మే నెలలోనే.. బిరబిరా కృష్ణమ్మ తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు
నిండు వేసవిలో అరుదైన దృశ్యం. ఎండిపోయి ఎడారిలా మారిన కృష్ణానది ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక- తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది. జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపూర్‌కు ప్రవాహమేదీ లేదు. సాధారణంగా జూన్, తరువాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం అరుదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి 90 వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు తెరిచి 82,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (1045 అడుగులు). ఒకే నీటి సంవత్సరంలో(2024 జూన్- 2025 మే) మధ్య నైరుతి రుతుపవనాలతో గేట్లు ఎత్తడం అరుదైన విషయం.
ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) ద్వారా సృష్టించడంలో జమ్మూ కశ్మీర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి (ఎస్‌కేయూఏఎస్‌టీ) చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్‌లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. ‘జన్యు సవరణ ద్వారా 30 శాతం ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని సృష్టించగలిగాం. భారతీయ రకాల్లో సహజంగా మాంసం వాటా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఐరోపా గొర్రె జాతుల్లో మాంసం అధికంగా ఉండేలా జన్యు నిర్మాణం ఉంటుంది’ అని అహ్మద్ షా తెలిపారు. ‘సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం. ఇది 21వ శతాబ్దంలో ఆవిర్భవించిన కృత్రిమ మేధ లాంటిదే’ అని పేర్కొ న్నారు. ‘ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు. జన్యు ఆధారిత పశుగణాభివృద్ధిలో ఒక కొత్త ఆవిష్కారం. కొత్త జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టకుండా ప్రయోజనకరమైన జన్యు సవరణ చేసే సత్తా మనకుందని చాటుకున్నాం’ అని ఆయన వివరించారు. అహ్మద్ షా నేతృత్వంలోని పరిశోధక బృందం 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పష్మీనా గొర్రె ‘నూరీ’ అనే జన్యు సమరూప జీవిని (క్లోన్) ఆవిష్కరించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
ప్రకృతి సేద్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల్లో దాన్ని చేర్చాలని అగ్రి వర్సిటీల డీన్‌ల జాతీయ సదస్సు తీర్మానించింది. హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్)లో డీన్‌ల సదస్సు జరిగింది. వ్యవసాయ విద్యా విధానాలు, సవాళ్లు, పురోగమనం అంశాలపై ఇందులో చర్చించారు. 45 రాష్ట్ర, కేంద్ర, డీమ్డ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన 56 మంది డీన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. నార్మ్ డైరెక్టర్ జనరల్ ఆర్‌సీ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో వానాకాలం సీజన్ మొదలైంది. రోజూ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సైతం ముందస్తు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వరి నారు పెంపకం ప్రారంభించగా, ఇతర పంటలకు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం కార్యాచరణ ప్రణాళిక అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత వానాకాలం సీజన్‌లో 1.29 కోట్ల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి అదనంగా 5 లక్షల ఎకరాలు ప్రతిపాదించింది. సాధారణంగా జూన్ నెలలో రైతులు పొలాలను దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటారు. ఈసారి మార్చి నుంచే అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు.
రాష్ట్రంలో పదేళ్లుగా సాగు, ఉత్పత్తులు ఏటేటా పెరుగుతున్నాయి. ఆ మేరకు విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. సన్న ధాన్యానికి బోనస్ దృష్ట్యా 40 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకోసం 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. వీటి కంటే అధిక అంచనాలతో 60.11 లక్షల ఎకరాల్లో సన్నాలు, 38.21 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు కలిపి 98.32 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. పత్తికి సైతం 1.08 కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా విత్తనోత్పత్తి కోసం వచ్చే నెల 2న వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన విత్తనాలను గ్రామానికి ముగ్గురు చొప్పున ఆదర్శ రైతులకు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయవర్సిటీ.. 3వ తేదీ నుంచి సాగు విత్తనాలను రైతులకు అందించనుంది.
వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో ఏప్రిల్, మే నెలల్లో 1.72 లక్షల టన్నులు వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది.
పంటల బీమా అమలు: ఈ సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రీమియంలో సగం కేంద్రం, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి. రైతులందరికీ పంటల బీమా వర్తింపజేయడంతో స్థూల పంట విస్తీర్ణంలో 98 శాతానికి ఈ పథకం వర్తిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
నకిలీల నివారణపై దృష్టి: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద లేకుండా పోలీసు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఈ బృందాలు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల ముఠాలను పట్టుకున్నాయి. ఎరువుల నివారణకు వ్యవసాయశాఖ ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 5 నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరుగుతోంది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి, గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు (166.9 మి.మీ.) తో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య సగటు (87 మి.మీ.) కంటే 106% వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, వాయవ్య భారతదేశంలో సాధారణంగా, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో కూడా సాధారణ సగటుకు మించిన వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. మరోవైపు పసిఫిక్ ప్రాంతంలో ఎల్‌నినో తటస్థంగా ఉంది. ఈసారి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపబోదని ఐఎండీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అధికారులు, కంపెనీల ప్రతినిధులకు ఆదేశాలివ్వడంతో రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హెచ్‌డీ బర్లే పొగాకు 75 మిలియన్ కిలోల దిగుబడి రాగా, ఇప్పటికే 21 మిలియన్ కిలోలు కొనుగోలు చేశారు. పొగాకు రైతుల సమస్యలపై ఈ నెల 16న సీఎం చంద్రబాబు.. అధికారులు, పలు పొగాకు కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. రైతుల వద్ద 54 మిలియన్ కిలోల నిల్వలుండగా, 20 మిలియన్ కిలోలు కొనుగోలు చేస్తామని జీపీఐ, ఐటీసీ సంస్థలు తెలిపాయి. 30 మిలియన్ కిలోల మేర క్వింటాలుకు రూ.12 వేల ధర తగ్గకుండా వారంలో కొనుగోళ్లు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ప్రతి రెండు రోజులకు తనకు నివేదిక ఇవ్వాలని సూచించడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రైతుల వద్ద ఉన్న నిల్వల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు సర్వే చేసి, నమోదు చేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. అమ్మకాలను సమీక్షించేందుకు పొగాకు బోర్డు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 0863-2358531 నంబరును అందుబాటులో ఉంచింది. ఈ చర్యలతో కొనుగోళ్లు వేగం అందుకున్నాయి.
దేశ ప్రజల ఆకలి తీర్చే బృహత్కార్యంలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రికార్డుస్థాయి బియ్యం ఉత్పత్తితో దేశంలోనే ముందుందని రాష్ట్ర అర్థ, గణాంకశాఖ తెలిపింది. వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వ సానుకూల విధానాలతో గతేడాది (2024-25) రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని ఈ శాఖ తాజాగా విడుదల చేసిన అంచనాల్లో వెల్లడించింది. బియ్యం ఒకటే కాకుండా పలు ఇతర పంటల దిగుబడి సైతం అంతకుముందుతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు వివరించింది. తాజా నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ శాఖ అందజేసింది. *సాధారణ సాగు విస్తీర్ణానికి మించి..* అంతకుముందు ఏడాది (2023-24)లో 168.75 లక్షల టన్నుల ఉత్పత్తి చేసిన తెలంగాణ మరుసటి ఏడాది (2024-25) దాన్ని అధిగమించి ఏకంగా 183.57 లక్షల టన్నులు సాధించింది. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని అర్థ, గణాంకశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ తర్వాత వరుసగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఉన్నాయి. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి వేయడంతో దిగుబడులు వెల్లువెత్తాయి. ఉదాహరణకు గత రబీ (యాసంగి సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 16 లక్షల హెక్టార్లు కాగా… గతేడాది ఏకంగా 24.04 లక్షల హెక్టార్లలో సాగయింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు 29 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లు తీసుకున్నారు. వీటికి నిరంతరాయ ఉచిత కరెంటు సరఫరాతో కర్షకులు వరి సాగుకే మొగ్గుచూపారు. ఫలితంగా తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 2025 మార్చి 20న 17,162 మెగావాట్ల కరెంటు డిమాండు నమోదైనట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. గతేడాది ఖరీఫ్ (వానాకాలం), రబీ(యాసంగి)లో కలిపి మొత్తం 275 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. దీని నుంచి 183 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తయినట్లు నివేదిక తెలిపింది. ఏటా రెండు సీజన్లలో సాగు, దిగుబడులపై క్షేత్రస్థాయిలో పంటకోత ప్రయోగాల ద్వారా శాఖ అంచనాలు వేసి నాలుగుసార్లు నివేదిక పంపుతుంది. తాజాగా మూడో ముందస్తు అంచనాల నివేదిక పంపింది. దీని ప్రకారం రాష్ట్రంలో గతేడాది మొత్తం 224 లక్షల టన్నుల ఆహారధాన్యాలు పండినట్లు కేంద్రం ప్రకటించింది. బియ్యం, పప్పు, తృణధాన్యాల దిగుబడులను మాత్రమే కేంద్రం ఆహారధాన్యాల కింద చూపుతుంది. వరిధాన్యం దిగుబడి లెక్కను పరిగణనలోకి తీసుకోదు. తృణ, చిరుధాన్యాలు కలిపి తెలంగాణలో 37.19 లక్షల టన్నులు, కందులు 1.99 లక్షల టన్నులు, శనగలు 1.10 లక్షల టన్నులు, మినుములు 43,570, పెసలు 24,170, నూనెగింజలు 5.50 లక్షల టన్నులు పండినట్లు శాఖ వివరించింది.*రాష్ట్రంలో బియ్యం దిగుబడి (లక్షల టన్నుల్లో)* 2022-23 158.77 2023-24 168.75 2024-25 183.57*తెలంగాణలో ప్రధాన పంటల దిగుబడి తీరు (టన్నుల్లో)* పంట 2023-24 2024-25 వరి 2,60,89,000 2,75,30,800 మొక్కజొన్న 27,76,000 34,13,000 వేరుశనగ 2,25,000 2,29,510 సోయా 2,69,000 2,90,630
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయశాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావును కలిసి, వ్యవసాయ మరియు సహకార రంగానికి సంబంధించి అనేక అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సహకార రంగానికి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం దిశగా చర్చలు చేపట్టడానికి అనువుగా ఈ సమావేశం నిర్వహించుకోవాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మట్టి నమూనా ఫలితాలు ప్రతీ రైతుకు అందించేటందుకు ప్రభుత్వము కట్టుబడి ఉంది కనుక దానికి తగ్గ విధివిధానాల రూపకల్పనలో కమిషన్ అభిప్రాయాలు తెలియజేశారు. తరువాత సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ డైరెక్టర్ గోపిని ఉద్ధేశించి మాట్లాడుతూ, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అమలు అవుతున్న కార్యక్రమ అమలు తీరు తెలుసుకొని, ఇదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వము నిర్వహించ తలపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ 29 మే 2025 నుండి 12 జూన్ 2025 వరకు కార్యక్రమంలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మట్టి నమూనా పరీక్షలు త్వరితగతిన పూర్తిచేయడానికి సాయిల్ టెస్టింగ్ లాబ్స్‌ను ఎఫ్‌పిఓలకు అందచేయడం ద్వారా, రైతువేదికలలో పెట్టడం ద్వారా, ప్రతీ అవసరమున్న రైతుకు మట్టినమూనా పరీక్ష చేసుకొనే వెసులుబాటు కల్పించడానికి డైరెక్టర్ గోపికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ ద్వారా ప్రతీ రెవిన్యూ గ్రామాలలో ముగ్గురు ఎంపిక చేసిన రైతులకు మూల విత్తనము (ఫౌండేషన్ సీడ్) ను ఇవ్వడానికి, డిపార్ట్ మెంట్ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా మూలవిత్తనం సరఫరా చేసిన రైతుల పొలాల నిరంతర పర్యవేక్షణ చేస్తూ, అలా ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతులకు తిరిగి చేరేవిధంగా చూడాలని, అప్పుడే కార్యక్రమం యొక్క లక్ష్యం నేరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), ఏరువాక (డాట్ సెంటర్) కేంద్రాలున్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన 15 జిల్లాల్లో ఏరువాక కేంద్రాలు లేదా కృషివిజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య ఇటీవల జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 3 విస్తరణ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో రైతులకు ఎంతగానో ఉపకరించనుంది. ఇదివరకే దేశవ్యాప్తంగా జిల్లాకొక ‘కృషివిజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) నెలకొల్పాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేవీకేలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లాలో ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో కేవీకేలు పనిచేస్తున్నాయి. తాజాగా వ్యవసాయ వర్సిటీ నిర్ణయంతో పెద్దపల్లి జిల్లాలో కేవీకే ఏర్పాటు కానుండగా ప్రభుత్వ హామీ మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉద్యాన కేవీకేను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇదివరకున్నవి, నూతనంగా ఏర్పాటుచేసే అన్ని కేవీకేలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా, జిల్లాస్థాయి సమగ్ర వ్యవసాయకేంద్రాలుగా తీర్చి దిద్దనున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే కేవీ కేల నిర్వహణ, జీతభత్యాలను పూర్తిగా కేంద్ర వ్యవసాయశాఖనే భరిస్తుంది. పరిశోధన స్థానాల్లో అభివృద్ధి చేసిన నూతన వంగడాలను తొలుత కేవీకేల్లోని క్షేత్రాల్లో సాగుచేసి ఫలితాలను సమీక్షిస్తారు. కేవీకేల్లోని శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఫలితాలపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన సాగు విధానాలపైనా వీటిల్లో పరిశోధనలు చేపడతారు. భూసార పరీక్ష కిట్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు అందిస్తారు. వాతావరణ సమాచారం, చీడపీడల నివారణపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారు. ఒక్కో కేవీకేలో ఒక సీనియర్ సైంటిస్టు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాస్త్రవేత్తలు ఆరుగురితో పాటు ఒక మేనేజర్, ఇద్దరు కార్యక్రమ సహాయకులు, మరో ఇద్దరు పరిపాలన సిబ్బంది, ఒక ట్రాక్టర్ డ్రైవర్, ముగ్గురు సాంకేతిక ఉద్యోగులను నియమిస్తారు. ఒక్కో కేవీకేను దాదాపు 50-75 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు చొరవ తీసుకొని స్థలాన్ని సమకూర్చి కేవీకేలు, డాటా సెంటర్లను ఏర్పాటుచేస్తే వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ సమాచారం ఒకేచోట లభించి ఉమ్మడి జిల్లాలోని రైతులకు సాగు సంబంధిత సేవలు మరింతగా దరిచేరతాయి.
ఏజెన్సీ ప్రాంత మండలాల్లోని గిరిజన రైతులకు ఖరీఫ్‌లో 90% రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ, ఇతర జిల్లాల్లోని రైతులకు 40% రాయితీపై వీటిని అందించనుంది. ఒక్కో రైతుకు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా గరిష్ఠంగా మూడు బస్తాలు (బస్తా 30 కిలోలు) రాయితీపై అందిస్తారు. కే6, టీసీజీఎస్ 1694, టీఏజీ 24 రకాలు క్వింటాలుకు రూ.9,300, నారాయణి రకం క్వింటాలుకు రూ. 9,500, కదిరి లేపాక్షి రకం క్వింటాలుకు రూ.8,200 చొప్పున ధరలు నిర్ణయించారు. డి-కృషి యాప్ ద్వారా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అరెకరా వరకు ఒకటి, ఎకరా విస్తీర్ణానికి రెండు, అంతకు పైన మూడు బస్తాలు చొప్పున అందజేస్తారు.