. 6 నుంచి 59 నెలల వయస్సు ఉన్న పిల్లల్లో రక్తహీనత 59 నుంచి 67 శాతానికి పెరిగింది. మహిళల్లో ఊబకాయం 21 నుంచి 24 శాతానికి, పురుషులలో 19 నుంచి 23 శాతానికి హెచ్చింది. ఈ సమస్యలకు చిరుధాన్యాలు పరిష్కారం చూపగలవు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జొన్న ఆధారిత ఉత్పత్తులను, పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకంలోనూ ప్రయోగాత్మకంగా చేర్చింది.

కె. హిల్స్‌లో ఏం జరిగింది
చిరుధాన్యాల ఉత్పత్తిలో తమిళనాడు 7వ స్థానంలో ఉంది. మిల్లెట్‌ పంటల ఉత్పత్తిని పునరుద్ధరించడానికి, చెన్నైలోని ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ 1990 నుంచి తమిళనాడులోని కె.హిల్స్‌ ప్రాంతంలో సాగును ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని చిరుధాన్యాల పరిశోధన సంస్థ, ఇక్రిశాట్‌ తదితర సంస్థల సహకారంతో వనరుల పరిరక్షణ, సాగు, వినియోగం, వాణిజ్యంపై దృష్టి సారించింది. కొత్త వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన విత్తనాలు, ఆవిష్కరణలు, ఆధునిక శుద్ధి, విలువ ఆధారిత విధానాలపై శిక్షణ ఇచ్చింది. మెరుగైన రకాలతో విత్తన బ్యాంకును ఏర్పాటుచేసింది. పంటల సాగు కోసం ఆధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసింది. ఫలితంగా ఇక్కడ సాగు పెరిగింది.

ఇదీ అధ్యయనం…
కె.హిల్స్‌లో స్వామినాథన్‌ పరిశోధన సంస్థ చేయూతతో జరిగిన మార్పులపై తాజాగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సర్వే ప్రకారం ప్రతి ఇంటికి 0.15 హెక్టార్ల భూమిలో జొన్నలు సాగు చేశారు. హెక్టారుకు 1157 కిలోలు దిగుబడి వచ్చింది చిన్నకమతాలు గల సాగుదారులకు ఆధికాదాయం సమకూరింది. చిరుధాన్యాల సాగుకు హెక్టారుకు రూ.11,644 ఖర్చు కాగా.. రూ. 16,868 ఆదాయం వచ్చింది. 2021-22 నాటికి గ్రామంలో అన్ని కుటుంబాలు నెలకు 9 రోజుల చొప్పున చిరుధాన్యాలను తింటున్నాయి. 46 శాతం మంది సగటున నెలలో ప్రతి మూడు రోజులకోసారి చిరుధాన్యాలను వినియోగిస్తున్నారు. 42 శాతం మంది నెలకు రెండుసార్లు వాటిని భుజిస్తున్నారు. పండించిన చిరుధాన్యాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక విధానాలు చేపట్టారు. చిన్న పిండిమిల్లులు అందుబాటులోకి వచ్చాయి. కె. హిల్స్‌ ఆగ్రో డైవర్సిటీ కన్జర్వర్స్‌ ఫెడరేషన్‌ పేరిట 92 గ్రామాల్లోని 109 స్వయం సహాయక సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. వాటితో వివిధ ఆహార పదార్థాలను తయారుచేసి ‘కొల్లి హిల్స్‌ నేచురల్‌ ఫుడ్‌ బ్రాండ్‌’ పేరిట తమిళనాడులోని 12 జిల్లాల్లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాల శుద్ధి యంత్రాలను ఉపయోగించడంపై శిక్షణ పొందిన తర్వాత తనకు ఆత్మ విశ్వాసం పెరిగిందని హిల్స్‌లోని ఎట్టడిపరై గ్రామ మహిళ పూంగోడి తెలిపారు. 2020కి ముందు నామక్కల్‌ జిల్లాలో బరువు తక్కువగా ఉన్న పిల్లల నిష్పత్తి 39 శాతం కాగా చిరుధాన్యాల ఉత్పత్తులను భుజించడం వల్ల ఆ నిష్పత్తి 18 శాతానికి తగ్గింది.

నివేదికలో సిఫార్సులు

  • దిగుబడే కాకుండా మిల్లెట్‌ సాగు ద్వారా రాబడిని పెంచడానికి చర్యలు చేపట్టాలి.
  • చిరుదాన్యాల శుద్ధి వల్ల మహిళలకు వంటింట్లో పనిభారం తగ్గుతుంది.
  • రైతు నేతృత్వంలోని మార్కెటింగ్‌ సమాఖ్య వంటి కొత్త సంస్థలను నెలకొల్పాలి.
  • ప్రభుత్వ సంస్థల ‘మధ్య సమన్వయం, భాగ స్వామ్యాలు అవసరం.
  • జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజనం, ఇతర పోషక కార్యక్రమాల్లో చిరుధాన్యాలను అందించాలి.

చిరుధాన్యాలకు భారీగా ప్రోత్సాహకాలుండాలి
-ప్రొఫెసర్‌ మధుర స్వామినాథన్‌, భారతీయ గణాంక సంస్థ ఆర్థిక విశ్లేషణ విభాగం శాఖాధిపతి
చిరుదాన్యాలు వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తాయి. కొత్త వ్యవసాయ పద్ధతులతో మంచి నాణ్యమైన విత్తనాల లభ్యత ఫలితంగా ఉత్పత్తి పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. మెరుగైన శుద్ధి సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల లభ్యత వల్ల చిరుదాన్యాల వినియోగం ఎక్కువగా ఉండటంతో పాటు అధిక ఆదాయాలు కూడా పెరిగాయి. దక్షిణ భారతదేశంలోని ఈ అధ్యయనాన్ని ప్రాతిపదికగా తీసుకొని చిరుధాన్యాల సాగును పెద్దఎత్తున చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. పెంపకందారులకు భారీగా ప్రోత్సాహకాలుండాలి. పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు భారీగా నిధులందించాలి. లాభదాయక ధరలు, నమ్మకమైన మార్కెటింగ్‌ మార్గాలుండాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చిరుధాన్యాల పంటలకు ధర మద్దతు లభించేలా చర్యలుండాలి.

Read More