వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌ పెట్టొద్దు: మంత్రి గొట్టిపాటి

రైతులకు సకాలంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు అందించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు, పీఎం సూర్యఘర్‌, ఆర్డీఎస్‌ఎస్‌ పనుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో గురువారం ఆయన డిస్కంల సీఎండీలతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘వచ్చే వ్యవసాయ సీజన్‌కు అర్హులైన రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఆర్డీఎస్‌ఎస్‌ పథకం కింద ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. పనులు నిర్వహించే ప్రాంతంలో ఎల్‌సీ తీసుకుని విద్యుత్‌ సరఫరా నిలిపేస్తే.. ప్రజలు దాన్ని కోతలుగా భావిస్తున్నారు. ఈ దృష్ట్యా ప్రజలకు ముందుగా సమాచారం పంపాలి. విద్యుత్‌ ప్రమాదాల నియంత్రణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి’ అని డిస్కంల సీఎండీలకు సూచించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) సీఎండీ పుల్లారెడ్డి, ఎస్‌పీడీసీఎల్‌, ఈపీడీసీఎల్‌ సీఎండీలు సంతోషరావు, పృధ్వీతేజలు వర్చువల్‌గా హాజరయ్యారు.

Read More

ముద్దచర్మ వ్యాధి నియంత్రణకు టీకా

‘బయోలంపీ వ్యాక్సిన్‌’ను అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ అనుబంధ సంస్థ బయోవెట్‌
ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు

ప్రపంచంలోనే తొలి దివా మార్కర్‌ వ్యాక్సిన్‌

పాల ఉత్పత్తిని దెబ్బతీస్తూ.. పాడిపశువుల పాలిట మహమ్మారిగా తయారైన ముద్ద చర్మ వ్యాధి (లంపీస్కిన్‌ డిసీజ్‌ -ఎల్‌ఎస్‌డీ) నియంత్రణకు టీకా అందుబాటులోకి వచ్చింది. భారత్‌ బయోటెక్‌ అనుబంధ సంస్థ బయోవెట్‌ తయారు చేసిన ఈ టీకాను బుధవారం విజయవాడలో జరిగిన పశుసంవర్ధక రంగ ఏఐ టెక్‌ 2.0 సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. లంపీస్కిన్‌ వ్యాధి నియంత్రణకు టీకాను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా బయోవెట్‌ సంస్థ రూపొందించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ఈ టీకా ఎంతో దోహదపడుతుందని ప్రశంసించారు. భారత్‌ బయోటెక్‌ సీడీఓ డాక్టర్‌ రేచస్‌ ఎల్లను సీఎం చంద్రబాబు అభినందించారు.

అత్యంత సురక్షిత టీకా
బయోవెట్‌ ఆధ్వర్యంలో రూపొందించిన బయో లంపీ వ్యాక్సిన్‌ ప్రపంచంలోనే తొలి.. అత్యంత సురక్షితమైన దివా – మార్కర్‌ వ్యాక్సిన్‌ అని సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. లంపీ స్కిన్‌ నిర్ధారణ, నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. హిస్సార్‌ లోని ఐసీఏఆర్‌- ఎన్‌ఆర్‌సి (నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ ఈక్వైన్స్‌) అందించిన ఎల్‌ఎస్‌డీ వైరస్‌/ రాంచీ/ 2019 వ్యాక్సిన్‌ స్ట్రెయిన్‌తో బయోవెట్‌ సంస్థ దీన్ని అభివృద్ధి చేసినట్లు వివరించారు. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. టీకాల కోసం విదేశాలపై ఆధారపడకుండా మన వ్యాక్సిన్‌ మన దేశంలోనే అభివృద్ధి చేయాలనే బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, బయోవెట్‌ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్ల ఆలోచనల నుంచి టీకా రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు.

ఏటా 50 కోట్ల డోసులు
దేశ పశు అవసరాలకు 30 కోట్ల డోసులు అవసరం. బయోవెట్‌ సంస్థ ఏడాదికి 50 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనుంది. మూడు నెలల కంటే ఎక్కువ వయసున్న ఆవులు, గేదెలకు ఏడాదికి ఒక డోసు ఇవ్వాలి. మూడేళ్లపాటు వరుసగా టీకా ఇస్తే.. యూరోపియన్‌ దేశాల్లో లంపీ వ్యాధి నియంత్రణ అయిందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఏపీ ఆర్థిక సంఘం మాజీ వైస్‌ చైర్మన్‌ కుటుంబరావు. బయోవెట్‌ సీఈఓ శ్రీనాథ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ (కమర్షియల్‌) బాలాజీరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు కిలారి, హెచ్‌ఆర్‌ హెడ్‌ అమూల్య తదితరులు పాల్గొన్నారు.

లంపీ స్కిన్‌తో ఏడాదిలో రూ.20,040 కోట్ల నష్టం

  • లంపీ స్కిన్‌ వ్యాధి 2019లో దేశంలో ప్రవేశించింది.
  • 2022-23లో తీవ్రంగా వ్యాప్తి చెందడంతో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి. పశుసంవర్ధక రంగానికి రూ.20,040 కోట్ల నష్టం వాటిల్లింది.
  • లంపీ వ్యాధి సోకిన ఆవులు, పశువుల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. దోమలు, పురుగులు వాటిని కుట్టినప్పుడు తీవ్ర రక్తస్రావమవుతుంది.
  • పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎదకు రావు. పునరుత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది. శ్వాస, లాలాజల స్రావాలు మరింత ఎక్కువై.. పశువుల మరణానికి దారితీస్తుంది.
Read More

పంటలన్నీ మద్దతు ధరలకు కేంద్రమే కొనాలి: తుమ్మల

కేంద్ర ప్రభుత్వం ప్రతి పంటకు మద్దతు ధరను ప్రకటించి, అన్నింటి దిగుబడులను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. వానాకాలం సీజన్‌ కార్యాచరణపై సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ… ”రాష్ట్రంలో ఇప్పటికే 550 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యముంది. జూన్‌ 2 నాటికి మరో 1,000 వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలను ఏర్పాటు చేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తాం. సీజన్‌ కోసం ఇప్పటికే 3.31 లక్షల టన్నుల ఎరువులు వచ్చాయి. 2016-25 సంవత్సరాల మధ్య విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సోయాబీన్‌, వేరుసెనగ, పప్పులు, వరి విత్తనాలను రాయితీపై పంపిణీ చేసిన బకాయిలు రూ.220.80 కోట్లు, 2021- 24 మధ్య పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ.87. 57 కోట్లు ఉన్నాయి. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు కృషి చేస్తాం” అని వెల్లడించారు.

Read More

రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ.. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రముఖ ఇంజినీర్‌ కన్నయ్య నాయుడు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్న రైతు నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సోమవారం విజయవాడ, గాంధీనగర్‌లో నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సుమారు 500 ప్రాజెక్టులకు గేట్లు అమర్చి.. రైతులకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. గత ఏడాది తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో 14 లక్షల ఎకరాల పంటలు ఎండిపోగా.. ఐఎంఏలో గేటు ఏర్పాటు చేసి నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రకాశం బ్యారేజీ వరదల సమయంలో బోట్లు వచ్చి ఢీ కొట్టినప్పుడు.. గేట్లకు మరమ్మతులు చేసి బలం పెంచినట్లు తెలిపారు. రైతు సంఘం నాయకుడు అక్కినేని భవానీప్రసాద్‌ మాట్లాడుతూ.. పార్లమెంటు, అసెంబ్లీ స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేసుకొని.. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు 45.73 మీటర్ల ఎత్తులో నిర్మించాలని, గోదావరి ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సూచనల మేరకు గిట్టుబాటు ధర కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు గిట్టు బాటు ధరలు కల్పించడంతో పాటు సంక్షోభం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రాజకీయాలకతీతంగా రైతులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చలసాని శ్రీనివాసరావు, జి. వెంకటరామ రాజు, వి. రామ్మోహనరావు, వివిధ జిల్లాలకు చెందిన రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Read More

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం – వెస్టర్న్‌ సిడ్ని విశ్వ విద్యాలయంలు కలిసి నూతన సంయుక్త వ్యవసాయ విద్యా కోర్సులు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌గా ఉన్న బీఎస్సీ (అగ్రికల్చర్‌), కమ్యూనిటీ సైన్స్‌, ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకి అదనంగా 2025- 26 విద్యా సంవత్సరం నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రేలియాలోని వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయం (డబ్ల్యుఎస్‌యు) తో కలసి నాలుగు సంవత్సరాల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సు ప్రారంభించనుంది. విద్యార్థులు నాలుగు సంవత్సరాల కోర్సు వ్యవధి లో మూడు సంవత్సరాలు పీజేటీఏయూ లోనూ,ఒక ఏడాది వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయంలోనూ విద్య అభ్యసిస్తారు. తద్వారా రెండు విశ్వవిద్యాలయాల్లోనూ విద్యనభ్యసించే అవకాశం విద్యార్థులకి కలుగుతుంది. అదే విధంగా విద్యార్థులు ఎం.ఎస్సీ కూడా చదవాలని భావిస్తే మరో ఏడాది వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయం(డబ్ల్యుఎస్‌యు)లో చదువవలసిఉంటుంది. తద్వారా బీ.ఎస్సీ డిగ్రీ పీజేటీఏయూ నుంచి, ఎం.ఎస్సీ డిగ్రీ వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయం నుంచి పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు పీజీ తర్వాత కూడా వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కూడా చేయదలచుకుంటే ఎటువంటి రుసుములు లేకుండా స్కాలర్‌ షిప్‌ సాయంతో పీహెచ్‌డీ పూర్తి చేయవచ్చు.ఈ అంశాల పై రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఒప్పందం కుదిరే ప్రక్రియ తుదిథలో ఉందని పీజీటీఏయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య తెలిపారు. ఈ వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయం అందించే అన్ని వ్యవసాయ కోర్సులకి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) గుర్తింపు ఉందని జానయ్య పేర్కొన్నారు.ఈ మేరకు ఐసిఏఆర్‌ మరియు డబ్ల్యుఎస్‌యు ల మధ్య గత సంవత్సరం ఒక ఒప్పందం కూడా కుదిరిందని జానయ్య వివరించారు. ఈ ప్రత్యేక కోర్సుల ప్రవేశాల కోసం త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు జానయ్య తెలిపారు.

ఈఏపిసెట్‌ ర్యాంకర్లకి అభినందనలు
ఈఏపిసెట్‌-2025 ఫలితాలలో పాస్‌ అయి ర్యాంకులు సాధించిన వారికి జానయ్య అభినందనలు తెలిపారు. పీజేటీఏయూలో రెగ్యులర్‌, ప్రత్యేక కోటా సీట్లని పెంచడంతో పాటు, ఫీజులు కూడా తగ్గించామని జానయ్య వివరించారు. కొత్త కళాశాలలు కూడా రానున్నాయన్నారు.ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అదే విధంగా ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాల కోసం ఈ వారంలోనే నోటిఫికేషన్‌ రానుందని జానయ్య ప్రకటించారు.

విద్యార్థులు, తల్లితండ్రులకి జాగ్రత్తలు
రాష్ట్రంలో ఐసిఏఆర్‌ గుర్తింపు, అనుమతి లేని చాలా ప్రయివేటు సంస్థలు బీ.ఎస్సీ కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌లు ఇస్తున్నాయని వాటిపట్ల విద్యార్థులు, తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని జానయ్య సూచించారు. రాష్ట్రంలో బీ.ఎస్సీ (అగ్రికల్చర్‌) విద్యా కోర్సు అందించేందుకు ఐసిఏఆర్‌ గుర్తింపు, అనుమతి ఒక్క పీజేటీఏయూ కి మాత్రమే ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లి తండ్రులు గుర్తించాలని ఉపకులపతి ఆల్దాస్‌ జానయ్య వివరించారు.

Read More

రేపు దక్షిణ అండమాన్‌కు నైరుతి

ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగిన ఎండ మంటలు 144 చోట్ల 40 డిగ్రీలకు పైగా నమోదు

నైరుతి రుతుపవనాలు ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 4-5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్‌ ప్రాంతం, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. మరోవైపు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీశాయి. కోస్తాలో అనేక చోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడం, వాయవ్య భారతం నుంచి వీచిన పొడిగాలులతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదివారం 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పెదదోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 42.2, తిరుపతి జిల్లా ఓజిలి, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 41.8, ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.

Read More

శాస్త్రీయసాగు, మార్కెటింగ్‌పై రైతులు అవగాహన పెంచుకోవాలి

వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సూచించారు. మిరపలో రసాయనాల వాడకం తగ్గించి.. ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తే, గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో మిరప, టమాటా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు, రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. విత్తన నాణ్యత, మొక్కల ఎంపిక, పోషణపై శాస్త్రీయ విధానాలు పాటించాలని రాజశేఖర్‌ వివరించారు. ‘మిరప, టమాటాల ధరల్లో ఒడుదొడుకులు అధికంగా ఉన్నాయి. అగ్రివాచ్‌ ద్వారా వచ్చే సీజన్‌లో ఎంత ధర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. వాతావరణ పరిస్థితుల్ని ముందే అంచనా వేసే పరిజ్ఞానం ఉన్నా.. రైతులు నష్టపోతున్నారు. ఈదురు గాలుల తీవ్రత నుంచి పంటను రక్షించుకునేందుకు విండ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని రాజశేఖర్‌ పేర్కొన్నారు. రైతులు బహుళ పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఉద్యాన శాఖ కమిషనర్‌ శ్రీనివాసులు సూచించారు. ‘2021 నుంచి మిరపలో నల్లతామర పురుగు నివారించేందుకు రైతులు మూడు, నాలుగు రోజులకోసారి పిచికారీలు చేస్తున్నారు. దీంతో పురుగుమందుల అవశేషాల కారణంగా ఎగుమతుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ధర తగ్గుతోంది. రైతులు పురుగు, తెగుళ్ల మందులు, కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఖర్చు తగ్గించుకోవడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తిని పొందవచ్చు’ అని శాస్త్రవేత్త శిరీష వివరించారు. టమాటా పండించినా గిట్టుబాటు ధర రావడం లేదని ఈ సందర్భంగా రైతులు వివరించారు. ప్రభుత్వం రాయితీపై పరికరాలు, విత్తనాలు అందించేలా చూడాలని కోరారు. మిరపలో నల్లతామర పురుగు కారణంగా నష్టపోతున్నామని, ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లొస్తున్న పరిస్థితులున్నాయని కొందరు రైతులు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ విజయ సునీత, ఉద్యానశాఖ అదనపు సంచాలకులు వెంకటేశ్వర్లు, అశోక్‌కుమార్‌, హరినాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉద్యాన విద్యార్థులకు అంకుర శిక్షణ

తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల విద్యార్థులకు అంకురాలపై శిక్షణ ఇచ్చి వాటి స్థాపనకు సహకరిస్తామని ఉపకులపతి దండా రాజిరెడ్డి తెలిపారు. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో శుక్రవారం వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అంకురాల యుగం నడుస్తోందని, ఉద్యానవన విద్యార్థులను నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, అంకురాలపై ప్రోత్సహించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. సమావేశంలో నార్మ్‌ జేడీ గోపాలాల్‌, ఐడియా సీఈవో సెంథిల్‌ వినాయగం, మోజెర్ల ఉద్యానవన కళాశాల అసోసియేట్‌ డీన్‌ సైదయ్యలు పాల్గొన్నారు.
ఎగుమతులకు ప్రోత్సాహం: రాష్ట్రం నుంచి ఉద్యాన పంట దిగుబడుల ఎగుమతులను ప్రోత్సహిస్తామని ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో దృక్పథ ప్రణాళికపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉద్యాన పంటలు రాష్ట్ర అవసరాల మేరకు ఉత్పత్తి చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

Read More

ఉద్యాన పంటల అభివృద్ధికి మారుత్‌ డ్రోన్స్‌తో హార్టికల్చర్‌ వర్సిటీ ఒప్పందం

ఉద్యాన పంటల అభివృద్ధి, పరిశోధన, శిక్షణకు అవసరమయ్యే సహకారం కోసం హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ డ్రోన్స్‌ సంస్థతో శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వీసీ దండా రాజి రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ భగవాన్‌, మారుత్‌ డ్రోన్స్‌ వ్యవస్థాపకుడు ప్రేమకుమార్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. డ్రోన్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తెగుళ్లను అంచనా వేస్తూ పంటల సాగు పద్ధతులను మెరుగుపరుస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు చీనానాయక్‌, లక్ష్మీనారాయణ, సురేష్‌కుమార్‌, శ్రీనివాసన్‌, వీణ జోషి తదితరులు పాల్గొన్నారు.

Read More

మూసీ పరీవాహకం.. పూలసాగుకే అనుకూలం

ప్రభుత్వానికి వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక

తెలంగాణ రాష్ట్రంలోని మూసీనది పరీవాహకంలో కలుషిత జలాలతో పండించిన పంట ఉత్పత్తులు ప్రమాదకరంగా మారుతున్నందున ఆహార పంటల సాగును నిలిపివేసి ప్రత్యామ్నాయంగా పూలసాగును చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు. మూసీ నదిలో క్యాన్సర్‌ కారక ఆర్సెనిక్‌, క్రోమియం, కాపర్‌, నికెల్‌, లెడ్‌ వంటి రసాయనాలుండగా.. ఆ నీటితో పండించే పంట ఉత్పత్తుల్లో భారలోహాలున్నట్లు ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. మురికినీటితో సాగు చేయడంవల్ల వ్యవసాయ భూములు పంటలకు పనికిరాకుండా పోతున్నాయని గుర్తించారు. ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు మూసీ పరీవాహకంలోని పలు గ్రామాల్లో పర్యటించి అక్కడి పంటల పరిస్థితులను అధ్యయనం చేశారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమం కింద అన్నదాతలతో మాట్లాడి, ప్రజాభిప్రాయాలను తెలుసుకుని నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.

అధ్యయన అంశాలివి..
ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 81 గ్రామాల్లో పంటల సాగు జరుగుతోంది. ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది మూసీ నీటిని ఉపయోగిస్తుండగా.. 30 శాతం మంది వరకు బోర్ల కింద సాగు చేస్తున్నారు. వరి, జొన్న, బత్తాయి, కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. తాము పర్యటించిన ప్రాంతాల్లో కలుషిత మూసీ నీటితో పంటలు సాగవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వరి, ఇతర ఆహారపంటలు, కూరగాయలు, ఆకుకూరలను సాగుచేయవద్దని, పండ్ల తోటలను పెంచవద్దని రైతులను కోరారు. ఇక్కడి గడ్డిని పశువులు మేస్తే అవి అనారోగ్యం బారిన పడతాయన్నారు. మూసీ నీటిని శుద్ధి చేస్తేనే ఈ భూములు పంటల సాగుకు అనుకూలంగా మారతాయన్నారు. అప్పటివరకు రైతులు భూములను వదులుకునే పరిస్థితి లేనందున.. అక్కడ పూల సాగును చేపట్టాలని, వాటివల్ల రైతులకు ఆదాయం వస్తుందని, ప్రజలకు ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు.

Read More