ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, రసాయన వ్యవసాయాన్ని క్రమంగా వీడి ప్రకృతి సేద్యానికి మళ్లాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక సీజన్‌కు ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని సామాజిక మాధ్యమం ‘లింక్డిన్’లో బుధవారం పెట్టిన పోస్టు ద్వారా వివరించారు. గత నెలలో కోయంబత్తూరులో నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రకృతి సేద్యం సదస్సు-2025’కు రైతులు ఆహ్వానించగా వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయపరిచాయని పేర్కొన్నారు. వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు, విద్యాధికులు, వృత్తి నిపుణులు, కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి వచ్చిన వ్యక్తులు కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారని తన దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం తదితరాలను చేపట్టి విజయపథంలో కొనసాగుతున్నారని తెలిపారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలనూ ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకుంటున్నారని తెలిపారు.

4 Dec, 2025
ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించండి
#AgricultureReform, #AgriInnovation, #AgroDiversity, #ChemicalFreeFarming, #Coimbatore, #EcoFriendlyFarming, #Farmers, #FarmSuccessStories, #FishFarming, #GreenFarming, #HealthyFood, #IndiaAgriculture, #Intercropping, #LivestockFarming, #NaturalFarming, #NatureBasedFarming, #OneAcreModel, #OrganicFarming, #PMModi, #PrakrutiSedyam, #SeedPreservation, #SoilHealth, #SouthIndiaNaturalFarming, #SustainableAgriculture, #ValueAddition, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
