హాజరై మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గ్రామం అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్కులో 1,000 మొక్కలు నాటనున్నారు. అనంతరం జరిగే సమావేశంలో సుమారు 1,500 మంది పాల్గొనే అవకాశం ఉంది. పార్కు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాల్లో 15 ఎకరాలను ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో శరవేగంగా నేలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి హిమ శైలజ, సీఎఫ్‌వో కాశీవిశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తితో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆ జిల్లా కలెక్టర్ దివాకరను ఆదేశించారు. సోమవారం ఆయన కమిషన్ కార్యాలయం నుంచి ఈ విషయంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి, కమిషన్ సభ్యులు, కలెక్టర్ పాల్గొన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ.. తాము క్షేత్రస్థాయిలో పర్యటించి ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు రైతులకు న్యాయం జరగలేదన్నారు. కార్పొరేట్ కంపెనీలు పరిహారం ఇవ్వని పక్షంలో వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, ప్లాస్టిక్ కాలుష్య నివారణ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలనేది లక్ష్యం. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
జాతీయ సహజ వ్యవసాయ పథకం (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) విధానంలో పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసేందుకు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు గ్రాంట్లను ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రకృతి వ్యవసాయం రైతులు, గుర్తింపు పొందిన పరిశోధన సంస్థలు జూన్ 5న సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం https://nmnfresearch.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన ”గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం” కార్యక్రమం ఈరోజు లాంఛనంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ఎంపిక చేసిన పది మంది రైతులకు నాణ్యమైన విత్తన కిట్లను అందజేశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్
మన రొయ్య, మిరప, పొగాకుకు విదేశీ ఆర్డర్లే కీలకం- ఏటా సుమారు రూ.40 వేల కోట్లపైనే ఎగుమతులు – అక్కడ డిమాండు లేకున్నా, పన్ను పెరిగినా సాగుదారులకు భారీ నష్టం – మొన్న రొయ్య, నిన్న మిరప.. నేడు పొగాకు రైతుల పరిస్థితి ఇదే – ప్రభుత్వాల చొరవే కీలకం.. ప్రత్యేక యంత్రాంగం అవసరం రొయ్య, పొగాకు, మిరప పంట ఉత్పత్తి, ఎగుమతుల్లో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్‌దే. ఏడాదికి రూ.40 వేల కోట్ల పైనే ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. వీటికి పెట్టుబడి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలపైనే! అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలతో ధరలు పతనమవుతున్నా.. ఆదుకునే యంత్రాంగం లేదు. ఎగుమతులన్నీ కేంద్రం పరిధిలోనివే అంటూ రాష్ట్రం పట్టించుకోవట్లేదు. దీంతో మన రైతులు విలవిల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎగుమతులను ప్రోత్సహిస్తే, ఇక్కడి పంటలకు ధరలు దక్కుతాయి.
*కేంద్రానిదే బాధ్యత.. అయినా దృష్టి తక్కువే*
ఎగుమతులు విరివిగా ఉంటేనే రైతుకు ప్రయోజనం. విదేశాలతో చర్చించి ఎగుమతులు పెంచేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో బియ్యం 2.85%, సముద్ర ఉత్పత్తులు 1.69%, సుగంధ ద్రవ్యాలు 1.02%, పొగాకు 0.45% మాత్రమే. అందుకే కేంద్రం పట్టించుకోవట్లేదని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర రైతుల భవిష్యత్తుకు వీటి ఎగుమతులే ఆధారం. ఇంకా బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులకూ ఎన్నో అవకాశాలున్నా, సరైన ప్రోత్సాహం లేదు.
*ఎగుమతుల డిమాండ్ లేకుంటే.. మిరప రైతుకు మంటలే*
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మిరప సాగు, ఉత్పత్తి మాత్రమే కాదు, ఎగుమతులు కూడా అధికమే. దేశం నుంచి ఎగుమతయ్యే రూ.12 వేల కోట్ల మిరపలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే.- ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సగటున 4.50 లక్షల ఎకరాల నుంచి 6.50 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తుంటారు. ఉత్పత్తి సగటున 7-14 లక్షల టన్నులు ఉంది.- కౌలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కోత ఖర్చులు, రవాణా, కమీషన్ సహా మొత్తంగా ఎకరాకు సగటున రూ.3లక్షల పెట్టుబడి అవుతోంది.- గతేడాది జనవరి వరకు మిరప క్వింటాలుకు రూ.20 వేల వరకు ఉండేది. తర్వాత ఎగుమతులకు డిమాండు లేకపోవడంతో.. రూ.8-13వేల మధ్యకు దిగజారింది. ఎకరానికి రూ. 75 వేల నుంచి రూ. లక్ష వరకు నష్టపోతున్నారు.
*మిరప ఎగుమతులు ఇలా…*
సంవత్సరం ఎగుమతులు (టన్నుల్లో) విలువ (రూ. కోట్లలో) 2023-24 6,01,084 12,492 2022-23 5,16,177 10,444 2021-22 5,57,144 8,585 2020-21 6,49,815 9,241 అధిక ఎగుమతులు: చైనా, అమెరికా, బంగ్లాదేశ్, యూఏఈలకు.
*రొయ్య రైతులకు గుండె దడే!*
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 32-36% వరకు ఉంటోంది. అందులో అధికభాగం రొయ్యలే. ఈక్వెడార్ నుంచి పోటీతో రెండేళ్ల క్రితం ధరలు పతనమయ్యాయి. అమెరికా సుంకాల బాదుడుతో ఇటీవల మళ్లీ రేటు తగ్గించారు. అంతర్జాతీయంగా ఏం తేడా వచ్చినా.. ఇక్కడ ధర తగ్గించేస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో
రొయ్యల చెరువులు అధికం.- చెరువు తవ్వకం, విద్యుత్తు కనెక్షన్, బోరు ఇతర ఖర్చులతోపాటు.. చెరువు నిర్వహణ, రొయ్య పిల్ల, మేత, మందులు, కూలీలు, అన్నీ కలిపితే రెండున్నర నెలలకే (ఒక పంటకు) ఎకరానికి రూ.5 లక్ష లకు పైనే ఖర్చవుతుంది. వాతావరణం అనుకూలించి రెండు టన్నుల (50 కౌంట్) దిగుబడి వస్తే రూ. 6.50 లక్షల ఆదాయం. వ్యాధులు సోకితే.. పెట్టుబడి మొత్తం పోయినట్లే! రాష్ట్రంలో 2.64 లక్షల మంది రైతులు 5,72,065 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.
*రొయ్య ఎగుమతుల పరిస్థితి*
సంవత్సరం విలువ (రూ. కోట్లలో) ఏపీ వాటా (%) 2023-24 60,523 32.09 2022-23 63,969 31.02 2021-22 57,586 34.79 2020-21 43,717 36.21 అధిక ఎగుమతులు: అమెరికా, చైనా, జపాన్ తదితర దేశాలకు…
*పొగాకు.. అంతా ఎగుమతులే!*
పొగాకు అంటే పూర్తిగా ఎగుమతి ఆధారిత పంటే. ఇక్కడే ఉత్పత్తి అధికం. 2024-25లో దేశం నుంచి రూ.16,884 కోట్ల ఉత్పత్తుల్ని ఎగుమతి చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 67.15%. వర్జీనియా, బర్లీ రకాల సాగు గతేడాది భారీగా పెరిగింది. ధరలు అనుకూలించడంతో ఈ ఏడాది 3.40 లక్షల ఎకరాల్లో సాగుచేశారు.- బోర్డు నియంత్రణలో సాగయ్యే వర్జీనియా పొగాకు సాగుకు ఎకరానికి బ్యారన్ అద్దె, ఇతర ఖర్చులు కలిపితే రూ.1.80 లక్షల పెట్టుబడి అవుతోంది.- గతేడాది 140 మిలియన్ కిలోలకు అనుమతి ఇస్తే. 211 మిలియన్ కిలోల ఉత్పత్తి లభించింది. సగటు ధర కిలోకు రూ.288.65 దక్కింది. ఈ ఏడాది 167 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతించగా.. 240 మిలియన్ కిలోలు వస్తుందని అంచనా. వ్యాపారులు ధరలు తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
*దేశం నుంచి పొగాకు ఉత్పత్తుల ఎగుమతులు*
సంవత్సరం ఎగుమతుల విలువ (రూ.కోట్లలో) 2024-25 16,884 2023-24 12,006 2022-23 9,739 2021-22 6,880 అధిక ఎగుమతులు: యూఏఈ, బెల్జియం, ఇండోనేషియా, ఈజిప్ట్, అమెరికాలకు..
*ఏం చేస్తే ప్రయోజనం*-
వ్యవసాయ మిషన్‌ను బలోపేతం చేయాలి. అందులో వివిధ రంగాల నిపుణులను నియమించాలి. – ఎగుమతి ఆధారిత పంటలపై నిరంతరం సమీక్షించాలి. ఎంపెడా, అపెడా, ఎగుమతి సంస్థలతో చర్చించాలి.- విదేశీ సంస్థలను సంప్రదిస్తూ.. ఆర్డర్లు తెచ్చే సంస్థలను నియమించాలి.- పంట ఎగుమతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణ ఇప్పించాలి
ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు ఐదు ప్రధాన పంటలకు సంబంధించిన (వరి, కంది, పెసర, మినుము మరియు జొన్న) విత్తనాలు 11000 గ్రామాల్లో సుమారు 40000 మందికి పంపిణీరాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రేపు జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా కార్యక్రమ ఆరంభం నకు యేర్పాట్లు మంత్రి తుమ్మల
క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. ఇప్పటికే దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని 27.5% నుంచి 40%కి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభ్యర్థించినప్పటికి, దీనికి విరుద్ధంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వలన ఆయిల్ పామ్ రైతులకు గెలల ధర తగ్గడంతో పాటు దీర్ఘకాలికంగా దేశీయ ఆయిల్ పామ్ సాగును తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. ప్రస్తుతం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రాలు, రైతులకు తగిన ప్రోత్సాహం కల్పిస్తూ, ఈ పంట సాగు పెంపుపై దృష్టిసారిస్తున్న తరుణంలో, కేంద్ర నిర్ణయం రైతుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఈ దిగుమతి సుంకం తగ్గింపు వలన కొత్తగా ఆయిల్ పామ్ సాగు ప్రారంభించాలనుకునే రైతులు వెనక్కి తగ్గే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది స్వదేశీ నూనె ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న కేంద్ర – రాష్ట్రాల ఉద్దేశ్యాలకు విరుద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పాం సాగును ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహక కార్యక్రమాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెద్ద ఎత్తున రైతుల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న నిర్ణయం వల్ల చేపడుతున్న కార్యక్రమాలన్నింటికి తగిన ఫలితాలు రాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, క్రూడ్ పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలశాఖ మంత్రి పియూష్ గోయల్‌ని లేఖ ద్వారా కోరడం జరిగింది. ఇదేవిషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి లేఖ ద్వారా తీసుకొచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా రైతుల ఆకాంక్షలు నిలబెట్టడంకోసం, దేశ ఆత్మనిర్భరత లక్ష్యాన్ని సాధించేందుకు ఆయిల్ పామ్ వంటి నూనె పంటల ఉత్పత్తికి భరోసా కల్పించే విధానాలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు.
చీడపీడల నివారణకు రైతులు వినియోగిస్తున్న క్రిమిసంహారక మందులు తర్వాత శాపంగా మారుతున్నాయి. వీటిలోని రసాయన అవశేషాలు పొలాలను విషతుల్యంగా మార్చుతున్నాయి. భూముల సారాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. దీనికి విరుగుడుగా కృత్రిమ సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తోంది ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగం!
ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకం… ఓయూ మైక్రో బయాలజీ విభాగంలో ప్రొఫెసర్ సందీప్త బూర్గుల ఆధ్వర్యంలో విద్యార్థులు మూడేళ్ల నుంచి ఈ పరిశోధన చేస్తున్నారు. ముందుగా దేశ, విదేశాల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలు సేకరించి వాటికి భిన్నంగా ప్రయోగాలు ప్రారంభించారు. రైతులు పంట పొలాల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ వినియోగించినా… ఆ భూముల్లో కొన్ని సూక్ష్మజీవులు బతికే ఉన్నాయని గుర్తించారు. వీటిలో 12 రకాల సూక్ష్మజీవులను సేకరించి ప్రయోగశాలలో వడపోసి అయిదింటిని ఎంపిక చేసుకున్నారు. వీటిని కృత్రిమంగా పెంచి పంట పొలాల్లో ప్రవేశపెడితే భూముల్లో విష ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుంటుందని నిర్ధారణకు వచ్చారు.
ఏం చేశారంటే… ఇంక్యుబేటర్‌లో పెంచిన సూక్ష్మజీవులను విషతుల్యమైన నేలల్లో విడిచి పెడితే 75 నుంచి 90 శాతం వరకు క్రిమిసంహారక మందుల అవశేషాలను తొలగించాయని రుజువు చేశారు. వీరి పరిశోధనల పత్రాలను అంతర్జాతీయ జర్నల్ బ్రెజిలియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇటీవలే ప్రచురించింది. ఈ విధానంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సంస్థలు ప్రయోగాలు చేస్తున్నా.. 90 శాతం వరకు క్రిమిసంహారక మందుల అవశేషాలను తొలగించడం మెరుగైన విధానమని ప్రొఫెసర్ సందీప్త బూర్గుల తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని వివరించారు.
పండ్లు, కూరగాయల్లో… రైతులు పండిస్తున్న పండ్లు, కూరగాయాల్లో ఈ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే తోటలున్న రైతులకు కృత్రిమ సూక్ష్మజీవులను అందించి ప్రయోగాత్మకంగా ఆ నేలల్లో వాటిని విడిచి పరీక్షించాలన్న ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు పండించే కొందరు రైతులతో మాట్లాడి వారి అనుమతితో సూక్ష్మజీవులను పంట పొల్లాల్లో చొప్పించనున్నారు. సంతృప్తికరమైన ఫలితాలొచ్చాక ఈ విధానానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేయనున్నామని పరిశోధక విద్యార్థులు తెలిపారు.
ప్రయోగం ఇలా…
ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో నల్ల రేగడి, ఎర్రనేలల మట్టిని సేకరించారు. అందులోకి రైతులు సాధారణంగా వినియోగించే మోతాదు కంటే నాలుగైదు రెట్లు అధికంగా క్రిమి సంహారక మందును ఇంజక్షన్ల ద్వారా చొప్పించారు..
సహజ సిద్ధమైన గాలి, వెలుతురు లభించే చోట ఆ మట్టి నమూనాలను ఉంచి, వాటిలోకి ఇంక్యుబేటర్‌లో పెంచిన సూక్ష్మజీవులను పంపించారు. వారం రోజులకోసారి మట్టి నమూనాలు, సూక్ష్మజీవులను పరిశీలించారు. ప్రతి 40 నిమిషాలకు సూక్ష్మజీవులు రెట్టింపు అవుతున్నాయని గుర్తించారు.
మూడు వారాల్లో మట్టి నమూనాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాలు 75 నుంచి 90 శాతం తగ్గాయి. ఈ ఫలితాల ఆధారంగా మరింత మెరుగైన స్థితికి చేరుకునేందుకు మళ్లీ ప్రయోగాలు చేశారు.
ఇంక్యుబేటర్ నుంచి వెలుపలికి తీసిన సూక్ష్మజీవులు ఎదగాలంటే 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలని తెలుసుకున్నారు. రెండున్న రేళ్లు ప్రయోగాలు చేశాక అనుకున్న ఫలితాలు వచ్చాయని ప్రొఫెసర్ సందీప్త తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈరోజు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నాహాలు పూర్తి చేసింది. ఏటా ప్రవేశాల్లో జాప్యం జరిగి తరగతులు ఆలస్యమవుతుండడంతో ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియను త్వరగా నిర్వహించాలని వ్యవసాయ యూనివర్సిటీ ప్రతిపాదించగా.. ఉద్యాన, పశువైద్య వర్సిటీలు ఆమోదించాయి. గతంలో నీట్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ప్రవేశాలు నిర్వహించేవారు. ఈసారి నీట్ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా నెలరోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తుల నమోదుకు మూడు వారాల గడువు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఈ ఏడాది సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కొత్త వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా ఇప్పటి వరకు వాటికి సంబంధించిన సన్నాహాలు పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కళాశాలలకే నోటిఫికేషన్ జారీ కానుంది.