మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ సాయం

21న తొలి విడత చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులకు మూడు విడతల్లో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రమిచ్చే రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి ఈ నెల 21న తొలివిడతలో రూ.7 వేలు జమ చేస్తామన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఇటీవల గుంటూరు నుంచి ఎగుమతి అయిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని కంటెయినర్లను చైనా అధికారులు తిరస్కరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పంటను ఉత్పత్తి చేయాలి” అని వెల్లడించారు.

కోకో రైతులకు న్యాయం చేస్తాం
పెదవేగిలో సాగవుతున్న కోకో, పామాయిల్‌ పంటలను మంత్రి పరిశీలించి రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పామాయిల్‌ తరహాలోనే కోకో గింజల కొనుగోలుకు విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. సరకు నాణ్యతతోనే గిట్టుబాటు ధరలు సాధ్యమవుతాయని స్పష్టంచేశారు. కంపెనీలు సాగు సమయంలో చెప్పే మాటలు ఆచరణలో విస్మరిస్తున్నాయని రైతులు మంత్రికి మొర పెట్టుకున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రాయితీపై పరికరాలివ్వాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కోరారు. ఏలూరు మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.

Read More

ధాన్యం కొనుగోళ్లలో ‘సాంకేతిక పరిజ్ఞానం’

  • దక్షిణాదిలో తొలిసారి 800 కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్ల వినియోగం
  • తాలు, తరుగు, తేమ సమస్యలు తగ్గాయంటున్న అధికారులు
  • వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ టూల్స్‌ ఉపయోగించి వర్షాలపై అప్రమత్తం
  • తెలంగాణ విధానాలపై పలు రాష్ట్రాల అధ్యయనం

ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌ ప్రక్రియలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాలు తెలంగాణ విధానాలపై అధ్యయనం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల 800 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను ఉపయోగించారు. వీటి వాడకంతో తాలు, తరుగు, తేమ వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయని.. దక్షిణాదిలో ఈ విధానాన్ని అవలంబించిన తొలి రాష్ట్రం తెలంగాణేనని పౌరసరఫరాలశాఖ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో మిగతా కేంద్రాల్లోనూ ప్యాడీ క్లీనర్లను ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. ధాన్యం సేకరణ సమయంలో వర్షాలు కురుస్తుండటం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ టూల్స్‌ని ఉపయోగించి వర్షం పడే ప్రాంతాల్ని గుర్తించి.. ఆయా కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ అప్రమత్తం చేస్తోంది.

రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం

  • డీఎస్‌ చౌహాన్‌, పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌
    ధాన్యం కొనుగోళ్లు వీలైనంత సాఫీగా జరిగేందుకు టెక్నాలజీని వాడుతున్నాం. ప్యాడీ క్లీనర్లు వినియోగించి రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం. ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వాతావరణ ముందస్తు హెచ్చరికల్ని ప్రభావిత కేంద్రాలకు పంపి ధాన్యం తడవకుండా వీలైనంత మేరకు తగ్గించాం. తెలంగాణ పౌరసరఫరాల శాఖ చేపడుతున్న సంస్కరణల్ని పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మరికొన్ని రాష్ట్రాలూ రానున్నాయి.

ఆసక్తి కనబరుస్తున్న ఇతర రాష్ట్రాలు
తేమ శాతం నిబంధనల్ని పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.మిల్లర్లకు గ్యారంటీ, బకాయిదారులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయడం తదితర విధానాలను అవలంబించింది. ఈ పరిణామాలు, సంస్కరణల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు తెలంగాణలో పర్యటించి ఇక్కడి విధానాలను అధ్యయనం చేస్తున్నారు.

Read More

ఏటా మూడు పంటలు పండాలి

వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు.
ప్రయోగాత్మకంగా అంతర పంటలు
వ్యవసాయ శాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు

ఏటా మూడు పంటలు పండేలా... 365 రోజులూ సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో మూడు పంటల విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వరి రైతులకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు అన్వేషించాలన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. 'వరిలో అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే ఉపాధి హామీ నిధులతో వాటిని ఏర్పాటుచేయాలి. వరి పంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వా, ఉద్యాన సాగు దిశగానూ ప్రయత్నించాలి' అని సూచించారు.

వేసవిలోనూ సాగుకు సన్నద్ధం..
వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలి. అనంతపురం లాంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు సాగుచేసి మిగిలిన 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్నారు.. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. అందుకే ఆ కాలంలోనూ ఏదో ఒక పంట సాగుచేసే పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘వచ్చే వేసవిలో జల వనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లో సాగు చేసేలా రైతుల్ని సన్నద్ధం చేయాలి. 19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుని దిగుబడులు సాధించాలి’ అని అన్నారు.

ఎరువుల వినియోగం తగ్గాలి..
ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి భూసారం కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగు పెరగాలన్నారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌- మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖలో మూడు సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. రైతులకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని చంద్రబాబు సూచించారు.

పంట కాలం ముందుకు జరిపేలా కార్యాచరణ
గత 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ 14 తుపాన్లను ఎదుర్కొందని, అక్టోబరులో ఐదు, నవంబరులో ఆరు, డిసెంబరులో మూడు తుపాన్లు ప్రభావం చూపాయని వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అక్టోబరులో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయని వివరించారు. విపత్తుల ముప్పు తప్పేలా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. తుపాన్ల నుంచి ఖరీఫ్‌ పంటలను రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టినట్లు వివరించారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశామన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశామని తెలి పారు. జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, పత్తి సాగు చేస్తుండగా.. వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతోందని.. కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. పర్చూరు ఏఎంసీలో హెడ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభించడంతో రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెడ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

Read More

120 రోజుల్లోనే కంది పంట

  • ఏటా మూడు పంటలు.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి
  • కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిశాట్‌

కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్‌). 120 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండడం.. చీడపీడలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం ఈ వంగడం ప్రత్యేకతలు. ప్రస్తుత రకాలు వర్షాకాలంలోనే సాగుకు అనుకూలమైనవి. 6 నెలల పంటకాలంతో ఎకరాకు గరిష్ఠంగా 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తున్నాయి. కొత్త వంగడం ఎకరాకు 10 క్వింటాళ్ల మేర దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ‘ఐసీపీవీ 25444’ వంగడాన్ని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘యాక్సిలరేటెడ్‌ క్రాప్‌ ఇంప్రూవ్‌మెంట్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌’ డైరెక్టర్‌ సీన్‌ మేయెస్‌, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దేశంలో ఏటా 1.25 కోట్ల ఎకరాల్లో కంది పంట సాగవుతుండగా.. 35 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. 2.01 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. దేశీయ అవసరాల కోసం ఏటా 15 లక్షల టన్నుల మేర కందులను ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో ఐదేళ్ల విస్తృత పరిశోధన అనంతరం సీనియర్‌ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు బెలియప్ప శ్రుతి, బొమ్మ నరేశ్‌ల బృందం మేలైన కంది రకం ఐసీపీవీ 25444ను అభివృద్ధి చేసింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో దీనిని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత రకాలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుండగా.. కొత్త రకం 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండుతుందని, ఎకరానికి 2 కిలోల విత్తనాలు సరిపోతాయని వెల్లడించారు.

పది లక్షల టన్నుల అదనపు ఉత్పత్తికి అవకాశం
నూతన వంగడంతో దేశంలో కంది సాగు, ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దీని ద్వారా అదనంగా పది లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించే అవకాశం ఉంది. అన్నదాతల ఆదాయం మూడురెట్లు పెరుగుతుంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది సాగు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది.

  • హిమాన్షి పాఠక్‌, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌
Read More

విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ఖరీఫ్‌ సీజన్‌లో వరి విత్తనాలతో పాటు ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలోని గ్లోబల్‌ విశ్రాంతి భవనంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. రైతులంతా ఒకేరకమైన పంటలు వేయడంతో ధరల్లో తేడాలు వస్తున్నాయన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, నాయకులు సి. చిన్నమ్మ తల్లి, వి. సన్యాసినాయుడు, ఆర్‌. ఈశ్వరరావు, పి. మహేష్‌ తదితరులు మంత్రిని సన్మానించారు.

Read More

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు నియామకం

ఏపీ ప్రభుత్వం మరో సలహాదారును నియమించింది. కొమ్మెర అంకారావు అలియాస్‌ కొమ్మెర జాజిని అడవుల పెంపకం సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవిలో ప్లాస్టిక్‌ ఏరివేత ఒక యజ్ఞంలా నిర్వహించిన చరిత్ర ఈయనకి ఉంది. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు.

Read More

ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

సాధారణంగా ఒక మామిడి చెట్టుకు ఒకటి లేదా రెండు రకాల పండ్లే కాస్తుంటాయి. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా దిట్ల గ్రామంలో ఓ చెట్టుకు 12 రకాల పండ్లు కాస్తున్నాయి. రంగు, రుచి, సువాసన, పరిమాణం, బరువుల్లో అవన్నీ వేర్వేరు. 50 గ్రాముల నుంచి 2 కేజీల దాకా బరువున్న మామిడి పండ్లు ఆ చెట్టుకు కాస్తున్నాయి. ఉకాభాయ్‌ అనే రైతుకు చెందిన మామిడితోటలో ఈ చెట్టు ఉంది. అన్ని సీజన్లలోనూ డజను రకాల మామిడి పండ్లు కాస్తుండటం ఈ మామిడి చెట్టు ప్రత్యేకత. మొదటి నుంచీ ఉకాభాయ్‌ మామిడి సాగులోనే ఉన్నారు. అంటుకట్టే పద్ధతి ద్వారా మేలురకం మామిడి వంగడాల తయారీకి ఆయన నిత్యం ప్రయోగాలు చేస్తుంటారు. వీటి ఫలితంగానే 12 రకాల పండ్లను అందించే మామిడిచెట్టు ఏర్పడింది.

ఎలా అంటుకట్టారంటే..
మేలు రకం మామిడి వంగడాల తయారీకి ఉత్తమ లక్షణాలు కలిగిన ఒక మామిడి మొక్కను సేకరించాలి. దాని వేర్ల భాగాన్ని తొలగించాలి. మరో మేలు రకం మామిడి మొక్కను సేకరించాలి. దాని కాండం ఎగువ భాగాన్ని సగానికి పైగా కత్తిరించి తొలగించాలి. ఈ మామిడి మొక్కకు వేర్లు ఉంటాయి. అందువల్ల దీన్నే నేలలో నాటాలి. అనంతరం దీనిలోని సగం కాండంపై, అంతకుముందు మనం సిద్ధం చేసుకున్న మొక్క కాండాన్ని అతికించి కట్టు కట్టాలి. ఇలా ఒకేచెట్టుకు తీరొక్క పండ్లను చూసి ఉకాభాయ్‌ ఉప్పొంగిపోతున్నారు. మామిడి వంగడాల తయారీకి ఇకపైనా తన ప్రయోగాలను కొనసాగిస్తానని ఆయన ‘ఈటీవీ భారత్‌’కు చెప్పారు. ఇలాంటి మామిడి చెట్లు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.

Read More

పెరిగిన భూగర్భ జలమట్టం

గతేడాది మే నెలతో పోల్చితే 0.30 మీటర్లు పైకి

  • 18 జిల్లాల్లో పెరుగుదల..
  • 2024-25 నీటి సంవత్సరంలో 32 శాతం అధికంగా వర్షాలు ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలతో ప్రారంభమైన వర్షాలకు భూగర్భం కూడా చల్లబడింది. మండుటెండలతో అడుగంటాల్సిన మే నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 0.30 మీటర్లు పెరిగింది. గతేడాది మే నెలతో పోల్చితే 18 జిల్లాల్లో పెరుగుదల నమోదైంది. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.

మే నెలలో అరుదుగా…
సాధారణంగా భూగర్భ జలాలు జూన్‌ నుంచి అక్టోబరు వరకు పెరుగుతాయి. అక్కడి నుంచి ఒకటి రెండు నెలలు నిలకడగా కొనసాగి ఆ తరువాత క్రమంగా లోతుకు వెళ్తాయి. అయితే, ఈ ఏడాది మే రెండో వారం చివర నుంచి వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు కూడా తార స్థాయిలో లేవు. దీంతోపాటు చాలా అరుదుగా వేసవి ముగియకుండానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు కురిశాయి. భూగర్భ జల వినియోగం తగ్గడంతోపాటు వర్షాలు కురవడం కారణంగా క్రమంగా నీటిమట్టం పైకి రావడం ప్రారంభమయింది. మే నెలలో ఇది చాలా అరుదు అని నిపుణులు పేర్కొంటున్నారు.

  • మే నెల రాష్ట్ర సరాసరి నీటి మట్టం 10.06 మీటర్లు. 2025 మే నెలలో ఇది 10.36 మీటర్లు. అంటే 0.30 మీటర్లు పెరిగింది.
  • గతేడాదితో పోల్చితే మే నెలలో 18 జిల్లాల్లో నీటి మట్టం పెరుగుదల ఉండగా భూపాలపల్లిలో అత్యధికంగా 3.05 మీటర్ల పెరుగుదల నమోదైంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 2.74, నల్గొండలో 2.32, సూర్యాపేటలో 1.70 మీటర్లు పెరిగింది. హైదరాబాద్‌, హనుమకొండలలో అత్యల్పంగా 0.17 మీటర్లు మాత్రమే పెరుగుదల రికార్డయింది.
  • 2024 మేతో పోల్చితే ఈ ఏడాది మేలో 15 జిల్లాల్లో తగ్గుదల నమోదయింది. ఎక్కువగా సంగారెడ్డి జిల్లాలో 1.61, వరంగల్‌ 0.04 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌ కన్నా మే నెలలో మాత్రం ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. ఈ ఏడాది భూగర్భ జలాల పురోగతి బాగుంటుందని రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ డైరెక్టర్‌ లక్ష్మా పేర్కొన్నారు.

32 శాతం అధికంగా వర్షాలు
2024-25 నీటి సంవత్సరంలో (జూన్‌ నుంచి మే) 32 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. రాష్ట్ర సాధారణ వార్షిక వర్షపాతం 919 మి.మీటర్లకు గాను 1,216 మి.మీటర్లు అంటే 32 శాతం అధికంగా నమోదయింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా నారాయణపేట. ఈ జిల్లా సాధారణ వర్షపాతం 618.9 మి.మీటర్లు కాగా 1,184.1 మి.మీటర్లు (91 శాతం) నమోదైంది. వనపర్తిలో 80 శాతం, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాలలలో 71 శాతం చొప్పున, నాగర్‌కర్నూల్‌లో 58 శాతం నమోదయింది. మహబూబాబాద్‌ జిల్లాలో 49 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. అతి తక్కువగా ఆదిలాబాద్‌లో 11 శాతం వర్షపాతం నమోదయింది. మరోవైపు రాష్ట్రంలో సగటున 116 రోజులు వర్షం కురిసింది. ఎక్కువ రోజులు వర్షం కురిసిన జిల్లాలలో కుమురంభీం ఆసిఫాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 101 రోజులు వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లాలో 99 రోజులు, మహబూబాబాద్‌లో 97. రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెంలలో 92 రోజుల చొప్పున.. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో 91 రోజుల చొప్పున వర్షం కురిసింది.

Read More

హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆన్‌ మిల్లెట్స్‌ శంకుస్థాపన

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్‌ చౌధరి మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌ – భారత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐసిఏఆర్‌-ఐఐఎంఆర్‌) ప్రాంగణంలో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ మిల్లెట్స్‌ (సీఓఈ) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సంస్థ సిరిధాన్యాల పరిశోధన, అభివృద్ధి, శిక్షణ మరియు ప్రాచుర్యం దిశగా కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను పెంపొందించేందుకు ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్తలు, రైతులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ శాఖలో ఏడు కార్పొరేషన్ల విలీనం!

తెలంగాణ వ్యవసాయ అనుబంధ ప్రభుత్వరంగ సంస్థ (కార్పొరేషన్‌)ల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. ఏడింటిని ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ శాఖలో ప్రస్తుతం రాష్ట్ర మార్కెటింగ్‌ సమాఖ్య (మార్క్‌ ఫెడ్‌), వ్యవసాయ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఆగ్రోస్‌), హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం (హాకా), విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ సంస్థ, నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఆయిల్‌ ఫెడ్‌), రాష్ట్ర గిడ్డంగుల సంస్థలున్నాయి. హాకా, ఆయిల్‌ ఫెడ్‌, విత్తనాభివృద్ధి సంస్థలకు ప్రస్తుతం పూర్తిస్థాయి ఎండీలు లేరు. మిగిలిన సంస్థల్లోనూ అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ నష్టాల్లో ఉన్నాయి. వీటి ఆస్తులు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ విషయమై వ్యవసాయ మంత్రి తుమ్మల పలు సమీక్షల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని మార్చాలనే ఉద్దేశంతో ఆయన కార్పొరేషన్లను విలీనం చేసి ఒక సంస్థగా మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు అన్ని కార్పొరేషన్లను కలిపి ఒక ప్రత్యేక కార్పొరేషన్‌గా ఒక కార్యాలయంలో ఏర్పాటు చేసి సీనియర్‌ ఐఏఎస్‌ను అధికారిగా నియమిస్తారు.

Read More