రుతుపవనాలకు పరిస్థితులు అనుకూలం
ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా
దేశ వ్యవసాయానికి దిక్సూచి నైరుతి రుతుపవనాలు. రాబోయే 'నైరుతి' సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. మార్చి వరకు వాతావరణ పరిస్థితులు, పలు అంశాలను విశ్లేషించిన తర్వాత తాజాగా రుతుపవనాల అంచనా నివేదికను విడుదల చేసింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మి.మీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకోనున్నాయి.
దక్షిణాదిలో సమృద్ధిగా వర్షాలు
భౌగోళిక అంచనాల పరంగా పశ్చిమ, దక్షిణ భారత దేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో, కేరళ, కర్ణాటకలోని తీర ప్రాంతం, గోవాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర భారతంలోని కొండ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే 30 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. ఆయా ప్రాంతాలు మినహా తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలే కురుస్తాయి. జులైలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టు, సెప్టెంబరులో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
మే నుంచే వర్షాలు..
మార్చి వరకు నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం రుతుపవనాలపై ఏప్రిల్ 15 నాటికి ఐఎండీ బులెటిన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్(ఐఓడీ) రుతుపవనాల ప్రారంభానికి ముందు సానుకూలం (పాజిటివ్)గా మారనుంది. మే నెల నుంచే వర్షాలు కురిసేందుకు అవకాశముంది.
*కేజే రమేష్, మాజీ డైరెక్టర్ జనరల్, ఐఎండీ

