81 గ్రామాలలో అన్ని ఇళ్లపై, వ్యవసాయ బోర్లకు సౌర ఫలకాలు

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో పూర్తిగా సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇళ్ల పైకప్పుపై, వ్యవసాయ బోర్లకు, ఇతర కరెంటు కనెక్షన్లన్నింటికీ సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.1,273 కోట్లతో సౌర ఫలకాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తూ రెడ్కో ప్రకటన జారీచేసింది. ఇందులో రూ.400 కోట్లను రాయితీగా కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. మిగిలిన రూ. 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ నెల 24లోగా టెండర్లను దాఖలు చేయాలని సూచించింది. ఈ గ్రామాల్లో 16,840 బోర్లు ఉన్నాయి. ఒక్కో బోరుకు 7.5 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల ఫలకాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సౌర విద్యుత్‌ ఏర్పాటు అనంతరం అక్కడ వచ్చే కరెంటును బోరుకు వాడుకోగా మిగిలింది సాధారణ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. అలా సరఫరా చేసినందుకు బోరు యజమానికి యూనిట్‌కు రూ.3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయి. దీనివల్ల వారికి పంటల సాగుతోనే కాకుండా అదనంగా ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ధరల్లో 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో ఫలకాలను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.4.50 లక్షల వరకూ వ్యయమవుతుందని అంచనా. ఇందులో 30 శాతం కేంద్రం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మునంతా రైతుల తరఫున ఈ 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సౌర కంపెనీలకు చెల్లించనుంది.

Read More

పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటి విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఆదివారం కృష్ణా జలాలను బనకచర్లకు విడుదల చేసేందుకు వచ్చిన మంత్రి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నాం అని వెల్లడించారు. దెబ్బతిన్న అలగనూరు రిజర్వాయర్‌ బండ్‌, గోరుకల్లు రిజర్వాయర్‌ మరమ్మతులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు పూజలు చేశారు. 10 వేల క్యూసెక్కుల శ్రీశైలం వెనుక జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి బనకచర్లకు విడుదల చేశారు. కృష్ణమ్మకు చీరె, సారె సమర్పించి జలహారతినిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రెడ్డిశేఖరరెడ్డి, ఈఈ నాగేంద్రప్రసాద్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు

Read More

తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో జొన్నల ఆహారం

కర్ణాటక విధానంపై అధ్యయనం చేయనున్న అధికారులు

అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఇస్తున్న పోషకాహారంతో పాటు కర్ణాటక తరహాలో జొన్నలతో చేసే రొట్టె, ఇతర పదార్థాలను అందించాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. మహిళా సంఘాలతో వీటిని తయారు చేయించి సరఫరా చేసేందుకు యోచిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలపై సీఎం తాజాగా నిర్వహించిన సమీక్షలో కర్ణాటక తరహాలో ఇక్కడా జొన్నరొట్టె ఇవ్వాలని, మహిళా సంఘాలతో తయారు చేయించాలని సూచించారు. దీంతో అధికారులు దీనిపై దృష్టిసారించారు. ప్రస్తుతం కర్ణాటక అంగన్వాడీ కేంద్రాల్లో అనుబంధ పోషకాహార కార్యక్రమం కింద సంవత్సరంలో మూడు వందల రోజులపాటు జొన్నలతో ఉప్మా, రొట్టె, లడ్డూలు, చిక్కీలు, కిచిడీ తయారు చేసి ఇస్తున్నారు. అక్కడి విధానంపై అధ్యయనానికి త్వరలో తెలంగాణ స్త్రీ శిశుసంక్షేమ, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారుల బృందాన్ని పంపించనున్నారు. వారు తుది నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. జొన్నరొట్టెలను మహిళలు, కౌమార బాలికలకు, ఇతర పదార్థాలను పిల్లలకు ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జొన్నల వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. సాగు వానాకాలంలో 50 వేల ఎకరాలు, యాసంగిలో 4 లక్షల ఎకరాలు ఉంది. అంగన్వాడీలకు ఆహార పథకంగా చేపట్టిన పక్షంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More

‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు 8 నుంచి కౌన్సెలింగ్‌

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ‘అగ్రి’ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ”ర్యాంకులు, రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజు మొత్తం తీసుకురావాలి. కౌన్సెలింగ్‌ తేదీల వారీగా ర్యాంకులు, ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.pjtau.edu.in ను సందర్శించండి” అని స్పష్టం చేశారు.

Read More

రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. డి-క్రిషి యాప్‌ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారీగా కేటాయింపులుంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ మేరకు.. అక్కడి వ్యవసాయ ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు. ఆధార్‌, మొబైల్‌ నంబరుకు ఓటీపీ ధ్రువీకరణ ద్వారా రైతుల్ని గుర్తిస్తారు. రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి, అదే రోజు విత్తనాలు పంపిణీ చేస్తారు.

Read More

జులై 31వ తేదీన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం

  • రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌
    ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవాన్ని జులై 31న ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ తెలిపారు. 01-11-2021 నుండి 31-10-2022 కాలం మధ్య చదివి ఉత్తీర్ణులైన 153 మంది పి.జి., పిహెచ్‌డి విద్యార్థులకి, 691మంది యుజి విద్యార్థులకి పట్టాలని ఈ స్నాతకోత్సవంలో ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ మెరిట్‌ సాధించిన 33 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు, 14 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు స్వర్ణ పతకాలు అందజేయనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచనలు, అడ్మిట్‌ కార్డు మరియు డ్రెస్‌ కోడ్‌ వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌ www.pjtau.edu.in లో జూలై 20వ తేదీ 2025 నుంచి అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రార్‌ వివరించారు.
Read More

వ్యవసాయంలో యాంత్రీకరణ పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలు, పట్టు సాగు విస్తరణకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో పంటల సాగు విస్తీర్ణం పెంపుపై కమిషన్‌ సభ్యులు, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల్లో ఉద్యోగుల కొరతతోపాటు రైతులు యాంత్రీకరణ చేపట్టకపోవడం పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వంతో చర్చించి వీటి పరిష్కారం కోసం కృషి చేస్తామని కోదండరెడ్డి తెలిపారు.

Read More

‘ఈ-పంట’ నమోదు సక్రమంగా జరగాలి

ఈ-పంట డిజిటల్‌ సర్వేలో.. విస్తీర్ణం, పంటలు సాగు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు పేర్కొన్నారు. 2025 ఖరీఫ్‌ డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన గురువారం విడుదల చేశారు. సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూముల్ని తొలగించి.. సాగుకు అనుకూలమైన వాటి వివరాలనే ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో జరిగే డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు అనుసంధానించామని పేర్కొన్నారు. ఈకేవైసీ తప్పనిసరి కాదని వివరించారు.

Read More

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి చేపట్టబోయే వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ దరఖాస్తు గడువు ఈ నెల 18 వరకు పొడిగింపు — రిజిస్ట్రార్ డాక్టర్. జి .ఈ .సిహెచ్. విద్యాసాగర్.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టబోయే వ్యవసాయ, వెటర్నరీ మరియు ఉద్యాన వర్సిటీల డిగ్రీ కోర్సులలో 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి ఈ సి హెచ్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున, ఆయా కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు వివరాల కొరకు వర్సిటీ వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించాలని సూచించారు.

Read More

రూ.150కే పెయ్య దూడ

  • నేటి నుంచి రైతులకు అందుబాటులో వీర్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల డోసులు

గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో మాట్లాడారు. ‘లింగ నిర్ధారిత వీర్యం విలువ బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి తెస్తున్న వీర్యం ఒక్కో డోసు రూ.300 వరకు ఉండగా, రైతులకు రూ.150 సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వల్ల అతి తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం దక్కింది. గతంలో ఇదే లింగ నిర్ధారిత వీర్యం కోసం రైతులు రూ.550 చెల్లించాల్సి వచ్చేది. పశు యజమానులపై భారం తగ్గించేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుతో సంప్రదింపులు జరిపి తక్కువ ధరకు రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల డోసులు (ఒక్కో గేదెకు రెండు డోసులు) లింగ నిర్ధారిత వీర్యం గేదెలకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ వీర్యం వేయటం వల్ల గర్భం దాల్చే ఐదు లక్షల గేదెల్లో కనీసం 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం చేపట్టటం వలన నేరుగా 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 2030 నాటికి పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 లక్షల డోసులు లింగ నిర్ధారిత వీర్యం వేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల హబ్‌గా తీర్చి దిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. దానివల్ల రానున్న ఐదు సంవత్సరాల్లో పశువుల్లో స్త్రీ సంపద పెరిగి పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. లింగ నిర్ధారిత వీర్యం అతి తక్కువ ధరకే అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నాం. పునరుత్పత్తి అవకాశం ఎక్కువగా ఉన్న గేదెలను ఎంపిక చేసి వీర్యం డోసులు ఇస్తాం. ఈ అవకాశం వినియోగించుకోవాలి’ అని కోరారు.

Read More