వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య శనివారం మృతిచెందారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన ఈ 85 సంవత్సరాల మొక్కల ప్రేమికుడు ఇంటిపేరునే వనజీవిగా మార్చుకుని జీవితమంతా కోటికి పైగా మొక్కలు నాటి, పెంచి సరికొత్త చరిత్ర సృష్టించినందుకు 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈ పర్యావరణవేత్తను అదే సంవత్సరం ‘రైతునేస్తం’ పురస్కారాల్లో ‘ప్రకృతిరత్న’ బిరుదుతో సత్కరించింది. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు రైతునేస్తం సంపాదకులు యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు.

Read More

మంత్రి తుమ్మల నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ సందర్శన

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌ పామ్‌ ప్యాక్టరీని మంత్రి పొన్నంతో కలిసి వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. జూన్‌ రెండవ వారంలో క్రషింగ్‌ మొదలుపెట్టే విధంగా ప్రణాళిక చేసుకొని, దాని ప్రకారం రోజువారి ప్రగతిని జిల్లా కలెక్టర్‌కి సమర్పించవలసిందిగా ఆయిల్‌ ఫెడ్‌ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

Read More

పత్తి కట్టె.. ఆదాయం తెచ్చిపెట్టే!

  • ‘బయోఫ్యూయల్‌ బ్రిక్స్‌’ తయారీ
  • రైతులకు, పొలాలకు మేలు

పత్తి పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థంగా పడి ఉండే పత్తి కట్టె ఇప్పుడు రైతులకు ఆదాయవనరుగా మారింది. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ‘బయోఫ్యూయల్‌ బ్రిక్‌’ పరిశ్రమను ఏర్పాటు చేసిన ఓ కంపెనీ ఆ కట్టెను కొనుగోలు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. దాదాపు 3.60 లక్షల మంది రైతులు సాగుచేస్తుండగా పంట అనంతరం టన్నుల కొద్దీ పత్తి కట్టె పోగవుతోంది. సాధారణంగా రైతులు ఈ కట్టెను పొలాల్లోనే కాల్చేస్తుంటారు. అయితే కంపెనీ ప్రతినిధులే పొలాలకు వెళ్లి దాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో కంపెనీ రోజుకు 70 టన్నుల కట్టెను కొనుగోలు చేస్తోంది. ఇలా గత ఏడాది 9 వేల టన్నులు కొనుగోలు చేశారు. రైతులకు ఎకరాకు రూ.1000 చెల్లించి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పొలానికి ఒక యంత్రాన్ని పంపించి అక్కడే కట్టెను పిప్పిగా మార్చి తెచ్చుకుంటున్నారు. ఈ పిప్పిని యంత్రాల ద్వారా ‘బ్రిక్స్‌’గా తయారుచేసి సంచుల్లో నింపి రవాణా చేస్తుంటారు. ఎకరా పొలం నుంచి సేకరించిన కట్టెతో.. తేమశాతం, వృథా పోను 6 క్వింటాళ్ల బ్రిక్స్‌ తయారవుతాయి. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా అనేక పరిశ్రమలు ఈ బ్రిక్స్‌ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. పత్తి ‘బ్రిక్స్‌’ వినియోగిస్తే పొగ రాకపోవడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుండటంతో ఎక్కువగా ఫార్మసీ, డెయిరీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ తోపాటు మహారాష్ట్రలోని పలు పరిశ్రమలకు వీటిని రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బ్రిక్స్‌ కిలో ధర రూ.6-7ల వరకు ఉంది.

*భూసారం దెబ్బతినకుండా..*

రైతులు పత్తి పంట పూర్తికాగానే కట్టెను తొలగించి పొలంలోనే కాల్చేస్తుండటంతో వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బ తింటుందని, మిత్రపురుగులు చనిపోతున్నాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. పొలం నుంచి పత్తి కట్టెను పూర్తిగా తరలించడంతో గులాబీ పురుగు వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.

Read More

నైరుతిలో వర్షపాతం.. సాధారణం

రుతుపవనాలకు పరిస్థితులు అనుకూలం
ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్‌’ అంచనా

దేశ వ్యవసాయానికి దిక్సూచి నైరుతి రుతుపవనాలు. రాబోయే 'నైరుతి' సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ వెల్లడించింది. మార్చి వరకు వాతావరణ పరిస్థితులు, పలు అంశాలను విశ్లేషించిన తర్వాత తాజాగా రుతుపవనాల అంచనా నివేదికను విడుదల చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మి.మీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్‌ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకోనున్నాయి.

దక్షిణాదిలో సమృద్ధిగా వర్షాలు
భౌగోళిక అంచనాల పరంగా పశ్చిమ, దక్షిణ భారత దేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో, కేరళ, కర్ణాటకలోని తీర ప్రాంతం, గోవాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర భారతంలోని కొండ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సాధారణం కంటే 30 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. ఆయా ప్రాంతాలు మినహా తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలే కురుస్తాయి. జులైలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టు, సెప్టెంబరులో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

మే నుంచే వర్షాలు..
మార్చి వరకు నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం రుతుపవనాలపై ఏప్రిల్‌ 15 నాటికి ఐఎండీ బులెటిన్‌ విడుదల చేస్తుంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌(ఐఓడీ) రుతుపవనాల ప్రారంభానికి ముందు సానుకూలం (పాజిటివ్‌)గా మారనుంది. మే నెల నుంచే వర్షాలు కురిసేందుకు అవకాశముంది.
*కేజే రమేష్‌, మాజీ డైరెక్టర్‌ జనరల్‌, ఐఎండీ

Read More

రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యం – మంత్రి తుమ్మల

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి మరియు ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ”గ్రామ గ్రామానికి జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం” అనే నూతన కార్యక్రమాన్ని జూన్‌ మొదటి వారంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అనేక రకాల కొత్త వంగడాలను అభివృద్ధి పరిచారని, వాటిలో ప్రాముఖ్యం పొందిన విత్తనాలను రైతాంగానికి అందించటం ద్వారా రైతులను నాణ్యమైన విత్తనాలను వారి స్థాయిలోనే ఉత్పత్తి చేసుకొనే విధంగా ప్రోత్సహించవచ్చన్నారు.


వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి, అన్ని రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించిన విత్తనాలను, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,000 గ్రామాలలోని ప్రతి గ్రామం నుండి మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్‌ మొదటి వారంలో ఈ పథకం కింద పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకంలో సుమారుగా 2500-3000 క్వింటాళ్ళ ఐదు ప్రధాన పంటల విత్తనాలను (వరి, కంది, పెసర, మినుము మరియు జొన్న) దాదాపు 40,000 మంది రైతులకు అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ పథకం ద్వారా నాణ్యమైన విత్తనం పొందిన రైతులు తిరిగి ఆయా పంటలలో పండిన విత్తన పంటను ఆయా గ్రామాలలో తమతోటి రైతాంగానికి తక్కువ ధరకు అందజేయటం ద్వారా వచ్చే మూడు సంవత్సరాలలో గ్రామంలోని రైతులందరకి నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంటుందన్నారు. దీని ఫలితంగా రైతాంగం నకిలీ విత్తనాల మోసాల బారినుండి రక్షించబడటమే కాకుండా నాణ్యమైన విత్తనం ద్వారా 10-15% అదనంగా దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయన్నారు. దీంతో రైతు నికరాదాయం కూడా పెరుగుతుందని మంత్రిగారు తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ సిబ్బంది మరియు విత్తన సంచాలకులు డా. నగేష్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల్లోనూ ఖాళీల భర్తీ

  • వివరాలు కోరిన ప్రభుత్వం
  • ఆ మూడింట్లో 718 పోస్టులు ఖాళీ

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాలతోపాటు వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల్లోని ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాల నుంచి ఖాళీలు, ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక విధానం, ఇతరత్రా అంశాలపై సమాచారం కోరింది. మూడు వర్సిటీల్లో మొత్తం 718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో ఎనిమిదేళ్ల క్రితం చివరి దఫా నియామకాలు జరిగాయి. పశువైద్య వర్సిటీలో 2022లో నియామకాల ప్రక్రియ చేపట్టి రెండు నెలల క్రితం భర్తీ చేశారు. ఈలోపు మళ్లీ ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి నల్గొండలతోపాటు కొడంగల్‌లో మూడు కొత్త కళాశాలలు, పశువైద్య వర్సిటీ పరిధిలో కొడంగల్‌ ఓ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ, కొత్త నియామకాలు అవసరమని ఆయా వర్సిటీల పాలకవర్గాలు గుర్తించాయి. ఖాళీల వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఉపకులపతులు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలుత ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపడంతోపాటు ఈ మూడు వర్సిటీల్లోని ఖాళీల వివరాలు అడిగింది.

నియామకాలకు ఏ విధానం?
ఉన్నత విద్యాశాఖ పరిధిలో సహాయ ఆచార్యుల పోస్టులను ప్రత్యక్ష నియామక విధానం ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. తాజా ఉత్తర్వుల్లో వీటి ప్రస్తావన లేదు. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన తర్వాత అవే మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం ఆదేశిస్తే పాలకమండళ్లు అమలు చేయాలి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో మూడు వర్సిటీలు అవే మార్గదర్శకాలను తాము అమలు (అడాప్ట్‌) చేస్తామని తీర్మానం చేయాలి. ప్రత్యేక విధానం తేవాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రస్తుతం వేయి మందికి పైగా పీహెచ్‌డీ అభ్యర్థులు పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఖాళీల భర్తీ చేపడితే తమకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో ఉన్నారు.

Read More

రొయ్యలపై సుంకాన్ని మినహాయించాలి 27% టారిఫ్‌పై అమెరికాతో కేంద్రం చర్చించాలి : చంద్రబాబు

భారత్‌ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఉత్పత్తులపై 27% దిగుమతి సుంకం విధించిన అమెరికా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రప్రభుత్వానికి సూచించారు. సుంకాల జాబితా నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆదివారం లేఖ రాశారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తోందని, అమెరికా సుంకాల కారణంగా ఆక్వా పరిశ్రమ నష్టపోతోందని తెలిపారు. ‘భారత్‌ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27% దిగుమతి సుంకం విధించింది. ఈనెల 5 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. 2023-24లో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్‌ డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92% వాటాను కలిగి ఉన్నాయి’ అని లేఖలో పేర్కొన్నారు.

Read More

యాసంగిలోనూ సన్నధాన్యానికి బోనస్‌

  • ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

యాసంగి సన్న ధాన్యానికీ కనీస మద్దతు ధరతోపాటు బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. దేశంలో క్వింటాకు రూ. 500 బోనస్‌ అందజేస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. ఇప్పటి వరకు బోనస్‌ రూపేణా రైతులకు రూ.1700 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”రూ.20,687 కోట్ల రైతు రుణమాఫీ వలన సుమారు 25.65 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు. ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయంగా రూ.5,400 కోట్లు అందజేశాం. గత వానాకాలంలో రికార్డు స్థాయిలో 1.53 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. వరి దిగుబడిలో తెలంగాణ ఏపీని అధిగమించింది. వరి వేస్తే ఉరే అనే పరిస్థితిని దాటి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. యాసంగి పంటలకు ఏ సమస్య లేకుండా సాగునీరు అందించడంతో ఈ సీజన్‌ లోనూ రికార్డుస్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు తొందరపడి సన్నాలను దళారులకు విక్రయించొద్దు” అని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Read More

కోకోకు అంతర్జాతీయ ధరలపై 5-10% అధికంగా ఇవ్వాలి

  • ప్రాసెసింగ్‌ సంస్థలకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

స్థానిక రైతుల నుంచి నాణ్యమైన కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్‌ ధరల కంటే 5% నుంచి 10% అధికంగా చెల్లించి కొనాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాసెసింగ్‌ సంస్థలను ఆదేశించారు. ఆఫ్‌ సీజన్‌ కోకో బీన్స్‌కు ఎంత చెల్లిస్తారో కూడా ముందే తెలియజేయాలని సూచించారు. ప్రాసెసింగ్‌ సంస్థలు దీనిపై సోమవారం లోపు తమ నిర్ణయాన్ని చెప్పాలన్నారు. కోకో రైతులు, ప్రాసెసింగ్‌ సంస్థల ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులతో గురువారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. 700 టన్నుల ఆఫ్‌ సీజన్‌ కోకో బీన్స్‌ నిల్వలున్నాయని, వాటిని ముందు కొనుగోలు చేసేలా చూడాలని రైతులు మంత్రిని కోరారు. నాణ్యత పేరుతో ధర తగ్గిస్తున్నారని వాపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర కిలో రూ.680-720 ఉండగా, రాష్ట్రంలో రూ.550 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రాసెసింగ్‌ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. 25 ఏళ్లుగా లేని నాణ్యత, గ్రేడింగ్‌ సమస్య ఇప్పుడే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. కోకోలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Read More

అరటి నార, గుర్రపు డెక్కలతో కళారూపాలు

  • ఏపీహెచ్‌డీసీ, ఎన్‌ఐడీల మధ్య ఒప్పందాలు
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి

అరటి నార, గుర్రపుడెక్కతో కళారూపాల తయారీపై హస్తకళాకారులకు శిక్షణ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్  బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అనంతపురంలో అరటి నారతో, మచిలీపట్నంలో గుర్రపుడెక్కతో కళారూపాల తయారీకి సంబంధించిన శిక్షణ కేంద్రాలనుఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌డీసీ), అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ మధ్య బుధవారం రెండు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆయా వస్తువులకు మార్కెటింగ్‌ సదుపాయం… వాటి ప్యాకింగ్‌, బ్రాండింగ్‌లపై అవగాహన కల్పిస్తామని వివరించారు.

Read More