రాష్ట్రంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి రావడంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వెంటనే కొనుగోళ్లు చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు అందరు గరిష్ట మద్ధతు ధర పొందేందుకు వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా సీసీఐ సెంటర్లలో రైతుల ఆధార్ ప్రామాణికత సమస్య వలన నిలిచిపోయిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియను, వెంటనే పునరుద్ధరించి పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు మంత్రి తుమ్మల లేఖ రాయడం జరిగింది.
అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మిర్చి ధరలు తగ్గడంతో రాష్ట్రంలో మిర్చి రైతులు ఆందోళనలో ఉన్నారని, రాష్ట్రంలోని మిర్చి రైతుల శ్రేయస్సు కోసం శ్రీజుఓజూఈ ద్వారా మార్కెట్ ధరకు ఎండుమిర్చిని కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు మంత్రి తుమ్మల లేఖ రాశారు.
– పామాయిల్‌తో పాటు ఇతర పంటలకు డ్రిప్ మరియు తుంపర సేద్య పరికరాలను అవసరం మేరకు రైతులకు అందించాలని ఆదేశాలు- రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశాలు – జూన్ మొదటి వారంలోపు రాష్ట్రంలో మరో ఆయిల్ పామ్ కర్మాగారం అందుబాటులోకి, మరో రెండు ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ఆరంభించేలా చర్యలు-
మెకడమియా పంట సాగుకు అవసరమైన పరిస్థితులను, అనువైన ప్రాంతాలను అధ్యయనం చేయాల్సిందిగా ఉద్యానశాఖ అధికారులకు ఆదేశాలు- ప్రగతి చూపని ఆయిల్ పామ్ కంపెనీలపై చర్యలు ఆరంభం, ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు కోతులు, ఇతర అడవి జంతువుల వల్ల ఇబ్బంది ఉన్న అన్ని జిల్లాలలో ఉద్యాన పంటల రక్షణకు సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సోలార్ పెన్సింగ్ స్కీం అమలవుతున్న హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీపై అందచేయుటకు విధివిధానాలు వెంటనే సిద్ధం చేయాలని ఈ రోజు సచివాలయంలో ఉద్యానశాఖ అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. దీనివల్ల కూరగాయలు మరియు ఉద్యాన పంటల సాగు చేయడానికి రైతులు ముందుకు రావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న అన్ని ప్రాంతాలలో కూరగాయాల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటుచేసి, రైతులకు ప్రోత్సహకాలు కూడా అందించేలా చూడాలన్నారు. కూరగాయల సాగు కోసం అవసరం మేరకు యంత్ర పరికరాలు సబ్సిడిపై అందించి, సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో కూరగాయల పంటలను పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసి, కూరగాయలను దిగుమతి చేసుకొనే స్థితి నుండి ఎగుమతి చేసే స్థితికి తీసుకురావాలని మంత్రిగారు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం సంబంధించి కూడా ముందస్తుగా డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల పంపిణీ కోసం ధరఖాస్తులను స్వీకరించి, గ్రౌండింగ్ మొదలు పెట్టాల్సిందిగా ఆదేశించారు. ఇతర రాష్ట్రాలలో సాగు చేస్తు లాభాలు పొందుతున్న మెకడమియా పంటను రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి గల వాతావరణ స్థితిగతులు, నేలలు, నర్సరీలు, మార్కెటింగ్ అవకాశాలను అధ్యయనం చేయాలని ఉద్యానశాఖ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. మార్చి నెలాఖరుకల్లా ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, తక్కువ పురోగతి ఉన్న కంపెనీలకు నోటిసులు జారీ చేసి, ఏఏ జిల్లాలలో తక్కువ పురోగతి ఉందో వాటికి అనుమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌పామ్ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి మల్టి నేషనల్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీకి సదరు ప్రాంతాన్ని అప్పగించడం జరిగిందని, అలాగే ఇంకా ఎక్కడైతే కంపెనీలు మూడు, నాలుగు సంవత్సరాలు అయినప్పటికి ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి భూమి గుర్తించక పోవడం, ప్లాంటేషన్ లక్ష్యాన్ని చేరుకోని కంపెనీలను తొలగించి, వాటి స్థానంలో ఆయిల్‌ఫెడ్‌కు బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయిల్‌పామ్ సాగు కోసం 2 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని ఆదేశించారు. ఆయిల్ ఫెడ్ సిబ్బందికి కూడా లక్ష్యాలు నిర్ధేశించి వాటిని చేరుకొనే విధంగా పనిచేసేటట్లు చూడాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా లక్ష్యానికి అనుగుణంగా ప్లాంటేషన్ పూర్తి చేసేట్టుగా, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పర్యవేక్షణ చేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్‌కు సూచించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ఉమ్మడి జిల్లాలలో కనీసం ఒక పామ్‌ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేలా చూడాలని, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కనీసం సంబంధింత జిల్లాలలో 6 వేల ఎకరాలకు పైన ప్లాంటేషన్ ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, అదేవిధంగా గద్వాల జిల్లా బీచుపల్లిలో, ఖమ్మం జిల్లా కల్లూరిగూడంలో ఆయిల్‌పామ్ కర్మాగారాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, పనులు ప్రారంభించి, ఈ డిసెంబర్ కల్లా వాటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 6 వేల ఎకరాలపైన ప్లాంటేషన్ పూర్తి చేసిన ప్రైవేట్ కంపెనీలు కూడా వెంటనే పామ్‌ఆయిల్ కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, ఆయిల్‌ఫెడ్ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు
అమరావతిలో అంతర్జాతీయ స్థాయి గార్డెన్ సెంటర్ నెలకొల్పేందుకు ఇజ్రాయెల్ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. విజయవాడలోని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. లక్ష్మీపార్థసారథితో ఇజ్రాయెల్ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. శీతోష్ణస్థితిని బట్టి పెంచగలిగే వివిధ రకాల పండ్లు, పూలు, కూరగాయలు తదితరాల గురించి దృశ్య మాధ్యమం ద్వారా వివరించారు. వారి సొంత నర్సరీల్లో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను సమావేశానికి తీసుకొచ్చారు. తమ ప్రతిపాదనలను సీఎండీకి వివరించారు. సమావేశంలో గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఇజ్రాయెల్ ప్రతినిధులు డేవిడ్ మిజ్రహి, ప్రశాంత్, కిషోర్, ఏడీసీ హార్టీకల్చర్ విభాగాధిపతి వి. ధర్మజ, అర్బన్ ప్లానింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అధికారులు పి.సురేష్ బాబు, కె.వి. గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాదులోని భారతీయ వరి పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్, భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్) సంచాలకులు డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జానయ్య మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధనలు ప్రాధాన్యతా పద్ధతిలో చేపట్టాలని, వరిలో ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుతో పాటు రైతులకు, వినియోగదారులకు కూడా ప్రయోజనాలు కలిగించే విధంగా ఇరు సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. వరిలో కార్భన్ క్రెడిట్ ద్వారా రైతులు మరింత ఆర్థికపరమైన ప్రయోజనం కలిగించే విధానాలపై దృష్టి నిలపాలన్నారు. వరిలో వాతావరణ మార్పులను తట్టుకునే వరి రకాల రూపకల్పన ప్రస్తుతం అవసరమన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ 5 మిలియన్ టన్నుల మేర వరి ధాన్యం మిగులు ఉత్పత్తి చేస్తోందని, అందుకు ఎగుమతులే సరైన విధానమని, రైతులను అటువైపు మళ్లించడానికి అవసరమైన సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశమైన ఫిలిప్పైన్స్‌కు మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడానికి ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునే విధంగా వరి పంట సాగును ఒక ఆధునికమైన పరిశ్రమగా మార్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా రెండు సంస్థలు తదనుగుణంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ వరి పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం మాట్లాడుతూ రైతులకు మేలైన సేవలు అందించేందుకు ఇరు సంస్థలు సమన్వయంతో పనిచేసేందుకు ఈ అవగాహన ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, ఐఐఆర్‌ఆర్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాల కోళ్లు, గుడ్ల వాహనాల అడ్డగింత ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చర్యలు
ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్ల సరఫరాను అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఏపీ నుంచి రాష్ట్రానికి వస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకొని వెనక్కి పంపించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎనిమిది, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మరో 21 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల కోళ్ల వాహనాలను అడ్డుకున్నారు.
ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా అన్ని జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. పౌల్ట్రీ రంగానికి చెందిన వారికి దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల, గుడ్ల వాహనాలను అడ్డుకొని వెనక్కి పంపించాలన్నారు.
బర్డ్ ఫ్లూపై పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లో హెల్ప్ లైన్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) పై అప్రమత్తతలో భాగంగా హైదరాబాద్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్ 040-23314876 నంబర్‌తో సహాయక కేంద్రం (హెల్ప్ లైన్) ఏర్పాటు చేసినట్లు సంచాలకుడు గోపి తెలిపారు. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే ఈ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇవ్వాలని జిల్లాల పశువైద్యాధికారులకు సూచించారు.
వైరస్‌తో 11 వేల కోళ్ల మృతి ఆందోళనలో పౌల్ట్రీఫామ్ యజమానులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులను కుదిపేసింది. వైరస్ బారిన పడి వేల కోళ్లు మృతిచెందడంతో యజమానులకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. గంపలగూడెం మండలం అనుముల్లంకలోని శ్రీబాలాజీ పౌల్ట్రీఫామ్‌లో ఇప్పటి వరకు 11వేల బ్రాయిలర్ కోళ్లు వైరస్‌తో చనిపోయాయి. మరో 3,800 కోళ్లు వైరస్‌తో కొన ఊపిరితో ఉన్నాయని, యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పశు వైద్యాధికారులు అభిలాష్, సాయికృష్ణ అనుముల్లంక వెళ్లి పరిశీలించారు. నమూనాలను ప్రయోగశాలకు పంపించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. మృతిచెందిన కోళ్లను గుంత తీయించి పూడ్చిపెట్టారు.
గోదావరి జిల్లాల నుంచి వచ్చే కోడిగుడ్లను తాత్కాలికంగా మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించవద్దని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి బర్డ్ ఫ్లూ వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు.
హిమాచల్ ప్రదేశ్, మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్‌లో జరిగిన నేషనల్ సర్వీస్ స్కీమ్ – నేషనల్ అడ్వెంచర్ క్యాంప్- 2024 లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎనిమిది కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. 2024 నవంబర్ 15-24 తేదీల మధ్య 10 రోజులపాటు ఈ క్యాంపు జరిగింది. ఈ అడ్వెంచర్ క్యాంప్‌లో భాగంగా రాక్ క్లయింబింగ్, రివర్ క్రాసింగ్, ట్రెక్కింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ, సామర్థ్యాలను చాటారు. అందుకుగాను వారందరికీ ప్రతిభా పురస్కార పత్రాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా ఈ అడ్వెంచర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు ఈరోజు పరిపాలన భవనంలో పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్యని కలిశారు. ఉపకులపతి విద్యార్థినీ, విద్యార్థులని అభినందించారు. విద్యతో పాటు క్రీడలలో కూడా విద్యార్థినీ, విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సి.హెచ్ వేణుగోపాల రెడ్డి, సైఫాబాద్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ చల్లా పాల్గొన్నారు.
సూక్ష్మసేద్యంలో ఆటోమేషన్ అమలు, ధర నిర్ణయం, వాటి విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ఉద్యానవన డైరెక్టర్ ఛైర్మన్‌గా, రాష్ట్ర సూక్ష్మసేద్య అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఓ శాస్త్రవేత్తతో పాటు వివిధ సంస్థల నుంచి మరో నలుగురు సభ్యులుగా కొనసాగుతారని తెలిపింది.
ఈ వ్యాధితో గత రెండేళ్లలో 2 లక్షల పశువుల మృతి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి (ఎల్‌సిడి) టీకా అందుబాటులోకి రాబోతోంది. పాడి పశువులకు ఈ టీకా ఇస్తారు. ‘బయో లంపివ్యాక్సిన్’ అనే ఈ టీకా మనదేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి సీడీఎస్‌సీఓ (సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నుంచి లైసెన్సు వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని పేర్కొంది. దీన్ని ఐసీఏఆర్-ఎన్‌ఆర్‌సీఈ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)లలో విస్తృతంగా పరీక్షించినట్లు వివరించింది. హిస్సార్‌లోని ఐసీఏఆర్-ఎన్‌ఆర్‌సీఈ అందించిన ఎల్‌ఎస్‌డీ వైరస్ / రాంచీ/ 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్‌తో బయోవెట్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు సీడీఎస్‌సీఓ లైసెన్సు లభించడం, మనదేశంలో పశుసంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఎల్‌ఎస్‌డీ వ్యాధి వల్ల మనదేశంలో గత రెండేళ్లలో 2 లక్షల పశువులు చనిపోయాయి. ఇంకొన్ని లక్షల పాడి పశువులు వట్టిపోయాయి.
ఏటా 50 కోట్ల డోసుల తయారీ ‘బయోలంపివ్యాక్సిన్’ను వెంటనే విడుదల చేస్తామని కృష్ణ ఎల్ల తెలిపారు. బయోవెట్‌కు కర్ణాటకలోని మల్లూర్‌లో ఉన్న యూనిట్లో ఏటా 50 కోట్ల డోసులు టీకాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్‌ఎస్‌డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్ వర్గాలు వివరించాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొన్నాయి.
మార్చి 11 తర్వాత బాధ్యతల స్వీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పొగాకు బోర్డుకు ఈడీగా త్రిపుర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి బి. విశ్వశ్రీ నియమితులయ్యారు. ఆమెను నాలుగేళ్ల కాలానికి డిప్యుటేషన్‌పై నియమిస్తూ డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈడీగా పనిచేస్తున్న అద్దంకి శ్రీధర్ బాబు పదవీ కాలం మార్చి 11తో ముగియనుంది. ఆ తర్వాత విశ్వశ్రీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఊరూరా చిరుధాన్యాలు సాగు కావాలని.. ఇంటింటికీ వాటి ఆహారం చేరాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ సి. తారాసత్యవతి ఆకాంక్షించారు. ప్రతిఒక్కరు చిరుధాన్యాలను ప్రాథమిక అవసరంగా గుర్తించి వినియోగించాలన్నారు. ఐఐఎంఆర్ పదో వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం రాజేంద్రనగర్‌లోని సంస్థ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”రైతులు పెద్దఎత్తున చిరుధాన్యాల సాగు చేపట్టి వాటికి పూర్వవైభవం తీసుకురావాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సాహం అందించాలి. ఐఐఎంఆర్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది. సాగు విస్తరణతోపాటు ఆహార శుద్ధి, వినియోగం, ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఏపీ, తెలంగాణతోపాటు మరో అయిదు రాష్ట్రాల రైతులతో కిసాన్ మేళా నిర్వహిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో సాగు ప్రణాళికలను వెల్లడిస్తాం” అని తారాసత్యవతి తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్, నార్మ్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ ఆర్సీ అగర్వాల్ మాట్లాడుతూ.. చిరుధాన్యాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. వీటిపై అంకురాల ద్వారా విస్తృత ప్రయోగాలు జరగాలన్నారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు ఫౌండేషన్ జోనల్ విభాగాధిపతి ఆసిఫ్ ఇక్బాల్, ఐఐఎంఆర్ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు, అంకుర వ్యవస్థాపకులు పాల్గొన్నారు.