ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగిన ఎండ మంటలు 144 చోట్ల 40 డిగ్రీలకు పైగా నమోదు
నైరుతి రుతుపవనాలు ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 4-5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, అండమాన్లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. మరోవైపు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీశాయి. కోస్తాలో అనేక చోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడం, వాయవ్య భారతం నుంచి వీచిన పొడిగాలులతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదివారం 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పెదదోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 42.2, తిరుపతి జిల్లా ఓజిలి, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 41.8, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.

