ఔరా అనిపిస్తున్న అటవీ ఉత్పత్తులు

తూర్పు కనుమల్లోని ప్రకృతి అందాలే కాదు.. అటవీ ఉత్పత్తులూ ఔరా అనిపిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కిల్లోగుడలో సంజీవిని సంస్థ నిర్వహిస్తున్న ‘పాత విత్తనాల పండగ’లో వెరైటీ ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటివే.. డుంబ ఉల్లి, కొండ గిలక్కాయ్‌. మహిళ చేతిలో ఉన్నదే డుంబ ఉల్లి. కిలో బరువుంది. కొండల్లో రాళ్ల మధ్య అరుదుగా పెరుగుతాయని తెలిపారు. ఉల్లి గుజ్జును చర్మ వ్యాధులకు, గొంతు నొప్పి నివారణకు, పశు వైద్యానికి వాడుతామని గిరిజనులు వివరించారు. మరొకరి చేతిలో భారీ చింతకాయలా ఉన్నదే.. కొండ గిలక్కాయ. వీటి చెట్లు ఒడిశా సరిహద్దులో చువ్వ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్కో గిలక్కాయ 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంది. ఇందులోని పిక్కలను ఔషధాలుగా ఉపయోగిస్తామంటున్నారు.

Read More

ఖరీదైన మామిడి.. పాణ్యంలో సాగు

ఫలించిన మాజీ మంత్రి ఏరాసు ప్రయత్నంకాయలు కాసిన మియాజాకీ రకం

ప్రంచంలో ఖరీదైన మామిడిగా పేరొందిన ‘మియాజాకీ’ రకం మామిడిని ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన తెదేపా నేత, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. జపాన్‌లో పండే ఈ రకం మామిడి.. గతంలో బంగ్లాదేశ్‌లో ఒక కేజీ రూ. లక్ష పలికింది. దాంతో మియాజాకీ మామిడిపండ్లపై ప్రపంచ రైతులు దృష్టి సారించారు. మంచి రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరోటిన్‌, విటమిన్‌-సి, విటమిన్‌-ఎ, ఫోలిక్‌ యాసిడ్‌ వంటివి అందులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి రెండేళ్ల కిందట బంగ్లాదేశ్‌లో జరిగిన ‘మామిడి మేళా’ ప్రదర్శనలో ఆరు మియాజాకీ రకం మొక్కలను కొనుగోలు చేసి తన పొలంలో వేశారు. ఉద్యానశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ వాటికి తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించడంతో ఈ ఏడాది కాయలు కాశాయి.

ప్రయోగక్షేత్రంగా తోట..
పాణ్యంలోని తన పొలంలో అరుదైన జాతుల మొక్కలను పెంచుతూ ప్రతాప్‌రెడ్డి దాన్ని ఒక ప్రయోగక్షేత్రంగా మార్చేశారు. మామిడిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 20 రకాలకు చెందిన 1,500 మొక్కలను బంగ్లాదేశ్‌ నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందులో 400 మొక్కలు బతికాయి.

Read More

వ్యవసాయంలో కృత్రిమ మేధ వినియోగంపై బిట్స్‌ పిలానీప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం

వ్యవసాయంలో కృత్రిమ మేధ వినియోగంపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బిట్స్‌ పిలానీల మధ్య శుక్రవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్‌ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని అగ్రి హబ్‌లో జరిగిన కార్యక్రమంలో పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య, బిట్స్‌ పిలానీ ఉపకులపతి ప్రొఫెసర్‌ వి. రాంగోపాల్‌ రావు సమక్షంలో అవగాహన ఒప్పందం పత్రాలపై ఇరుసంస్థల అధికారులు సంతకాలు చేశారు. పరస్పరం ఒప్పంద పత్రాల్ని మార్చుకున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థల మధ్య జరిగిన ఈ అవగాహన ఒప్పందం సంయుక్తంగా పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనకు, పీహెచ్‌.డీ. విద్యార్థులకు పరిశోధన సలహాలు ఇవ్వడానికి దోహదం చేస్తుందని బిట్స్‌ పిలాని ఉపకులపతి ప్రొఫెసర్‌ వి. రాంగోపాల్‌ రావు అన్నారు. ఇరు సంస్థల శాస్త్రవేత్తలు కలిసి నాణ్యమైన పరిశోధనా పత్రాలు ప్రచురించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. దుబాయ్‌ తోపాటు దేశంలోని 4 చోట్ల బిట్స్‌ క్యాంపస్‌లు ఉన్నాయని, అందులో ప్రతి ఏటా సుమారు 600 మంది పీహెచ్‌.డీ.లో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. దేశంలోనే మూడవ అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టార్టప్‌ నెట్వర్క్‌ బిట్స్‌ పిలానీ సంస్థ కు ఉందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించి రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని వివరించారు. పిజేటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రాచీన వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండోదని, ఇది అమెరికా ల్యాండ్‌ గ్రాంట్‌ మోడల్‌లో ఏర్పాటయిందని తెలిపారు. గ్రామీణ స్థాయి వరకు అత్యంత పటిష్టమైన పరిశోధన నెట్‌ వర్క్‌ కలిగి ఉండడంతోపాటు అనేక వ్యవసాయ విద్య, విస్తరణ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉండి రైతులకు మెరుగైన సేవలు అందించడంలో నిమగ్నమైందని అన్నారు. 2047 నాటికి మానవ రహిత వ్యవసాయం తీసుకురావాలనే లక్ష్యంతో తాము ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం డిజిటల్‌ అగ్రికల్చర్‌ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. బిట్స్‌ పిలానీతో జరిగిన ఈ అవగాహన ఒప్పందం వల్ల తాము అనుకున్న మానవ రహిత వ్యవసాయ లక్ష్యాలను సాధించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ పరిజ్ఞానం (హార్డ్‌ వేర్‌), బిట్స్‌ పిలానీలోని సాఫ్ట్‌ వేర్‌ కలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల సాగుకి ఉపయోగపడే అగ్రి రోబోల రూపకల్పన జరగాలని జానయ్య ఆకాంక్షించారు.
పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ బలరాం అవగాహన ఒప్పందం ముఖ్య లక్ష్యాల గురించి సమావేశంలో వివరించారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సీహెచ్‌. విద్యాసాగర్‌, బిట్స్‌ ఫిలానీ డీన్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ డాక్టర్‌ సంకేత్‌ గోయల్‌, పిజేటిఏయు అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకులు డాక్టర్‌ రాములు, డిజిటల్‌ అగ్రికల్చర్‌ సంచాలకులు డాక్టర్‌ బాలాజీ నాయక్‌, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బిట్స్‌ పిలానీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

మూడున్నర నిమిషాల్లోనే మిర్చిని బస్తాల్లోకి తొక్కేసే యంత్రం

బాపట్ల పోస్ట్‌హార్వెస్ట్‌ సెంటర్‌లో కొత్త ఆవిష్కరణకు పేటెంట్‌ లభించింది. కాళ్లకు మంటలు లేకుండా..పొలంలో కోసిన మిర్చిని కళ్లంలో ఆరబెట్టాక గ్రేడింగ్‌ చేయించి గోతాల్లో తొక్కి మార్కెట్‌కు తరలిస్తారు. బస్తాల్లోకి ఒకరు కాయలు పోస్తుంటే మరొకరు లోపలకు దిగి కాళ్లతో తొక్కాలి. మిరప మంట కూలీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఎండుమిర్చిని గోతాల్లో నింపే యంత్రాన్ని బాపట్ల పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ కేంద్రం తయారుచేసింది. దీనికి పేటెంట్‌ లభించింది. తక్కువ సమయంలో ఎక్కువ టిక్కీలు నింపడంతోపాటు మిర్చి దెబ్బతినకుండా, విత్తనాలు రాలకుండా నింపొచ్చు.

Read More

సీతారామ, సీతమ్మసాగర్లకు సాంకేతిక అనుమతులు

సమీకృత సీతమ్మసాగర్‌, సీతారామ ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక అనుమతి లభించింది. ఫలితంగా గోదావరి జలాల సమర్థ వినియోగానికి నిర్మిస్తున్న ఈ పథకాలకు అడ్డంకులు తొలగడంతోపాటు వేగంగా పూర్తి చేయడానికి అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడానికి ముందడుగు పడింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన జలసంఘం సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సమావేశంలో ఈ పథకాలకు ఆమోదముద్ర పడింది. ఈ భేటీలో కేంద్ర జలసంఘం చైర్మన్‌(సీడబ్ల్యూసీ) అధ్యకక్షుడు ముఖేష్‌ కుమార్‌ సినా, తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్సీ(జనరల్‌) అనిల్‌ కుమార్‌, కొత్తగూడెం ఎస్‌ఈ శ్రీనివాస రెడ్డి, అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్య ప్రసాద్‌ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రాజీవ్‌, ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకాలను… తెలంగాణ ఏర్పడిన తర్వాత రద్దు చేసి, సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. గోదావరిలోని 67.05 టీఎంసీల నీటి వినియోగంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు నాగార్జునసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా లక్ష్యంగా చేసుకున్నారు. సీడబ్ల్యూసీ తాజాగా ఆమోదించిన ప్రకారం 7.87 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద 36.5 టీఎంసీల సామర్ధ్యంతో సీతమ్మసాగర్‌ ఆనకట్ట నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దీని అనుమతుల సమయంలోనే సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ను కలిపి ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టుగా డీపీఆర్‌ తయారుచేయాలని సీడబ్ల్యూసీ సూచించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ సిద్ధం చేసి, జలసంఘానికి పంపింది. దీన్ని సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు డీపీఆర్‌ను అధ్యయనం చేసి, అనుమానాలను లేవనెత్తగా… నీటిపారుదల శాఖ అధికారులు పరిష్కరిస్తూ వచ్చారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జలశక్తి మంత్రిని కలిసి అనుమతుల కోసం వినతిపత్రం సమర్పించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సలహాదారు ఆదిత్యనాధ్‌ దాస్‌తో కలిసి పలుదఫాలు దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని, అధికారులతో పలుదఫాలు చర్చించారు. మార్చిలో జరిగిన టీఏసీ సమావేశంలోనే డీపీఆర్‌కు ఆమోదం లభించాల్సి ఉన్నా… మేడిగడ్డ బ్యారేజి సంఘటన నేపథ్యంలో సీతమ్మసాగర్‌ డిజైన్లను జలసంఘం పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామంటూ టీఏసీ చైర్మన్‌, జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ వాయిదా వేశారు. దాంతో కొత్తగూడెం చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాసరెడ్డి, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) ఇంజినీర్లు దిల్లీకి వెళ్లి జలసంఘం ఇంజినీర్లు అడిగిన వివరాలను సమర్పించిన తర్వాత సీతమ్మసాగర్‌ డిజైన్‌కు ఆమోదం లభించింది. గురువారం జరిగిన సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత సాంకేతిక అనుమతి ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు కేంద్ర కార్యదర్శి ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి రావడంతోపాటు ఎన్జీటీలో ఉన్న కేసు కూడా పరిష్కారమైన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌కు వెళ్లనుంది. ఈ అనుమతి వస్తే కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడానికి అవకాశం ఉంటుంది. సీతారామ, సీతమ్మసాగర్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టుకు కేంద్రజల సంఘం టీఎసీ అనుమతి రావడంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతిలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తంచేశారు.

Read More

29, 30 తేదీల్లో ఆంగ్రూ వజ్రోత్సవాలు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) వజ్రోత్సవాల (1962-2024)ను గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌. శారద జయలక్ష్మీ దేవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథులుగా గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరవుతారని పేర్కొన్నారు. 29న వ్యవసాయం, అనుబంధ విభాగాల్లో అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న మార్పులపై సదస్సు జరుగుతుందన్నారు. 30న వర్సిటీ రూపొందించిన వంగడాలతో రైతులకు కలిగిన ప్రయోజనాలపై చర్చిస్తారని వెల్లడించారు.

Read More

మద్దతు ధరపై హైబ్రిడ్‌ జొన్న కొనుగోలు

మద్దతు ధరపై జొన్న సేకరణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. 6.93 లక్షల క్వింటాళ్లను రైతుల నుంచి సేకరించనుంది. క్వింటాల్‌ రూ. 3,371 ల ధరపై ఈ నెల 20 నుంచి జూన్‌ 20 వరకు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయాలని ఆదేశిస్తూ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచి పంట కొంటారు. ఇందుకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ ద్వారా మానవ ఆహారానికి ఉపయోగపడే జొన్నలను సేకరిస్తున్నారు. హైబ్రిడ్‌ రకాల జొన్న తీసుకోక పోవడంతో వాటిని సాగు చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటిని కూడా మద్దతు ధరపై సేకరించేందుకు అనుమతిచ్చింది.

Read More

ఆదర్శ రైతు వ్యవస్థ’పై అధ్యయనం

తెలంగాణలో ఆదర్శ రైతుల నియామకం చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ సిఫార్సుపై వ్యవసాయశాఖ అధ్యయనం చేపట్టింది. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శ రైతుల నియామకం జరిగింది. అప్పట్లో ప్రతి వేయి ఎకరాలకు ఒకర్ని నియమించి, వారికి నెలకు రూ. వేయి చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. ఆ పంథాలోనే మళ్లీ నియామకం చేపట్టాలని వ్యవసాయ కమిషన్‌ తాజాగా సిఫార్సు చేసింది. వారిని ఎలా వినియోగించుకోవాలో సూచించింది. జూన్‌ రెండో తేదీన విత్తనాల పంపిణీ కోసం గ్రామానికి ఇద్దరు లేదా ముగ్గురు అవసరం ఉన్నందున ఆ మేరకు తాత్కాలికంగా ఎంపిక చేయాలని యోచిస్తోంది. బుధవారం వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావును కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి కలిసి ఆదర్శరైతుల నియామకంపై వినతిపత్రం ఇచ్చారు. ఆదర్శ రైతుల నియామక ప్రక్రియపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంత్రిమండలిలో చర్చించిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విత్తనాల పంపిణీకి, ఆదర్శరైతుల నియామకానికి సంబంధం లేదన్నారు.

Read More

లేత వర్ణం పసుపు సూర్య విడుదల

ఐఐఎస్‌ఆర్‌ శాస్త్రవేత్తల తయారీ.. హెక్టారుకు 41 టన్నుల దిగుబడి
భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ(ఐఐఎస్‌ఆర్‌) లేత వర్ణం పసుపు రకం ‘సూర్య’ను రూపొందించి బుధవారం విడుదల చేసింది. దేశంలో అధిక పసుపు పండించే రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ, ఒడిశా, ఝార్ఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ లకు ఇది అనుకూలమని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో దీనిని ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయవంతం కావడంతో తాజాగా విడుదల చేశారు. భారత్‌లో పండించే పసుపు దేశ, విదేశాల్లో విస్తృతంగా వినియోగంలో ఉంది. ప్రస్తుతం పండే పసుపును వంటలు, తినుబండారాలు, ఔషధ, రసాయనాలు, సౌందర్యసాధనాలకు వాడుతున్నారు. చిక్కటి రంగు కనిపించవద్దనే ఉద్దేశంతో దానిని వాడే సమయంలో ఇతర పదార్థాలను కలుపుతున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి లేత రంగు పసుపును తయారు చేసి దానికి సూర్య అని పేరు పెట్టారు. పసుపు జెర్మ్‌ ప్లాజమ్‌ కన్జర్వేటరీల నుంచి క్లోనల్‌ ఎంపిక ద్వారా అభివృద్ధి చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. పసుపులోని నాణ్యతకు ప్రమాణంగా కొలిచే కుర్క్‌మిన్‌ 2 నుంచి మూడు శాతం ఎక్కువగా ఉంటుంది.

దిగుబడులు అధికం
ప్రస్తుతం సాధారణ రకం హెక్టార్‌కు 29 టన్నుల వరకు పండుతుండగా. సూర్య హెక్టారుకు 41 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. దీని పంటకాలం తొమ్మిది నెలలుగా నిర్ధారించారు. ఈ రకం సువాసన ఇవ్వడంతోపాటు మసాలా, పొడులు, ఔషధ, రసాయనాలు, ఫేస్‌ క్రీమ్‌లకు అనుకూలంగా ఉంటుందని, విదేశాలకు భారీగా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉందని దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు డి.ప్రసాద్‌, ఆరతి, ఎన్‌.కె. లీల, ముకేశ్‌, శంకర్‌, శశికుమార్‌ తెలిపారు. ఆల్‌ ఇండియా కోఆర్డినేటెడ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ ఆన్‌ స్పైసెస్‌ ద్వారా దీనిని త్వరలోనే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు.

Read More

రాష్ట్రంలో పంటల భీమా పథకం అమలుకు కసరత్తు

రైతులందరికి ప్రయోజనం చేకూరేవిధంగా చర్యలు – మంత్రి తుమ్మల
ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు మరియు ఇతర అధికారులతో పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఈ పథకం కింద రైతులందరికి భీమా అందేలా మరియు ఏఏ పంటలకు భీమా పథకాన్ని వర్తింపచేయాలనే విషయాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా వానాకాలం మరియు యాసంగి కాలాల్లో ఏఏ పంటలకు ఏఏ విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు.
నష్టం కలిగే సంభావ్యత ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించడం జరిగిందని, సాధారణంగా వానాకాలం సీజన్‌లో సుమారు 128 లక్షల ఎకరాలు పంటలు వేయడం జరుగుతుందని, వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23, పత్తి 44.75, మిర్చి 1.90, సోయాబీన్‌ 3.80, కంది 5.21 లక్షల ఎకరాలు సాగవగా, యాసంగి పంటకాలంలో మొత్తం 78 లక్షల ఎకరాలల్లో పంటలు సాగవగా, వరి 59 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు మంత్రిగారికి వివరించారు.
ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికిగాను మొత్తం ప్రీమియంలో రైతు వాటా 2 శాతం, యాసంగి పంటకాలంలో 1.5 శాతం, వాణిజ్య మరియు ఉద్యానపంటలకు గాను 5 శాతం ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం 50:50 భరించడం జరుగుతుందని తెలిపారు. రైతులందరికి పంటలభీమా వర్తింపచేయడం వలన స్థూల పంట విస్తీర్ణంలోని 98 శాతం విస్తీర్ణానికి భీమా వర్తిస్తుందని మంత్రిగారికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాతావారణ మార్పుల వలన ప్రధానంగా అకాల వర్షాల వలనగాని, అధిక వర్షాల వలన గాని, వడగండ్ల వానల వలన, వర్షాభావ పరిస్థితుల వలన గాని కలిగే పంట నష్టానికి పంటల భీమా వల్ల రైతులకు కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీచేసే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దిగుబడి ఆధారిత భీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్‌, వేరుశనగ, శనగ, నువ్వులు, మొదలైన పంటలు మరియు వాతావరణ ఆధారిత భీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్‌ పామ్‌, టమాట, బత్తాయి మరియు మొదలైన పంటలకు భీమా వర్తింపచేసే విషయంలో పూర్తిస్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షం వలన నష్టపోయే వరి మరియు మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలుచేస్తున్నాయో అధ్యయనం చేసి, రైతులందరికి ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాలను రూపొందించడం మరియు నష్టపోయిన పంటల విషయంలో భీమా కంపెనీలు సత్వరమే భీమా క్లెయిమ్‌ అందించుటకు గల విధివిధానాలను రూపొందించాలని సూచించారు. వానాకాలం మరియు యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని రకాల ప్రధాన పంటలకు భీమా ప్రీమియం అంచనా వేయుటకు వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

Read More