కేంద్ర ప్రభుత్వం ప్రతి పంటకు మద్దతు ధరను ప్రకటించి, అన్నింటి దిగుబడులను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. వానాకాలం సీజన్‌ కార్యాచరణపై సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ… ”రాష్ట్రంలో ఇప్పటికే 550 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యముంది. జూన్‌ 2 నాటికి మరో 1,000 వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలను ఏర్పాటు చేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తాం. సీజన్‌ కోసం ఇప్పటికే 3.31 లక్షల టన్నుల ఎరువులు వచ్చాయి. 2016-25 సంవత్సరాల మధ్య విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సోయాబీన్‌, వేరుసెనగ, పప్పులు, వరి విత్తనాలను రాయితీపై పంపిణీ చేసిన బకాయిలు రూ.220.80 కోట్లు, 2021- 24 మధ్య పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ.87. 57 కోట్లు ఉన్నాయి. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు కృషి చేస్తాం” అని వెల్లడించారు.